తనూబాయి నైపుణ్యంలో దిద్దుబాటుకు ఆస్కారం లేదు. ఆమె కష్టపడి చేతితో వేస్తున్న చక్కని కుట్లలో ఒక్క లోపం కనిపించినా కూడా సరిదిద్దడానికి ఒకే ఒక్క మార్గం ఉంది- మొత్తం ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టి చేయటమే! అంటే, దాదాపు 97,800 కుట్లను తీసివేసి మళ్లీ పనిని ప్రారంభించడం అన్నమాట!
"ఒక్క తప్పు చేసినా సరే, మీరిక వాకల్ [బొంత]ని సరిచేయలేరు," అని తన పనితనంలోని సూక్ష్మ నైపుణ్యాలను వివరించే ఉద్దేశ్యంతో, సుమారు 74 ఏళ్ల వయసున్న, కృశించిన శరీరం కలిగిన తనూబాయి అన్నారు. ఇప్పటివరకూ, వాకల్‌కు మళ్ళీ కుట్లు వేయాల్సి వచ్చిన ఒక్క మహిళ కూడా ఆమెకు గుర్తులేదు. " ఏక్దా శిక్లా కీ చూక్ హోత్ నాహీ [మీరీ నైపుణ్యాన్ని ఒక్కసారి నేర్చుకుంటే, మీరింక తప్పు చేయరు]," అని ఆమె నవ్వుతూ చెప్పారు.
అమిత శ్రద్ధగా చేయవలసిన ఈ సూక్ష్మ కళను నేర్చుకోవాలని ఆమె ఎన్నడూ అనుకోలేదు. జీవితం - మనుగడ సాగించడం గురించిన ప్రశ్నలు - ఆమె సూదిని అందుకునేలా చేశాయి. " పోటానే శిక్‌వలా మలా [పేదరికం నాకు ఈ కళను నేర్పింది]," 1960ల ప్రారంభంలో, తానొక 15 ఏళ్ల వధువుగా ఉన్నప్పటి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పారామె.
“చదువుకునే వయసులో, నా చేతిలో పెన్నో పెన్సిలో ఉండేందుకు బదులుగా కొడవలీ, సూదీ ఉండేవి. నేనే గనుక బడికి వెళ్లి ఉంటే, ఈ నైపుణ్యాన్ని నేర్చుకుని ఉంటానని మీరు అనుకుంటున్నారా?" అని అందరూ ఆప్యాయంగా ఆజీ (అమ్మమ్మ) అని పిలిచే తనూబాయి అడుగుతారు.
ఆమె, ఆమె (మరణించిన) భర్త ధనాజీ మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు. వ్యవసాయ కూలీలుగా వారిద్దరూ చాలా కష్టపడేవారు. చలికాలంలో తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి బొంతలను కొనడం అంటే, వారి శక్తికి మించిన విలాసవంతమైన విషయంగా ఉండేది. "అప్పట్లో బొంతలు మేం కొనలేనంత ఖరీదుగా ఉండేవి. కాబట్టి మహిళలు పాత చీరలతో స్వంతంగా బొంతలను కుట్టుకునేవారు" అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ విధంగా, రోజంతా పొలాల్లో ఒళ్ళువిరిగేలా పనిచేసిన తర్వాత, తనూబాయి తన సాయంత్రం వేళలను ఒక వాకల్ కుడుతూ గడిపేవారు.
శేతాత్ ఖుర్పా ఘేఉన్ భాంగలేలా బరా , పణ్ హ ధందా నకో [ఈ పని కంటే కొడవలితో పొలంలో కలుపు తీయడం చాలా మంచిది]" అని ఆమె చెప్పారు. కారణం: ఒక వాకల్ తయారీకి 120 రోజులు పడుతుంది, దాదాపు 600 గంటల పాటు క్లిష్టమైన సూదిపని చేయాల్సి ఉంటుంది. తరచుగా వెన్నునొప్పి, విపరీతమైన కళ్ళు లాగటం- సూదితో పని చేయడం కంటే కొడవలితో పని చేయడం సులభమని తనూబాయి ఎందుకు నమ్ముతున్నారో మనకు సులభంగా అర్థమవుతుంది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా, జాంభలి గ్రామంలోని 4,963 మంది నివాసితులలో (2011 జనాభా లెక్కల ప్రకారం) వాకల్ కళని సాధన చేస్తున్నది ఆమె ఒక్కరే కావడం కూడా దీనిని వివరిస్తుంది.
*****
వాకల్ తయారు చేయడంలో మొదటి దశ చీరలను జాగ్రత్తగా కూర్చడం. ఈ ప్రక్రియను స్థానిక మరాఠీలో లెవా అని పిలుస్తారు. వాకల్ లోని చీరల సంఖ్య కళాకారులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా తమ చేతిలో ఉన్న సమయాన్ని బట్టి మహిళలు ఈ చీరల సంఖ్యను నిర్ణయిస్తారు. తనూబాయి తాను తాజాగా తయారుచేస్తున్న వాకల్ కోసం తొమ్మిది సుతీ (నూలు), లేదా నవూవారీ (తొమ్మిది గజాల పొడవు) చీరలను ఉపయోగిస్తున్నారు.
మొదట, ఆమె ఒక చీరను రెండు భాగాలుగా కత్తిరించి నేలపై పరుస్తారు. దీని పైన, సగానికి మడిచిన రెండు చీరలను మరొక పొరగా ఉంచుతారు. మొత్తంగా, ఆమె ఎనిమిది చీరలను నాలుగు పొరలుగా పేరుస్తారు. అప్పుడు, వదులుగా ఉండే కుట్ల సహాయంతో, మొత్తం తొమ్మిది చీరలను కలిపి కుడతారు. ఈ కుట్లు తాత్కాలికమైనవి. అయితే బేస్ దృఢంగా ఉండేలా చూసుకుంటారు. "మీరు వాకల్ ను కుడుతూపోతున్నప్పుడు, ఈ [తాత్కాలిక] కుట్లను తొలగిస్తారు," అని ఆమె వివరించారు.
ఆజీ ఆపైన మరిన్ని చీరలను ఠిగల్ అని పిలిచే చిన్న ముక్కలుగా కత్తిరించి, వాటిని పైపొరగా ఉన్న చీరపై ఒక్కొక్కటిగా కుట్టి, చివరకు ఒక రంగురంగుల, సౌష్టవ నమూనాను సృష్టిస్తారు. "దీనికొక ప్రణాళిక గానీ, ముందుగా బొమ్మ గీసుకోవడం గానీ అవసరం లేదు," అని ఆమె చెప్పారు. "నువ్వొక ఠిగల్ ను తీసుకొని కుట్లు వేస్తూ పోవడమే."
చక్కగా ఆమె వేసే కుట్లు ఒక్కొక్కటి 5 మిమీ కొలతతో ఉంటాయి, అవి బయటి అంచు నుండి మొదలవుతాయి. ప్రతి ఒక్క కుట్టుతో వాకల్ బరువెక్కుతుంది. అది ఆ ఆకృతిని ఇచ్చే చేతులను శ్రమపెడుతుంది. ఒక వాకల్ కుట్టడానికి ఆమె 30 దారపు కండెలను(స్పూల్స్), లేదా 150 మీటర్ల (సుమారు 492 అడుగులు) తెల్లటి నూలు దారాన్నీ, అనేక సూదులనూ ఉపయోగిస్తారు. ఆమె దారాన్ని ఒక కండె రూ. 10 చొప్పున, సమీపంలోని ఇచల్‌కరంజి పట్టణంలో కొంటారు. ఇది జాంభలీ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. “ఇంతకుముందు, వాకల్ కుట్టడానికి కేవలం రూ. 10 అవసరం అయ్యేది; ఈరోజు దాని ఖర్చు రూ. 300.” అంటూ ఆమె మెల్లగా ఫిర్యాదుచేస్తున్నట్టుగా అన్నారు.
చివరి విడత కుట్లు వేయడానికి ముందు, ఆజీ ప్రేమతో వాకల్ మధ్యభాగం లేదా దాని పోట్ (కడుపు) లోపల ఒక భక్రీ (జొన్న/సజ్జలతో చేసిన రొట్టె) ముక్కను ఉంచారు. వాకల్ ఇచ్చే మెత్తని వెచ్చదనానికి గాఢమైన కృతజ్ఞతా నైవేద్యంగా ఆమె దీన్ని సమర్పించారు. " త్యాలా పణ్ పోట్ ఆహే కి రే బాలా [ వాకల్ కి కూడా కడుపు ఉంటుంది బిడ్డా]," అని ఆమె చెప్పారు.
నాలుగు త్రిభుజాకార కటౌట్‌లను దాని మూలలకు జోడించిన తర్వాత వాకల్ తయారైపోతుంది. ఈ డిజైన్ ఈ బొంతల లక్షణం మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన పనిని కూడా చేస్తుంది - బరువైన వాకల్ ను ఎత్తేందుకు ఈ నాలుగు మూలలు ఒక సులభమైన పట్టును అందిస్తాయి. 9 చీరలు, 216 ఠిగల్ లు, 97,800 కుట్లు వాకల్ ను 7 కిలోల కంటే ఎక్కువ బరువుండేలా చేస్తాయి.
"ఇది నాలుగు నెలల పని. కాని, నేను దీన్ని రెండు నెలల్లోనే ముగించాను," అని ఆజీ గర్వంగా తాజాగా తాను తయారుచేసిన వాకల్ ని చూపించారు. అది ఒక 6.8 x 6.5 అడుగుల అందమైన సృష్టి. ఆమె తన పెద్ద కొడుకు ప్రభాకర్‌కు చెందిన పక్కా ఇంటి బయట ఉన్న సిమెంటు చేసిన వసారాలో తానెప్పుడూ కూర్చుని పనిచేసుకునే స్థలంలో కూర్చుని ఉన్నారు. సంవత్సరాల తరబడి జాగ్రత్తగా సేకరించిన ట్యూబ్ రోస్, కోలియస్ వంటి మొక్కలతో ఆమె ఆ ప్రదేశాన్ని అలంకరించారు. ఒకప్పుడు ఆజీ ఆవు పేడతో అలికిన ఆ నేల, లెక్కలేనన్ని బట్ట ముక్కల నుండి అద్భుతమైన సృష్టిని చేసేందుకు ఆమె అక్కడే వేల గంటలు గడిపినదానికి సాక్షిగా నిలిచి ఉంది.
“ఒక వాకల్ ను ఉతికి శుభ్రంచేసేందుకు కనీసం నలుగురు వ్యక్తులు కావాలి. అది అంత బరువుగా ఉంటుంది,” అని ఆమె చెప్పారు. వాకల్ ల ను సంవత్సరానికి మూడుసార్లు - దసరా, నవ్యాచీ పూనమ్ (సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి), ప్రతి సంవత్సరం జరిగే గ్రామోత్సవం - శుభ్రం చేస్తారు. "ఈ మూడు రోజులే ఎందుకు ఎంచుకున్నారో నాకు తెలియదు, కానీ అది సంప్రదాయం."
తనూబాయి తన జీవితకాలంలో 30కి పైగా వాకల్ ల ను తయారుచేశారు. ఈ క్లిష్టమైన, సూక్ష్మమైన కళ కోసం ఆమె 18,000 గంటలకు పైగా తన సమయాన్ని కేటాయించారు. అది కూడా ఆమె చేసే మొత్తం పనిలో కొంతభాగం మాత్రమే. జీవితంలోని ఆరు దశాబ్దాలకు పైగా, ఆమె పూర్తికాల వ్యవసాయ కూలీగా రోజుకు 10 గంటలపాటు వెన్నువిరిగిపోయే శ్రమ చేశారు.
“ఇంత పని చేసినా ఆమె అలసిపోలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, ఆమె మరొక వాకల్ తయారుచేయడం మొదలుపెడుతుంది,” అని ఆమె కుమార్తె సింధు బిరంజే చెప్పారు. సింధు ఈ కళను ఎప్పుడూ నేర్చుకోలేదు. “జీవితకాలమంతటిలో కూడా మాలో ఎవ్వరం ఆమె స్థాయికి చేరుకోలేము. ఈ రోజు వరకూ కూడా ఆమె పనిని చూసే అదృష్టం మాకు కలిగింది, ”అని తనూబాయి పెద్ద కోడలు లత అన్నారు.
సింధు కోడలు 23 ఏళ్ళ అశ్విని బిరంజే, టైలరింగ్ కోర్సు పూర్తి చేసింది; ఆమెకు వాకల్ తయారుచేయడం తెలుసు. “కానీ నేను యంత్రాన్ని ఉపయోగించి వాకల్ తయారు చేస్తాను. ఈ సంప్రదాయ కళకు చాలా ఓపిక, సమయం అవసరం" అని ఆమె చెప్పింది. ఆమె చెప్పనిదేమిటంటే- ఇది శారీరకంగా అమిత శ్రమతో కూడుకున్న పని, వీపు భాగాన్నీ కళ్లనీ బాధిస్తుంది, వేళ్లకు గాయాలై పుండ్లు పడేలా చేస్తుంది- అని.
కానీ తనూబాయి దానిని పెద్దగా పట్టించుకోరు. “నా చేతులు ఇప్పుడు దానికి అలవాటు పడ్డాయి. ఈ చేతులు ఉక్కులా మారాయి, కాబట్టి సూదులు నన్నేమీ ఇబ్బంది పెట్టలేవు,” అని నవ్వుతారామె. తన పనికి ఎవరైనా ఆటంకం కలిగించిన ప్రతిసారీ సూదిని తన ముడిలో సున్నితంగా గుచ్చుకుంటూ, "సూదిని ఉంచడానికి ఇదే సురక్షితమైన ప్రదేశం," అన్నారు నవ్వుతూ.
ఈ కళను నేర్చుకోవడానికి యువతరం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ఆమెను అడగండి, ఆమె వెంటనే ఇలా బదులిస్తారు: “ చింధ్యా ఫడాయ్లా కోణ్ యేణార్ ? కితీ పగార్ దేనార్ ? [చీరలు చింపేందుకు ఎవరు వస్తారు? ఇంతకీ మీరు వారికి ఎంత చెల్లిస్తారు?]”
యువత మార్కెట్ నుండి చౌకైన, యంత్రంతో తయారుచేసిన బొంతలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుందని ఆమె వివరిస్తారు. “దురదృష్టవశాత్తూ చేతితో వాకల్ ను తయారుచేయడం ఏ కొద్దిమంది మహిళలకు మాత్రమే తెలుసు. ఇప్పటికీ ఆ కళ పట్ల సంభ్రమం చెందేవారు దానిని మెషిన్‌లో కుట్టించుకుంటారు” అని తనూబాయి చెప్పారు. "ఇది వాకల్ లు ఏ కారణంచే తయారు చేయబడినాయనే దాన్ని పూర్తిగా మార్చివేసింది. అయితే సమయంతో పాటు విషయాలు కూడా మారుతాయి" అని ఆమె అన్నారు. మహిళలు కూడా వాకల్ తయారుచేసేందుకు పాత చీరలకు బదులు కొత్త చీరలను వాడేందుకు ఇష్టపడతారని ఆమె అభిప్రాయపడ్డారు.
జీవితమంతా చేతితో మిలియన్ల కొద్దీ అసాధారణమైన కుట్లు వేస్తూనే గడిపేసిన ఆమె, తన పొరుగింటి టైలర్ నాయక్ (ఆజీకి అతని మొదటి పేరు గుర్తులేదు) ఇచ్చిన స్నేహపూర్వక సలహాను పాటించనందుకు ఇప్పటికీ చింతిస్తున్నారు. "టైలరింగ్ నేర్చుకోమని అతను నన్ను అడుగుతూనే ఉండేవాడు," అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు. "నేను దానిని నేర్చుకున్నట్లయితే, ఈ రోజు నా జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేది." కళ ఎక్కువ శ్రమను డిమాండ్ చేస్తుంది కాబట్టి, ఆమె ఆ కళను తక్కువగా ఇష్టపడుతుందని అర్థం కాదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తనూబాయి తన జీవితకాలంలో ఎన్నడూ తాను తయారుచేసిన వాకల్ ను అమ్మలేదు. “ కశాలా రే మీ వికూ వాకల్ , బాలా [దీన్ని నేనెందుకు అమ్మాలి కొడుకా]? దీని కోసం ఎవరైనా ఎంత చెల్లించగలరు?”
*****
వాకల్ ల ను తయారు చేయడానికి సంవత్సరంలో ఒక నిర్ణీత సమయమంటూ లేనప్పటికీ, అది వ్యవసాయ చక్రం లయను అనుసరించి నడుస్తుంది; సాధారణంగా ఫిబ్రవరి ప్రారంభం నుండి జూన్ వరకు పొలాల్లో ఎక్కువగా పని లేనప్పుడు, మహిళలు కుట్టుపనికి మొగ్గుచూపుతారు. " మనాలా యెఈల్ తెవ్హా కరాయచా [మాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేశాం]," అంటారు తనూబాయి.
కొల్హాపూర్‌లోని గడ్‌హిన్‌లజ్ తాలూకా లోని తన పూర్వ గ్రామమైన నౌకుడ్‌లో, దాదాపు ప్రతి ఇంటివారు 1960ల చివరి వరకు గోధడీ అని మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో పిలువబడే వాకల్ ను తయారు చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. "ఇంతకుమునుపు, స్త్రీలు ఒక రోజు పనికి మూడు అణాలు [కొలతలకు పూర్వం ఉన్న కరెన్సీ ప్రమాణం] చెల్లించి, వాకల్ కుట్టడంలో సహాయం చేయమని ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించేవారు." నలుగురు మహిళలు నిరంతరం పనిచేస్తే, ఒక బొంత పూర్తి కావడానికి రెండు నెలలు పడుతుందని ఆమె అన్నారు.
అప్పట్లో చీరలు చాలా ఖరీదుగా ఉండేవని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక నూలు చీర ధర రూ. 8, అందులో నాణ్యమైనవి రూ. 16 పలికేవి. ఒక కిలో మసూరి పప్పు (ఎర్ర కందిపప్పు) ధర 12 అణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఆమె స్వయంగా పొలాల్లో శ్రమిస్తూ రోజుకు 6 అణాలు సంపాదించేవారు. పదహారు అణాలు అయితే ఒక రూపాయి అయేది.
"మేము సంవత్సరానికి రెండు చీరలు, నాలుగు ఝంపర్ లు [రవికెలు] మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళం." చీరలు చాలా అరుదుగా దొరికేవి కాబట్టి, వాకల్ ఎక్కువ కాలం మన్నగలిగివుండాలి." తను తయారు చేసిన వాకల్ లు కనీసం 30 ఏళ్లపాటు నిలిచేవని తనూబాయి గర్వంగా చెబుతారు. కళలోని సూక్ష్మ వివరాలను నేర్చుకోవడంలో తీవ్రంగా చేసిన అభ్యాసం ద్వారా సాధించిన గొప్పతనమది.
200 లక్షల మందిని (మహారాష్ట్ర గ్రామీణ జనాభాలో 57 శాతం) తీవ్రంగా ప్రభావితం చేసిన 1972-73 నాటి కరువు గోవిల్కర్లను నౌకుడ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్‌లోని శిరోల్ తాలూకా లోని జాంభలీ గ్రామానికి వలస వెళ్లేలా చేసింది. “ఆ కరువును కనీసం తలచుకోను కూడా కూడదు. అంత భయంకరంగా ఉండింది. చాలా రోజులు ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవాళ్ళం", కన్నీటితో మసకబారిన కళ్లతో అన్నారు ఆమె.
“నౌకుడ్ నివాసి ఒకరు జాంభలీలో కొన్ని ఉద్యోగావకాశాలను కనుగొన్నారు. పెద్దగా ఆలోచించకుండానే దాదాపు ఊరంతా వలసపోయింది” అని ఆమె గుర్తుచేసుకున్నారు. వలస వెళ్ళకముందు, ఆమె భర్త, దివంగత ధనాజీ, రోడ్లను నిర్మించే పనులూ, బండరాళ్లను బద్దలు కొట్టే పనులలో కూలీగా పనిచేసేవారు. అందుకోసం ఆయన నౌకుడ్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవా వరకూ కూడా ప్రయాణించేవారు.
జాంభలీలో, ప్రభుత్వ కరువు సహాయక చర్యల్లో భాగంగా రోడ్డును నిర్మిస్తున్న 40 మంది కార్మికులలో ఆజీ కూడా ఒకరు. “రోజుకి 12 గంటల పనికి మాకు రూ.1.5 మాత్రమే ఇచ్చేవారు” అని ఆమె గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన 16 ఎకరాల పొలంలో పనికి రోజుకు రూ.3 చొప్పున ఇస్తామని, వీరిని పనికి పిలిచారు. తనూబాయి వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించి వేరుశెనగ, జొన్నలు , గోధుమలు, వరి, ఇంకా చీకూ (సపోటా), మామిడి, ద్రాక్ష, దానిమ్మ, సీతాఫలం వంటి పండ్లను సాగుచేసేవారు.
2000వ దశకం ప్రారంభంలో ఆమె వ్యవసాయాన్ని విడిచిపెట్టాక, మూడు దశాబ్దాలకు పైగా కష్టపడి పనిచేసిన తర్వాత, ఆమె నెలవారీ జీతం 10 గంటల పనిదినానికి రూ. 160 చొప్పున మాత్రమే పెరిగింది. “ కొండచా ధోండా ఖల్లా పణ్ మూలనా కధీ మాగా తేవ్‌లో నహీ [మేము భోజనం బదులు పొట్టు తిన్నాము కానీ మా పిల్లలను బాధపడనివ్వలేదు],” అని తాను సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, అనుభవించిన పేదరికాన్ని గురించి క్లుప్తంగా వివరించారు. ఆమె పోరాటం, త్యాగం చివరికి ఫలించాయి. ఈ రోజు, ఆమె పెద్ద కుమారుడు ప్రభాకర్, సమీపంలోని జైసింగ్‌పూర్ పట్టణంలో ఎరువుల దుకాణాన్ని నడుపుతున్నారు. చిన్న కుమారుడు బాపుసో, జాంభలీలోని ఒక బ్యాంకులో పనిచేస్తున్నారు.
ఆమె పొలంలో పనిచేయడం మానేసిన తర్వాత, ఖాళీగా కూర్చోవడం విసుగనిపించి, వెంటనే మళ్లీ వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించారు. మూడేళ్ల క్రితం ఇంట్లో పడిపోయి గాయాలపాలవడంతో ఆమె వ్యవసాయ పనుల నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. "కుడి భుజానికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, నొప్పి వస్తూనే ఉంది," అని ఆమె వివరించారు. అయినప్పటికీ, తన మనవడు సంపత్ బిరంజే కోసం మరొక వాకల్ తయారు చేయకుండా ఆమెను ఏ నొప్పీ ఆపలేకపోయింది.
భుజం నొప్పి బాధిస్తున్నప్పటికీ, తనూబాయి ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభించి, సాయంత్రం 6 గంటల వరకు కుట్టుపని కొనసాగిస్తారు. ఆరుబయట ఎండబెట్టిన మొక్కజొన్నలను తింటున్న కోతులను తరిమికొట్టడానికి మాత్రం మధ్య మధ్య లేస్తుంటారు, "కోతులతో పంచుకోవడానికి నాకే పేచీ లేదు కానీ నా మనవడు రుద్ర్‌కి మొక్కజొన్న అంటే చాలా ఇష్టం" అని ఆమె అంటారు. తన అభిరుచికి మద్దతు ఇచ్చినందుకు ఆమె తన ఇద్దరు కోడళ్లకు చాలా రుణపడి ఉన్నానని అన్నారు. "వారి కారణంగా నేను ఇంటి బాధ్యతల నుండి విముక్తి పొందాను."
74 ఏళ్ళ వయసులో కూడా, తనూబాయి తన సూదితో మాయాజాలం చేస్తూనే ఉన్నారు, ఒక్క కుట్టు కూడా తప్పు పోకుండా ఆమె నైపుణ్యం ఎప్పటిలాగే పదునుగా ఉంది. “ త్యాత్ కాయ్ విసరణార్ , బాలా ? త్యాత్ కాయ్ విద్యా ఆహే ? [ఇందులో మరిచిపోవడానికి ఏముంది? దీనికి ఏమంత గొప్ప నైపుణ్యం అవసరమనీ?]” అని ఆమె వినయంగా అంటారు.
తనూబాయికి ప్రతి ఒక్కరికీ ఇచ్చే సలహా ఇదే : “ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నెహ్మీ ప్రామాణిక్ రహావా [జీవితాన్ని నిజాయితీగా జీవించండి].” అనేక వాకల్ ముక్కలను కలిపి ఉంచే చక్కటి కుట్ల వలె, ఆమె తన కుటుంబాన్ని కలిపి ఉంచడానికి జీవితకాలం కష్టపడ్డారు. " పూర్న్ ఆయుష్ మీ శివత్ గేలే [నేను జీవితమంతా కుడుతూనే గడిపాను]."
గ్రామీణ కళాకారులపై సంకేత్ జైన్ రూపొందిస్తోన్న సిరీస్‌లో భాగమే ఈ కథనం. దీనికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ సహాయాన్నందిస్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి