అదొక జరగని కాల్పుల భీభత్సం. న్యూస్ పేపర్లలో దీనిని గురించి వైవిధ్యమైన శీర్షికలు అచ్చయ్యాయి. కానీ అన్నిటికన్నా - బహదూర్ షా జాఫర్ మార్గ్‌పై “రైతును పోలీసులు కాల్చి చంపారు” - అనే వార్త ఈ "హత్య" జరిగిన కొద్ధిక్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కానీ ఆ మరణం కాల్పుల వలన జరగలేదు. జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లో ప్రసిద్ధి చెందిన ఆదాయపు పన్ను కార్యాలయం (ఐటిఓ) జంక్షన్ వైపుకు వచ్చిన నిరసనకారుల సమూహాలలో ఈ విషయం చాలా గందరగోళాన్ని సృష్టించింది. ఇదే పుకారు రెడ్ ఫోర్ట్ వద్ద హింసకు దారితీసింది.
ట్రాక్టర్ నడుపుతున్న ఒక యువ రైతును పోలీసులు పాయింట్-బ్లాంక్ లో కాల్చి చంపారు అనే కథ అందరి నోళ్ళలోనూ పడింది. సోషల్ మీడియా వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఈ కథను అందరికీ చేర్చడంలో ఏ రాజీ లేకుండా పనిచేసింది. కొన్ని టెలివిజన్ ఛానెళ్లు కూడా ఇదే కథను ప్రసారం చేశాయి. మైదానంలో ఉన్న ప్రజలు ఈ ‘గోలికాండ్’ (కాల్పులు) ను నమ్మి పోలీసులు హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐటిఓ జంక్షన్ సమీపంలో ఉన్న నిరసనకారులు చెల్లాచెదురయ్యారు.
నిజానికి నలభయిదేళ్ల నవ్‌నీత్ సింగ్, తాను నడుపుతున్న ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయాడు. అతనిని ఎవరూ కాల్చలేదు. కానీ ఎర్రకోట వద్ద జరిగిన ఈ విధ్వంసాన్ని అర్ధం చేసుకునేలోగా, 2020 సెప్టెంబరులో పార్లమెంటు ద్వారా జారీ చేయబడ్డ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే నాడు నిరసన తెలిపిన రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ మరుగున పడిపోయింది.
భిన్నంగా ప్రారంభమైన
ఇటువంటి రోజు ఇలా మారిపోవడం చాలా విచారకరం.
అంతకాలం విపరీతమైన చలి, మంచు ఉన్నాగాని, భారతదేశ 72 వ రిపబ్లిక్ డే నాటి ఉదయం మాత్రం వెచ్చగా, ఎండతో మొదలైంది. రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలిపిన రైతులు ప్రణాళికాబద్ధమైన మార్గాల్లో శాంతియుత ట్రాక్టర్ పరేడ్లు నిర్వహించి చరిత్ర సృష్టించబోతున్నారు. మధ్యాహ్నం సెంట్రల్ ఢిల్లీ లోని రాజ్‌పథ్‌లో అధికారిక కవాతు ముగిసిన తర్వాత సింఘు, తిక్రీ మరియు ఖాజీపూర్- ఈ మూడు సరిహద్దుల నుండి ఇవి మొదలవ్వాల్సి ఉంది.
ఈ కవాతులు రిపబ్లిక్ డే యొక్క అతిపెద్ద పౌరుల వేడుకగా మారేవి. కానీ సాయంత్రానికల్లా ప్రజల దృష్టి, ఆసక్తి వేరేవైపుకి మరలిపోయింది.
ఢిల్లీ- ఉత్తర ప్రదేశ్ ల మధ్య (ఘాజిపూర్ దగ్గరగా ఉన్న) చిల్లా సరిహద్దుకు బయలుదేరడంతో మా రోజు ప్రారంభమైంది. ఎంట్రీ పాయింట్ దగ్గర బారికేడ్లు కాస్త వేరేగా ఉన్నాయి: ఇంధన వాహకాలను, డిటిసి బస్సులు చిన్న, పసుపు-పెయింట్ రంగులున్న కదిల్చగలిగే ఇనుప గేట్ల తో పాటుగా ఉంచారు. చిల్లా సరిహద్దు వద్ద, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ రైతుల బృందం నాయకులు తమ బృందాన్ని పోలీసు బలగాల సహకారంతో నిర్దేశించిన మార్గంలో వెళ్ళమని చెప్పారు.
ఇక్కడి నిరసనకారులు తెల్లవారుజామున 4 గంటల నుండి సైట్లో తయారుచేసిన పప్పు అన్నం తిన్నారు. మధ్యాహ్నం సమయంలో, బృందాలు ట్రాక్టర్ల పైకి చేరసాగాయి, ప్రసిద్ధ స్థానిక పాటలు వెనుక మోగుతుండంగా, ‘భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్' అని ఒకే శ్వాసలో నినాదాలు చేశారు. పెద్ద లైన్లలో పోలీసులు, తెలుపు రంగు డ్రోన్ కెమెరాలు గమనిస్తుండగా ట్రాక్టర్లు తమకు నియమించబడిన మార్గాలలో దూసుకెళ్లడం ప్రారంభించాయి: చిల్లా- ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ ఫ్లైఓవర్-దాద్రి-చిల్లా.
రైతులు రద్దు చేయాలని కోరుతున్న చట్టాలు: రైతు ఉత్పత్తి వాణిజ్య (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . వీటిని మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా జారీ చేశారు. తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అదే నెల 20 న వీటిని చట్టాలుగా ప్రవేశపెట్టింది.
నిరసనకారులు ఈ చట్టాలను వారి జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తారు. ఎందుకంటే వీటి వలన పెద్ద సంస్థలకు రైతులు, వారి వ్యవసాయం పై చాలా అధికారం వస్తుంది. అంతేగాక భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేయగల చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించారు.
చిల్లా ట్రాక్టర్ పరేడ్ సాఫీగా సాగింది. ఇది త్వరగా వెళ్లి ఒక గంటలోపు తిరిగి బేస్ క్యాంపు కు వచ్చింది. అప్పుడు మేము 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింఘు వైపు వెళ్ళడం ప్రారంభించాము. ఇక్కడే ప్రధాన కవాతు జరిగేది. దారిలో అక్కడ ఉన్న మా సహనిరసనకారులు, కొన్ని రైతు బృందాలు సింఘు నుండి ఢిల్లీ కి వెళ్తున్నాయని చెప్పారు. ఏదో జరుగుతోందని శంకించి మేము వారి వెనుకనే ఢిల్లీ కి వెళ్ళాము. మేము ఔటర్ రింగ్ రోడ్ వెంట వెళ్తున్నప్పుడు, అనేక మంది ఢిల్లీ నివాసులు రోడ్డు పక్కన రైతుల సమూహాలకు చేయూపుతూ నిలబడ్డారు, వారిలో చాలా మంది ట్రాక్టర్లలో ఉన్నారు. ఇంకొందరు మోటారుబైకులపై, కొందరు కార్లపై ఉన్నారు. ‘మజ్ను కా తిలా’ సమీపంలో ఎరుపు రంగు బట్టల్లో (veshadhAraNa means “dressed as”, not “dressed “in”) ఉన్న సన్యాసుల బృందం కూడా ఉత్సాహంగా చేతులూపారు. తన కుటుంబంతో కలిసి కారులో కూర్చున్న ఒక మహిళ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాక్టర్ వెనుక వేలాడుతున్న వారికి నీటి బాటిళ్లను ఇవ్వడానికి ప్రయత్నించింది.
దేశానికి ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడే ట్రాక్టర్ల పెద్ద పెద్ద చక్రాలు దేశ రాజధాని యొక్క కాంక్రీట్ రోడ్లపైకి వెళ్తున్నాయి - ఇలాంటిది బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది ఒక శక్తివంతమైన, పదునైన సంకేతాన్ని ఇచ్చే చర్య.
అకస్మాత్తుగా, వాతావరణం లో - దానితోపాటే అందరి మానసిక స్థితిలో, మార్పు వచ్చింది. ఎటువంటి హెచ్చరిక లేకుండా కొన్ని నిరసన బృందాలు విడిపోయి ఎర్ర కోట వైపు వెళ్తున్నాయని మేము విన్నాము. ఇంకొద్ది సేపట్లోనే చారిత్రాత్మక స్మారక చిహ్నం వద్ద ఘర్షణలు అవుతున్నాయని, ఒక మతపరమైన జెండాను ఎర్రకోట వద్ద ఎగురవేశారని పుకార్లు మొదలయ్యాయి. కళ్ళ ముందు కనపడే దృశ్యాలు చేసే మాయ, మీడియాను, ప్రజల దృష్టిని ప్రధాన ట్రాక్టర్ పరేడ్ల నుండి మళ్లించేలా చేసింది.
"ఇక్కడి నుండి దూరంగా ఉండండి" అని ఎర్రకోట సైట్ నుండి బయలుదేరిన సహోద్యోగి మధ్యాహ్నం 3:15 గంటలకు ఫోన్లో మాకు చెప్పారు. అప్పటికే పుకార్లతో రెచ్చిపోయిన కొంతమంది నిరసనకారులు పరిగెత్తినప్పుడు, అతని కెమెరా లెన్స్ పగిలిపోయింది. మేము ITO వైపు కొనసాగాము. అక్కడకు కొన్ని ట్రాక్టర్లు ఘజిపూర్, సింఘు మరియు ఎర్రకోట నుండి వచ్చి చేరుతున్నాయి. ఇంతలో, పాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెలుపల ప్రజలతో పాటు ట్రాక్టర్లు చెల్లాచెదురవుతున్నాయి.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కోపంగా ఉన్నారు: “నేను జనవరి 22 న నా ట్రాక్టర్లో సింఘు వద్దకు వచ్చాను. మేము ఈ రోజు ఉదయం 4 గంటల నుండి ఇక్కడే ఉన్నాము. ఈ కవాతులో 2 లక్షలకు పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. మేము కూడా మా గణతంత్రాన్ని జరుపుకుంటున్నాము. ఈ చట్టాలు రైతులకు కాకుండా కార్పొరేట్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి.” వారు పెద్ద, చట్టబద్ధమైన కవాతులో భాగమని వారు నిజంగా విశ్వసించినట్లు అనిపించింది. ఎందుకంటే ఈ గందరగోళం ఇలా సాగుతున్న సమయాల్లో కూడా, ప్రశాంతంగా, నియమించబడిన మార్గాల్లో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ గందరగోళం వేర్వేరు స్థలాలలో ఉన్న ఇతర నిరసనకారులలో కూడా చెలరేగింది.
కానీ నగరంలోకి ప్రవేశించిన నిరసనకారులలో మరికొందరు ఉన్నారు. వారికి ఏ గందరగోళం లేదు. వారు ఏమి చేస్తున్నారో, ఎందుకు ఇక్కడ ఉన్నారో వారికి తెలుసు అనిపించింది. వారు ఈ ర్యాలీ కి అంతరాయం, అల్లర్లు మరియు విధ్వంసాలు సృష్టించడం కోసమే వచ్చారు. వారి చర్యలు రాజధాని సరిహద్దులలో లక్షలాది మంది రైతులు పాల్గొంటున్న శాంతియుత ర్యాలీకి హాని కలిగిస్తాయని వారికి బాగా తెలుసు. వారిలో కొందరు నాతో: “అవును, ఆ జెండాను ఎర్ర కోటపై ఉంచడం మంచి విషయం, ఆ పని మేమే చేయాలనుకున్నాము” - అని వారి వద్ద ఉన్న జెండా ని చూపారు.
“ఈ దేశంలో మరెవరూ లేనట్లుగా, ప్రభుత్వం‘ హిందూ రాష్ట్ర ’గురించి మాట్లాడుతూనే ఉంది. ఈ రోజు ఎర్రకోట వద్ద [మత] జెండా ఎగురవేయడం, ఒక సవాలులా ఉంది, ”అని 26 ఏళ్ల పవన్‌దీప్ సింగ్ నొక్కిచెప్పారు.
కొందరిలో గందరగోళం ఇంకొందరిలో సందేహాస్పద నిబద్ధత, ఈ అలజడికి దారి తీస్తోంది.
"నేటి గణతంత్ర దినోత్సవం చరిత్రలో లిఖించబడుతుంది, రాబోయే కాలంలో ప్రజలు ఈ ట్రాక్టర్ మార్చ్‌ను గుర్తుంచుకుంటారు" అని 45 ఏళ్ల రంజిత్ సింగ్ మాకు చెప్పారు.
ఈ సమయంలోనే నవనీత్ సింగ్ ట్రాక్టర్ బోల్తా పడింది. ఇక పుకార్లకు రెక్కలొచ్చాయి. అతని మృతదేహాన్ని చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారులు చుట్టుముట్టి, రోడ్డు పై కూర్చుని దుఃఖించారు. పోలీసులు కొన్ని మీటర్ల దూరంగా నిలబడి వారిపై నిఘా ఉంచారు.
పంజాబ్‌లోని బిలాస్పూర్లో నివసిస్తున్న రవ్నీత్ సింగ్ (20) అనే మరో వ్యక్తి కాలికి బుల్లెట్ తగిలినట్లు పుకార్లు వచ్చాయి. మరణించిన నవనీత్ సింగ్ పక్కనే ఒక వృద్ధ స్నేహితుడి ఒడిలో పడుకుని, రవ్నీత్ తన గాయానికి కట్టు కట్టించుకుంటున్నాడు. పోలీసులు ఎవరూ తనను ఎటువంటి బుల్లెట్తోనూ కాల్చలేదని, ఐటిఓ సమీపంలో టియర్ గ్యాస్ వదిలినప్పుడు జరిగిన కొట్లాట సమయంలోనే గాయపడ్డానని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. కానీ అదే సమయంలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి మీడియా పై మండిపడి, “నిజాన్ని చూపించకపోతే వెనక్కి వెళ్లిపొమ్మ”ని అరిచిన అరుపుల మధ్య రవ్నీత్ గొంతు వినిపించకుండా పోయింది.
ITO కి సమీపంలో మొహాలి నుండి 20 ఏళ్ళ యువ రైతుల బృందం ఒక ట్రాక్టర్ మీద ఉండి, తమ బృంద నాయకుడి సూచనల కోసం ఎదురుచూస్తోంది. మేము ‘ఐబి’ నుండి వచ్చామేమో అన్న అనుమానం తో వారు మాతో మాట్లాడటానికి వెనుకాడారు. ‘లేదు, మేము ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందినవాళ్ళం’ కాదని మేము స్పష్టం చేసినప్పుడు, ‘ట్రాక్టర్ పరేడ్‌లో ఉన్న ఒకరిపై పోలీసులు కాల్పులు జరిపారని వారు విన్నారని, అది తప్పు’ అని వారు చెప్పారు. ‘నిరసన ఇప్పటివరకు శాంతియుతంగా ఉంది, కానీ ఇది రెచ్చగొట్టే చర్య’, అని వారు తెలిపారు.
"ప్రభుత్వం రైతులను చంపకూడదు, దాని బదులు వారు ఈ చట్టాలను చంపాలి" అని వారు మాకు చెప్పారు, "ఇది బహుశా ఈ దేశ చరిత్రలో జరుగుతున్న సుదీర్ఘ నిరసన." అని గర్వంగా అన్నారు
మేము అలా తిరుగుతూ, నవనీత్ సింగ్ మరణానికి కారణాన్ని నిర్ధారించుకోవడానికి ఇతర నిరసనకారులతో మాట్లాడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ లోని బాజ్పూర్ నుండి వచ్చి, ప్రస్తుతం మీరట్ లో ఉంటున్న 45 ఏళ్ల మాజీ సైనికుడు, అజయ్ కుమార్ సివాచ్ ని కలిసాము.
"ఈ దేశంలో వ్యవసాయం ఆగిపోతే, ప్రభుత్వం ఆగిపోతుంది. నేను పెన్షనర్ని. ఇప్పుడు చెరకు మరియు గోధుమలను పండించే రైతుని . నేను దాదాపు 20 సంవత్సరాలు సైన్యంలో గడిపాను, వ్యవసాయంలోకి వచ్చే ముందు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు లడఖ్ లో పని చేశాను. నాలో ఇద్దరున్నారు- జవాన్ మరియు కిసాన్. కానీ నేను ఎప్పుడూ కిసాన్‌గానే ఉంటాను. ఈ రోజు మనందరికీ ఒక ముఖ్యమైన రోజు. ఈ నిరసనలో పాల్గొనడానికి మేము మా గ్రామ ప్రజల నుండి రూ. 60,000 విరాళాన్ని జమ చేసి వచ్చాము.”
ఇంతలో ప్రకాశవంతమైన ముదురాకుపచ్చ తలపాగా ధరించిన శ్రీమతి ఆంటిల్ (48) అనే రైతు మా దృష్టిని ఆకర్షించింది. హర్యానాలోని సోనిపట్ కు చెందిన ఈ రైతు మొక్కజొన్న, దోసకాయలు, బంగాళాదుంపలు, క్యారెట్లు పండిస్తుంది. గత రెండు నెలలుగా రైతుల నిరసన కార్యక్రమంలో తాను ఇంటికి, సింఘుకు మధ్య తిరుగుతున్నానని ఆమె మాకు చెప్పారు. “నేను సింఘు వద్ద ఉన్నప్పుడు నా భర్త, మా పదేళ్ల కొడుకు, 17 ఏళ్ల కుమార్తెలను చూసుకుంటాడు. నేడు భారత రిపబ్లిక్ దినోత్సవం కోసం పంజాబ్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ కలిసి వచ్చాయి. ఏది జరిగినా అది ప్రతి ఒక్కరికీ నష్టానికి దారితీస్తుంది. ఇటీవలి కాలంలో దాదాపు 200 మంది రైతులు అమరులయ్యారు, ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వవలసి ఉంది. ఈ వ్యవసాయ చట్టాలన్నీ అంబానీలు మరియు అదానీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి, మనకు కాదు. ”
సూర్యుడు అస్తమిస్తుండగా, ITO లోని కొన్ని ట్రాక్టర్లు సరిహద్దులకు తిరిగి వెళ్లడం ప్రారంభించాయి. రాజధాని మరియు చుట్టుపక్కల ప్రాంతాలు భారీ, శాంతియుత, వేడుకల కవాతు మరియు విషాదకరమైన, విఘాతం కలిగించే, దుర్మార్గపు కధనాలు రెంటినీ చూశాయి.
అనువాదం: అపర్ణ తోట