పదేళ్ల నూతన బ్రాహ్మణే కి ఒకటే కుతూహలం. తన అమ్మమ్మ ఎందుకు నిరసన ప్రదర్శనకు వెళ్తుందో అని. కాబట్టి జిజాబాయి బ్రాహ్మణే ఆమెను వెంట తీసుకురావాలని నిర్ణయించుకుంది. జనవరి 26 న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద చురచురలాడే ఎండలో కింద కూర్చున్న జిజాబాయి, "ఆదివాసుల బాధలను, సమస్యలను ఆమె అర్ధం చేసుకోవాలని నేను ఆమెను తీసుకువచ్చాను." అంది.
“ఢిల్లీ లో [మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా] నిరసన తెలిపే రైతులకు మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము. అంతేగాక మాకు స్థానిక డిమాండ్లు కూడా ఉన్నాయి,” అన్నారు 65 ఏళ్ల జిజాబాయి. నూతన్‌తో పాటు ఆమె జనవరి 25-26 తేదీలలో ఆజాద్ మైదానంలో బస చేశారు.
వీరు నాసిక్ జిల్లాలోని అంబేవాని గ్రామం నుండి జనవరి 23 న నాసిక్ నుండి బయలుదేరిన రైతుల బృందం తో కలిసి ఇక్కడికి వచ్చారు.
జిజాబాయి మరియు ఆమె భర్త, 70 ఏళ్ల శ్రావణ్ కోలి మహాదేవ్ ఆదివాసీ వర్గానికి చెందినవారు. దశాబ్దాలుగా,దిండోరి తాలూకాలోని తమ గ్రామంలో ఐదు ఎకరాల అటవీ భూమిని సాగు చేశారు. 2006 లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన తరువాత వారు భూమికి పట్టా పొందాలి. "కానీ మా పేరు మీద ఎకరం కన్నా తక్కువ భూమి వచ్చింది. దానిలో మేము వరి, గోధుమ, మినప,
ముంబైలో జరిగిన రిపబ్లిక్ డే నిరసన కోసం, నూతన్ తండ్రి, జిజాబాయి కుమారుడు సంజయ్, తన కుమార్తెను అమ్మమ్మతో వెళ్లనివ్వడానికి వెంటనే అంగీకరించారు. “నూతన్ 2018 లోనే కిసాన్ లాంగ్ మార్చ్ కోసం రావాలని అనుకుంది. అప్పుడు మేము నాసిక్ నుండి ముంబైకి ఒక వారం పాటు నడిచాము. అప్పటికి నా మనవరాలు చాలా చిన్నది. ఆమె నడవగలదో లేదో నాకు తెలియదు. ఈ రోజు ఆమె దూరాలు నడవగలిగే వయస్సులోకి వచ్చింది. పైగా ఈ మార్చ్ లో పెద్దగా నడిచేది కూడా ఏమి లేదు, ”అని జిజాబాయి అన్నారు.
జిజాబాయి మరియు నూతన్ నాసిక్ గ్రూపుతో కలిసి పిక్-అప్ ట్రక్కులు, టెంపోలలో ప్రయాణించారు. వీరు పూర్తిగా వాహనాల పై ప్రయాణించినా 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కసర ఘాట్లో మాత్రం అందరూ వాహనాల నుండి దిగి తమ సంఘీభావ బలం చూపడం కోసం నడిచారు. "నేను కూడా నానమ్మతో కలిసి నడిచాను, అస్సలు అలసిపోలేదు" నూతన్ సిగ్గుగా నవ్వుతూ అంది. వారు నాసిక్ నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరం ఉన్న ఆజాద్ మైదానానికి చేరుకున్నారు.
"ఆమె ఒక్కసారి కూడా ఏడవలేదు, విసిగించలేదు . నిజానికి, ముంబై చేరుకున్న తర్వాత ఆమె ఉత్సాహం పెరిగింది, ”అని జిజాబాయి , నూతన్ నుదిటిని ముద్దుపెడుతూ గర్వంగా అంది. “మేము ప్రయాణం కోసం భక్రీ, పచ్చిమిర్చి పచ్చడిని తీసుకువెళ్ళాము. అవి మా ఇద్దరికీ సరిపోతాయి, ”అన్నదామె.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అంబేవనిలోని నూతన్ చదువుతున్న పాఠశాల మూసివేయబడింది. కుటుంబానికి స్మార్ట్‌ఫోన్ లేదు, కాబట్టి ఆన్‌లైన్ తరగతులు సాధ్యం కాలేదు. " కాబట్టి నూతన్ కి ఇది మంచి అనుభవమవుతుందని నేను అనుకున్నాను" అని జిజాబాయి అన్నారు.
"ముంబై ఎంత పెద్దదో తెలుసుకోవాలనుకున్నాను" అన్నది 5 వ తరగతి చదువుతున్న నూతన్, ఆమె ఎప్పటినుంచో ముంబైని చూడాలనుకుంది." నేను మా ఊరికి వెళ్లి నా స్నేహితులకు ముంబై గురించి చెబుతాను." అంది ఉత్సాహంగా.
కొన్నేళ్లుగా తన అమ్మమ్మ భూమి హక్కులను కోరుతోందని నూతన్‌కు ఇప్పుడు తెలిసింది. వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఆమె తల్లిదండ్రులకు తమ గ్రామంలో తగినంత పని లేదని కూడా ఆమెకు తెలుసు. 2020 సెప్టెంబర్‌లో మోడీ ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలుసుకుంటోంది.
మూడు చట్టాలు: రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . అవి మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి ప్రస్తుత ప్రభుత్వం అదే నెల 20 న చట్టాలుగా తీసుకొచ్చింది.
రైతులు ఈ చట్టాలను వారి జీవనోపాధికి వినాశకరమైనదిగా చూస్తారు, ఎందుకంటే దీని ద్వారా పెద్ద పెద్ద కార్పరేట్లకు రైతులపైన వ్యవసాయంపై నియంత్రణ పెరుగుతుంది. “మాకు వ్యవసాయంలో పెద్ద కంపెనీలు వద్దు. వారు మా అవసరాలను దృష్టిలో పెట్టుకోరు ”అని జిజాబాయి అన్నారు.
కొత్త చట్టాల వలన సాగుదారునికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు కూడా బలహీనపడుతుంది. వీటిలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి), రాష్ట్ర సేకరణ వంటివెన్నో ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేయగల చట్టబద్దమైన హక్కును వారు నిలిపివేస్తున్నందున ఇవి ప్రతియొక్క భారతీయుడిని ప్రభావితం చేస్తున్నాయని విమర్శించబడ్డది.
రైతు వ్యతిరేక విధానాలపై తమ అనంగీకారాన్ని తెలియజేయడానికి రైతులు వీధుల్లోకి రావాలని జిజాబాయి అన్నారు. "ముఖ్యంగా మహిళలు," భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ బొబ్డే యొక్క ప్రశ్నను ప్రస్తావిస్తూ, "వృద్ధులను మరియు మహిళలను నిరసనల వద్ద ఎందుకు ఉంచారు?" అని అడిగింది.
"నేను నా జీవితాన్ని వ్యవసాయ భూములలో గడిపాను" అని జిజాబాయి చెప్పారు. "నా భర్త ఎంత పని చేసాడో అంతే పని నేను కూడా చేశాను."
‘ముంబైకి రావచ్చా’ అని నూతన్ అడిగినప్పుడు ఆమె చాలా సంతోషించింది. “ఆమె చిన్న వయసులోనే ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆమె స్వతంత్ర మహిళగా తయారవ్వాలి. ” అన్నది.
అనువాదం: అపర్ణ తోట