విరిగిన చేయికి తగిలించి ఉన్న కట్టుతాడు(స్లింగ్) నారాయణ్ గైక్వాడ్‌ను ఇబ్బంది పెడుతోంది. ఆయన దాన్ని తీసేసి, తలపై ఉన్న టోపీని సర్దుకుని తన నీలిరంగు డైరీ, పెన్ను కోసం వెతికారు. ఆయన తొందరలో ఉన్నారు.
మాఝ నావ్ నారాయణ్ గైక్వాడ్ . మీ కొల్హాపురాతన ఆలోయ్ . తుమ్హీ కుఠన్ ఆలాయ్ ? (నా పేరు నారాయణ్ గైక్వాడ్. నేను కొల్హాపుర్ నుంచి వచ్చాను. మీరెక్కడి నుంచి వచ్చారు?) కొల్హాపుర్, జాంభళీ గ్రామానికి చెందిన 73 ఏళ్ళ ఆ రైతు అడిగారు.
దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మండుతోన్న సూర్యుని నుండి రక్షణ కోసం ఒక గుడారంలో ఆశ్రయం పొందుతోన్న అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన ఆదివాసీ సాగుదారుల బృందానికి ఆయన తన ఈ ప్రశ్నను సంధించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 24-26 తేదీల్లో అక్కడ సమావేశమై ఉన్న మహారాష్ట్రలోని 21 జిల్లాలకు చెందిన రైతులలో వీరు కూడా భాగమే. శిరోల్ తాలూకా లోని తన గ్రామంలో నారాయణ్‌కు మూడు ఎకరాల భూమి ఉంది. ఆయన అక్కడి నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరం తన గాయపడిన చేతితోనే ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు.
తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత నారాయణ్ తాను, ఇతర రైతులు తమ తమ గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పడం ప్రారంభించారు. "నేను రైతును. అందుకే ఈ సమస్యలతో నాకూ సంబంధం ఉంటుంది," అని జనవరి 25న మేం కలుసుకున్నప్పుడు ఆయన నాతో అన్నారు. ఆయన తన విరిగిన కుడి చేతితోనే మరాఠీలో నోట్స్ తయారుచేసుకుంటున్నారు. ఈ రకంగా విరిగిన చేతిని కదిలించడం బాధ కలిగిస్తున్నప్పటికీ, "రైతుల, వ్యవసాయ కూలీల పోరాటాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నేను వారి సమస్యలను వింటాను," అని ఆయన అన్నారు.
తాను ఆజాద్ మైదాన్‌లో 10 జిల్లాలకు చెందిన 20 మందికి పైగా రైతులతో మాట్లాడినట్లు ఆయన తర్వాత నాతో అన్నారు.
జనవరి మొదటి వారంలో పొలంలో పనిచేసుకుంటోన్న నారాయణ్‌పై కొబ్బరి మట్ట పడడంతో ఆయన చేతికి దెబ్బ తగిలింది. ఆయన చెరకు, జ్వారీ (జొన్న) పంటలు పండిస్తున్నారు; రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఆయన తనకు తగిలిన దెబ్బను గురించి మొదట్లో పట్టించుకోలేదు, కానీ ఒక వారం తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడంతో జాంభళీలోని ఒక ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లారు. “డాక్టర్ పరీక్ష చేసి చెయ్యి బెణికిందని చెప్పాడు. అతను నన్ను పట్టీ (గుడ్డ కట్టు) వేసుకోమని చెప్పాడు,” అన్నారాయన.
అయినా నొప్పి తగ్గకపోవడంతో ఏడు రోజుల తర్వాత నారాయణ్ అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరోల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారు. అక్కడ ఎక్స్-రే తీయించుకున్నారు. "డాక్టర్ నాతో, 'మీరసలు ఎలాంటి మనిషి? ఒక వారం రోజుల క్రితమే మీ చెయ్యి విరిగింది. అయినా పట్టించుకోకుండా తిరుగుతున్నారు!' అన్నాడు," అని నారాయణ్ నాతో చెప్పారు. పిఎచ్‌సిలో ప్లాస్టర్ కట్టులు లేవు, కాబట్టి డాక్టర్ ఆయన్ని శిరోల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీలోని పౌర ఆసుపత్రికి పంపించారు. అక్కడ నారాయణ్ చేతికి ప్లాస్టర్ కట్టు వేశారు.
జనవరి 24న ఇంటి నుంచి బయలుదేరి ఆజాద్ మైదాన్‌కు వెళ్తుండగా కుటుంబ సభ్యులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఉత్సాహం నీరుగారిపోలేదు. "మీరు నన్ను ఆపితే, నేను ముంబైకి వెళ్లడమే కాదు, మళ్ళీ తిరిగి రానని వారికి చెప్పాను." ఆయన తన చేతిని ఎత్తిపట్టి ఉండేలా మెడకు జోలెకట్టు కట్టుకొని ప్రయాణించారు.
ఆయనతో పాటే వ్యవసాయం చేసే ఆయన భార్య కుసుమ్ (66), నారాయణ్ ప్రయాణంలో తినటం కోసం 13 భాకరీలు , లాల్ చట్నీ (పండు మిరపకాయల పచ్చడి)లతో పాటు పంచదార, నెయ్యి మూటగట్టి ఇచ్చారు. ఆయన వాటిలో సగం కూడా తినరని ఆమెకు తెలుసు. ముంబై నిరసన తర్వాత నేను జాంభళీని సందర్శించినప్పుడు "అతనెప్పుడూ నిరసనకారులకు ఆహారం పంచిపెడుతుంటాడు" అని ఆమె నాతో చెప్పారు. రెండు రోజుల్లో ఆయన కేవలం రెండు భాకరీలు మాత్రమే తిని మిగిలినవి నలుగురు ఆదివాసీ మహిళా రైతులకు ఇచ్చారు. “మేమేమీ బూర్జువాజీ కాదు. ఈ రైతులు అనేక మారుమూల గ్రామాల నుండి నడుచుకుంటూ వచ్చారు, నేను చేయగలిగే సహాయం, వారికి ఎంతోకొంత ఆహారం ఇవ్వడమే,” అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి అనుబంధంగా ఉన్న అఖిల భారత కిసాన్ సభ సభ్యుడు నారాయణ్ అన్నారు.
నవంబర్ 26 నుండి దిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న లక్షలాది మంది రైతులకు తమ సంఘీభావాన్ని తెలియజేయడం కోసం మహారాష్ట్ర రైతుల సంయుక్త శేత్కరీ కామ్‌గార్ మోర్చా జనవరి 24-26 వరకు ముంబైలో నిరసన దీక్షకు కూర్చున్నారు.
రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలు: రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రమోషన్ మరియు సరళీకరణ) చట్టం, 2020 ; రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 ; నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020 . ప్రస్తుత ప్రభుత్వం వీటిని మొదట జూన్ 5, 2020న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించి, సెప్టెంబర్ 14న వ్యవసాయ బిల్లులుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి, అదే నెల 20న హడావుడిగా చట్టాలుగా మార్చింది.
రైతులపై, వ్యవసాయంపై మరింత ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండేలా పెద్ద కార్పొరేట్లకు మరింత వెసులుబాటును కల్పించి, తమ జీవనోపాధిని విధ్వంసం చేసేవిగా రైతులు ఈ చట్టాలను చూస్తున్నారు. ఈ కొత్త చట్టాలు కనీస మద్దతు ధరలు ఎమ్ఎస్పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎమ్‌సి), రాజ్యం ద్వారా ఉత్పత్తి సేకరణ మొదలైన వాటితో సహా రైతులకు కీలకమైన మద్దతు రూపాలను బలహీనపరుస్తాయి. పౌరులందరికీ చట్టపరమైన ఆశ్రయ హక్కును నిలిపివేస్తున్నందున భారత రాజ్యాంగంలోని 32వ అధికరణాన్ని పనికిరాకుండా చేయడం ద్వారా అవి ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయనే విమర్శలను ఎదుర్కొన్నాయి.
ఇతర రైతుల ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ఇలా ఆజాద్ మైదాన్‌లో నారాయణ్ కూర్చోవడం ఇదే మొదటిసారి కాదు. "వారి జీవితాల గురించి మరింత తెలుసుకోవడానికి నేను ఎల్లప్పుడూ నా తోటి నిరసనకారులతో మాట్లాడతాను," అని అతను చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన భారతదేశం అంతటా జరిగిన నిరసనలు, సమావేశాలలో వందలాది మంది రైతులను కలుసుకున్నారు; అనేకమంది ఆయనకు స్నేహితులుగా మారారు. ఆయన దిల్లీ, బీహార్‌లోని సమస్తిపూర్, తెలంగాణలోని ఖమ్మం, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్రలోని ముంబై, నాగ్‌పూర్, బీడ్, ఔరంగాబాద్‌లలో జరిగిన నిరసనలకు హాజరయ్యారు.
సెప్టెంబరు 2020లో ప్రభుత్వం కొత్త చట్టాలను ఆమోదించిన తర్వాత, కొల్హాపుర్ జిల్లా వ్యాప్తంగా పది చోట్ల జరిగిన నిరసనల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. గత నాలుగు నెలల్లో నారాయణ్, కొల్హాపుర్‌లోని జాంభళీ, నాందణీ, హరోలి, అర్జున్‌వాడ్, ధరణ్గుత్తీ, శిర్ధోన్, టాక్వాడే వంటి గ్రామాలకు చెందిన పలువురు రైతులతో మాట్లాడారు. “నేను మాట్లాడిన వందలాది మంది రైతుల్లో ఎవరికీ ఈ చట్టం అక్కర్లేదు. ఈ చట్టాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?" కోపంగా అడిగారు నారాయణ్.
డిసెంబర్ 8, 2020న రైతులు, వ్యవసాయ కూలీలు భారతదేశమంతటా ఒక రోజు బంద్ (షట్-డౌన్)ను పాటించినప్పుడు, అతను శిరోల్ తాలూకాలోని కురుంద్వాడ్ పట్టణంలో ఉన్నారు. “ఊరేగింపుగా వెళ్ళేందుకు మాకు అనుమతి నిరాకరించారు, కాని పట్టణంలోని ప్రజలు సహకరించి రైతులకు మద్దతు ఇచ్చారు. లేకపోతే కురుంద్వాడ్ దుకాణాలను మూసివేయడాన్ని మీరెన్నడూ చూసుండేవారు కాదు - ఎన్నడూ!” అన్నారాయన.
సమీప గ్రామాల రైతులను కలవడానికి, నిరసనలకు హాజరు కావడానికి, నారాయణ్ ఉదయం 4 గంటలకు నిద్రలేచి, 10 గంటలకల్లా తన పనులన్నీ పూర్తిచేసుకొని, ఆ పై తన మోటారుసైకిల్‌పై గ్రామాలకు వెళ్తుంటారు. తన పంటలను విందుచేసుకోవడానికి ప్రయత్నించే పక్షులను తరిమికొట్టడానికి సాయంత్రం 5 గంటలకంతా తిరిగి వచ్చేస్తానని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 2,000 మంది రైతులతో కూడిన బృందంతో చేరడానికి డిసెంబరు 20న ఆయన, జాంభళీ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాశిక్‌కు వెళ్లారు. ఆ మరుసటి రోజు వారంతా దిల్లీ వైపుకు వాహన జాతా (యాత్ర)కి బయలుదేరారు. నారాయణ్ మధ్యప్రదేశ్ సరిహద్దు వరకు వెళ్ళారు. చలిని తట్టుకోలేని కొందరు, తమ పొలానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉన్న మరికొందరు రైతులతో కలిసి ఆయన వెనుదిరిగారు. “దిల్లీలోని రైతులు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారు దేశం మొత్తాన్ని ఏకం చేశారు. నేను దిల్లీకి వెళ్లాలనుకున్నాను, కానీ చలికాలం కావడం, తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా కుదరలేదు,” అని అతను చెప్పారు.
నారాయణ్ ఇతర మార్గాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2020 సెప్టెంబరు నుండి అక్టోబర్ మధ్య, ఆయన రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ ప్రధాని నరేంద్ర మోడీకి 250 పోస్ట్‌కార్డ్‌లను రాశారు. మూడు "నల్ల చట్టాలను" రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ నివేదికల ప్రకారం ఎమ్ఎస్పిని అమలు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్ఎస్పి కోసం కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన తర్వాత అతను ఎచ్చరికగా ఉన్నారు. "స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఎంఎస్పిని అమలు చేయడం సాధ్యం కాదని 2015లో బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పింది. ఇప్పుడు ఈ చట్టాల వలన ఎంఎస్పి పోదని అంటున్నారు. మేం వారిని ఎలా నమ్మగలం?”
ఆయన తర్వాత ఆయన తాలూకాలోని గ్రామాలకు చెందిన చాలామంది రైతులు ప్రధానికి పోస్ట్‌కార్డులు రాయడం మొదలుపెట్టారని ఆయన నాతో అన్నారు. “రైతులు ఈ చట్టాలను అర్థం చేసుకోలేదని ప్రజలంటున్నారు. మేం ప్రతిరోజూ పొలంలో పని చేస్తాం, మేమెందుకు అర్థం చేసుకోలేం?” అని ఆయన ఆశ్చర్యపోయారు.
కొత్త చట్టాలపై, వాటి ప్రభావాలపై పూర్తి అవగాహనను పెంపొందించుకోవడానికి నారాయణ్ కార్యకర్తలతోనూ, న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు. “ఈ చట్టాలు అందరికీ ప్రమాదకరం. ఏదైనా వివాదం వస్తే ఇప్పుడు కోర్టులకు కూడా వెళ్ళలేం," అని ఆయన అన్నారు.
రైతులు కానివారికి కూడా ఈ చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. " విచార్ ప్రభోదన్ కేలం పాహిజే పూర్ణ్ దేశాత్ (దేశం మొత్తాన్నీ మేల్కొలపాలి)."
జనవరి 25న, ఆజాద్ మైదాన్ నుండి రైతులు దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర గవర్నర్ నివాసం వైపు కవాతు చేయడం ప్రారంభించినప్పుడు, కొల్హాపుర్ జిల్లాకు చెందిన రైతుల వస్తువులకు కాపలాకాయడానికి నారాయణ్ వెనుక ఉండిపోయారు.
రైతుల సమస్యల జాబితాను ఆయన తన నోట్‌బుక్‌లో సంకలనం చేశారు: ‘భూమి పట్టాలు, పంటల బీమా, కనీస మద్దతు బియ్యం, ఎపిఎమ్‌సి యార్డులు’. "వ్యవసాయ చట్టాలు మొదట ఎపిఎమ్సిలను నాశనం చేస్తాయి, ఆపైన భారతీయ రైతులను చంపుతాయి," అని ఆయన నాతో చెప్పారు. "ఈ మూడు చట్టాలు మనందరినీ కార్పొరేట్ల కోసం పనిచేసే కార్మికులను చేస్తాయి." అన్నారాయన ముక్తాయింపుగా.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి