సరిగ్గా ఒక సంవత్సరం క్రితం పౌరుల రిపబ్లిక్ డే అతిపెద్ద వేడుకలు జరిగాయి. సెప్టెంబరు 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అప్పటికే రెండు నెలల పాటు ఢిల్లీ వెలుపల విడిది చేసిన పదివేల మంది రైతులు గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను స్వంతంగా నిర్వహించారు. జనవరి 26, 2021న సింగు, టిక్రి, ఘర్జిపూర్ మరియు ఢిల్లీ సరిహద్దుల నుండి ట్రాక్టర్ ర్యాలీలు సాగాయి. దేశవ్యాప్తంగా కూడా ఇతర నిరసన ప్రదేశాల్లో ర్యాలీలు జరిపారు. .
రైతుల కవాతు శక్తివంతమైన, ఉద్వేగభరితమైన చర్య. ఇది సాధారణ పౌరులు, రైతులు, కార్మికులు, ఇతరులచే రిపబ్లిక్‌ను తిరిగి పొందే స్ఫూర్తితో జరుపబడింది. ఈ వేడుకలో కొన్ని సమూహాలు కలతపరిచే, అంతరాయం కలిగించే చర్యలు చేసి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించినప్పటికీ, చరిత్రలో ఇది ఒక గొప్ప సంఘటనగా నిలిచిపోయింది.
నవంబర్ 2021లో ప్రభుత్వం చట్టాలను రద్దు చేసిన తర్వాత రైతుల నిరసనలు పరాకాష్టకు చేరుకున్నాయి. అప్పటికే, వారు చలికాలాన్ని, మండుతున్న వేసవి తాపాన్ని, రెండవసారి వచ్చిన కోవిడ్-19ని ధైర్యంగా ఎదుర్కొన్నారు - ఈ నిరసనలో వివిధ కారణాల వలన 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి సుదీర్ఘ పోరాటానికి నివాళులు అర్పించిన చిత్రమిది.
2021 గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ట్రాక్టర్ పరేడ్ చరిత్రలోని అతిపెద్ద నిరసనలలో ఒకటి - రాజ్యాంగం, ప్రతి పౌరుడి హక్కుల రక్షణ కోసం రైతులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించిన ఉద్యమమిది. గణతంత్ర దినోత్సవం, ప్రజాస్వామ్యాన్ని పౌరుల హక్కులను రక్షించే రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుందని మనమంతా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ఆదిత్య కపూర్ తీసిన సినిమా
అనువాదం: అపర్ణ తోట