“మా ఇళ్లలో ఎలుకలు పైకప్పు మీద నుండి పడి చనిపోవడం నాకు గుర్తుంది. నేను ఇప్పటిదాకా చూసిన వాటిలో అత్యంత అరిష్టాన్ని తెచ్చిన దృశ్యం ఇదే. ఈ రోజు మీకు నవ్వు రావొచ్చు, కాని పైకప్పు నుండి ఎలుక పడిపోవడం అంటే మేము ఇళ్లన్నీ వదిలి వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి ఎప్పుడు రాగలమో మాకే తెలియదు.”
ఈ దృశ్యమానం అంతా కోయంబత్తూర్‌లోని కాలాపట్టి నివాసి అయిన ఎ. కుళధయమ్మాళ్ నుండి వచ్చింది. ఇప్పుడు ఆమె 80వ దశకంలో ఉంది. 1940వ దశకం ప్రారంభంలో తమిళనాడులో చివరిసారిగా ప్లేగు వ్యాధి సోకినప్పుడు ఆమె ఇంకా కౌమార దశకు కూడా రాలేదు.
కోయంబత్తూర్లోని అంటువ్యాధుల విషాద చరిత్ర - మశూచి నుండి ప్లేగు, ప్లేగు నుండి కలరా వరకు - ఇలా వేరే ప్రాంతాల్లో కూడా వ్యాధి వచ్చినా, ఇక్కడ మాత్రమే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ఒక పద్ధతిని చూసింది. ఇక్కడ 'ప్లేగ్ మారియమ్మన్' ('బ్లాక్ మారియమ్మన్' అని కూడా పిలుస్తారు) దేవాలయాలు విస్తరించాయి. ఈ నగరంలోనే ఇటువంటి 16 దేవాలయాలు ఉన్నాయి.
అయితే, కోవిడ్ -19 మహారోగం వలన 'కరోనా దేవి' ఆలయం కూడా ఆవిర్భవించింది. కానీ ప్లేగు మారియమ్మన్ పుణ్యక్షేత్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పొరుగునే ఉన్న తిరుప్పూర్ జిల్లాలో దేవాలయాలు, కొన్ని పండుగలను కూడా నిర్వహించి సందర్శకులను ఆకర్షిస్తాయి.
1903 నుండి 1942 వరకు, కోయంబత్తూర్లో కనీసం 10 సార్లు ప్లేగు వచ్చింది. వేలాది మంది ప్రజలు మరణించారు. అది విడిచిపెట్టిన దశాబ్దాల తరువాత కూడా ప్లేగు ఈ నగర సామూహిక జ్ఞాపకాలలో బంధింపబడి ఉంది. కుళధయమ్మాళ్ వంటి చాలా మంది పెద్దవాళ్లకు, ప్లేగు వ్యాధి గురించి చేసిన ప్రస్తావన, భయపెట్టే నగరం వాతావరణంలో వారు జీవించిన చరిత్రను గుర్తుచేస్తుంది.
సందడిగా ఉండే టౌన్ హాల్ ప్రాంతంలోని ప్లేగు మారియమ్మన్ దేవాలయాలన్నిటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం బయట, పూల వ్యాపారి సాయంత్రం జరిగే గిరాకీలకు సిద్ధంగా ఉన్నాడు. "ఈ రోజు శుక్రవారం. చాలా మంది వస్తారు,” అని 40 ఏళ్ల వయస్సులో ఉన్న కనమ్మాళ్, పువ్వులను కట్టే చేతుల మీద నుండి కళ్ళు ఎత్తకుండా చెప్పింది.
"ఆమె చాలా శక్తివంతమైనది, తెలుసా. మాకు ఇప్పుడు కరోనా దేవి గుడి ఉన్నాగాని, నల్ల మరియమ్మన్ మనలో ఒకరు. మేము ఆమెను ఆరాధిస్తూనే ఉంటాము, ప్రత్యేకించి మాకు ఆరోగ్యం బాలేనప్పుడు. అంతేగాక వేరే సాధారణ ప్రార్థనల కోసం కూడా.” 'సాధారణ ప్రార్థనలు' అంటే ఆమె భక్తుల సాధారణ డిమాండ్లు - ఐశ్వర్యం, విజయం, దీర్ఘాయువు ఇటువంటివి. ప్లేగు శకం ముగిసిన దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కనమ్మాళ్ జన్మించింది. కానీ ఆమె తరానికి చెందిన చాలా మంది, సహాయం కోసం మరియమ్మన్ వద్దకు వస్తారు.
ప్లేగు వ్యాధి ప్రభావం కోయంబత్తూర్ సాంస్కృతిక చరిత్రలో ఒక భాగమైపోయింది. “పట్టణంలోని అసలైన స్థానిక నివాసితులు, ప్లేగు ద్వారా ధ్వంసమైన వినాశనానికి సాక్షులు మాత్రమే కాదు. వారే బాధితులు. ప్లేగు బారిన పడని ఒక్క కుటుంబం కూడా ఇక్కడ మీకు కనిపించదు” అని కోయంబత్తూరుకు చెందిన రచయిత, సి.ఆర్. ఇలంగోవన్ చెప్పారు.
1961 జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ ప్రకారం, కోయంబత్తూర్ నగరంలో 1909లో 5,582 మంది మరణించారు, ఆ తరవాత 1920లో 3,869 మంది ప్లేగు వ్యాధి కారణంగా మరణించారు. 1911లో ఆ సంవత్సరం ప్లేగు వ్యాప్తి తర్వాత కోయంబత్తూరు జనాభా 47,000కి తగ్గిందని ఇతర నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తం మీద, 1901లో దాదాపు 53,000 జనాభా ఉన్న నగరంలో ప్లేగు వలన భారీగా జనాభా తగ్గింది.
"హాని కలగకుండా" కోయంబత్తూరుకు తిరిగి రావాలని, అతని స్వంత కుటుంబం, "అడవుల్లో నివసించడానికి" పారిపోయిందని ఎలాంగోవన్ చెప్పారు. ఈ రోజు సంభవమేకాదనిపించే మూలం నుండి ఈ ఆశ వచ్చింది.
"ఆ చీకటి సంవత్సరాలలో, ఎటువంటి వైద్య సహాయం అందుబాటులో లేదు, అప్పుడు ప్రజలు దైవత్వం వైపు మళ్లారు" అని జిల్లాలో సాంస్కృతిక చరిత్ర పై తీవ్ర ఆసక్తి ఉన్న కోయంబత్తూర్‌కు చెందిన కీటక శాస్త్రవేత్త పి. శివ కుమార్ చెప్పారు.
ఆ ఆశ, ఎప్పటిలాగానే, భయమూ నిరాశతో ముడిపడి ఉంది. 1927లో, నగరం యొక్క ప్లేగు శకం మధ్యలో, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, “మతం ప్రధానంగా భయంపై ఆధారపడి ఉంద”ని ప్రకటించాడు. “మనలో తెలియని భయాందోళన, కష్టాలు, వివాదాలలో, అండగా ఒక పెద్దదిక్కు మనలను చూసుకుంటున్నారని భావించడం- వీటి మీద ఆధారపడి ఉంది.”
ఈ వైవిధ్యమైన కారణాలన్నింటికీ దేవతకు అంకితం చేయబడిన 16 దేవాలయాల ఉనికితో సంబంధం ఉంది - ప్రసిద్ధమైన దీని పేరు కూడా మార్పు చెందింది. "ప్రజలు కూడా ప్లేగు మరియమ్మన్‌ను బ్లాక్ మరియమ్మన్ అని పిలవడం ప్రారంభించారు" అని ఇలంగోవన్ చెప్పారు. "తమిళంలో మారి అంటే నలుపు అని కూడా అర్ధం కాబట్టి, మార్పు ఇబ్బంది లేకుండా జరిగింది."
ప్లేగు చరిత్ర నీడలలోకి వెళ్లిపోతున్నప్పటికీ, దాని ప్రభావం గురించి తరతరాలుగా అందించిన జ్ఞాపకాలు విభిన్న మార్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కోయంబత్తూరులో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సి నిఖిల, “నేను అనారోగ్యంతో ఉన్నప్పుడల్లా మా తల్లిదండ్రులు నన్ను ఆలయానికి తీసుకెళ్లడం నాకు గుర్తుంది. మా అమ్మమ్మ నిత్యం గుడికి వచ్చేది. ఆలయంలోని పవిత్ర జలం వ్యాధిని నయం చేస్తుందని నా తల్లిదండ్రులు నమ్మేవారు. ఆలయంలో పూజలు కూడా చేశారు. ఇప్పుడు నా కూతురు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే, నేను కూడా అలానే ఆమెను అక్కడికి తీసుకెళ్లి పూజలు చేస్తాను, ఆమెకు పవిత్ర జలం ఇస్తాను. నా తల్లిదండ్రుల మాదిరిగా తరచుగా రాకపోవచ్చేమోగాని, నేను ఇప్పటికీ వస్తున్నాను. కోయంబత్తూరులో ఉంతున్నామంటే ఇక్కడికి రావలసిందే.”
*****
"నేను ఇక్కడ నాల్గవ తరం పూజారిగా పనిచేస్తున్నాను. ప్రజలు ఇప్పటికీ అమ్మవారు, చర్మ వ్యాధులు, కోవిడ్-19, వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల నివారణ కోసం సందర్శిస్తారు," అని టౌన్ హాల్ ప్రాంతంలోని ప్లేగు మారియమ్మన్ గుడిలో, 42 ఏళ్ల M. రాజేష్ కుమార్ చెప్పారు. "ఈ దేవత అటువంటి వ్యాధుల నుండి విముక్తిని అందిస్తుందని ఒక నమ్మకం ఉంది."
“ఈ ఆలయం 150 సంవత్సరాలుగా ఉంది. ప్లేగు వ్యాధి కోయంబత్తూరులో ఉన్నప్పుడు [1903-1942], మా ముత్తాత ప్లేగు మరియమ్మన్ అదనపు విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు. అతని తర్వాత మా తాతయ్య, నాన్న చూసుకున్నారు. ఈ రోజున నేను చేసుకుంటున్నాను. అప్పటి నుండి, దేవత పాలనలో ఏ ప్రాంతమూ ప్లేగు బారిన పడలేదు. కాబట్టి ప్రజలకు ఆమెపై విశ్వాసం తగ్గలేదు.”
కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీలోని దేవాలయానిదీ ఇదే కథ. "ఇది వాస్తవానికి సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించారు," అని ఈ ప్రాంతంలోని ప్లేగు మారియమ్మన్ దేవాలయం యొక్క అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యుడైన 63 ఏళ్ల వి. జి. రాజశేఖరన్, చెప్పారు. అంటే ప్లేగు వ్యాధి రాకముందే దీనిని నిర్మించారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రెండూ, వీటిలాంటి అనేక ఇతర దేవాలయాలు ఇప్పటికే మారియమ్మన్ ఆలయాలుగా ఉన్నాయి - కానీ వేరే పాత్రధారణలో లేదా అవతారాలలో ఆమెను జరుపుకుంటున్నారు. ప్లేగు వ్యాధి ఈ ప్రాంతాన్ని తాకి, వినాశనాన్ని తెచ్చిపెట్టినప్పుడు, ఈ అదనపు దేవతగా ఆరాధించబడే, రాతితో చేసిన ప్లేగు మరియమ్మన్ విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.
అతను సేవ చేస్తున్న ఆలయాన్ని స్థాపించిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్లేగు నగరాన్ని తాకినప్పుడు, "ఒక్కో కుటుంబంలో కనీసం ఐదు లేదా ఆరు మంది చనిపోయారు" అని రాజశేఖరన్ చెప్పారు. “ఆ కుటుంబాలు తమ సభ్యుల మరణాల తర్వాత లేదా ప్లేగు వ్యాధి పెరిగిపోతున్నప్పుడు, ఎలుకలు పైకప్పుల నుండి పడిపోయినప్పుడు, వారి ఇళ్లను విడిచిపెట్టివెళ్లిపోయేవారు. మళ్ళీ వాళ్లంతా తిరిగి తమ స్వస్థలాలకు రావడానికి నాలుగైదు నెలలు పట్టేది.”
అదివరకులో చిన్న గ్రామమైన సాయిబాబా కాలనీలోని నివాసితులు, ప్లేగు వ్యాధి నివారణ పూజల కోసం ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆమెను ప్లేగు మరియమ్మన్ అని పిలవాలని నిర్ణయించుకున్నారు. “మా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. మామయ్య అనారోగ్యం పాలైనప్పుడు, మా అమ్మమ్మ అతనిని గుడికి తీసుకువచ్చి, ప్లేగు మరియమ్మన్ ముందు పడుకోబెట్టి, అతని ఒళ్లంతా వేప పసరు, పసుపు పూసింది. అతను నయమయ్యాడు. ”
అప్పటి నుండి, ఆ గ్రామం, ఇంకా ఇతర గ్రామాలు (ఇప్పుడు కోయంబత్తూర్ నగరంలో భాగమాయ్యాయి), మరియమ్మన్ వారిని ప్లేగు వ్యాధి నుండి రక్షిస్తుందని నమ్ముతారు.
ప్లేగ్ మారియమ్మన్ మందిరాల సంఖ్య వాటి మధ్య సామీప్యత వెనుక ఇదే కారణమని ఎలాంగోవన్ చెప్పారు. “సాయిబాబా కాలనీ, పీలమేడు, పాపనాయకన్‌పాళయం, టౌన్ హాల్, ఇంకా ఇతర ప్రాంతాలు ఒక శతాబ్దం క్రితం వేర్వేరు గ్రామాలుగా ఉండేవి. నేడు అవన్నీ కోయంబత్తూరు నగరంలో భాగమయ్యాయి.”
తమిళ సాంస్కృతిక చరిత్ర రచయిత, చరిత్రకారుడు అయిన స్టాలిన్ రాజాంగం, ప్లేగు మరియమ్మన్‌ను ఆరాధించడం- “చాలా సహజమైన పరిణామం, ఇది వినాశనం కలిగించిన ఒక వ్యాధికి ప్రజల నుండి వచ్చిన ప్రతిస్పందన. ఇది ఒక విశ్వాసభావన: మీ సమస్యలకు, మీ చింతలకు పరిష్కారం కనుగొనడానికి మీరు దేవుణ్ణి నమ్ముతారు. మానవాళికి అతి పెద్ద సమస్య అనారోగ్యం. కాబట్టి స్పష్టంగా, వ్యాధుల ఉపశమనం చుట్టూ నమ్మకం కేంద్రీకృతమై ఉంది.” అని చెబుతారు.
"ఇది క్రైస్తవం, ఇంకా ఇస్లాంలో కూడా సాధారణం" అని రాజాంగం చెప్పారు. “పిల్లలు అనారోగ్యం పాలైనపుడు, మసీదులలో చికిత్స పొందుతున్నారు. క్రైస్తవ మతంలో, ఆరోగ్య మాదా (ఆరోగ్యమాత) ఆరాధన ఉంది. బౌద్ధ భిక్కులు వైద్యం చేసేవారని అంటారు. తమిళనాడులో, మనకు సిద్ధులు ఉన్నారు, వారు మొదట్లో వైద్య నిపుణులు. అందుకే మనకు సిద్ధ అనే ఔషధస్రవంతి ఉంది.”
తమిళనాడులోని దాదాపు ప్రతి గ్రామంలో మారియమ్మన్ దేవాలయం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఆమెకు వేరే పేరు ఉండవచ్చు, కానీ ఆమె దేవాలయాలు అయితే ఉన్నాయి. దేవుడు అనే ఆలోచన, బాధను నయం చేసే సామర్థ్యం, ఈ రెండు విషయాలు, ఒక మతం లేదా ఒక దేశానికి పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు ఇటీవలి దశాబ్దాలలో ప్లేగు, అంటువ్యాధుల పట్ల మతపరమైన ప్రతిస్పందనను విశ్లేషిస్తున్నారు.
2008లో ప్రచురితమైన ‘ రిలిజియన్ అండ్ ఎపిడెమిక్ డిసీజ్ ’ అనే తన పేపర్‌లో చరిత్రకారుడు డువాన్ J. ఒషీమ్ పేర్కొన్నట్లుగా: “అంటువ్యాధికి ఒక విధమైన లేదా ఊహించదగిన మతపరమైన ప్రతిస్పందన లేదు. మతపరమైన ప్రతిస్పందనలు ఎల్లప్పుడూ అలౌకికమని భావించడం కూడా సరైనది కాదు. లింగం, తరగతి లేదా జాతి, మతం కూడా విశ్లేషణకు గురయ్యే వర్గమని గుర్తించడం మంచిది. అంటువ్యాధికి వచ్చేమతపరమైన ప్రతిస్పందన- అనారోగ్యం, దాని పై మానవ ప్రతిస్పందనలు, - ఈ మారుతున్న ప్రతిస్పందన విధానాల చట్రంలో చూడవచ్చు."
*****
తమిళనాడులో నేటికీ వార్షిక అమ్మన్ తిరువిజాలు (మారియమ్మన్ పండుగలు) సర్వసాధారణం. ఇవి ప్రజారోగ్యం, మత విశ్వాసాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవలసిన అవసరాన్ని బలపరుస్తాయని స్టాలిన్ రాజాంగం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ పండుగలు సాధారణంగా అమ్మన్ దేవాలయాలలో తమిళ నెల ఆదిలో (జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు) జరుగుతాయి.
"ముందు నెలలైన- చితిరై, వైగాసి, ఆని [వరుసగా ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు, మే మధ్య నుండి జూన్ మధ్య వరకు, మరియు జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు] మాసాలప్పుడు తమిళనాడులో చాలా వేడిగా ఉంటుంది" అని రాజాంగం చెప్పారు. “భూమి పొడిగా ఉంది, శరీరాలు పొడిగా ఉంటాయి. పొడిబారడం వల్ల అమ్మై (అమ్మవారు/మశూచి) అనే వ్యాధి వస్తుంది. రెంటికి చల్లదనమే మందు. తిరువిజాలు అంటే అదే.”
వాస్తవానికి, 'ముత్తు మరియమ్మన్' (దేవునికి మరొక అవతారం) ఆరాధన - అమ్మవారు, మశూచి నుండి ఆ వ్యాధులు రాకముందే ఉపశమనాన్ని కోరుతుంది. "ఈ వ్యాధి చర్మంపై వ్యాపిస్తుంది కాబట్టి, దేవతను ముత్తు మరియమ్మన్ అని పిలుస్తారు, తమిళంలో ముత్తు అంటే ముత్యం. అమ్మవారిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా వైద్యం పురోగమించినా, దేవాలయాలు జనాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి.”
రాజాంగం పండుగలకు సంబంధించిన కొన్ని ఆచారాలను కూడా సూచించారు, వీటిలో శాస్త్రీయ విలువలు లేకపోయినా ఔషధ విలువలున్నాయి. “ఒక గ్రామంలో తిరువిళా ను ప్రకటించిన తర్వాత, కాపు కట్టుతాల్ అనే ఆచారం జరుగుతుంది, దీని తరువాత ప్రజలు గ్రామం నుండి బయటకి అడుగు పెట్టలేరు. వారు తమ కుటుంబాలలో, వారి వీధుల్లో, గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవాలి. క్రిమిసంహారిణిగా పరిగణించబడే వేప ఆకులను పండుగల సమయంలో విరివిగా ఉపయోగిస్తారు.”
శాస్త్రీయ సమాజం ఇప్పటికీ పరిష్కారంతో పోరాడుతున్నప్పుడు, కోవిడ్ -19 కోసం ప్రకటించిన మార్గదర్శకాలు, ఇదే విధమైనవని రాజాంగం చెప్పారు. "శారీరక దూరం, పరిశుభ్రత కోసం శానిటైజర్ల వాడకం ఉంది. కొన్ని సందర్భాల్లో, ప్రజలు వేప ఆకులను కూడా ఆశ్రయించారు, ఎందుకంటే కోవిడ్ సంభవించినప్పుడు వారు ఇంకేం చేయాలో వారికి తెలియదు.”
ఐసోలేషన్ మరియు కొన్ని రకాల శానిటైజర్‌ల వాడకం అనే ఆలోచన సార్వత్రికమైనది. కోవిడ్ వ్యాప్తి సమయంలో, ఒడిశాలోని పబ్లిక్-హెల్త్ అధికారులు పూరీ జగన్నాథ్ యొక్క ఉదాహరణను ఉపయోగించి దిగ్బంధం, భౌతిక దూరాల ప్రాముఖ్యతను ఇంటింటికి చేరేలా చూసుకున్నారు. వార్షిక రథయాత్రకు ముందు జగన్నాథుడు అనసర్ ఘర్ (ఐసోలేషన్ రూమ్)లో తనను తాను ఎలా దిగ్బంధం చేసుకుంటాడో అధికారులు ప్రచారం చేశారు .
దేవత, వ్యాధితో పోరాడే ఆలోచన "ఎంత విశ్వవ్యాప్తం అంటే కర్నాటకలోని అమ్మన్ దేవాలయం ఎయిడ్స్‌కు అంకితం చేయబడింది" అని న్యూయార్క్‌లోని సియానా విశ్వవిద్యాలయంలో రచయిత, మతపరమైన అధ్యయనాల అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్. పెరుందేవి చెప్పారు.
మరియమ్మన్ ఆరాధన అనేది “చాలా సమగ్రమైన ఆలోచన… నిజానికి, తమిళంలో మారి అంటే వర్షం అని కూడా అర్థం. ములైపారి (వ్యవసాయ పండుగ) వంటి కొన్ని ఆచారాలలో మరియమ్మన్‌ను పంటలుగా పూజిస్తారు. కొన్ని సందర్భాల్లో, ఆమెను రత్నాలుగా పూజిస్తారు. కాబట్టి, ఆమె వ్యాధిగా, వ్యాధిని ఇచ్చే దేవతగా, వ్యాధిని నయం చేసే దేవతగా కూడా కనిపిస్తుంది. ఇదే ప్లేగు తోనూ జరిగింది.” కానీ పేరుందేవి వ్యాధిని గొప్పగా చూడడమ్ గురించి హెచ్చరిస్తుంది. "మారియమ్మన్ గురించిన జానపద కథలు వ్యాధిని జీవితంలో భాగంగా అంగీకరించి పరిష్కారాలను కనుగొనే ప్రయత్నమే" అని ఆమె అభిప్రాయం చెప్పింది.
*****
ఇంతకీ మరియమ్మన్ ఎవరు?
ఈ ద్రావిడ దేవత చాలా కాలంగా పరిశోధకులను, చరిత్రకారులను, జానపద రచయితలను ఆకర్షిస్తోంది.
మరియమ్మన్ తమిళనాడులోని గ్రామాలలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవత, ఇక్కడ ఆమె సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది. ఆమె గురించి వివిధ స్థలాల నుండి వివిధరకాల కథలు వచ్చాయి.
కొంతమంది చరిత్రకారులు బౌద్ధ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, నాగపట్నం నుండి వచ్చిన బౌద్ధ సన్యాసినిగా గుర్తించారని ఉదహరించారు. వ్యాధి-బాధితులైన ప్రజలు, ముఖ్యంగా మశూచి బారిన పడిన వారు చికిత్స కోసం ఈమెను ఆశ్రయించారు. ఆమె వారిని బుద్ధునిపై విశ్వాసం ఉంచాలని కోరి, చాలామంది జబ్బుని నయం చేసింది, వారికి వేప-ఆకు పసరు పూసి, ప్రార్థనలు చేసి, చికిత్స చేసింది - పరిశుభ్రత, ఆరోగ్యం, దాతృత్వంపై సలహాలు కూడా ఇచ్చింది. ఆమె మోక్షం పొందినప్పుడు, ప్రజలు ఆమె విగ్రహాన్ని నిర్మించారు,అక్కడి నుండే మరియమ్మన్ కథ ప్రారంభమైంది.
ఇంకా అనేక ఇతర కథలు కూడా ఉన్నాయి. పోర్చుగీస్ వారు నాగపట్నం వచ్చినప్పుడు, ఆమెకు మర్యమ్మాన్ అని పేరు పెట్టడం, ఆమె క్రైస్తవ దేవత అని చెప్పుకోవడం వంటి కథ కూడా ఉంది.
ఆమెను మశూచి, ఇంకా ఇతర అంటు వ్యాధుల ఉత్తర-భారత దేవత అయిన శీతలానికి ప్రతిరూపంగా చెప్పుకునే వారు కొందరు ఉన్నారు. శీతల (దీని అర్థం సంస్కృతంలో 'చల్లపరిచేది' అని అర్ధం)ను శివుని జీవిత భాగస్వామి అయిన పార్వతీ దేవి అవతారంగా చూస్తారు.
అయితే గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నుండి వెలువడుతున్న వివరాల ప్రకారం, ఆమె గ్రామీణ ప్రజల దేవత, దళితులు, నిమ్న కులాలచే ఆరాధించబడేది - అంటే ఆమె నిజానికి, దళిత మూలానికి చెందిన దేవత.
ఇందులో ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, మరియమ్మన్ శక్తిని, ఆకర్షణను, యుగాలుగా, ఉన్నత కులాల వర్గాలు వారి దేవతగా సమీకరించడానికి, స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాయి.
చరిత్రకారుడిగా, రచయితగా కె.ఆర్. హనుమంతన్ 1980లోనే ' ది మారియమ్మన్ కల్ట్ ఆఫ్ తమిళనాడు ' అనే పేపర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు : “ఆ మరియమ్మన్ తమిళనాడులోని తొలి నివాసులు పూజించే పురాతన ద్రావిడ దేవత … దేవతకి పరియా[పరైయర్లు, ఒక షెడ్యూల్డ్ కులం]తో ఉన్న అనుబంధం ద్వారా తెలుస్తుంది , వీరిని పూర్వంలో 'అంటరానివారు'గా పిలిచేవారు. వీరు తమిళనాడు ద్రావిడ ప్రజల పురాతన ప్రతినిధులు.
ఈ దేవత యొక్క అనేక దేవాలయాలలో, హనుమంతన్, పరైయర్లు "చాలా కాలంగా పూజారులుగా పనిచేసినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు, చెన్నై సమీపంలోని తిరువెర్కాడు కారుమారియమ్మన్ ఆలయంలో అసలు పూజారులు పరైయర్లు. కానీ మతపరమైన ఎండోమెంట్స్ చట్టం [1863] ఆచరణలోకి వచ్చినప్పుడు వారి స్థానంలో బ్రాహ్మణులు ఉన్నారు.” బ్రిటీష్ కలోనియల్ చట్టం అప్పటికే కొనసాగుతున్న అట్టడుగు వర్గాల దేవాలయాలను అగ్రవర్ణాల స్వాధీనానికి చట్టపరమైన అనుమతినిచ్చింది. స్వాతంత్య్రం తర్వాత, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ అన్యాయాన్ని రద్దు చేయడానికి లేదా తగ్గించడానికి తమ స్వంత చట్టాలను తీసుకువచ్చాయి.
*****
మరి ఇప్పుడు ‘కరోనా దేవి’ దేవాలయమా? నిజమేనా?
అవును, కోయంబత్తూరు శివారు ఇరుగూర్‌లోని ఆ పేరుగల ఆలయ నిర్వాహకుడు ఆనంద్ భారతి చెప్పారు. "ఇది ప్లేగు మరియమ్మన్ ఆరాధనకు అనుగుణంగా ఉంటుంది," అని ఆయన చెప్పారు. “మేము కరోనా దేవి విగ్రహాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నప్పుడు [ఇప్పటికే ఉన్న మందిరంలో], వ్యాధి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరాధన మాత్రమే మనలను రక్షించగలదని మేము నమ్మాము.”
కాబట్టి కోవిడ్-19 సంభవించినప్పుడు, 2020 చివరలో, దేశంలోని కొన్ని ప్రదేశాలలో వెలసినట్లుగానే కోయంబత్తూర్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన ప్రార్థనా స్థలం వెలసింది.
అయితే దేవి అనడం ఎందుకు? కరోనా మరియమ్మన్ ఎందుకు అనకూడదు, అని మేము అడిగాము. ఆ పదాలను కలిపి పలికే పదజాలంలో సమస్యలు ఉన్నాయని భారతి అన్నారు. “మరియమ్మన్ అనే పదం ప్లేగు వ్యాధికి బాగా సరిపోతుంది కానీ కరోనాతో కాదు. కాబట్టి, మేము బదులుగా దేవి అని పిలవాలని నిర్ణయించుకున్నాము.”
తమిళనాడులోని దాదాపు ప్రతి గ్రామంలో మారియమ్మన్ దేవాలయం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఆమెకు వేరే పేరు ఉండవచ్చు, కానీ ఆమె దేవాలయాలు అయితే ఉన్నాయి
వైద్యపరమైన పురోగతి ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యల పట్ల ప్రజల ప్రతిస్పందనలో భాగంగా దేవతా పూజలు, సంబంధిత ఆచారాలు కొనసాగుతున్నాయి.
కానీ లాక్డౌన్ల కారణంగా, ప్లేగు మారియమ్మన్ ఆలయాలలో జరిగినట్లుగా, కరోనా దేవి ఆలయంలో ఆరాధకులను వ్యక్తిగతంగా సందర్శించడానికి అనుమతించలేదు. ఈ ప్రాణాంతక వైరస్ చుట్టూ నిర్మించిన ఆలయంలో దేవతను మాత్రమే కాకుండా మహారోగంప్రోటోకాల్‌లను కూడా దైవంగా పరిగణించాలి. 48 రోజుల పాటు ఒక యజ్ఞాన్ని (నిర్దిష్ట లక్ష్యంతో ఆచార పూజలు లేదా నైవేద్యాన్ని) నిర్వహించామని, ఆ తర్వాత కరోనా దేవి మట్టి విగ్రహాన్ని నదిలో కరిగించామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మందిరం ఇప్పుడు సందర్శకులకు తెరిచి ఉంది, కానీ పూజించడానికి వెళ్లినప్పుడు అందులో విగ్రహం లేకపోవడంతో వారు ఆందోళన పడతారు.
ఎలంగోవన్ వంటి రచయితలు ప్లేగు మారియమ్మన్ ఆలయాల మాదిరిగానే కోయంబత్తూర్ సంస్కృతిలో భాగంగా కరోనా దేవి ఆలయం అనే ఆలోచనను తిరస్కరించారు. “ఇది ఉత్తమమైన పబ్లిసిటీ స్టంట్. ప్లేగు మరియమ్మన్ పుణ్యక్షేత్రాలకు దీనికి సంబంధం లేదు, వీటి మధ్య పోలికలు లేవు. ప్లేగు మారియమ్మన్ దేవాలయాలు కోయంబత్తూరు చరిత్రలోనూ సంస్కృతిలోను అంతర్భాగంగా ఉన్నాయి.”
ప్లేగు మారియమ్మన్ ప్రార్థనా స్థలాలు నగరం అంతటా నేటికీ జనాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ ప్లేగు భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. 2019లో, కోవిడ్-19 ప్రారంభానికి ముందు, పప్పనాయకన్‌పాళయంలోని ప్లేగు మరియమ్మన్ దేవాలయంలో, ఒక పండుగ సందర్భంగా, దేవత విగ్రహంపై ఒక చిలుక కూర్చుని, భక్తులను చికాకు పెట్టడంతో చిన్న సంచలనంగా మారింది.
స్థానిక నివేదికల ప్రకారం, ఈ ‘వేడుక’ గంటలపాటు కొనసాగింది, ఆలయానికి మరింత మంది సందర్శకులను తీసుకొచ్చింది. “మారియమ్మన్ గ్రామ దేవత. ఆమె ఆలయాలు సామాన్య ప్రజలలో తమ ఔచిత్యాన్ని ఎప్పటికీ కోల్పోవు” అని ఇలంగోవన్ చెప్పారు. “ఉదాహరణకు, టౌన్ హాల్‌లోని కొనియమ్మన్ ఆలయ ఉత్సవం కోసం, అదే ప్రాంతంలోని ప్లేగు మరియమ్మన్ ఆలయంలో పవిత్రమైన అగ్నిగుండం తయారు చేస్తారు. ఆచారాలు పరస్పర సంబంధంతో నడుస్తాయి. కొనియమ్మన్‌ను కోయంబత్తూరు నగర సంరక్షక దేవతగా పరిగణిస్తారు.”
ఇంత క్లిష్టమైన చరిత్ర, పురాణాల గురించి ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అయినా, ఈ పుణ్యక్షేత్రాలు వాటికి ప్రాముఖ్యతను కోల్పోవు. కోయంబత్తూరులోని 28 ఏళ్ల వ్యాపారవేత్త ఆర్. నరైన్ మాట్లాడుతూ, “దేవాలయాలకు ఇలాంటి చరిత్ర ఉందని నిజంగా నాకు తెలీదు. కానీ నేను మా అమ్మతో పాటు వస్తూ ఉండేవాడిని, ఇక ముందు ముందు కూడా వస్తూ ఉంటాను. నాకు ఏమీ మారదు. ఇకపై నాకు ఈ దేవాలయం ఇంకా అద్భుతంగా కనిపిస్తుందేమో.”
కవితా మురళీధరన్ ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు రాస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం: అపర్ణ తోట