లేదు, కిషన్‌జి లారీ వెనుక డోర్ లేదా గేట్ నుంచి లోపలకి చూడడానికి ప్రయత్నించడం లేదు. అయినా ఆ లారీ పూర్తి ఖాళీగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో మురాదాబాద్ నగరంలో చిన్న బస్తీలో అప్పుడే ఆ లారీ, ఏదో గోడౌన్ లో లోడ్ దించి వచ్చింది.
డెబ్బైల మధ్యలో ఉన్న కిషన్‌జీ వీధిలో ఇంట్లో వేపి తెచ్చిన పల్లీలను తన తోపుడు బండి మీద అమ్ముకునే చిన్న విక్రయదారుడు. “నేను మార్చిపోయింది ఏదో తెచ్చుకుందామని అప్పుడే ఇంటికి వెళ్లాను, నేను వెనక్కి వచ్చేసరికి ఒక పెద్ద లారీలో సగం నా బండి మీదకు ఎక్కి ఉంది.” అన్నాడు కిషన్‌జీ.
ఏమైందంటే ఆ లారీ డ్రైవర్ తన లారీ ని ఇక్కడ, వెనక్కి నడుపుతూ, కిషన్‌జీ బండి మీదుగా పార్క్ చేశాడు. కనీసం ఆ లారీ కిషన్‌జీ బండికి మరీ దగ్గరగా వచ్చిందో లేదో కూడా చూసుకోకుండా. ఇక ఆ తరవాత ఆ డ్రైవర్, అతని క్లీనర్ ఇద్దరూ అక్కడనుంచి అదృశ్యమైపోయారు- బహుశా వారి స్నేహితులను కలవడానికో లేక భోజనానికో. వెనుక డోర్ లోని పై సగం కిషన్‌జీ బండి మీద ఇంచుమించుగా ఎక్కి కుర్చునట్టు ఉండిపోయి, అక్కడే ఇరుక్కుపోయింది. కిషన్‌జీ దానిని వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కళ్ళు సరిగ్గా కనపడని కిషన్‌జీ లారీ లోకి చూస్తున్నాడు - తన బండి ఏ భాగం లో ఎక్కడ ఇరుక్కుంది, తన బండిని లారీ నుండి విడదీయడాన్ని లారీ లో ఎక్కడ ఏ భాగం ఆపుతుందో తెలుసుకోడానికి, కిషన్‌జీ లోపలకి చూస్తున్నాడు.
ఆ డ్రైవర్, అతని అసిస్టెంట్ ఎక్కడికి వెళ్లారో మాకు అర్థం కాలేదు. కిషన్‌జీకి కూడా వాళ్లెవరో, ఎక్కడున్నారో తెలీదు, కానీ వారి తాత ముత్తాతలను అతని మాటలలో తలచుకున్నాడు. వయసు అతని పదవిలాసాన్ని ఏమీ తగ్గించలేదు.
కిషన్‌జీ తన బండి మీద సరుకుని అమ్ముకునే లెక్కవేయలేని వేలమంది వీధి విక్రయదారుల్లో ఒకడు. మన దేశం లో ఎంతమంది కిషన్‌జీలు ఉన్నారో ఎక్కడా ఒక సరైన లెక్క లేదు. కచ్చితంగా 1998 నేను ఈ ఫోటో ను తీసుకునేడప్పుడైతే ఆ లెక్క లేదు. “నేను ఈ బండిని తోసుకుంటూ మరీ దూరాలు నడవలేను. అందుకే నేను 3-4 బస్తీలలోనే తిరుగుతుంటాను.” అన్నాడతను. “నేను 80 రూపాయిలు సంపాదించగలిగితే అది నాకు మంచి రోజు అవుతుంది.”
మేమంతా అతని బండిని ఆ ఇరుకులోంచి తప్పించాము. అతను ఆ రోజు ఇంకో 80 రూపాయిలు వస్తాయేమో అన్న ఆశతో తన బండిని తోసుకుంటూ దూరంగా వెళ్లిపోతుంటే చూస్తూండిపోయాము.
అనువాదం: అపర్ణ తోట