ఇక తన కుటుంబ పోషణ గురించి చింతించాల్సిన అవసరం లేదని రుఖ్సానా ఖాతూన్ భావించారు. రేషన్ కార్డ్ కోసం రెండు సంవత్సరాల పాటు సాగుతూపోయిన ఆమె ప్రయత్నాలు మూడోసారి ఫలించి, 2020 నవంబర్‌లో ఆమెకు రేషన్ కార్డ్ వచ్చింది. అకస్మాత్తుగా, కోవిడ్ విజృంభించిన ఆ సంవత్సరంలోని గడ్డు నెలలు వెనక్కిపోయినట్లు ఆమెకు అనిపించింది.
ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ), 2013 కింద ఒక 'ప్రాధాన్య కుటుంబాలు’ కార్డ్. దీని కింద అర్హులైన లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి.
ఆ కార్డు, ఆ సమయంలో వారు నివసిస్తున్న వారి స్థానిక ఇంటి చిరునామాను కలిగి ఉంది. బిహార్‌లోని దర్భంగా జిల్లాలోని ఒక మురికి మునిసిపల్ కౌన్సిల్ ప్రాంతంలో ఇటీవలే విలీనం చేయబడినది వారి గ్రామం. తన ఏడుగురు సభ్యుల కుటుంబానికి రాయితీతో కూడిన రేషన్‌లను రుఖ్సానా చివరకు పొందగలిగారు.
ఆ తర్వాత వారందరూ ఆగస్టు 2021లో ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఆమె కుటుంబానికి చట్టబద్ధంగా లభించే ఆహారధాన్యాలను పొందడం ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడింది.
కేంద్ర ప్రభుత్వ ‘ ఒక దేశం , ఒక రేషన్ కార్డ్ ’ (ఒఎన్ఒఆర్‌సి) పథకం కింద, ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారులు - 'ప్రాధాన్య కుటుంబాలు', 'పేదవారిలోకెల్లా పేదవారు' కింద వర్గీకరించబడినవారు. వీరు ఏ చౌక ధరల దుకాణం నుండైనా తమ ఆహార ధాన్యాల కోటాను సేకరించడానికి అర్హులు. ఆధార్ కార్డ్ లింక్ అయివున్న బయోమెట్రిక్ ప్రామాణికతను ఉపయోగించి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)) కింద వస్తువులను పంపిణీ చేయడానికి ఈ దుకాణాలు లైసెన్స్ పొందాయి. కానీ రుఖ్సానా తన నెలవారీ కోటా కోసం పశ్చిమ ఢిల్లీలోని షాదీపూర్ మెయిన్ బజార్ ప్రాంతంలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ప్రతిసారీ, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePOS) మెషీన్‌లో ఇలా రాసి ఉంటోంది: ‘ఐఎంపిడిఎస్‌లో రేషన్ కార్డ్ లేదు’.
ప్రజా పంపిణీ వ్యవస్థ - పిడిఎస్ కింద పంపిణీ చేయడానికి ఆహారధాన్యాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఒఎన్ఒఆర్‌సి పథకం కింద దేశంలోని ఏ ప్రాంతం నుండైనా అర్హులైన వలసదారులు తమకు రావలసిన ఆహారధాన్యాలను తీసుకునేలా 2018లో ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ( ఐఎంపిడిఎస్ ) ఏర్పాటు చేయబడింది.
కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె కుటుంబ ఆర్థిక స్థితిగతులు దిగజారిపోవడంతో, ఢిల్లీలో ఇంటిపనులు చేసే కార్మికురాలుగా పనిచేస్తున్న రుఖ్సానా, ఒక రేషన్ కార్డును పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అక్టోబర్ 2020లో, PARI నివేదించింది. ఉచిత ఆహార పంపిణీ జరిగే ప్రదేశాల వద్ద ఆమె క్యూలో నిలబడవలసి వచ్చింది. చేసేందుకు పని దొరకక, పిడిఎస్ కింద ఆహారధాన్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడంతో, చివరకు ఆమె తన పిల్లలను తీసుకొని దర్భంగాకు తిరిగి వచ్చింది.
PARI రుఖ్సానా గురించిన నివేదికను ప్రచురించిన కొన్ని వారాలకు, అధికారులు బిహార్‌లో ఉన్న రుఖ్సానాను కలిశారు. ఆమె కుటుంబ ఆధార్ కార్డులను పరిశీలించిన తర్వాత ఆమెకు ఒక రేషన్ కార్డ్‌ను మంజూరు చేశారు.
"బిహార్‌లో, బొటనవేలును [ePOS- వేలిముద్రను గుర్తించే స్కానర్‌పై] అలా ఉంచినవెంటనే మా రేషన్ మాకు వచ్చేది," అని ఆమె చెప్పారు. అక్కడ రేషన్ షాపుకు ఆమె వెళ్లలేకపోతే ఆమె 11 ఏళ్ల కొడుకు లేదా, 13 ఏళ్ల కూతురు కూడా తమ ఆహారధాన్యాలను ఇంటికి తీసుకువచ్చేవాళ్ళు. “ జబ్ సబ్ ఆన్ లైన్ హువా హై , ఫిర్ క్యోఁ నహీ ఆ రహా యహాఁ [ఇప్పుడంతా ఆన్‌లైన్ అయినప్పుడు, మేం ఇక్కడ (ఢిల్లీలో) మా వివరాలను ఎందుకు చూడలేకపోతున్నాం?]”
రుఖ్సానా (31), ఆమె భర్త మహమ్మద్ వకీల్ (35), వారి ఐదుగురు పిల్లలతో కలిసి ఆగస్టు 25, 2021న రైలులో ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆమె పశ్చిమ ఢిల్లీలోని పటేల్ నగర్‌లో నాలుగు ఇళ్లలో గృహ కార్మికురాలిగా తిరిగి తన పనిని మొదలుపెట్టి, నెలకు రూ. 6,000 సంపాదిస్తున్నారు. బిహార్‌కు తిరిగి వెళ్ళడానికి ముందే, 2020 నవంబర్‌లో తన టైలరింగ్ దుకాణాన్ని మూసివేసిన వకీల్‌కు, చివరకు 2022 మార్చిలో ఈశాన్య ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్‌లో టైలర్‌గా పని దొరికింది. ఆయన సంపాదన నెలకు రూ. 8,000.
మార్చి 2020లో లాక్‌డౌన్ ప్రారంభం కావడానికి ముందు ఆ ఇద్దరి సంపాదన మొత్తం నెలకు దాదాపు రూ. 27,000.
సెప్టెంబర్ 2021 నుండి రుఖ్సానా, రేషన్ షాపు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో తానే మర్చిపోయారు.
"బిహార్ నుండి రేషన్ కార్డును బ్లాక్ చేశారని ఇక్కడి డీలర్ నాతో చెప్పారు. బిహార్ వెళ్లి మా ఆధార్ కార్డులన్నింటినీ నా రేషన్ కార్డ్‌తో లింక్ చేయమని అడిగారు. మా మామగారు బేనీపుర్‌లోని రేషన్ కార్యాలయానికి వెళ్లారు. కానీ మా ఆధార్ కార్డులన్నిటినీ ఢిల్లీలోని రేషన్ కార్యాలయంలోనే సమర్పించమని అక్కడివాళ్ళు ఆయనకి చెప్పారు. మేము బిహార్‌లో విచారించినప్పుడు, ఢిల్లీలో తనిఖీ చేయించమని చెప్పారు. ఢిల్లీలో అడిగితే, బిహార్‌లో తనిఖీ చేయాలని వారు మాట్లాడుతున్నారు." అని రుఖ్సానా వాపోయారు.
*****
రుఖ్సానా తన స్వగ్రామమైన మోహన్ బహెరాలో నివసించడానికి ఇష్టపడతారు. ఈ గ్రామం మరో 23 గ్రామాలతో కలిసి దర్భంగాలోని బేనీపుర్ నగర్‌పరిషత్‌గా 2009లో ఏర్పాటయింది. “మా గ్రామంలో నాకు విశ్రాంతిగా ఉన్నట్టుండేది. అక్కడ నేను చేయాల్సిందల్లా ఆహారం సిద్ధం చేయడం, తినడం, పిల్లలను చూసుకోవడం." అంటారు రుఖ్సానా. ఢిల్లీలో అయితే, తన కుటుంబానికి వంట చేసే సమయానికి తిరిగి ఇంటికి రావాలంటే, ముందు ఆమె తన యజమానుల ఇళ్లల్లో పనిని ఉరుకులపరుగుల మీద ముగించాల్సి ఉంటుంది.
షాదీపూర్ మెయిన్ బజార్‌లోని నివాస గృహాలు ఒక ప్రధాన మార్కెట్ రోడ్డు చుట్టూ విస్తరించిన చిన్నచిన్న ఇళ్ళతో కూడిన ఎత్తు తక్కువ నిర్మాణాలు. ఇక్కడ సెప్టెంబర్ 2021 నుండి రుఖ్సానా నివసించే ఇల్లు- ఒక చిన్న, క్రిక్కిరిసి ఉన్న గది. దీని అద్దె నెలకు రూ. 5,000. ఒక వైపు వంట కోసం ఎత్తుగా కట్టిన అరుగు, దానికి ఎదురుగా ఒక మంచం. వీటి మధ్య వకీల్ కుట్టు మిషన్, బట్టల కొలతల కోసం ఉపయోగించే ఒక పెద్ద టేబుల్ ఉన్నాయి. ప్రవేశ ద్వారం దగ్గర కుడి మూలలో ఒక టాయిలెట్ ఇరికించినట్టుగా వుంది.
రుఖ్సానా, ఆమె ముగ్గురు చిన్న కూతుళ్ళు – నజ్మిన్ (9), జమ్జమ్ (3), ఒక సంవత్సరం వయస్సున్న అసియా - ఇనుప మంచం మీద పడుకుంటారు. వకీల్, కపిల్ (11), పెద్ద కుమార్తె చాందిని (13)- వీరు నేలపై పరచివున్న దూది పరుపుపై పడుకుంటారు.
“గ్రామాలలో అయితే, జనం తమ జంతువులను ఇలాంటి గదులలో వదులుతారు. నేను హాస్యమాడడం లేదు. వాళ్ళు తమ పశువులను ఇంతకంటే మంచి గదుల్లో ఉంచుతారు,” అని వకీల్ చెప్పారు. "ఇక్కడ, ప్రజలే స్వయంగా జంతువులు అవుతారు."
ఎన్ఎఫ్ఎస్ఎ కింద, భారతదేశంలోని గ్రామీణ జనాభాలో 75 శాతం మంది, పట్టణ జనాభాలో 50 శాతం మంది సబ్సిడీ ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి అర్హులు. వీరు కిలో బియ్యం రూ. 3, గోధుమలు రూ. 2, ముడి తృణధాన్యాలు (మిల్లెట్లు) కిలో ఒక్కింటికి రూ. 1 చొప్పున గుర్తింపుపొందిన చౌక ధరల దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు. 'ప్రాధాన్య కుటుంబాలు' కార్డులో జాబితా చేయబడిన ప్రతి ఒక్కరు నెలకు 5 కిలోల చొప్పున, ఆహారధాన్యాలు తీసుకోవడానికి అర్హులు. అత్యంత నిరుపేద కుటుంబాలు, లేదా "పేదలలో కెల్లా పేదవారు", అంత్యోదయ అన్న యోజన (AAY) కింద ప్రతి నెలా 35 కిలోల వరకు ఆహారధాన్యాలు తీసుకునేందుకు అర్హులు.
రుఖ్సానా కుటుంబ సభ్యులలోని ఆరుగురు ఆమె ప్రాధాన్య కుటుంబ కార్డులో నమోదైవున్నారు. వీరిలో ఒక్కొక్కరికీ నెలకు 3 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమలు అందుతాయి.
వివిధ వినియోగ, ఆదాయ ప్రమాణాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గాల అర్హతను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు, ఢిల్లీలో వార్షిక ఆదాయం రూ. లక్ష కంటే తక్కువ ఉన్న కుటుంబాలు 'ప్రాధాన్య కుటుంబాలు, AAY కేటగిరీ'లలో చేర్చడానికి అర్హులు . ప్రతి కుటుంబం యొక్క సామాజిక, వృత్తిపరమైన, గృహపరమైన దుర్బలతలను పరిగణనలోకి తీసుకొనడం ద్వారా వారే వర్గానికి చెందుతారో నిర్ణయించబడుతుంది. అయితే, ఆదాయపరమైన అర్హత ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఉపయోగం కోసం నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉన్న కుటుంబాలు, లేదా రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతాలలో భవనం లేదా భూమి ఉన్నవారు, లేదా 2 కిలో వాట్ల కంటే ఎక్కువ వాడకం ఉన్న విద్యుత్ కనెక్షన్‌ని కలిగి ఉన్న కుటుంబాలు ఈ వర్గాల నుండి మినహాయించబడ్డాయి. వేరొక పథకం కింద సబ్సిడీ ఆహారాన్ని పొందుతున్న కుటుంబాలు, లేదా ఆదాయపు పన్ను చెల్లించే సభ్యులున్న కుటుంబం, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే కూడా ఈ పథకాలకు అర్హులు కారు.
బిహార్‌లో, మినహాయింపు ప్రమాణాల ద్వారా అర్హత నిర్ణయించబడుతుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మార్గదర్శకాలు , మోటారు వాహనం (మూడు లేదా నాలుగు చక్రాల వాహనం), లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ పక్కా గదులు ఉన్న ఇల్లు, లేదా 2.5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ సాగునీటి వసతి కలిగి ఉన్న పొలం ఉన్న ఏ కుటుంబాన్నయినా అనర్హులుగా చేస్తాయి. కుటుంబంలోని ఒక సభ్యుడు నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నా, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇందులోంచి మినహాయించబడతారు.
2019లో పైలట్ పథకంగా ప్రారంభించబడిన ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డ్’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నట్లు కేంద్రం మే 2020లో ప్రకటించింది. కార్డు కలిగివున్నవారి ఆధార్ నంబర్ ఒకసారి 'సీడ్' అయిన తర్వాత, ఆ రేషన్ కార్డ్ ఎక్కడ రిజిస్టర్ చేయబడి ఉన్నా సరే, దాని 'పోర్టబిలిటీ'ని ఇది అనుమతిస్తుంది. ఇది రుఖ్సానా పరిస్థితిలో ఉన్న ఎవరైనా, దేశంలోని ఏ ఔట్‌లెట్ నుండి అయినా పిడిఎస్ ద్వారా వారికి లభించే సౌకర్యాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై 2021లో అమలులోకి తెచ్చింది.
*****
రుఖ్సానా ప్రతి రోజూ, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు, తాను పనిచేసే ఇళ్ళలో శుభ్రం చేసి, నేలను తుడిచి, పాత్రలను తోమి, శుభ్రం చేస్తారు. రుఖ్సానా సోదరి రూబీతో కలిసి ఈ రిపోర్టర్, డిసెంబరు 1, 2021న పటేల్ నగర్‌లోని ఆహార సరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయానికి - రుఖ్సానా తనకు రావలసిన రేషన్‌ను ఢిల్లీలో ఎందుకు పొందలేకపోతున్నారో అడిగేందుకు - వెళ్ళారు.
'మేరా రేషన్' మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు సీడ్ చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయమని వారు మాకు సలహా ఇచ్చారు. ఆ రోజు వారి కార్యాలయంలో ఈ వెబ్ పోర్టల్ పనిచేయడం లేదు.
ఆ మధ్యాహ్నం మేము రుఖ్సానా రేషన్ కార్డు, ఆధార్ వివరాలను అప్లికేషన్‌లో పొందుపరిచి చూశాం. ఏడాది వయసున్న చిన్నారి అసియా మినహా మిగతా కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ‘సీడెడ్’గా కనిపించాయి. కానీ ఒఎన్ఒఆర్‌సి రిజిస్ట్రేషన్ కోసం రుఖ్సానా వలసవచ్చిన సమాచారాన్ని నవీకరించడానికి ప్రయత్నించినప్పుడు, ఒక పాప్-అప్ సందేశం కనిపించింది: 'డేటాను పోస్ట్ చేయడం సాధ్యం కాదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి.’
డిసెంబర్ 7న మరోసారి ప్రయత్నించినప్పుడు కూడా అదే పాప్-అప్ సందేశం వచ్చింది.
చివరికి, ఒక పిడిఎస్ డీలర్ మాట్లాడుతూ- ఐఎంపిడిఎస్ సర్వర్ కొన్నిసార్లు వలసదారుల స్థానిక గ్రామాల్లో పంపిణీ ప్రారంభమైన అదే సమయంలో ఢిల్లీలో నివసించే వారి కోసం పని చేయడం కూడా ప్రారంభిస్తుంది. ఢిల్లీ లబ్ధిదారులు నవంబర్ 31 సాయంత్రంలోపు తమ కోటాను పొందారు. బీహార్‌లో తదుపరి రౌండ్ పంపిణీ డిసెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని ఆ డీలర్ తెలిపారు.
రుఖ్సానా అప్పటికీ ఆశ చావక, డిసెంబర్ 5న రేషన్ అవుట్‌లెట్‌కి తిరిగి వెళ్ళారు. యంత్రం స్పందించింది: ‘ఐఎమ్‌పిడిఎస్‌లో రేషన్ కార్డ్ కనిపించలేదు’.
సెప్టెంబరు 2021 నుండి, రుఖ్సానా ఇంటిల్లిపాదికీ ఆహారాన్ని సమకూర్చడం కోసం తన యజమానుల సహాయంపై ఆధారపడవలసి వచ్చింది. “ఒకరు నాకు కొన్ని పచ్చి కూరగాయలు ఇస్తారు. మరికొన్నిసార్లు ఇంకో యజమాని అవుట్‌లెట్ నుండి తీసుకొచ్చిన తన రేషన్‌లో కొంత భాగాన్ని మాకు ఇస్తారు."
" కబ్ సే కోషిష్ కర్ రహీ హూఁ [నేను చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను]," అని రుఖ్సానా చెప్పారు. ఆమెలో నిరాశ స్పష్టంగా కనిపించింది. బీహార్ నుండి ఆమెతో పాటు ఢిల్లీకి తిరిగి వచ్చిన కొంతమంది, 2021 ఆగస్టు, డిసెంబర్‌ల మధ్య కనీసం మూడుసార్లు తమ కోటాను తీసుకున్నారు.
2020 డిసెంబరు నుంచీ ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్థానంలో పంపిణీ చేసిన డ్రై రేషన్ కిట్ ఉపయోగకరంగా ఉండింది. ఆమె ఇద్దరు పెద్ద పిల్లలు కపిల్, చాందినీ పటేల్ నగర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఈ పిల్లలిద్దరూ తలా పదేసి కిలోల బియ్యం, రెండు కిలోల పప్పు , ఒక లీటర్ రిఫైన్డ్ నూనె అందుకున్నారు. అయితే మార్చ్ 2022లో మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభం కాగానే ఈ కిట్లు ఆగిపోయాయని రుఖ్సానా చెబుతున్నారు.
*****
ఢిల్లీ ప్రభుత్వ ఓఎన్‌ఓఆర్‌సీ హెల్ప్‌లైన్ నంబరుకు చేసిన ఎన్నో ప్రయత్నాలు ఏ ఫలితమూ ఇవ్వలేదు. నెట్‌వర్క్ ఎప్పుడూ ‘రద్దీ’గానే ఉండింది.
దర్భంగాలోని బేనీపుర్‌లో 1991 నుంచీ చౌక ధరల దుకాణం నడిపిన రేషన్ డీలర్ పర్వేజ్ ఆలమ్, ఈ సమస్య రుఖ్సానా ఒక్కరిదే కాదని, మాతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. ‘‘చాలామంది ఢిల్లీకి వెళ్ళిన వలస కార్మికులు ఢిల్లీలో తమ రేషన్ తీసుకోలేకపోతున్నామని ఫోన్లు చేసి చెబుతున్నారు,’’ అని ఆలమ్ చెప్పారు.
దర్భంగా జిల్లా పంపిణీ అధికారి అజయ్ కుమార్ తమ కార్యాలయంలో అన్ని పనులూ సవ్యంగా సాగుతున్నట్టు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ‘‘ఢిల్లీలోని అధికారులు సరిగ్గా ఎక్కడ సమస్య ఉందో మీకు చెబుతారు. (ఢిల్లీ తప్ప) ఇంకే రాష్ట్రంలోనూ ఏ సమస్యలూ ఉన్నట్టుగా నివేదించబడటం లేదు,’’ అన్నారాయన.
ఢిల్లీలోని ఆహార సరఫరాల విభాగానికి చెందిన అదనపు కమిషనర్ కుల్‌దీప్ సింగ్, బిహార్‌కు చెందిన వలస కార్మికులకు సంబంధించి డిసెంబరులో ఇప్పటికే 43,000కు పైగా లావాదేవీలు జరిగాయని చెప్పారు. ‘‘అది ఒక ప్రత్యేకమైన కేసు అయివుంటుంది. లబ్ధిదారు పేరును బహుశా బిహార్‌లో తొలగించి ఉండటానికి అవకాశం ఉంది,’’ అన్నారాయన.
మే 2020లో, కేంద్రం ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డ్’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అది ఎక్కడ నమోదు చేయబడినా, కార్డుదారుని ఆధార్ నంబర్‌తో ఒక్కసారి 'సీడ్' అయిన తర్వాత, రేషన్ కార్డు 'పోర్టబిలిటీ'ని అనుమతిస్తుంది
2022 ఫిబ్రవరి 24న రుఖ్సానా, ఆమె కుటుంబం తమ కుటుంబానికే చెందిన ఒకరి వివాహం సందర్భంగా దర్భంగా ప్రయాణమయ్యారు. వాళ్లు ఊరికివచ్చిన తెల్లారి, అంటే ఫిబ్రవరి 26న, తమ కూతురుని మోహన్ బహేరాలోని చౌక ధరల దుకాణానికి పంపారు రుఖ్సానా.
అక్కడ వాళ్ల కుటుంబం తమ ఆ నెల రేషన్లను తీసుకోగలిగింది.
అయితే, ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి ముందు మార్చ్ 21న, రుఖ్సానా రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, గ్రామంలోని డీలర్ ఆమె రేషన్ కార్డ్ రద్దయిందని చెప్పాడు. ‘‘ఊపర్ సే బంద్ హో గయా హై(పైనుంచి ఆగిపోయింది),’’ అని ఆమెకు చెప్పాడు
‘‘పోయిన్నెల పని చేసింది. అలా ఎలా రద్దవుతుంది?’’ అని డీలర్‌ను అడిగారు రుఖ్సానా.
ఇంట్లో వాళ్లందరి ఆధార్ కార్డులు తీసుకుని బేనీపుర్‌లోని బ్లాక్ రేషన్ ఆఫీసుకు వెళ్లమని డీలర్ మళ్లీ ఆమెకు సలహా ఇచ్చాడు. ఢిల్లీలోని ఆఫీసుకు కూడా ఆధార్ కార్డులు తీసుకుపొమ్మని డీలర్ ఆమెకు సూచించాడు.
ఈ విధంగా రేషన్ కార్డు రద్దు కాదని డీఎస్‌ఓ అజయ్ కుమార్ చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో, రుఖ్సానా, ఆమె కుటుంబం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
తిరిగి ఢిల్లీకి వస్తే, ఇప్పట్లో ఏమీ మారే సంకేతాలు కనబడని పరిస్థితులతో రాజీ పడిపోయానని రుఖ్సానా చెప్పారు. ‘‘ రేషన్ తో మేరా బంద్ హీ హో గయా (నా రేషన్ అయితే బంద్ అయిపోయింది).’’
అనువాదం: సుధామయి సత్తెనపల్లి