లేదు, చిత్రకళ
ఇళ్ళను అందంగా అలంకరించేందుకు కాదు. అది శత్రువుకు వ్యతిరేకంగా పోరాడటానికీ, రక్షించుకోడానికీ
కూడా పనికివచ్చే ఒక ఆయుధం.
- పాబ్లో పికాసో
మరాఠీ భాషలో ఒక సామెత ఉంది: “బామనా ఘరి లిహనం, కుణబ్యా ఘరి దానం ఆణి మాంగా-మహారా ఘరి గాణం.” బ్రాహ్మణుడి ఇంట్లో వర్ణమాల ఉంటుంది, కుణ్బీల ఇంట్లో గింజలు ఉంటాయి, మాంగ్-మహార్ ఇళ్లలో సంగీతం ఉంటుంది.” సంప్రదాయ గ్రామం ఏర్పాటులో, మాంగ్ సామాజిక వర్గానికి చెందినవారు హల్గీ వాయించారు, గోంధలీలు సంబల్ వాయించారు, ధన్గర్లు ఢోల్ లో మాస్టర్లు మహర్లు ఏక్ తారీ వాయించారు. విజ్ఞానం, వ్యవసాయం, కళ, సంగీతాల సంస్కృతి కులాలవారీగా విభజించబడింది. అంతేకాకుండా, 'అంటరానివారు' అని యెంచే అనేక కులాలకు పాడటం, సంగీతాన్ని ప్రదర్శించడం మనుగడకు ముఖ్యమైన సాధనాలు. శతాబ్దాలుగా అణచివేతనూ వివక్షనూ ఎదుర్కొంటూన్న దళితులు తమ చరిత్రను ధైర్యం, బాధ, ఆనందం, తత్త్వం వంటివాటిని జాత్యవర్చి ఓవి (రోకటి పాటలు లేదా పద్యాలు)గానూ, మౌఖిక కథలు, పాటలు, జానపద సంగీతం వంటి రూపాలలోనూ భద్రపరిచారు. డాక్టర్ అంబేద్కర్ జాతీయ వేదికపై ప్రముఖులుగా ఎదగడానికి ముందు, మహార్ ప్రజలు కబీర్ దోహాల కు ఏక్‌తారీ వాయించేవారు. విఠల్ కోసం భక్తి పాటలు పాడారు. భగవంతుడిని ఆరాధించే భజనలు చేశారు.
డా. అంబేద్కర్ దళిత రాజకీయ దిగంతంలో ఉద్భవించినప్పుడు, 1920 తర్వాత, ఈ కళారూపాలు, సంబంధిత కళాకారులు ఆయన ప్రారంభించిన జ్ఞానోదయ ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో, వ్యాప్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం పెంపొందించిన సామాజిక మార్పులను, దైనందిన సంఘటనలను, డాక్టర్ అంబేద్కర్ పాత్ర, ఆయన సందేశం, జీవితం, పోరాటాల ద్వారా - నిరక్షరాస్యులు, అవగాహన లేని వారు కూడా అర్థం చేసుకోగలిగే భాషలో - వారు వివరించేవారు. ముంబైలోని నాయ్‌గావ్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్లో భీమ్రావ్ కర్డక్ , అతని బృందం ప్రదర్శించిన ఒక జల్సా (పాటల రూపంలో సాంస్కృతిక నిరసన)ను డాక్టర్ అంబేద్కర్ స్వయంగా చూశారు. "నా 10 సభలు, సమావేశాలు కర్డక్, అతని బృందం ఇచ్చే ఒక్క జల్సా ప్రదర్శనకు సమానం." అని అంబేద్కర్ పేర్కొన్నారు.
డా. అంబేద్కర్ సమక్షంలో ప్రదర్శననిస్తూ, షాహిర్ భెగ్డే ఇలా అన్నారు:
ఈ మహార్ పిల్లవాడు (అంబేడ్కర్) చాలా తెలివైనోడు
నిజం, చాలా తెలివైనోడు
మొత్తం ప్రపంచంలో ఇలా ఎక్కడా జరిగి ఉండదు
చీకట్లోంచి బయటపడే దారి చూపాడు
అమాయక జనాన్ని తట్టిలేపాడు
డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం దళితుల్లో ఒక చైతన్యపు అలను తీసుకువచ్చింది. జల్సా ఈ ఉద్యమానికి ఒక సాధనం; వేలాదిమంది తెలిసిన, తెలియని కళాకారుల కోసం షాహిరి (ప్రదర్శనా కవిత్వం) ఒక మాధ్యమం.
అంబేద్కర్ ఉద్యమం గ్రామాలకు చేరుకున్నప్పుడు, సగానికి సగం తగరపు పైకప్పులు, మిగిలిన సగం గడ్డి పైకప్పులతో ఉండే దళిత వస్తీ (నివాసాలు)లలో ఒక విలక్షణమైన దృశ్యం కనిపించేది. ఈ వస్తీ మధ్యలో ఒక వేదిక ఉంటుంది, అక్కడ ఒక నీలిరంగు జెండా ఎగురవేయబడుతుంది. ఆ నీలిరంగు జెండా కింద, పిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు గుమిగూడతారు. సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలలో బుద్ధ-భీమ్ గీత్ (పాటలు) పాడతారు. చైత్యభూమి (ముంబై), దీక్షాభూమి (నాగ్‌పూర్), ఇంకా ఇతర పెద్ద నగరాల నుండి చిన్నా పెద్దా కవుల పాటల పుస్తకాలను తీసుకువస్తారు. దళిత వస్తీల లోని స్త్రీ, పురుషులు నిరక్షరాస్యులైనప్పటికీ, వారు బడికి వెళ్ళే పిల్లలతో ఆ పాటలను పైకి చదివించుకొని, తరువాత తాము పాడటానికి వీలుగా వాటిని గుర్తుపెట్టుకుంటారు. లేదంటే ఎవరైనా షాహిర్ పాడిన పాటను కంఠస్థం చేసి తమ వస్తీ లో ప్రదర్శిస్తారు. పొలంలో బాగా కష్టపడి పనిచేసి అలసిపోయిన రోజున ఇంటికి తిరిగి వస్తుండే మహిళా వ్యవసాయ కూలీలు, “ భీమ్ రాజా కీ జై ! బుద్ధ భగవాన్ కీ జై !” అని పాడుతూ వస్తీల మనఃస్థితిని సంతోషకరంగా, ఉల్లాసంగా, ఆశాజనకంగా మారుస్తారు. గ్రామాల్లోని దళితులకు ఈ పాటలే ఒక విశ్వవిద్యాలయం వంటివి. వీటి ద్వారానే బుద్ధుడు, అంబేద్కర్లు తర్వాతి తరానికి పరిచయమవుతారు. ఈ గాయకుల, షాహీర్ల కరుకైన, చురుకైన భాష ద్వారా ఎప్పటికీ మరచిపోలేని విధంగా బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్లను గురించిన శక్తివంతమైన పాటలను యువతరం తమ మనస్సులలో ఇముడ్చుకుంది. షాహీర్లు మొత్తంగా ఒక తరం యొక్క సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని రూపొందించారు. ఆత్మారామ్ సాల్వే అటువంటి షాహీర్ల లో ఒకరు, మరాఠ్వాడా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని నిర్మించడంలో కీలక పాత్రను పోషించినవారు.
బీడ్ జిల్లా, మాజల్గావ్ తాలూకాలోని భాట్వడ్గావ్లో జూన్ 9, 1953లో జన్మించిన షాహిర్ సాల్వే 1970లలో విద్యార్థిగా ఔరంగాబాద్‌కు వచ్చారు.
మరాఠ్వాడా 1948కి మునుపు నిజాం పాలనలో ఉండేది. విద్యతో సహా ఈ ప్రాంతపు అభివృద్ధి అనేక రంగాలలో దెబ్బతింది. ఈ నేపథ్యంలో, డాక్టర్ అంబేద్కర్ 1942లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఔరంగాబాద్‌లోని నాగ్‌సేన్‌వన్ ప్రాంతంలో మిలింద్ మహావిద్యాలయాన్ని ప్రారంభించారు. నాగ్‌సేన్‌వన్ క్యాంపస్ దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. మిలింద్ కళాశాలకి ముందు, మరఠ్వాడా అంతటికీ ఒకే ఒక ప్రభుత్వ కళాశాల ఔరంగాబాద్‌లో ఉండేది; అది కూడా ఇంటర్ వరకు మాత్రమే! (ఇంటర్ అనేది డిగ్రీ కోర్సుకు ముందరి కోర్స్ అయిన ఇంటర్మీడియట్ డిగ్రీని సూచిస్తుంది.) మరఠ్వాడాలో ప్రీ-డిగ్రీ విద్య కోసం మిలింద్ మొదటి కళాశాల అయింది. ఈ ప్రాంతంలో శాస్త్రసంబంధమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఈ కొత్త కళాశాల కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని కూడా ఇది మార్చేసింది. అంతరించిపోతున్న ఆ సమాజానికీ, ప్రాంతానికీ కొత్త జీవాన్ని అందించింది. అంతేకాకుండా స్వంత గుర్తింపునూ, విలువనూ గురించిన ఎరుకను కలిగించడంలో తోడ్పడింది. మహారాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు మిలింద్కు రావడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ఆత్మారామ్ సాల్వే విద్యార్థిగా మిలింద్లోకి అడుగుపెట్టారు. ఈ క్యాంపస్‌లో ప్రారంభమైన మరాఠ్వాడా విశ్వవిద్యాలయం (ఔరంగాబాద్) పేరును మార్చాలనే ఉద్యమం, రెండు దశాబ్దాలపాటు అతని దీప్తివంతమైన కవిత్వంతోనే కదిలిపోయింది. ఒక విధంగా, నామాంతర్ (పేరు మార్చడం), దళిత్ పాంథర్ ఉద్యమాల సాంస్కృతిక చైతన్యానికి ఆత్మారామ్ ఏకైక బాధ్యుడు.
1970లు ఒక అల్లకల్లోలమైన దశాబ్దం. ఇది స్వేచ్ఛా భారతదేశపు మొదటి తరం యువతీ యువకుల యుగం. చాలామంది యువకులు చేతిలో డిగ్రీ పట్టాలతో కళాశాలల నుండి బయటికొచ్చారు, కానీ స్వాతంత్య్రం (1947) తర్వాతి పరిస్థితులను చూసిన వారి భ్రమలు తొలగిపోయాయి. అనేక సంఘటనలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి: ఎమర్జెన్సీ; పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ; తెలంగాణ రాష్ట్ర ఉద్యమం; బిహార్‌లో జయప్రకాష్ నారాయణ్ నవనిర్మాణ ఉద్యమం; గుజరాత్, బిహార్లలో ఓబిసి రిజర్వేషన్ కోసం ఉద్యమం; ఇటీవలి సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం; ముంబైలో మిల్లు కార్మికుల పోరాటాలు; షహదా ఉద్యమం; హరిత విప్లవం; మరాఠ్వాడా ముక్తి ఆందోళన్; మరఠ్వాడాలో కరవు పరిస్థితి. యువత, దేశం కూడా అలజడిలో ఉన్నారు. అభివృద్ధి, అస్తిత్వాల కోసం పోరాటం తీవ్రమైంది.
డాక్టర్ మశ్చింద్ర మొహొల్ నేతృత్వంలోని మరాఠ్వాడా రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పతాకం క్రింద, నాగ్‌సేన్‌వన్ క్యాంపస్‌లో చేరిన తర్వాత అవగాహనను పెంచుకున్న విద్యార్థులు మరఠ్వాడాలోని రెండు విశ్వవిద్యాలయాలలో ఒకదానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టమని జూన్ 26, 1974న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. అయితే భారతీయ దళిత్ పాంథర్స్ జోక్యం చేసుకోవడంతోనే పేరు మార్చాలనే ( నామాంతర్ ) అభ్యర్థన వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంది. నామ్‌దేవ్ ఢసాల్, రాజా ఢాలేల మధ్య వివాదం కారణంగా, ఢాలే దళిత్ పాంథర్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ మహారాష్ట్రలో దళిత్ పాంథర్స్ చేస్తున్న పనిని కొనసాగించేందుకు ప్రొఫెసర్ అరుణ్ కాంబ్లే, రామ్‌దాస్ ఆఠవలే, గంగాధర్ గాడే, ఎస్. ఎమ్. ప్రధాన్ నేతృత్వంలో భారతీయ దళిత్ పాంథర్స్ ప్రారంభమైంది.
కొత్తగా ఏర్పాటైన భారతీయ దళిత్ పాంథర్స్ గురించి ఆత్మారామ్ సాల్వే ఇలా రాశారు:
నేనొక పాంథర్ సైనికుణ్ని
కాంబ్లే అరుణ్ సర్దార్
మేమందరం జై భీమ్ వాళ్లం
న్యాయం కోసం పోరాడుతాం
సైనికులెప్పుడూ భయపడరు
మేం ఎవ్వరికీ భయపడం
అన్యాయాన్ని మేం అంతం చేస్తాం
అడుగు ముందుకే వేస్తాం
దళితులారా, కార్మిక-కర్షకులారా, లేవండి
మనందరం ఒకటవుదాం, పిడికిళ్లు బిగిద్దాం
ఈ పాటతో సాల్వే కొత్త పాంథర్స్‌ను స్వాగతించారు. అతను 'మరాఠ్వాడా ఉపాధ్యక్షుడి'గా బాధ్యతలను స్వీకరించారు. జూలై 7, 1977న కొత్తగా ఏర్పాటైన భారతీయ దళిత్ పాంథర్స్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ గాడే, మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటూ మొట్టమొదటి ప్రజా డిమాండ్‌ను లేవనెత్తారు.
జూలై 18, 1977న అన్ని కళాశాలలను మూసివేశారు, మరాఠ్వాడా విశ్వవిద్యాలయం నామాంతర్ (పేరు మార్పు)ని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి కార్యాచరణ కమిటీ ఒక భారీ ఊరేగింపుకు నాయకత్వం వహించింది. ఆ తర్వాత జూలై 21, 1977న ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, సరస్వతీ భువన్ కళాశాల, దేవగిరి కళాశాల, వివేకానంద కళాశాలలకు చెందిన సవర్ణ (అగ్ర కుల హిందువులు) విద్యార్థులు పేరు మార్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా మొదటి నిరసనను చేపట్టారు. నామాంతర్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనలు, సమ్మెలు, ర్యాలీలు పెరిగాయి. ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు దళితులు, దళితేతరుల మధ్య వైషమ్యాల యుద్ధభూమిగా మరాఠ్వాడా మారిపోయింది. ఈ పోరాట రంగంలో ఆత్మారామ్ సాల్వే తన ఆయుధాలైన షాహిరీ నీ, స్వరాన్నీ, మాటలనూ "దళితులపై విధించిన కుల పోరుకు వ్యతిరేకంగా" ఎక్కుపెట్టారు.
అంబేద్కర్ ఉద్యమాన్ని చూసిన, పాల్గొనిన షాహీర్ లు - షాహిర్ అణ్ణాభావూ సాఠే, భీమ్రావ్ కర్డక్, షాహిర్ ఘేగడే, భావూ ఫక్కడ్, రాజానంద్ గాడ్పాయ్లే, వామన్ కర్డక్ వంటివారు సామాజిక సాంస్కృతిక పరిసరాల నుండి పూర్తిగా లేకుండా పోయిన సమయంలో ఆత్మారామ్ సాల్వే ఉద్భవించారు.
అంబేద్కర్ అనంతర కాలంలో వచ్చిన విలాస్ ఘోగరే, దళితానంద్ మోహనాజీ హట్కర్, విజయనాద్ జాదవ్ వంటి షాహీర్లు డాక్టర్ అంబేద్కర్ నడిపిన ఉద్యమాన్ని గానీ మత మార్పిడి కాలాన్ని గానీ చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే, వారు కడిగిన పలకలాంటివారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ఈ షాహీర్ల కు బాబాసాహెబ్ (డా. అంబేద్కర్), ఆయన ఉద్యమం పుస్తకాల ద్వారానే పరిచయమయ్యారు. కాబట్టి వారి షాహిరీ ఉగ్రంగా ఉంటుంది. అందునా ఆత్మారామ్ సాల్వే పాటలు మరింత ఎక్కువ ఉగ్రంగా ఉంటాయి.
నామాంతర్ కేవలం పేరు మార్పు గురించి మాత్రమే కాదు. ఇది వారి గుర్తింపు గురించీ, తానొక మనిషి అనే స్పృహ గురించి కొత్తగా కలిగిన అవగాహన గురించీ కూడా.
నామాంతర్ ఉద్యమానికి ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ తన మద్దతును వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మారామ్ సాల్వే ఇలా రాశారు:
వసంత్‌దాదా, మాతో పోట్లాటలు పెట్టుకోకు
నువ్వు గద్దె దిగిపోక తప్పదు
ఈ దళితులు అధికారం చేజిక్కించుకుంటారు
నువ్వు చెత్తకుప్పలోకి చేరిపోతావ్
అధికారం నీకు తలకెక్కింది
ఇటు చూడు, నియంతృత్వ ధోరణి వదిలెయ్
నీ నిరంకుశ పాలన ఇక సాగదు
సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్నారనే ఆరోపణతో పోలీసులు తరచూ అతని కార్యక్రమాలను ఆపేసేవాళ్ళు. కానీ ఆత్మారామ్ తన ప్రదర్శనలను ఎప్పుడూ ఆపలేదు
ఆత్మారామ్ సాల్వే ఈ పాటను రాయడమే కాకుండా వసంతదాదా పాటిల్ నాందేడ్‌ను సందర్శించినప్పుడు వేలాది మంది ప్రజల ముందు ప్రదర్శించారు. అతనిపై కేసు నమోదైంది. రాజకీయ ‘నేరాల’ పరంపర అలా ఆయన జీవితాంతం కొనసాగింది. 1978 నుండి 1991 వరకు, అంటే సాల్వే మరణించే వరకు, మహారాష్ట్ర అంతటా పోలీసు స్టేషన్లలో పోరాటం, ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించటం, అల్లర్లు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం వంటి నేరాలకు అతనిపై కేసులు నమోదయ్యాయి. అతనిపై అనేక హత్యాప్రయత్నాలు జరిగాయి. దేగలూర్కు చెందిన సాల్వే స్నేహితుడు, సహచరుడు చంద్రకాంత్ ఠాణేకర్ ఇలా గుర్తుచేసుకున్నారు: “1980లో, దేగలూర్ బ్లాక్ (నాందేడ్ జిల్లా) లోని మర్ఖేల్ గ్రామంలో అతనిపై దాడి జరిగింది. బెన్నాల్ గ్రామంలో జరిగిన దళిత కార్మికుడు కాలే హత్య కేసులో తప్పుడు మరణ ధృవీకరణ పత్రం జారీ చేశాడని ఆరోపించబడిన డాక్టర్ నావల్‌ను ప్రశ్నించిన తర్వాత, సాల్వేపై ఆ డాక్టర్‌పై హత్యాయత్నం చేసినట్టుగా కేసు నమోదు చేశారు. అందుకు నాకు, సాల్వేకు, రామా ఖర్గేకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించారు. తర్వాత ఉన్నత న్యాయస్థానం మమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేసింది.”
అదే మరఖెల్ గ్రామంలో, 70 ఏళ్ల వృద్ధురాలు నాగర్బాయి సొపన్ వజార్కర్ నాకు ఆత్మారామ్ సాల్వే స్వదస్తూరితో రాసిన పాటల నోటుపుస్తకాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా భద్రంగా దాచివుంచిన మట్టి కుండలోంచి ఆమె దాన్ని బయటకు తీశారు. మరఖెల్లో ఆత్మారామ్పై దాడి జరిగినప్పుడు అతని ప్రాణాలను కాపాడింది నాగర్బాయే. మరో సంఘటనలో, పాంథర్స్ పిలుపునిచ్చిన బంద్‌ను పురస్కరించుకొని ఆత్మారామ్ సాల్వేను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మజల్గావ్ వ్యాపారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత బీడ్ జిల్లాలోకి ఆయన ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఆత్మారామ్ పాడేటప్పుడు హార్మోనియం వాయించే ముఖేడ్‌కు చెందిన తేజేరావు భద్రే ఇల్లా అన్నారు: “ఆత్మారామ్ ప్రసంగం ఉద్వేగభరితంగా సాగుతుంది, అతని పాటలు రెచ్చగొట్టేవిధంగా ఉంటాయి. దళితులు అతను చెప్పేది వినడానికి ఇష్టపడతారు, కాని సవర్ణ ప్రజలకి అది నచ్చలేదు. తరచూ రాళ్లు కూడా విసురుతూ ఉండేవారు. ఆత్మారామ్ పాడినప్పుడు, ముందు కూర్చున్న వ్యక్తులు వేదిక వైపు నాణేలను విసిరేవారు, అతనంటే గిట్టనివారు రాళ్ళు విసిరేవారు. ఒక షాహిర్ గా అతను ఒకే సమయంలో ప్రేమించబడ్డాడు, ద్వేషించబడ్డాడు - ఇది చాలా సాధారణం. కానీ రాళ్ల దాడి ఎన్నడూ ఆత్మారామ్‌ను పాడకుండా ఆపలేదు. అతను తన ఆవేశాన్నంతటినీ తన పాటల్లో చూపించేవాడు. ప్రజలు స్వాభిమానం, ఆత్మగౌరవాల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని అతను కోరుకున్నాడు."
సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్నారనే నెపంతో పోలీసులు తరచూ అతని కార్యక్రమాలను అడ్డుకునేవారు, కానీ ఆత్మారామ్ ఎన్నడూ తన ప్రదర్శనను ఆపలేదు. ప్రదర్శనల సమయంలో ఆత్మారామ్కు తోడుగా వచ్చే ఫూలే పింపల్‌గావ్‌కు చెందిన షాహిర్ భీమ్సేన్ సాల్వే ఇలా గుర్తుచేసుకున్నారు: “ఆత్మారామ్ సాల్వేను బీడ్ జిల్లాలోకి ప్రవేశించకుండా నిషేధించారు. కానీ ఒక రాత్రి, అతను జిల్లా లోపల తన షాహిరీ ని నిర్వహించవలసి ఉంది. ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి ఆత్మారామ్ని ఆగమని చెప్పారు. తర్వాత ఆత్మారామ్ గ్రామంలో ప్రవహించే నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లారు. ఆ భాగం జిల్లా సరిహద్దుకు వెలుపల ఉండింది. ఆత్మారామ్ అక్కడి నుండే పాడటం ప్రారంభించారు. ప్రజలు చీకటిలో నది ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు, అతను పాడటం విన్నారు. గాయకుడు జిల్లా వెలుపల ఉన్నారు; ప్రేక్షకులు జిల్లా సరిహద్దులలో ఉన్నారు. పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారు! మాకు భలే ఉల్లాసంగా ఉండింది." ఆత్మారామ్ ఇలాంటి అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు, కానీ అతను ఎన్నడూ పాడటాన్ని ఆపలేదు. గానం అతని ప్రాణశక్తి.
మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరు మార్చాలనే ఉద్యమం, ఆత్మారామ్ సాల్వే దీప్తివంతమైన కవిత్వంతో రెండు దశాబ్దాల పాటు కొనసాగింది
బీడ్‌లో, మానవి హక్కా అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది ఏక్నాథ్ ఆవ్హడ్ తన ఆత్మకథ, జగ్ బదల్ ఘాలుని ఘావ్ (Strike a Blow to Change the Worldగా జెర్రీ పింటో ఆంగ్లంలోకి అనువదించారు) లో ఆత్మారామ్ సాల్వేకు సంబంధించిన ఒక సంఘటన గురించి ఇలా రాశారు: తన షాహిరీ ల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం వంటి అభియోగాల కింద ఆత్మారామ్‌ను బీడ్ జిల్లా నుంచి బహిష్కరించారు. దాంతో అతను నాందేడ్‌లో ఉన్నాడు. మేము పాంథర్స్ జిల్లా శాఖను ప్రారంభించి, అతని జల్సా ను నిర్వహించాం. అంబజోగాయీలోని పరలి వేస్‌లో దళిత జనాభా ఎక్కువ. అందుకే అక్కడ జల్సాలు నిర్వహించారు. ఆత్మారామ్‌ను బీడ్‌లో ప్రవేశించకుండా నిషేధించారు కాబట్టి పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆత్మామ్ను అరెస్టు చేసేందుకు పీఎస్ఐ కదమ్ సిద్ధమయ్యాడు. మేం వెళ్లి అతన్ని కలిశాం. ‘ప్రదర్శన అయిపోయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయండి’ అన్నాం. అతను అంగీకరించాడు. ఆత్మారామ్ తన పూర్తి శక్తితో ప్రదర్శన చేశారు. అతని పాటలు నామాంతర్ డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి. పీఎస్ఐ కదమ్ పాటలను ఆస్వాదించాడు. అతను 'చాలా విప్లవాత్మక షాహిర్ ' అని కూడా ఆత్మారామ్‌ను ప్రశంసించాడు. అయితే ఆత్మారామ్‌ను పొగుడుతూనే అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అది పసిగట్టిన ఆత్మారామ్ వేదికపై తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి, తాను మాయమైపోయాడు. ఆత్మారామ్‌ను అరెస్టు చేసేందుకు వేదికపైకి వచ్చిన పీఎస్ఐ కదమ్‌కు అతను ఎక్కడా కనిపించలేదు!"
జులై 27, 1978న మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును మార్చాలని తీర్మానం చేసిన వెంటనే మరఠ్వాడా ప్రాంతమంతా దళితుల పాలిట సర్వనాశనంగా మారిపోయింది. ఒక్కరోజులోనే అన్ని రవాణా మార్గాలు నిలిపివేయబడ్డాయి. దళితులకు చెందిన వేలాది ఇళ్లను తగులబెట్టేశారు. కొన్ని చోట్ల గుడిసెలకు నిప్పంటించగా, అందులో ఉన్న మహిళలు, చిన్నారులు సజీవ దహనమయ్యారు. నాందేడ్ జిల్లాలో సుగావ్ గ్రామానికి చెందిన జనార్దన్ మవాడే, టెంభుర్ణి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పోచిరామ్ కాంబ్లే మృతి చెందారు. పర్భణీ జిల్లాలోని ధామణ్‌గావ్ గ్రామానికి చెందిన దళిత పోలీసు అధికారులు సంభాజీ సోమాజీ, గోవింద్ భురేవార్లు కూడా హత్యకు గురయ్యారు. వేలాది మంది దళితులు గాయపడ్డారు. లక్షల విలువైన ఆస్తులను దోచుకున్నారు. పంటలు, సాగు భూములు ధ్వంసమయ్యాయి. చాలా గ్రామాల్లో దళితులను బహిష్కరించి తిండి, నీళ్లు ఇవ్వలేదు. గ్రామాల నుంచి వేలాదిమంది నగరాలకు వలస వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తి నష్టం మొత్తం రూ. 1.5 కోట్లు. చాలా చోట్ల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. మరాఠ్వాడా కుల పోరుకు రణరంగంగా మారిపోయింది.
మరాఠ్వాడాలో కులతత్వ హింస తీవ్రతను, క్రూరత్వాన్ని వివరిస్తూ ఆత్మారామ్ ఇది రాశారు:
పల్లెల్లో, గ్రామాల్లో నిప్పు రాజుకుంది
నల్గీర్లో ఒక చిన్నారిని సజీవ దహనం చేశారు
ప్రాణాలు అరచేత పట్టుకొని వారు అడవుల్లోకి పారిపోతున్నారు
దాడులతో దళితులు చెల్లాచెదురవుతున్నారు
కుల దురహంకారులు వారిని వేధించారు, బాధించారు
దళితులకు పనుల్లేవ్
వారి వంటింటి పొయ్యిలోంచి పిల్లి లేవడం లేదు
లే, ఇక లే, లేస్తావు కదూ
ఇళ్లలోంచి పైకి ఎగుస్తున్నమంటల్ని చల్లార్చు, చల్లార్చుతావు కదూ
రక్తపుటేరులు పారినా సరే
నన్నీ రక్తంలో స్నానం చేయనివ్వండి
ఈ అంతిమ సంగ్రామంలో నాతో భుజం కలిపి పోరాడు, పోరాడుతావు కదూ
విప్లవ బీజాలను నాటు, నాటుతావు కదూ
ఈ దళిత వ్యతిరేక వాతావరణం ఒక్కరోజులో పుట్టుకొచ్చినది కాదు. నిజామ్ పాలనలోనే దాని పూర్వాపరాలు ఉన్నాయి. నిజామ్‌లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్వామి రామానంద తీర్థ ముందున్నారు. అతడు ఆర్యసమాజానికి చెందినవాడు. బ్రాహ్మణీయ అణచివేతను నిరోధించేందుకు ఆర్యసమాజ్ ఏర్పాటైనప్పటికీ, దాని నాయకత్వం మొత్తం బ్రాహ్మణీయంగానే ఉండేది. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, ఈ నాయకత్వం దళితుల గురించి అనేక వివక్షాపూరిత బీజాలను నాటింది. ‘నిజామ్కు దళితుల మద్దతు’, ‘దళిత ఇరుగుపొరుగువారు రజాకార్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు’ వంటి దుష్ప్రచారం అంబేద్కర్ వ్యతిరేక సవర్ణ ప్రజలను ఆగ్రహానికి గురి చేసి వారి మనసుల్లో నాటుకుపోయింది. దాంతో, రజాకార్ల పై పోలీసుల అణిచివేత సమయంలో దళితులు అనేక అఘాయిత్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. దళితులపై జరిగిన ఈ దౌర్జన్యాలపై అప్పటి మరాఠ్వాడా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు భావూసాహెబ్ మోరే ఒక నివేదికను తయారు చేసి, దానిని డాక్టర్ అంబేద్కర్‌కూ, భారత ప్రభుత్వానికీ పంపారు.
డాక్టర్ అంబేద్కర్ తర్వాత భూమి హక్కుల కోసం దాదాసాహెబ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆయన నినాదం ‘ కసేల్ త్యాచీ జమీన్ , నసేల్ త్యాచే కాయ్ ? ’ (‘దున్నేవాడికే భూమి సరే కానీ భూమిలేని వారి సంగతేంటి?’) ఈ పోరాటంలో మరాఠ్వాడా దళితులు ముందంజలో ఉన్నారు, లక్షలాది మంది మహిళలు, పురుషులు దీని కోసం జైళ్లకు వెళ్లారు. దళితులు తమ జీవిక కోసం లక్షల హెక్టార్ల భూమిని స్వాధీనంలోకి తీసుకున్నారు. దళితులు ఉమ్మడి గడ్డి మైదానాలను స్వాధీనం చేసుకున్నందుకు సవర్ణులు పెద్దగా సంతోషించలేదు. ఆ కోపం వాళ్ల మనసుల్లో అలాగే ఉండిపోయింది. వసంతాదా పాటిల్, శరద్ పవార్ మధ్య పోరు కూడా ఇందులో పాత్ర పోషించింది. గ్రామం తర్వాత గ్రామంలో సవర్ణుల కున్న ఆగ్రహం, దళితుల పట్ల ద్వేషంగానూ, హింసారూపంలోనూ వ్యక్తమయింది. నామాంతర్ ఉద్యమం సమయంలో "విశ్వవిద్యాలయానికి నీలి రంగు వేయబడుతుంది" వంటి పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి; "డిగ్రీల సర్టిఫికేట్లో డాక్టర్ అంబేద్కర్ ఫోటో ఉంటుంది"; “డా. అంబేద్కర్ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తారు కాబట్టి, ఈ చదువుకున్న దళిత యువకులు మా ఆడపిల్లలను ఎత్తుకుపోతారు." వంటివి.
“నవ బౌద్ధ [నియో బౌద్ధ] ఉద్యమం దృక్పథంలో మరఠ్వాడా విశ్వవిద్యాలయ నామాంతర్ సమస్య కూడా చేరింది. ఇది స్పష్టంగా ఒక స్వతంత్ర దళిత అస్తిత్వాన్ని కోరుతున్న వేర్పాటువాద ఉద్యమం. అందుకోసం వారు బౌద్ధ దేశాల నుండి సహాయం కోరుతున్నారు, భారత పౌరసత్వాన్ని వదులుకునే వైఖరిని కూడా తీసుకున్నారు. కాబట్టి మనం వీలైనంత త్వరగా స్పష్టమైన, దృఢమైన వైఖరిని తీసుకోవాలి." అంటూ నామాంతర్ విరోధి కృతి సమితి లాతూర్‌లో జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. తద్వారా దళితులను వారి మాతృభూమి నుండి వేరు చేయడానికి ప్రయత్నించింది. నామాంతర్ ఉద్యమం హిందువులకూ, బౌద్ధులకూ మధ్య యుద్ధంగా చిత్రీకరించబడింది. అటువంటి దురభిప్రాయాలు సర్వసాధారణమయ్యాయి. ఆ విధంగా నామాంతర్ ఆందోళన ప్రారంభం నుంచీ మండుతూనే ఉన్న మరాఠ్వాడా ఆ తర్వాత కూడా నిరంతరం అల్లకల్లోలంగానే ఉంది. నామాంతర్ ఉద్యమం జరుగుతున్న క్రమంలో 27 మంది దళితులు అమరులయ్యారు.
ఈ ఉద్యమం కేవలం ఉనికికీ, గుర్తింపు సమస్యలకూ సంబంధించింది మాత్రమే కాదు; ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలలో కూడా పెనవేసుకుపోయింది. పుట్టుక, పెళ్ళి, మరణ ఆచారాలలో దీని ప్రభావం కనిపించింది. పెళ్లిళ్లలోనూ, అంత్యక్రియల సమయంలో కూడా ప్రజలు ‘ డాక్టర్ అంబేద్కరంచ విజయ్ అసో ’ (‘డాక్టర్ అంబేద్కర్‌కు విజయం కలుగుగాక’), ‘ మరాఠ్వాడా విద్యాపీఠాచే నామాంతర్ ఝలేచ్ పాహిజే ’ (‘మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరు మార్చాలి’) వంటి నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. నామాంతర్ గురించి ప్రజలకు జ్ఞానోదయాన్ని కలిగించడంలో, సామాజిక సాంస్కృతిక స్పృహను రూపొందించడంలో షాహిర్ ఆత్మారామ్ సాల్వే ముఖ్యమైన పాత్రను పోషించారు.
ఆత్మారామ్ సాల్వే జీవితమంతా అంబేద్కర్, నామాంతర్లుగా మారిపోయింది. "విశ్వవిద్యాలయం పేరును అధికారికంగా మార్చినప్పుడు నేను నా ఇంటినీ పొలాన్నీ అమ్మి, ఆ డబ్బుతో విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం మీద అంబేద్కర్ పేరును బంగారు అక్షరాలతో రాస్తాను" అని అతను చెప్పేవారు. తన స్వరంతో, మాటలతో, షాహిరీ తో అణచివేతకు వ్యతిరేకంగా అతను జ్ఞానజ్యోతిని మోసుకొచ్చాడు. నామాంతర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ, రెండు దశాబ్దాల పాటు కాలి నడకన మహారాష్ట్రలోని పల్లెటూళ్లను చుట్టబెట్టారు. అతనిని గుర్తు చేసుకుంటూ, ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ అశోక్ గైక్వాడ్ ఇలా అంటారు: “నాందేడ్ జిల్లాలోని మా ఊరు, బోండ్గవ్హాణ్కు ఇప్పటికీ రోడ్డుమార్గం లేదు, అక్కడకు ఏ వాహనం చేరుకోలేదు. ఆత్మారామ్ 1979లో మా ఊరికి వచ్చి షాహిరీ జల్సా చేశాడు. అతను తన షాహిరీ తో మా జీవితాల్లో వెలుగులు నింపాడు, అతని పాటలు పోరాటాలలో దళితులకు శక్తినిచ్చాయి. అతను కులవాదులను బాహాటంగా ఎత్తిచూపేవాడు. తన శక్తివంతమైన స్వరంతో అతను పాడటం ప్రారంభించిన క్షణంలో, తేనెపట్టుకు వచ్చి చేరే తేనెటీగల్లాగా ప్రజలు అతని వద్దకు చేరుకునేవారు. అతని పాటలు చెవులకు ప్రాణం పోశాయి, అతని మాటలు జీవం కోల్పోయిన మనస్సుకు కూడా తిరిగి జీవం పోసి, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి."
కినావట్ (నాందేడ్ జిల్లా)కు చెందిన దాదారావు కయాపాక్కు సాల్వే గురించిన మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. “1978లో గోకుల్ కొండేగావ్లో దళితులు బహిష్కరణకు గురయ్యారు. దీనికి నిరసనగా ఎస్.ఎమ్. ప్రధాన్, సురేశ్ గైక్వాడ్, మనోహర్ భగత్, అడ్వకేట్ మిలింద్ సర్పే, నేను కలిసి ఒక మోర్చా నిర్వహించాం. పోలీసులు సెక్షన్ 144 [సీఅర్పిసి]ని అమలు చేశారు, అన్నిరకాల సమావేశాలను నిషేధించారు. ఆత్మారామ్ సాల్వే ఆధ్వర్యంలో జల్సా నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాహిర్ సాల్వేనీ, పాంథర్ కార్యకర్తలనూ అరెస్టు చేయాలని సవర్ణ ప్రజలు డిమాండ్ చేశారు. వారు పోలీసు సూపరింటెండెంట్ శృంగారవేల్నూ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.పి. ఖాన్‌నూ ఘెరావ్ చేసారు. పోలీసు అతిథి గృహం ప్రహరీ గోడకు నిప్పు పెట్టారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్రావ్ రాథోడ్ సన్నిహిత సహచరుడు, దళిత పరిరక్షణ కార్యకర్త అయిన జె.నాగోరావు ప్రాణాలు కోల్పోయారు.
షాహిర్ ఆత్మారామ్ సాల్వే పాటలు మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి ఆలోచనలతో నిండి ఉంటాయి. ఆయన పాటల్లో లడాయి (పోరాటం), ఠిణగి (మెరుపు), క్రాంతి (విప్లవం), ఆగ్ (నిప్పు), రణ్ (యుద్ధభూమి), శస్త్ర (ఆయుధం), తోఫ్ (ఫిరంగి), యుద్ధ (యుద్ధం) నవ ఇతిహాస్ (నూతన చరిత్ర) వంటి మాటలు తరచూ వినిపిస్తుంటాయి. ఆయన మాటలు నిజజీవిత అనుభవాలకు అద్దం పడతాయి. ఆయన ప్రతి పాటా ఓ యుద్ధ నాదమే!
ఫిరంగులు తీసుకొచ్చా, అడుగు ముందుకేశా
మనువు సంతానాన్ని భూస్థాపితం చేసేందుకు
మనందరం ఒక కొత్త చరిత్రను సృష్టిద్దాం
విప్లవమనే మొలకను నాటుదాం
ఈరోజు తుపాకీ గొట్టంలోంచి వెలువడే ఒక తూటా
హోళీ మంటను రాజేస్తుంది
మనువు కోటను కూల్చేందుకు
ఆత్మారామ్ సాల్వే వినోదం కోసమో, డబ్బు, కీర్తి లేదా పేరు కోసమో తన కళను ప్రదర్శించలేదు. కళ ఎప్పుడూ తటస్థం కాదనీ, మార్పు కోసం జరిపే పోరాటంలో అది ఒక ముఖ్యమైన సాధనం అనీ అతను నమ్మారు
ఒక షాహిర్ (కవి)గా, కళాకారుడిగా ఆత్మారామ్ ఎప్పుడూ తటస్థంగా ఉండలేదు. ఆయనలో ప్రాంతీయతత్వం గానీ, సంకుచిత ధోరణులు గానీ ఎప్పుడూ కనిపించలేదు. 1977లో బిహార్‌లోని బెల్ఛీలో దళితులపై హత్యాకాండ జరిగినపుడు ఆయన అక్కడికి వెళ్లి తన ఉద్యమాన్ని ప్రారంభించారు. అందుకుగాను ఆయనను 10 రోజులు జైల్లో పెట్టారు. ఆ హత్యాకాండ గురించి ఆయనిలా రాశారు:
ఈ హిందూ దేశంలో, బెల్ఛీ అనే పల్లెలో
నా అన్నల్ని సజీవ దహనం చేశారు, నేను దాన్ని చూశాను
తల్లులు, చెల్లెళ్లు, పిల్లలు కూడా
ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు, నేను దాన్ని చూశాను
అదే పాటలో, దళిత నేతల భావజాలపరమైన దివాలాకోరుతనాన్ని, స్వార్థ రాజకీయాలను కూడా ఆయన ఎండగట్టారు:
కొందరు కాంగ్రెస్‌కు తొత్తులయ్యారు
మరి కొందరు తమ మనసుల్నీ, శరీరాల్నీ ‘జనతా’(దళ్)కు అర్పించుకున్నారు
ఈ కీలక సమయంలో, గవాయి లాంటి నయవంచకులు
శత్రువుతో చేయి కలపడాన్ని నేను చూశాను
1981లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు సీట్ల రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ విద్యార్థుల వలె నటిస్తూన్న రిజర్వేషన్ వ్యతిరేకుల బృందం ఒకటి గుజరాత్లో విధ్వంసానికి దిగింది. అప్పుడక్కడ దహనం, దోపిడీలు, కత్తితో దాడులు, బాష్పవాయు ప్రయోగం, కాల్పుల వంటి సంఘటనలు జరిగాయి. ఎక్కువగా దళితులపైనే ఈ దాడులు జరిగాయి. అహ్మదాబాద్‌లో దళిత కార్మికుల కాలనీలకు నిప్పు పెట్టారు. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో అగ్రవర్ణాలవారు దళితుల నివాసాలపై దాడులు చేశారు. అనేకమంది దళితులు తమ గ్రామాలను విడిచిపెట్టి పోవలసివచ్చింది.
దీని గురించి రాస్తూ, ఆత్మారామ్ ఇలా అన్నారు:
ఈరోజు రిజర్వుడు సీట్ల కోసం
బలహీనులను నువ్వెందుకు వేధిస్తావ్
ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నది నువ్వే కదా
నువ్వెందుకింత నీచంగా ప్రవర్తిస్తావ్
ఈరోజు గుజరాత్ మండుతోంది
రేపు మొత్తం దేశమే మండుతుంది
ఇది రగులుతున్న, జ్వలిస్తున్న అగ్ని
ఇందులో నువ్వెందుకు కాలిపోతావ్
ఆత్మారామ్ సాల్వే వినోదం కోసమో, డబ్బు, కీర్తి లేదా పేరు కోసమో తన కళను ప్రదర్శించలేదు. కళ ఎప్పుడూ తటస్థం కాదనీ, వినోదం కోసం కూడా కాదనీ; సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పు కోసం జరిపే పోరాటంలో అది ఒక ముఖ్యమైన సాధనం అనీ అతను నమ్మారు. ఆయన 300కు పైగా పాటలు రాశారు. వీటిలో 200 పాటలు రాత రూపంలో ఈరోజు మన దగ్గర ఉన్నాయి.
భోకర్‌లోని లక్ష్మణ్ హిరే, మర్ఖేల్లోని నాగర్బాయి వజర్కర్, ముఖేడ్‌లో తేజేరావ్ భద్రే (నాందేడ్ జిల్లా), ఫూలే పింపల్గావ్ (బీడ్ జిల్లా) నుండి షాహిర్ మహేంద్ర సాల్వే - వీరందరి వద్ద ఆత్మారామ్ పాటలు ఉన్నాయి. అనేక అసంపూర్ణమైన పాటలు ప్రజల స్మృతిలో ఉన్నాయి. ఈ పాటలు ఎవరు రాశారు? ఎవ్వరికి తెలియదు. కానీ జనం మాత్రం వాటిని గుణ్గుణాయిస్తూనే ఉన్నారు.
మేమంతా జై భీమ్ వాళ్లం
మా నాయకుడు రాజా ఢాలే
ఆ కాలంలోని పాంథర్ సభ్యులందరి నాలుకలపై ఆడిన ఈ ‘దళిత్ పాంథర్ గీతాన్ని’ సాల్వే రాశారు. మరాఠ్వాడా ప్రాంత ప్రజల హృదయాల్లో, మనసుల్లో ఇవాళ్టికీ ఈ పాట ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
ఈ విప్లవ అగ్నికణాలను నాటుతున్నా
ఈ అగ్ని జ్వలించనీ
నిర్లక్ష్యాన్ని ఇంకా ఎంత కాలమని భరిద్దాం
ప్రతి గుండెలో ఓ మంట రాజుకుంటోంది
తల్లి కడుపులోంచే
బిడ్డ తన్నడం నేర్చుకుంటాడు
రాబోయే రోజుల్ని గుర్తించి
భీమ్బా వీర సైనికుడా
మిమ్మల్ని మేల్కొలపనివ్వండి
ప్రసిద్ధిచెందిన పై పాటను ఆత్మారామ్ రాశారు. ఈయన మరాఠ్వాడా నామాంతర్ పోవాడా ను కూడా రాశారు. ఇది అతని చేతిరాత ప్రతి, విషయసూచికలో ఉంది కానీ, రాత ప్రతి మావద్ద లేదు. అయితే, పూణేకి చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు రోహిదాస్ గైక్వాడ్, అంబేద్కర్ ఉద్యమానికి చెందిన అనుభవజ్ఞుడైన మిషనరీ నాయకుడు వసంత్ సాల్వే నా కోసం కొన్ని పంక్తులు పాడారు. ఇందాపూర్ తాలూకాలోని బావ్డా గ్రామంలో దళితులను పైకులాల గ్రామస్తులు బహిష్కరించినపుడు, ఆత్మారామ్ సాల్వే పూణేకు వచ్చి, అనేక మురికివాడలలో ప్రదర్శనలిచ్చారు. అతని పాటల ఇతివృత్తాలన్నీ సామూహిక స్ఫూర్తి, సున్నితత్వం చుట్టూనే తిరుగుతాయి. ఆత్మారామ్ ఎప్పుడు ప్రదర్శన ఇచ్చినా, సమీపం నుంచే కాక, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దళితులు భాకరీలు (రొట్టెలు) మూటకట్టుకొని, కిటకిటలాడుతూ కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి కార్యక్రమానికి హాజరయ్యేవారు. అతని ప్రదర్శన ముగిసిన తర్వాత పాంథర్ కార్యకర్తలు ప్రసంగించేవారు. అతను పాంథర్స్కూ, నామాంతర్ ఉద్యమానికీ కూడా ప్రజలను అమితంగా సభలకు ఆకర్షించే నాయకుడయ్యారు. నామ్‌దేవ్ ఢసాల్ దళిత పాంథర్ యుగానికి ప్రాతినిధ్యం వహించే కవి అయినట్లే, ఆత్మారామ్ సాల్వే పాంథర్ యుగ గాథాగీతానికి ప్రతినిధి. నామ్‌దేవ్ కవిత్వంలో కొత్త మార్గాన్ని కనుగొన్నట్లుగానే, అంబేద్కర్ అనంతర కాల ఉద్యమంలో సాల్వే షాహిరి లో తన కొత్త దిశను కనుగొన్నాడు. పాంథర్ యుగాన్ని నామ్‌దేవ్ కవిత్వం ఎలా వివరించిందో, ఆత్మారామ్ షాహిరీ పాంథర్ కాలాన్ని అలాగే విశదపరుస్తుంది. నామ్‌దేవ్ కవిత్వం కులాన్నీ, వర్గాన్నీ కలిపి ఎదుర్కొన్నట్లే, ఆత్మారామ్ షాహిరీ కుల, వర్గ, లింగ అణచివేతను ఒకే సమయంలో వివరించింది. పాంథర్స్ అతనిని ప్రభావితం చేస్తే, అతను పాంథర్స్నూ, ప్రజలనూ కూడా ప్రభావితం చేశారు. ఈ ప్రభావంతోనే అతను ఉన్నత చదువులు, ఉద్యోగం, ఇల్లు, తన సర్వస్వాన్ని విడిచిపెట్టి నిర్భయంగా, నిస్వార్థంగా తాను ఎంచుకున్న మార్గాన్ని అనుసరించారు.
నామ్‌దేవ్ ఢసాల్ దళిత పాంథర్ యుగానికి ప్రాతినిధ్యం వహించే కవి అయినట్లే, ఆత్మారామ్ సాల్వే పాంథర్ యుగ గాథాగీతానికి ప్రతినిధి
వసయీ మాజీ ఎమ్మెల్యే వివేక్ పండిట్ రెండు దశాబ్దాల పాటు ఆత్మారామ్ సాల్వేకు స్నేహితుడు. "భయం, స్వప్రయోజనం - ఈ రెండు పదాలు ఆత్మారామ్ నిఘంటువులోనే లేవు" అని ఆయన చెప్పారు. సాల్వేకి తన స్వరంపై, మాటలపై గొప్ప పట్టు ఉంది. తనకు తెలిసిన విషయాలపై కూడా ఆయన గట్టి పట్టు సాధించారు. మరాఠీతోపాటు హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. హిందీ, ఉర్దూ భాషల్లో కొన్ని పాటలను స్వరపరిచారు. హిందీలో కొన్ని ఖవ్వాలీలను రాసి, ప్రదర్శించారు కూడా. కానీ అతను తన కళను ఎప్పుడూ వ్యాపారీకరించలేదు, మార్కెట్లో అమ్మకానికి పెట్టలేదు. తన కళను, మాటలను, తన శక్తివంతమైన స్వరాన్ని ఆయుధంగా మార్చుకుని, కుల-వర్గ-లింగ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిలా తన మరణం వరకు ఒంటరి పోరాటాన్ని కొనసాగించారు.
కుటుంబం, ఉద్యమం, వృత్తి- ఇవి ఒక కార్యకర్తకు మానసికంగా మద్దతునిచ్చే వనరులు. వాటిని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా కార్యకర్తలు, ప్రజా కళాకారులు ఒక్కరిగా, ఒంటరిగా ఉండకుండా జీవించగలిగే, తమను తాము నిలబెట్టుకునే ప్రత్యామ్నాయాన్ని ఒక ప్రజా ఉద్యమం సృష్టించగలగాలి.
కళాకారులు మానసిక క్షోభకు గురికాకుండా కాపాడేందుకు, లేదా వారు నిరాశలో కూరుకుపోయినప్పుడు సహాయం చేసేందుకు అంబేద్కర్ ఉద్యమంలో ఎలాంటి నిర్మాణాత్మకమైన, సంస్థాగతమైన చర్యలు చేపట్టలేదు. కాబట్టి, సహజంగానే ఆత్మారామ్ సాల్వే వంటి కళాకారుడికి ఏమి జరగాల్సి ఉందో అదే జరిగింది.
తరువాతి జీవితంలో, మూడు స్థాయిలలోనూ ఆయనకు నిరాశే మిగిలింది. ఉద్యమం కారణంగా అతని కుటుంబం విచ్ఛిన్నమయింది. అతని వ్యసనం (మద్యానికి) మరింత దిగజారింది. చివరకు మతిమరపు వచ్చింది. ఒక ప్రదర్శకుడిలా నిలబడి ఎక్కడైనా పాడటం ప్రారంభించేవారు - రహదారి మధ్యలో, టౌన్ స్క్వేర్ వద్ద, ఎవరి కోరినా కూడా. తన వ్యసనం వలన నామాంతర్ కోసం పోరాడిన ఈ షాహిర్ , 1991లో విశ్వవిద్యాలయం కొత్త పేరును బంగారు అక్షరాలతో రాయకుండానే అమరవీరుడుగా మరణించారు.
ఈ కథనాన్ని మొదట మరాఠీ లో రాశారు
పొవాడాల (జానపదాలు) అనువాదం: నమితా వైకర్.
కథనాన్ని నివేదించడంలో సహాయం చేసినందుకు భోకర్ నుండి లక్ష్మణ్ హీరే, నాందేడ్ నుండి రాహుల్ ప్రధాన్, పూణే నుండి దయానంద్ కనక్దండేకి రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఈ మల్టీ మీడియా కథనం ' ఇన్ ఫ్లుయెన్షియల్ షాహిర్స్ , నరేటివ్స్ ఫ్రమ్ మరాఠ్వాడా ' అనే ప్రాజెక్ట్ లో భాగం . ఈ ప్రాజెక్ట్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ ద్వారా వారి ఆర్కైవ్స్ అండ్ మ్యూజియమ్స్ ప్రోగ్రామ్ కింద చేయబడినది . ఈ ప్రాజెక్ట్ కు న్యూ ఢిల్లీలోని గోట ( Goethe ) ఇన్ స్టిట్యూట్ ( మాక్స్ ముల్లర్ భవన్ ) నుండి పాక్షిక మద్దతు కూడా లభించింది .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి