రాత్రి రెండు గంటల సమయం. చిమ్మ చీకటి. అయినా తెల్లారే దాకా అతడు వేచి ఉండలేడు. మరో మూడు గంటలు ఆగితే తెల్లవారుతుంది. ఇంకప్పుడు బయలుదేరలేడు. పోలీసులు అక్కడకు వచ్చి అతడిని సముద్రంలోకి వెళ్లకుండా నిలువరిస్తారు. పోలీసుల లాక్ డౌన్ పహరా మొదలవుతుంది. అందుకనే వారు లేని ఆవేళ కాసరపు ధనరాజు, తోటి మత్స్యకారులు మరో ఇద్దరూ మెల్లగా సముద్రంలోకి జారుకున్నారు.
“మొదట్లో అలా వెళ్లడానికి నాకు చాలా భయం వేసేది. నేను ఎక్కడలేని ధైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చేది. నాకు డబ్బు కావాలి. అద్దె కట్టుకోవాలి” అన్నాడు నలభై ఏళ్ల ధనరాజు ఏప్రిల్ 10 న తాను చేసిన మొదటి సాహస కార్యాన్ని వర్ణిస్తూ. అతడు, అతడి ఇద్దరి స్నేహితులు తప్పని పరిస్థితుల్లో ఔట్ బోర్డు మోటారు లేని చిన్న పడవ మీద ఎవరి కళ్ళా పడకుండా సముద్రంలోకి జారుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చేపల వేటనూ, ఇతర రేవు కార్యకలాపాలను నిషేధించారు. పోలీసులు ప్రతిరోజూ ఉదయం 5 గం. కల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ రెండు ప్రధాన ద్వారాల వద్దకు చేరుకుంటారు. మత్సకారులకు, ప్రజలకు ఎవరికీ కూడా ఇక్కడి చేపల బజారులోకి అనుమతి లేదు.
తెల్లవారే సరికల్లా ధనరాజు వేటను పూర్తి చేసుకుని ఆరేడు కిలోల బంగారు తీగ చేపలతో వెనక్కి వచ్చేశాడు. “వెంట్రుక వాసిలో నాకు ప్రమాదం తప్పింది. నేను తీరం చేరిన కొద్ది క్షణాలలోనే పోలీసులు వచ్చేశారు. వాళ్ళు గనుక నన్ను పట్టుకుని ఉంటే బాగా కొట్టేవారు. కష్టాల్లో మనుగడ కోసం కొన్ని సార్లు తెగించక తప్పదు. నేను అద్దెను చెల్లించేస్తాను సరే, కానీ రేపు మరో అవసరం ఏదో మీద పడుతుంది. నాకు కోవిడ్ రాలేదు, కానీ దాని ప్రభావం నా మీద ఆర్థికంగా బాగానే పడింది” అన్నాడు ధనరాజు.
ధనరాజు పోలీసుల కళ్ల పడకుండా రహస్యంగా చేపల అమ్మకం సాగించాడు. బీచ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఉన్న చెంగల్రావు పేట ఇరుకు రోడ్డులో తన పాత రోమా సైకిల్ మీద తిరిగి చేపలు అమ్మేశాడు. సైకిలు మీద తెల్లని చెక్కను ఒక దాన్ని ఉంచి దాని మీద చేపలు పెట్టుకుని అమ్మకాన్ని సాగించాడు. “ సైకిలును మెయిను రోడ్డు మీదకు తీసుకుపోయి చేపలు అమ్ముకోవాలని అనుకున్నాను, కానీ పోలీసులకు భయపడ్డాను” అన్నాడు ధనరాజు. మామూలు రోజుల్లో అయితే కిలో రూ. 250 కి అమ్ముకోవాల్సిన చేపలను రూ. 100 కే అమ్ముకున్నాడు ధనరాజు.
సాధారణ పరిస్థితులలో అయితే ధనరాజు ఆ ఆరేడు కిలోల చేపల మీదా రూ. 1500 నుంచి రూ 1750 దాకా సంపాదించేవాడు. అతడి సైకిలు దుకాణం ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండు రోజులు తిరిగి అమ్మితే అతడికి కేవలం రూ. 750 దక్కాయి. 46 ఏళ్ల పప్పు దేవి అతడికి సాయంగా వచ్చేది. చేపల కొనుగోలుదారులకు వాటిని శుభ్రం చేసి ముక్కలు చేసి ఇచ్చేది. ప్రతి కొనుగోలుదారు నుంచి ఆమెకు రూ. 10-20 దక్కేవి. డబ్బు కోసం ఈమె కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంది.
రేవు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు పప్పు దేవి రోజుకి రూ. 200-250 సంపాదించుకునేది. చేపలను శుభ్రం చేసి తరిగి ఇవ్వడమే ఆమెకు దొరికిన పని. “రోజులో ఒక పూట మాత్రమే భోజనం ఇపుడు నాకు. జూన్ వరకూ ఇలాగే గెంటుకురావాలి. వైరస్ పుణ్యాన జూన్ తర్వాత కూడా ఇదే పరిస్థితి (లాక్ డౌన్) కొనసాగవచ్చునేమో” అని దేవి నిరాశగా మాట్లాడింది. కొద్ది నిమిషాల మౌనం తర్వాత “నేనీ పరిస్థితులను అధిగమిస్తాను” అంటూ ఆశను వ్యక్తం చేసింది. దేవి వితంతువు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్ కు చెందిన ఇప్పలవలస ఆమె అసలు ఊరు.
మార్చి నెలలో దేవి తన కూతుళ్లను ఇప్పలవలస పంపింది. “ నా తల్లిదండ్రుల సంరక్షణ కోసం పంపాను. నేను కూడా ఈ నెలలో వారి వద్దకు వెళ్ళాలి. కానీ వెళ్ళడం అసాధ్యంలా కనిపిస్తోంది” అంది దేవి.
అధికారికంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లడానికి ఏప్రిల్ 2 నాటికి కూడా మత్స్యకారులకు అనుమతి లేదు. వేట మీద ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకూ 61 రోజుల వార్షిక నిషేధం కూడా అమల్లో ఉంది. మత్స్య సంపద సంరక్షణ కోసం మర పడవల ద్వారా చేపల వేటను ఈ కాలంలో నిషేధిస్తారు. “నేను మార్చి 15 నుంచే వేటకు వెళ్ళడం మానేశాను. అప్పటికి 15 రోజులుగా సగం లేదా సగం కంటే తక్కువ ధరకే నేను చేపలను అమ్ముకోవాల్సి వచ్చింది” చెప్పాడు వాసుపల్లి అప్పారావు. “ మార్చిలో నేను కేవలం రూ. 5000 మాత్రమే సంపాదించుకోగలిగాను” అన్నాడు చెంగల్రావుపేట ప్రాంతం లోనే ఉంటున్నఈ ఏభై ఏళ్ల ఈ మత్సకారుడు. సాధారణంగా అప్పారావు నెలకు సుమారు రూ 10-15 వేలు దాకా సంపాదిస్తాడు.
“ఏప్రిల్ తొలి రెండు వారాలలో మేము మంచి లాభాలను సంపాదిస్తాము(వార్షిక నిషేధం అమల్లోకి వచ్చేముందు). ఈ కాలంలో కొనుగోలు దారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చేపల పునరుత్పత్తి జరిగే నిషేధ కాలానికి ముందు నేను పది పదిహేను రోజుల్లో రూ. 15 వేలు సంపాదించాను, ” అన్నాడు అప్పారావు.
ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే చేపల ధర దారుణంగా పడిపోయింది. మామూలుగా వెయ్యి రూపాయల ధర పలికే వంజరం, సందువాయి చేపలను నాలుగయిదు వందల రూపాయలకు మాత్రమే అమ్ముడవుతున్నాయి. కరోనా వైరస్ తెచ్చిపెట్టిన భయం కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని అప్పారావు అభిప్రాయపడ్డాడు. “ ఒకతనెవరో వచ్చి నేను చేపల వలలను వేయడం ఆపేయాలని అన్నాడు. చైనా నుంచి చేపలు వైరస్ ను మోసుకొస్తాయని అన్నాడు “ అంటూ నవ్వి “ నేనేం చదువుకున్నవాడిని కాదు, అయినా ఆమాట నిజం కాదని నాకు అనిపిస్తోంది” అన్నాడు అప్పారావు.
రేషన్ పథకంలో భాగంగా ప్రభుత్వం మనిషికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తోంది. అవి తీసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో కష్టాలు తప్పవని అప్పారావు అభిప్రాయపడ్డాడు. “ చేపల పునరుత్పత్తి సమయం మాకు ఏటా కష్ట కాలమే. కానీ దానికి ముందు కొన్ని వారాల పాటు మేము సంపాదించే నాలుగు డబ్బులతో కష్టాలను అధిగమించేస్తాము. ఈ సారి పూర్తి భిన్నమైన పరిస్థితి. మాకు ఆదాయమూ లేదు, లాభాలూ లేవు” అన్నాడు అప్పారావు.
మత్స్యకారులను చేపల వేటకు సముద్రం లోకి అనుమతి ఇస్తూ ఏప్రిల్ 12 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. చేపల వేట మీద వార్షిక నిషేధం మరో 72 గంటల్లో వచ్చేస్తుందనగా ఈ సడలింపు ఇచ్చింది. ఈ సడలింపు మత్స్యకారులకు ఊరట ఇచ్చింది. కానీ “ ఈ సమయం చాలా తక్కువ. దీనికి తోడు లాక్ డౌన్ కారణంగా కొనుగోలుదారులు తగ్గిపోయారు” అని అప్పారావు చెప్పాడు.
చింతపల్లి తాతారావు చెంగల్రావు పేట నివాసి. ఆ వాడలో చిందరవందరగా పేర్చిన అగ్గిపెట్టెల కుప్పలా ఉండే పలు ఇళ్ళలో ఒకటి తాతారావుది. ఇరుకిరుకుగా ఉండే మెట్ల వరుస మీద నుంచి వెలుతురు సరిగా ప్రసరించని ఇతని ఇంట్లోకి వెళ్ళాలి. నలభై ఎనిమిదేళ్ల తాతారావు ఉదయాన్నే లేచి దగ్గరలోని బీచ్ లోకి దిగుతాడు. లాక్ డౌన్ కాలంలో అంతకు మించి ముందుకు పోలేడు. పప్పు దేవి స్వగ్రామమే ఇతని స్వగ్రామం కూడా- విజయనగరం జిల్లాలోని ఇప్పలవలస.
“సముద్రం నా చెంత లేదు, రేవు నా చెంత లేదు, చేపలు నా చెంత లేవు” విచారంగా నవ్వుతూ అన్నాడు తాతారావు. చేపలతో లభించే ఆదాయం కూడా అతడు కోల్పోయాడు. అతడు సముద్రంలోకి వేటకు చివరిసారిగా వెళ్లింది 20 మార్చి 2020 న.
“ఐసులో నిల్వ చేసినా కూడా ఆ వారం చాలా చేపలు అమ్ముకోలేకపోవడం వలన మిగిలిపోయాయి” అన్నాడు తాతారావు. “అలా మిగిలిపోవడం నాకు సంతోషం కలిగించింది. మేము ఆ చేపలు వండుకు తిన్నాము!” అంది తాతారావు భార్య సత్య భర్త మాటలకు అడ్డు తగులుతూ. ఆమెకు 42 ఏళ్ళు. తాతారావుకు చేపలు అమ్మడంలో సాయం చేస్తుంది.
లాక్ డౌన్ వచ్చిన నాటి నుంచి ఇల్లు కళకళలాడుతోందని సత్య అభిప్రాయం. “మామూలుగా, ఎప్పుడూ నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. నా కొడుకు, భర్త ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. మేమంతా కలిసి భోజనం చేసి కొన్ని మాసాలు అయ్యింది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మేము కలిసి గడుపుతుండటం నాకు నచ్చింది” అంది సత్య విప్పారిన ముఖంతో.
రెండేళ్ల క్రితం పడవ కొనడం కోసం చేసిన రుణాన్ని తీర్చే దారి కోసం తాతారావు అన్వేషిస్తున్నాడు. ఏ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరో అప్పు చేసి ఈ ఏడాది చివరికి అప్పు తీరుస్తానని అతడు అన్నాడు. “చేపలు చవగ్గా వెళ్లిపోవడంతో మూడు రోజుల అనుమతి ( సడలింపు కాలం) మాకు చేసిన మేలు ఏమీ లేదు. వేటకు వెళ్ళి చేపలు పట్టుకురావడం కంటే వాటిని మంచి ధరకు అమ్ముకోవడం మరీ కష్టం” అన్నాడు తాతారావు.
“నా కొడుకు గురించి కూడా నేను ఆందోళనగా ఉంది. గత నెలలో వాడి ఉద్యోగం పోయింది” అని చెప్పాడు తాతారావు. ఇరవై ఒకటేళ్ల చింతపల్లి తరుణ్ ఒక ప్రయివేటు కంపెనీలో వెల్డరు. కాంట్రాక్టు ముగిసిపోవడంతో మొన్న ఫిబ్రవరిలో అతడి ఉద్యోగం పోయింది. “ నేను ఉద్యోగం గురించి వెతుక్కుంటున్నాను, కానీ కరోనా వైరస్...” అంటూ తరుణ్ నిట్టూర్చాడు.
“మేము బస్తీల్లో ఉంటాం. సాంఘిక దూరం పాటించడం మాకు చాలా కష్టం. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎవరికీ పాజిటివ్ రాలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఎవరికయినా పాజిటివ్ వస్తే మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరని నాకు అనిపిస్తోంది” అని తాతారావు అన్నాడు. “ ఏ మాస్కూ, శానిటైజర్ మమ్మల్ని అపుడు రక్షించలేవు” అన్నాడు. తాతారావుకి సర్జికల్ మాస్క్ లేదు. దానికి బదులు చేతి రుమాలు ముఖం చుట్టూ కట్టుకున్నాడు. సత్య తన ముఖాన్ని పైట కొంగుతో కప్పుకుంది.
“కష్టాలు మా చెంతకు రాకుండా ఉండవు” అని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు తాతారావు. “నాకు గానీ, నా కుటుంబంలో మరెవరికైనా గానీ కరోనా పట్టుకుంటే వైద్యం చేయించుకోవడం కోసం మా దగ్గర పైసలు లేవు” అన్నాడు. “మాలో ఎవరికీ ఆరోగ్య బీమా గానీ, పొదుపు చేసుకున్న డబ్బులు కానీ లేవు. మాకున్నదల్లా తీర్చడానికి అప్పులు, చంపుకోవడానికి ఆకలి బాధలు “ అని సత్య నిర్వేదంగా అంది.
విశాఖపట్నానికి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన అనేక మంది మత్స్యకారుల్లో తాతారావు, సత్య, పప్పు దేవి కొందరు మాత్రమే. ఈ ఏడాదిలా కాక మిగిలిన సంవత్సరాల్లో వార్షిక నిషేధం విధించే రెండు నెలల కాలంలో తమ స్వంత గ్రామాలకు వెళ్తారు. ఈ సారి అలా వెళ్ళే అవకాశాలు వారికి లేవు.
“గతంలో మేము ఆ రెండు నెలలు అద్దె కట్టేవాళ్లం కాదు. ఇపుడు మేము ఇంటి అద్దె కట్టాల్సి వస్తోంది” చెప్పాడు తాతారావు. “ చేపల పునరుత్పత్తి కాలంలో మేము మా ఊళ్లలో ఇతరుల పొలాలలో చిన్ని చిన్ని పనులు చేసుకుని రోజుకి రూ. 50 దాకా సంపాదించుకునే వాళ్ళం” అన్నాడు. పంటను, వ్యవసాయ ఉత్పత్తులను జంతువుల నుంచి కాపాడటం వంటి పనులు వాటిలో భాగంగా ఉండేవి.
“ఒక్కోసారి ఆ పనిని పాడు పెట్టేవాళ్లం “ అని నవ్వాడు తాతారావు. “మత్స్యకారులకు మరో బతుకు తెరువు తెలియదు. చేపల పునరుత్పత్తి సమయం వెళ్లిపోయేనాటికి వైరస్ ఉండబోదని నమ్మకంగా ఉంది” అని ఆశగా అన్నాడు.
ఫోటోలు ఇచ్చిన ప్రజాశక్తి బ్యూరో చీఫ్ మధు నరవకు కృతజ్ఞతలు
అనువాదం: ఎన్.ఎన్.శ్రీనివాసరావు