జూలై 2021లో వరద నీరు తన ఇంటిలోకి ప్రవేశిస్తుండటంతో శుభాంగి కాంబ్లే తన వస్తువులన్నిటినీ వదిలేసి ఇల్లు వదిలి పారిపోయారు. వెళ్ళేటపుడు ఆమె త్వరత్వరగా రెండు నోట్‌బుక్కులను మాత్రం తనతో పట్టుకెళ్ళారు.
రాబోయే వారాలూ నెలల్లో, ఒక్కొక్కటి 172 పేజీలున్న ఈ రెండు పుస్తకాలు అనేక జీవితాలను రక్షించడంలో ఆమెకు సహాయపడతాయి
అది, మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని అర్జున్‌వాడ్ అనే ఆమె గ్రామం ఇప్పటికే మరొక విపత్తుతో - వేగంగా పెరుగుతోన్న కోవిడ్ -19 కేసులు - వ్యవహరిస్తోన్న సమయం. శుభాంగి నోట్‌బుక్‌ల లోపలి పేజీలలో గ్రామంలోని కరోనావైరస్ కేసులకు సంబంధించిన మొత్తం సమాచారం - ఫోన్ నంబర్లు, చిరునామా, కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు, వారి వైద్య చరిత్ర, ఆరోగ్య రికార్డులు మొదలైనవన్నీ చక్కగా రాసివున్నాయి.
"(గ్రామంలో నిర్వహించిన RT-PCR పరీక్షల) కోవిడ్ నివేదికలు మొదట నాకే వస్తాయి,” అని ఈ 33 ఏళ్ల అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ASHA-ఆశా) చెప్పారు. 2005లో భారతదేశ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద నియమించబడిన లక్షమంది మహిళా సామాజిక ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలలో శుభాంగి ఒకరు. శిరోల్ తాలూకా లోని వరద సహాయక శిబిరానికి తరలించబడిన కోవిడ్-పాజిటివ్ గ్రామస్థుడిని గుర్తించడంలో ఆమె నోట్స్ ఆమెకు సహాయపడింది. అతని ద్వారా కనీసం 5,000 మంది ఇతర వ్యక్తులకు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది..
"వరదల కారణంగా, చాలామంది వ్యక్తుల ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అవటమో లేదా, నెట్‌వర్క్ కవరేజీలో లేకపోవడమో జరిగింది," అన్నారామె. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెర్వాడ్‌లోని తన తల్లిగారి ఇంటికి మారిన శుభాంగి, వెంటనే తాను చేతితో రాసిన రికార్డులను వెతికి, శిబిరంలో ఉన్న మరికొందరి ఫోన్ నంబర్లను కనుగొన్నారు. "ఎలాగైతేనేం, నేను రోగిని సంప్రదించగలిగాను."
ఆమె సమీపంలోని అగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో ఒక బెడ్‌ను కూడా ఏర్పాటు చేయటంతో రోగిని వేగంగా అక్కడికి తరలించారు. "నేను నోట్‌బుక్ తీసుకోకపోతే, వేలాది మందికి వ్యాధి సోకి ఉండేది" అని ఆమె చెప్పారు.
గ్రామంలో ఏర్పడిన అటువంటి సంక్షోభాన్ని తిప్పికొట్టడం లేదా తన కంటే ముందు తన పనికి ప్రాధాన్యం ఇవ్వడం శుభాంగికి ఇది మొదటిసారి కాదు. 2019 వరదల (ఆగస్టు) తర్వాత, ఆమె తన శిథిలమైన ఇటుక ఇంటిని మరమ్మతు చేయడానికి ముందే పనిలో చేరారు. "నేను గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు గ్రామానికి జరిగిన మొత్తం నష్టాన్ని సర్వే చేయడంలో బిజీగా ఉన్నాను" అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత మూడు నెలలకు పైగా గ్రామమంతా తిరుగుతూ వరదనుంచి ప్రాణాలతో బయటపడ్డవారితో మాట్లాడుతూ, అక్కడ జరిగిన వినాశనాన్నంతా చూస్తూ గడిపారామె. ఆమె చూసినవి, విన్నవి ఆమెను విపరీతంగా కలవరపెట్టాయి. తాను సర్వే చేసిన 1,100 పైగా కుటుంబాలకు జరిగిన నష్టాలను గుర్తించినపుడు ఆమె ఆందోళనకూ, ఒత్తిడికీ గురవటం మొదలయింది.
"నేను నా మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూపోయాను. అంతకన్నా నాకు వేరే అవకాశమేముంది?" అంటారామె
ఆ సంవత్సరం వరదల వల్ల కలిగిన గాయం నుండి కోలుకోకముందే, 2020 కోవిడ్ రిలీఫ్‌లో ఆమె ముందంజలో ఉన్నారు. కోవిడ్ విజృంభిస్తున్నప్పటికీ, జూలై 2021లో వరదల వల్ల ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి ఆమె తిరిగి వచ్చారు. “వరదలు, కోవిడ్ కలిసి రావడమంటే అది ఎన్నడూ మన ఊహకు కూడా అందని చాలా పెద్ద విపత్తు అని అర్థం" అని శుభాంగి చెప్పారు.
తన స్వంత మానసిక ఆరోగ్యాన్ని ఆమె నిర్లక్ష్యం చేసినదాని ప్రభావం చివరకు వివిధ మార్గాల్లో కనిపించడం ప్రారంభించింది
ఏప్రిల్ 2022లో ఆమెకు న్యుమోనియా, కొద్దిపాటి రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయింది. "నేను ఎనిమిది రోజులుగా జ్వరంతో ఉన్నాను. కానీ పని ఉండటంతో ఆ లక్షణాలను పట్టించుకోలేదు," అని ఆమె చెప్పారు. ఆమె హిమోగ్లోబిన్ 7.9కి పడిపోయింది. ఇది మహిళలకు ఉండవలసిన స్థాయి (ప్రతి డెసిలీటర్ రక్తానికి 12-16 గ్రాములు) కంటే చాలా తక్కువగా ఉంది. దాంతో ఆమె ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.
రెండు నెలల తర్వాత, ఆమె కోలుకుంటున్న సమయంలో గ్రామంలో భారీ వర్షాలు కురిసి నీటి మట్టం వేగంగా పెరగుతుండడం చూసిన శుభాంగిలో మరోసారి మానసిక ఒత్తిడి ప్రారంభమైంది. "ఒకప్పుడు మేం వర్షాల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వర్షం కురిసిన ప్రతిసారీ మరొక వరద వస్తుందేమోనని భయపడుతున్నాం" అని ఆమె చెప్పారు. "ఈ సంవత్సరం ఆగస్టులో నీటి మట్టం ఎంత త్వరగా పెరిగిందంటే, నేను చాలా రోజులు నిద్రపోలేకపోయాను." (ఇది కూడా చదవండి: వరద నీటిలో మునిగిపోతున్న కొల్హాపూర్ క్రీడాకారుల కలలు )
వైద్యం కొనసాగుతున్నప్పటికీ, శుభాంగి హిమోగ్లోబిన్ స్థాయి పెరగటంలేదు. ఆమెకు మైకం కమ్మడం, అలసట కూడా ఉంటున్నాయి. కానీ కనుచూపు మేరలో విశ్రాంతిగానీ స్వస్థతగానీ లేవు. "సర్వనాశనం అయినప్పటికీ, ఆశాలుగా మేం ఒక సహాయక వ్యవస్థగా ఉండితీరాల్సిందే" అని ఆమె చెప్పారు.
*****
శిరోల్‌లోని గణేశవాడి గ్రామంలో ఆశాగా పనిచేస్తోన్న ఛాయా కాంబ్లే(38), 2021లో వచ్చిన వరదలను చాలా వివరంగా గుర్తు చేసుకున్నారు. "వరదలో చిక్కుకున్నవారిని రక్షించే పడవ మా ఇంటి పైన ప్రయాణించింది," అని ఆమె చెప్పారు.
శుభాంగిలాగే, ఛాయ కూడా వరదనీరు తగ్గడం ప్రారంభించిన వెంటనే తిరిగి పనిలోకి వచ్చారు. "మేమంతా (గణేశ్‌వాడికి చెందిన ఆరుగురు ఆశాలు) మొదట సబ్-సెంటర్‌కి వెళ్ళాం" అని ఆమె చెప్పారు. వరదల వలన సబ్-సెంటర్ భవనం దెబ్బతినడంతో, ఒకరి ఇంటి వద్ద తాత్కాలిక ఉప కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
"ప్రతిరోజూ న్యుమోనియా, కలరా, టైఫాయిడ్, చర్మ వ్యాధులు, జ్వరం, మరెన్నో జబ్బులతో బాధపడే అనేకమంది (ఉప కేంద్రానికి) వస్తుంటారు." ఈ డ్యూటీ ఒక్క రోజు విరామం కూడా లేకుండా ఒక నెల మొత్తం కొనసాగింది.
"ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసినప్పుడు మనపై ఆ ప్రభావం పడుతుంది" అని ఛాయ చెప్పారు. "దురదృష్టవశాత్తూ, మాకు మానసిక ఆరోగ్య సంరక్షణా సౌకర్యం లేదు. అలాంటప్పుడు ఎలా నయం అవుతుంది?”
ఆమె ఒత్తిడి స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి, తొందరలోనే శ్వాస ఆడకపోవడం మొదలయింది. "ఇదంతా పనిభారం వల్ల అయుంటుందని భావించి నేను దానిని పట్టించుకోకుండా వచ్చాను," కొన్ని నెలల్లోనే ఛాయకు ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. "విపరీతమైన ఒత్తిడే అందుకు కారణమని డాక్టర్ చెప్పారు" అన్నారామె. ఒత్తిడికీ, ఉబ్బసానికీ మధ్య సంబంధాన్ని నిర్ధారించే అధ్యయనాలు చాలానే ఉన్నాయి.
మందులు వాడటం ఛాయాకు సహాయం చేస్తున్నప్పటికీ, వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పుల గురించి ఆమె చింతించకుండా ఉండలేకపోయారు. ఉదాహరణకు, ఈ సంవత్సరం మార్చి-ఏప్రిల్‌లో వీచిన వడగాడ్పుల సమయంలో ఆమెకు మైకం రావడం, ఊపిరి ఆడకపోవడం మొదలయ్యాయి.
"ఈ పరిస్థితులలో పని చేస్తూ ఉండాలంటే చాలా కష్టమైన విషయం. నా చర్మం మండిపోతున్నట్లుగా అనిపించేది," అని ఆమె గుర్తుచేసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు మేధ పనితీరు పై ప్రభావం చూపుతాయని, ఆత్మహత్యలు పెరగటం , హింస , దూకుడుతనం పెరగడానికి కూడా దారితీస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి.
ఛాయకున్నటువంటి లక్షణాలే తమనూ బాధిస్తున్నాయని ఆశాలుగా పనిచేసే మరికొంతమంది కూడా చెప్తున్నారు. “ఇదేమీ విచిత్రం కాదు. ఇవన్నీ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ - SAD (ఋతువుల ప్రభావంతో వచ్చే రోగాల) లక్షణాలు” అని కొల్హాపూర్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ శాల్మలి రన్‌మాళే-కాకడే చెప్తున్నారు.
SAD అనేది ఋతువులు మారినప్పుడు కలిగే కుంగుబాటుకు ఒక రూపం. అధిక అక్షాంశ దేశాలలో వచ్చే శీతాకాలంతో ఈ లక్షణాలు ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నప్పటికీ, భారతదేశం వంటి ఉష్ణమండల దేశాలలో కూడా ప్రజలను ప్రభావితం చేసే ఈ రుగ్మత గురించి అవగాహన పెరిగింది.
“వాతావరణం మారుతున్నప్పుడల్లా నాకు ఆందోళన మొదలవుతుంది; తలతిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆతా మలా ఆజిబాత్ సహన్ హోయీనా ఝాలఁయ్ (ఇక నేను దీనిని భరించలేను)," అన్నారు శుభాంగి. “దాదాపు వరద-ప్రభావానికి గురైన ప్రతి ఆశా ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనేవున్నారు, అది క్రమేణా దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తోంది. మేం ఇంతమందిని కాపాడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మాకు ఏ సహాయమూ చేయడం లేదు."
ఆరోగ్య అధికారులు సమస్యను గుర్తించటంలేదని కాదు. వారి ప్రతిస్పందన సరిపోతుందా, లేదా సరైనదేనా అనేదే ప్రశ్న.
వరదలు, కోవిడ్ కారణంగా ఈ ప్రాంతంలోని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు "అధికంగా పని చేస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు" అని సమీపంలోని వరద ప్రభావిత హాత్‌కణంగలే తాలూకాలో పనిచేస్తున్న తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ ప్రసాద్ దాతార్ చెప్పారు. "ఈ ఆందోళనలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి,మేం ఆశాలుగా పనిచేసేవారి కోసం ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం," అని ఆయన అన్నారు.
అయితే, కొల్హాపూర్‌లోని శిరోల్ తాలూకా లో ఉన్న ఆశా యూనియన్ నాయకురాలు నేత్రదీపా పాటిల్, ఈ కార్యక్రమాలు ఎలాంటి సహాయమూ చేయడం లేదని అభిప్రాయపడ్డారు. "నేను నా మానసిక ఆరోగ్య సమస్యలను అధికారులకు వినిపించినప్పుడు, ‘మేం అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ అంటూ వారు దానిని తోసిపుచ్చారు," అని ఆమె వాపోయారు.
ఆశాలకు థెరపీ, కౌన్సెలింగ్ అవసరమనీ, వాటివల్ల వారు నిరంతర ఒత్తిడిని తట్టుకోగలుగుతారని రన్‌మాళే-కాకడే అన్నారు. "సహాయం చేసే చేతికి కూడా సహాయం కావాలి" అని ఆమె చెప్పారు. "దురదృష్టవశాత్తూ, మన సమాజంలో అలా జరగదు." అంతేకాకుండా, చాలామంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు సహాయం అందించడానికే నిరంతరం ముందుకువస్తుంటారు. వారు తరచుగా తాము అనుభవిస్తున్న ఒత్తిడిని, ఆందోళనను, భావోద్వేగ భారాన్ని గుర్తించలేరు.
వేగంగా మారుతున్న స్థానిక వాతావరణ నమూనాల వంటి పదే పదే వచ్చిపడే ఒత్తిళ్లతో వ్యవహరించడానికి మరింత బలంగా, మరిన్ని ఎక్కువసార్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అంటారు.
*****
మారుతున్న వాతావరణ నమూనాలు కొల్హాపూర్‌లోని ఆశాల మానసిక ఆరోగ్యం క్షీణించడంలో అనేక పాత్రలను పోషిస్తున్నాయి.
వారిపై అపారమైన భారం ఉన్నప్పటికీ - ప్రతి ఆశా ఒక గ్రామంలో 1,000 మందికి సంబంధించిన 70కి పైగా ఆరోగ్య సంరక్షణ పనులను నిర్వహిస్తారు. సురక్షితమైన గర్భధారణలు ఉండేలా చూడటం, సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా వేయించడం కూడా ఈ పనులలో ఉన్నాయి. అయినప్పటికీ అతి తక్కువ వేతనం మాత్రమే పొందే ఈ ఆరోగ్య కార్యకర్తలు దోపిడీకి గురవుతున్నారు.
మహారాష్ట్రలోని ఆశాలకు నెలకు కేవలం రూ. 3,500-5,000 వరకు చెల్లిస్తారు, అది కూడా కనీసం మూడు నెలల ఆలస్యంతో వస్తుందని నేత్రదీప ఎత్తిచూపారు. "ఈనాటికీ మమ్మల్ని స్వచ్ఛంద సేవకులుగానే పరిగణిస్తున్నారు. దీని కారణంగా మాకు కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు ఉండవు," అని ఆమె వివరించారు. ఆశాలకు చెల్లించే వేతనాన్ని ప్రభుత్వం 'పనితీరు ఆధారిత ప్రోత్సాహకం' అని పిలుస్తుంది. అంటే వారు తమ సముదాయంలో లక్ష్యాలుగా నిర్దేశించిన కొన్ని పనులను పూర్తి చేసినప్పుడు మాత్రమే వారికి వేతనం చెల్లిస్తారని అర్థం. వారికి స్థిరమైన గౌరవ వేతనం లేదు. ఆ వేతనం కూడా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటుంది.
అందువలన చాలామంది ఆశాలు కేవలం సమాజ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడం ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే జీవించలేరు. ఉదాహరణకు, ఇంటిని నడపటం కోసం శుభాంగి వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తుంటారు.
"2019, 2021లలో వచ్చిన వరదల వలన పొలాలు ధ్వంసమైనందున నాకు మూడు నెలలు పని దొరకలేదు," అని ఆమె చెప్పారు. "మారుతున్న వాతావరణ పరిస్థితులతో అనూహ్యంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా, వ్యవసాయ పనులు దొరుకుతాయనుకున్న మా ఆశలతో సహా అన్నింటినీ నాశనం చేసేస్తుంది." జూలై 2021లో కురిసిన భారీ వర్షాలు, వరదలు కొల్హాపూర్‌తో సహా మహారాష్ట్రలోని 24 జిల్లాల్లో 4.43 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణాన్ని నాశనం చేశాయి.
2019 నుండి పదే పదే ముంచెత్తుతున్న వరదలు, జరిగిన ఆస్తి విధ్వంసం, వ్యవసాయ పనులు లేకపోవటం వంటివాటివలన శుభాంగి అధికశాతం వడ్డీకి చిన్నమొత్తాల్లో వివిధ వడ్డీ వ్యాపారుల నుండి లక్ష రూపాయలు అప్పు చేశారు. ఆమె తన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ధ్వంసమైన పాత ఇంటిని తిరిగి కట్టుకునే స్తోమత లేకపోవడంతో 10x15 అడుగుల రేకుల గుడిసెకు మారవలసి వచ్చింది.
“2019, 2021లలో వచ్చిన రెండు వరదలలోనూ వరదనీరు 30 గంటలలోపే ఇంట్లోకి ప్రవేశించింది. మేం వేటినీ రక్షించుకోలేకపోయాం,” అని శుభాంగి భర్త, 37 ఏళ్ల సంజయ్ చెప్పారు. వ్యవసాయ కూలీగా చేయడానికి తగినంత పని లేనందున ఆయన ఇప్పుడు తాపీపని చేయడం ప్రారంభించారు.
తనకు వ్యక్తిగతంగా నష్టాలూ బాధలూ ఉన్నప్పటికీ, శుభాంగి ఆశాగా తన పనికి సంబంధించిన అపారమైన బాధ్యతలను నిర్వర్తించడంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
వరదల వల్ల కలిగిన నష్టాలను సర్వే చేయడంతో పాటు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి తాగునీటి వనరులను క్రిమిరహితం చేసే పనిని కూడా ఆశాలకు అప్పగించారు. వారు చేసే అనేక పనులకు డబ్బులు చెల్లించడమంటూ లేదని నేత్రదీప చెప్పారు. “మాకు అనేక మానసిక సమస్యలు రావడానికి కారణమైన ఈ వరదల అనంతర సహాయ కార్యక్రమాలన్నిటినీ చేసినందుకు మాకేమీ చెల్లించరు. అదంతా ఉచిత శ్రమ."
"ఎవరికైనా నీటి ద్వారా లేదా పరాన్నజీవి ద్వారా సంక్రమించే వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మేం ఇంటింటికీ వెళ్లాలి," అని శుభాంగి చెప్పారు. "ఆశాలు సకాలంలో చికిత్స అందించడం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడారు."
అయినప్పటికీ, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆమె స్వయంగా అనారోగ్యానికి గురైనప్పుడు ఆమెకు వ్యవస్థ నుండి చాలా కొద్దిపాటి మద్దతు మాత్రమే లభించింది. “నేనొక ప్రజారోగ్య సంరక్షణ కార్యకర్తను అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సివచ్చింది, రూ. 22,000 ఖర్చు చేయాల్సివచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి మందులు మాత్రమే సూచిస్తుంది, నేనేమో వెంటనే ఆసుపత్రిలో చేరవలసిన పరిస్థితిలో ఉన్నాను.” అని ఆమె చెప్పారు. ప్రజా ఉపకేంద్రం నుంచి ఉచితంగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్లు అందజేస్తున్నప్పటికీ, ఆమె ప్రతి నెలా అదనపు మందులపై రూ. 500 ఖర్చుచేస్తున్నారు.
ఆశాగా నెలకు దాదాపు రూ. 4,000 సంపాదించే ఛాయ, తనకు స్తోమత లేకపోయినా మందుల కోసం రూ. 800 వెచ్చించాల్సి వస్తోంది. “అన్నింటికీ మించి, మేం సామాజిక సేవకులమనే వాస్తవాన్ని మాకు మేమే అంగీకరించాం. అందుకే మేం చాలా బాధలు పడాల్సివస్తోంది" అని ఆమె చెప్పారు.
మారుమూల సముదాయాలను ప్రజారోగ్య వ్యవస్థకు అనుసంధానించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చినందుకు 2022లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆశాలను గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు తో సత్కరించింది. "దీని గురించి మేమంతా గర్విస్తున్నాం. అయితే మేం మా సీనియర్లను అప్పటికే ఆలస్యమైన మా కొద్దిపాటి జీతం గురించి అడిగినప్పుడల్లా, మేం మానవాళికి అద్భుతమైన సేవ చేస్తున్నామని వారు సమాధానం ఇస్తారు - ' పేమెంట్ చంగ్లా నహీ మిలత్ , పన్ తుమ్హాలా పుణ్య మిల్తే (మీకు మంచి జీతం రాకపోవచ్చు కానీ ప్రజల ఆశీర్వాదాలు మాత్రం దండిగా సంపాదిస్తున్నారు)' అని వారు మాకు చెప్తుంటారు." అంటారు ఛాయ.
ముందుండి పనిచేసే ఆరోగ్య కార్యకర్తల మానసిక ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమస్యను ఒక క్లుప్త విధాన ప్రకటన ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లేవనెత్తింది: "తీవ్రమైన వాతావరణ సంఘటనలను అనుసరించి నిస్పృహ, ఆందోళన, ఒత్తిడికి సంబంధించిన పరిస్థితులు ఏర్పడతాయని గమనించడం జరిగింది."
వాతావరణ సంఘటనలతో పాటు దిగజారుతున్న పని పరిస్థితులు, వారి పరిస్థితులను పట్టించుకోకపోవటం- ఇవన్నీ కలిసి, ఆశాల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నేత్రదీప చెప్పారు. "ఈ సంవత్సరం వడగాడ్పుల కాలంలో సర్వే చేస్తున్న సమయంలో మాలో చాలామందికి చర్మం చికాకుపెట్టడం, మంట, అలసట కలిగాయని నివేదించారు" అని ఆమె చెప్పారు. “మాకు ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వటంలేదు."
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (IITM)లో వాతావరణ శాస్త్రవేత్త, ఐక్యరాజ్యసమితి వెలువరించిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే నివేదికకు కంట్రిబ్యూటర్ అయిన రాక్సీ కోల్, వడగాడ్పులు వీచే కాలం, ఇంకా ఇతర విపరీత వాతావరణ పరిస్థితులు ఎప్పుడు, ఏ రోజుల్లో సంభవించవచ్చో స్పష్టంగా ప్రస్తావించే 'వాతావరణ కార్యాచరణ ప్రణాళిక'ను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "రాబోయే సంవత్సరాలు లేదా దశాబ్దాలకు సంబంధించి మనకు వాతావరణ సూచనలు ఉన్నాయి. దాని ఆధారంగా, ఉద్యోగులు ఏయే ప్రాంతాల్లో, రోజులో ఏ సమయంలో సూర్యరశ్మికి దూరంగా ఉండాలో మనం గుర్తించగలం” అని ఆయన చెప్పారు. "అదేమీ పెద్ద విషయం కాదు. మా దగ్గర అన్ని వివరాలు సిద్ధంగా ఉన్నాయి."
ఈ దిశలో ఎటువంటి అధికారిక విధానం లేదా ప్రయత్నం లేనప్పుడు, ఆశాలు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి తమ స్వంత మార్గాలను రూపొందించుకోవలసి ఉంటుంది. వాతావరణ సూచనను తనిఖీ చేయడంతో శుభాంగి తన రోజును ప్రారంభిస్తారు. “నేను నా కర్తవ్యాన్ని విడిచిపెట్టలేను; కనీసం ఆ రోజు వాతావరణాన్ని ఎదుర్కోవడానికి నన్ను సిద్ధం చేసునేందుకు ప్రయత్నిస్తాను” అని ఆమె చెప్పారు.
ఇంటర్‌న్యూస్ ఎర్త్ జర్నలిజం నెట్‌వర్క్ మద్దతుతో వస్తోన్న సిరీస్‌లో భాగంగా, స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ పొందిన రిపోర్టర్ ఈ కథనాన్ని రాశారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి