అన్ని టమాటోలూ మీరు తినొచ్చు- ఉచితంగానే. ఈ కాలంలో మీరొక ఆవు అవ్వొచ్చు. ఇక వేరే కాలాల్లో అయితే మీరు ఒక మేకగా మారితే బాగా లాభిస్తుంది.
అనంతపూర్ టమాటో మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న స్థలం పండ్లు, కూరగాయల ధరలు ఉన్నపాటుగా తగ్గిపోయినప్పుడు పారవేయడానికి బాగా ఉపయోగపడుతుంది. (అసలైతే టమాటోలు పండ్ల విభాగం లోకి వస్తాయి, కానీ వాటిని కూరగాయాలుగా పరిగణిస్తాము, అని బ్రిటానికా ఎన్సైక్లోపీడియా చెబుతుంది). వారి పొలాల్లో పండిన టమాటోలని తెచ్చిన చుట్టుపక్కల గ్రామాల రైతులు, వారు అమ్మలేకపోయిన టమాటోలని ఇక్కడ పడేస్తారు. ఈ స్థలం ఎక్కువగా మేకలతో నిండి ఉంటుంది. “కానీ ఒకవేళ మేకలు వర్షాకాలంలో ఎక్కువగా టమోటోలు తింటే వాటికి ఫ్లూ వస్తుంది.” అన్నాడు పి. కదిరప్ప. అతను బుక్కరాయసముద్రం గ్రామం నుంచి తన మేకలను ఇక్కడకి తోలుకొస్తాడు. బుక్కరాయసముద్రం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలోని అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
మేకల జీర్ణకోశం ఆవుల కన్నా సున్నితం అని, పైగా వాటికి ఫ్లూ కూడా వస్తుందని తెలుసుకోవడం గొప్ప విషయమే. గత కొన్ని రోజులుగా అనంతపూర్ లో వర్షాలు పడడం మూలంగా ఆ మేకలు వాటికి ఇష్టమైన పండ్లని తినలేక పోయాయి. అయినా పాపం అవి ఆ చుట్టూ పక్కలే ఉన్న పిచ్చి మొక్కలు తింటూ, వాటికి పోటీగా తమకిష్టమైన ఆహారం మేస్తున్న ఆవులని అసూయగా చూస్తూ గడిపేసాయి. ఇంతటి విందు వారి జంతువులకు అందుతున్నా, మేకల కాపరులు ఆ రైతులకు ఏమి ఇవ్వరు, ఎందుకంటే కొన్ని వేల టమాటోలు అక్కడ పారేస్తుంటారు.
అనంతపుర్ మార్కెట్ లో టొమాటో ధరలు సాధారణంగా కిలో 20 నుండి 30 రూపాయిల వరకు ఉంటాయి. ఇంతకన్నా చవగ్గా అదే నగరంలోని రిలయన్స్ మార్ట్ లో దొరుకుతాయి. “మేము ఒకసారి వాటిని కిలో 12 రూపాయిలు కి కూడా అమ్మాము.” అని మార్ట్ లో పని చేసే వ్యక్తి చెప్పారు. “వారికి విడిగా సప్లై చేసేవారున్నారు”, అన్నాడు మార్ట్ లో కూరగాయలు అమ్మే అతను. “కానీ మేముకూడా మార్కెట్ లోనే కొంటాము, సాయంత్రానికి పాడైపోబోతున్నవి మార్కెట్ యార్డ్ దగ్గర పారేస్తాము.”
అయినా, ఈ ధరలకు మార్కెట్లో కొనుక్కువారికి. రైతులకు మాత్రం చాలా ఘోరమైన ఆదాయం లభిస్తుంది- 6 రూపాయిల నుంచి 20 రూపాయిల వరకు, వెరైటీ బట్టి, లేక పంట అందే సమయాన్ని బట్టి. వారికి మార్కెట్ ఎంత దగ్గరగా ఉంది అన్నదాన్ని బట్టి కూడా ఈ లెక్కల్లో తేడాలు, ధరలు మారే ప్రమాదాలు ఉంటాయి. అన్నిటి కన్నా ఎక్కువ కష్టం రైతుది, తక్కువ కష్టం మాత్రం ఆ ప్రాంతం లోని కార్పొరేట్ గొలుసు వ్యవస్థది.
ఒక వర్తకుడు ఒకసారి ఒక ట్రక్ నిండా 600 రూపాయిల విలువ చేసే టమోటోలు తెచ్చాడు. ఒక్కసారి ధరలు తగ్గగానే ఆ మార్కెట్ లోనే అమ్మేశాడు. “పది రూపాయిలు చెల్లించి ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లామని”, ఆ వర్తకుడి పిలుపు. అదీ చిన్న సంచి అయితే. అదే పెద్ద సంచి అయితే 20 రూపాయలకు సంచిలో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లామని. ఆ రోజు అతని వ్యాపారం బాగానే సాగినట్లుంది.
ఈ ఫోటో నేను తీసుకున్న రోజు అనంతపూర్ నగరంలోని వర్తకులు కిలో టమోటోలని 20-25 రూపాయలకు అమ్మారు. రిలయన్స్ మార్ట్ ఆ రోజు, టొమోటోలని 19 రూపాయిలకు అమ్మింది. ఇక్కడి షాపుల్లో మల్టీనేషనల్ బ్రాండ్లయిన నెస్లే, హిందూస్తాన్ లీవర్ వారి టమాటో సాస్ వంటివి ఉన్నాయి. బహుశా వీరే టమాటోల వలన అధిక లాభాలు గడించుకుంటున్నారు. ఈ సాస్లు ప్రత్యేక ఆర్థిక మండలాల్లో తయారవుతాయి(వీటికి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది).
టమాటో రైతులకు కావలసిన మద్దతు ఇవ్వాలని మీరు అనుకోవచ్చు, కాని చేయకండి. ఇంతలో, ధరలు తగ్గినప్పుడు, ఆవులు తమకు దొరికిన భలే పసందైన విందుని ఆరగించనివ్వండి.
అనువాదం : అపర్ణ తోట