గంగు బాయి చవాన్ కొద్దిపాటి తాగు నీటి కోసం అడుక్కోవాలి. “సర్కార్! వాచ్‌మన్ సాహిబ్! దయచేసి మాకు తాగడానికి నీళ్ళివ్వండి. నేను ఇక్కడే ఉంటున్నాను సార్."
అయితే కేవలం అడుక్కుంటే సరిపోదు. "నేను మీ పాత్రలను తాకను," అని ఆమె వారికి హామీ ఇవ్వాలి.
గంగుబాయి (అసలు పేరు కాదు) ఇళ్ళల్లో, భవనాలలో ఉండే కుళాయిలు, టీ కొట్లు, కల్యాణ మండపాలలో దొరికే నీటిపై ఆధారపడతారు. నాందేడ్ నగరంలోని గోకుల్‌నగర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ఉన్న తన ‘ఇంటి'కి ఎదురుగా ఉన్న హోటల్ వంటి భవనాల కాపలాదారులను ఆమె నీటి కోసం వేడుకుంటారు. ప్రతిరోజూ, నీళ్లు అవసరమైన ప్రతిసారీ ఆమె ఇలాగే చేస్తారు..
నీటిని వెతుక్కోవడం అనేది రోజువారీ పని. ఒకప్పుడు 'నేరచరిత్ర కలిగిన తెగ'గా ముద్రపడిన ఫాసేపార్ధీ తెగకు చెందిన వ్యక్తిగా ఆమె ఎదుర్కొనే అపవాదు ప్రతిరోజూ నీటి కోసం ఆమె చేసే వెతుకులాటలో ఆమె వెన్నంటే ఉంటుంది. బ్రిటిష్ వలసవాద యుగానికి చెందిన ఈ పరిభాషను 1952లో భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, 70 సంవత్సరాల తర్వాత కూడా, గంగుబాయి వంటి వ్యక్తులు తమ కనీస హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు; తాను దొంగను కానని ఆమె ఇతరులను ఒప్పించగలిగిప్పుడే ఆమెకు డ్రమ్ము నిండుగా నీళ్ళు దొరుకుతాయి.
"మీరిక్కడ ఉంచిన వస్తువులను మేమెన్నడూ ముట్టుకోలేదని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు మాకు నీళ్ళిస్తారు," అని గంగుబాయి చెప్పారు. ఒకసారి అనుమతి పొందిన తర్వాత ఆమె చిన్న పాత్రల్లో, ప్లాస్టిక్ బిందెల్లో, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో, నీళ్ళ సీసాలలో- వీలైనంత ఎక్కువ నీటిని నింపుకుంటారు. ఒక హోటల్‌వాళ్ళు ఒప్పుకోకపోతే, వాళ్ళ మొరటుతనాన్ని తోసేసుకొని, మరొక చోట ప్రయత్నిస్తారు. ఎవరైనా జాలిపడి నీళ్ళు ఇచ్చేంతవరకూ అలా ఆమె నాలుగైదు ప్రదేశాలలో అడగవలసి వస్తుంది. అప్పుడే ఆమెకు తాగడానికి, వంట చేయడానికి, తన ఇంటి అవసరాలకు నీళ్ళు దొరుకుతాయి.
















