సయ్యద్ ఖుర్షీద్‌కు బడ్జెట్‌పై పెద్దగా ఆసక్తి లేదు. 72 ఏళ్ళ ఆ వృద్ధుడు, “నేను టీవీలో ఏదైనా వార్తల చానల్ చూసే ప్రయత్నం కూడా చేయను. అందులో వచ్చేది ఎంతవరకు నిజమో, ఎంత వరకు ప్రచారమో కూడా మనకు తెలియదు," అన్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌లలో మార్పుల గురించి ఎవరో మాట్లాడడం ఆయన విన్నారు. "కానీ మా మొహల్లా లో దాని నుండి ప్రయోజనం పొందే వ్యక్తి నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు," ఆయన నవ్వుతూ చెప్పారు. " హమ్ అప్నా కమాతే హైఁ ఔర్ ఖాతే హైఁ [మేం సంపాదించినదాన్నే మేం తింటాం]."
సయ్యద్ మహారాష్ట్ర, పర్‌భణీ జిల్లాలోని గంగాఖేడ్ పట్టణంలో గత 60 ఏళ్ళుగా దర్జీగా పనిచేస్తున్నారు. తండ్రి నుంచి బట్టలు కుట్టడాన్ని నేర్చుకున్నప్పుడు ఆయన వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు. అయితే ఇప్పుడాయన వ్యాపారం మునుపటిలా లాభదాయకంగా లేదు. "నేటి యువతరం రెడీమేడ్ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తోంది," అని ఆయన వివరించారు.
ఒక ఒంటి గది దుకాణంలో పనిచేసే సయ్యద్, తన వద్ద పనిచేసే ఇద్దరు సహాయకులకు చెల్లించాక, నెలకు సుమారు రూ. 20,000 సంపాదిస్తారు. “అదృష్టం ఏమిటంటే మా నాన్న ఈ దుకాణాన్ని కొన్నారు, కాబట్టి నేను అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. లేకుంటే ఈమాత్రం సంపాదన కూడా ఉండేది కాదు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి అంతబాగా చదవలేను," అని తాను శ్రద్ధగా కుడుతున్న బట్టల మీది నుంచి దృష్టిని మరల్చకుండా చెప్పారాయన.
బడ్జెట్‌లో తక్కువ ఆదాయం ఉన్నవారిపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది, "కానీ అది ఒక నిర్దిష్ట తరగతి ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది," సయ్యద్ అన్నారు. "మాలాంటి కార్మికులకు దక్కేదేమీ ఉండదు."
అనువాదం: రవి కృష్ణ