"మేం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం," తన పక్కనే నిల్చొని ఉన్న స్నేహితురాలు సకుని వైపు ప్రేమగా చూస్తూ అన్నారు గీతా దేవి.
ఈ ఇద్దరూ దగ్గరలో ఉన్న అడవి నుంచి సాల (షోరియా రొబస్టా) పత్రాలను సేకరించి వాటితో దోనాలు (గిన్నెలు), పత్తల్‌లు (పళ్ళాలు) చేసి, వాటిని పలామూ జిల్లా ప్రధానకార్యాలయమైన డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు.
గీత, సకుని దేవిలు గత 30 ఏళ్ళుగా కోపె గ్రామంలోని నదిటోలా అనే చిన్న పల్లెలో ఇరుగుపొరుగులుగా జీవిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అనేకమంది గ్రామస్తులలాగే గీత, శకుని కూడా తమ జీవిక కోసం అడవిపైనే ఆధారపడుతున్నారు.
వాళ్ళు అడవిలో ఏడెనిమిది గంటలపాటు గడుపుతారు, మేతకు వెళ్ళిన పశువులు ఇళ్ళకు మళ్ళిన సమయంలో వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు. సరిపోయినన్ని ఆకులను సేకరించడానికి వారికి రెండు రోజులు పడుతుంది. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ, తమ కుటుంబాల గురించీ, స్థానిక వార్తలను గురించీ మాట్లాడుకుంటూ ఉంటే వారి సమయం త్వరగా గడిచిపోతుంది.
ప్రతి ఉదయం, "నికలీహే..." అంటూ పొరుగింటామె తనను పిలిచే పిలుపు కోసం గీత ఎదురుచూస్తారు. కొద్దిసేపటి తర్వాత, పాత సిమెంట్ గోతాలతో చేసిన ఒక సంచిని, ప్లాస్టిక్ సీసాలో నీటిని, చిన్న గొడ్డలిని, పాత గుడ్డ ముక్కను పట్టుకొని ఇద్దరూ ఇళ్ళు వదులుతారు. వాళ్ళిద్దరూ ఝార్ఖండ్‌లోని పలామూ టైగర్ రిజర్వ్‌కు తటస్థ ప్రాంతంగా ఉన్న హెహెగరా వైపు కదులుతారు.
ఆ ఇద్దరు స్నేహితులు వేర్వేరు సముదాయాలకు చెందినవారు - గీత భుయియాఁ దళిత వర్గానికి, సకుని ఉరాఁవ్ ఆదివాసీ సముదాయానికి చెందుతారు. మేం నడుస్తున్నప్పుడు గీత ఒక హెచ్చరిక కూడా చేశారు: "ఇక్కడికి ఒంటరిగా రావద్దు," అంటూ, "కొన్నిసార్లు అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. మేం తెందువాలను [చిరుతపులులను] చూశాం!" చెప్పారామె. పాములు, తేళ్ళ వల్ల కూడా ముప్పు ఎక్కువగానే ఉంటుంది. "చాలాసార్లు మేం ఏనుగులను చూశాం,” అని సకుని జత పలికారు. పలామూ టైగర్ రిజర్వ్‌లో 73 చిరుతపులులు, సుమారు 267 ఏనుగులు ఉన్నాయి (2021 వన్యప్రాణుల గణన).






















