ఇంకా పదేళ్ళు కూడా నిండని ఇజాజ్, ఇమ్రాన్, యాసిర్, షమీమాలు చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే బడికి వెళ్ళి చదువుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు తమ తల్లిదండ్రులతో కలిసి వలసపోవటం వలన ఒక నాలుగు నెలలపాటు బడి చదువును కోల్పోతున్నారు. పదజాలం, రాతలో నేర్పుతో పాటు ప్రాథమిక గణితం, పరిసరాల విజ్ఞానం, సామాజిక అధ్యయనాలలో పాఠాల వంటి కీలకమైన ప్రాథమిక పాఠశాల విద్యలో వెనుకబడిపోతుంటారు.
పిల్లలకు పదేళ్ళు వచ్చే సమయానికి, తరగతి గదికి దూరంగా ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం వరకూ అవుతుంది. అత్యుత్తమమైన మొదటి బెంచీ చదువరులకు కూడా అది ఒక దారుణమైన, అధిగమించరాని కష్టం.
కానీ ఇకపై అలా ఎంతమాత్రమూ జరగదు. వారు బడి నుండి దూరంగా వలస వెళ్ళేటప్పుడు వారితోపాటే ప్రయాణిస్తూ చదువుచెప్పే ఉపాధ్యాయుడు అలీ మహమ్మద్ ఉన్నాడు. పాతికేళ్ళ అలీ పర్వతాల మీదుగా కాశ్మీర్‌లోని లిద్దర్ లోయలో ఉండే గుజ్జర్ల స్థావరమైన ఖలాన్కు రావడం మొదలుపెట్టి ఇది మూడవ సంవత్సరం. రాబోయే నాలుగు నెలల వేసవి (జూన్ నుండి సెప్టెంబరు) ముగిసేవరకూ అతను చిన్న పిల్లలకు బోధించడానికి - తమ జంతువుల వేసవికాలపు మేత బయళ్ళకోసం వలస వచ్చిన గుజ్జర్ కుటుంబాలతో పాటు - ఇక్కడే ఉంటాడు.
"నేను కూడా ఉపాధ్యాయురాలిని అవుదామనుకుంటున్నాను," తన ముందు తెరచిపెట్టివున్న వర్క్బుక్లోకి మళ్ళీ తలదూరుస్తూ సిగ్గుపడుతూ అంది షమిమా జాన్. ఆ వర్క్‌బుక్‌ను ప్రభుత్వమే సరఫరాచేసింది. ఒకోసారి పిల్లలకు వెంటనే అవసరమైన సామగ్రిని అలీ తన సొంత డబ్బు వెచ్చించి పిల్లలకు కొనిస్తుంటాడు.
![Left: Shamima Jaan wants to be a teacher when she grows up.](/media/images/02a-IMG_4992-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
![Right: Ali Mohammed explaining the lesson to Ejaz. Both students have migrated with their parents to Khalan, a hamlet in Lidder valley](/media/images/02b-IMG_4959-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
ఎడమ: పెరిగి పెద్దయ్యాక ఉపాధ్యాయురాలు కావాలనుకుంటోన్న షమీమా జాన్. కుడి: ఇజాజ్‌కు పాఠం చెప్తోన్న అలీ మొహమ్మద్. ఈ ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి లిద్దర్ లోయలోని ఖలాన్ అనే చిన్న పల్లెకు వలసవచ్చారు
![The Gujjar children (from left) Ejaz, Imran, Yasir, Shamima and Arif (behind) will rejoin their classmates back in school in Anantnag district when they descend with their parents and animals](/media/images/03a-IMG_4928-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
![The Gujjar children (from left) Ejaz, Imran, Yasir, Shamima and Arif (behind) will rejoin their classmates back in school in Anantnag district when they descend with their parents and animals](/media/images/03b-IMG_4976-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
గుజ్జర్ పిల్లలైన (ఎడమవైపు నుండి) ఇజాజ్, ఇమ్రాన్, యాసిర్, షమీమా, ఆరిఫ్ (వెనుక)లు తమ తల్లిదండ్రులు, జంతువులతో కలిసి కిందికి దిగిన తర్వాత అనంత్‌నాగ్ జిల్లాలోని తమ బడిలోని సహవిద్యార్థులతో తిరిగి చేరతారు
పశుపోషక సముదాయానికి చెందిన గుజ్జర్లు పశువులతో పాటు కొన్నిసార్లు మేకలనూ గొర్రెలనూ కూడా పెంచుతుంటారు. తమ పశుగణానికి మేత బయళ్ళ కోసం వెదుకుతూ వారు ప్రతి సంవత్సరం వేసవికాలంలో హిమాలయాల పైపైకి వెళ్తుంటారు. ఈ వార్షిక వలసలు ఒక్కోసారి చిన్నపిల్లలు బడి తప్పిపోవడానికీ, వారి విద్యా పునాది నిలకడలేకుండా పోవడానికీ దారితీస్తాయి.
కానీ వారితో ప్రయాణించే అలీ వంటి ఉపాధ్యాయులు అలా జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే బడికి వెళ్ళని విద్యార్థులను కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు. “కొన్నేళ్ళ క్రితం వరకూ, మా సముదాయపు అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది. ఎత్తైన పర్వతాలకు వలస వెళ్తుంటాం కాబట్టి, బడి చదువును కొనసాగించడానికి అవకాశం ఉండదని, కొద్దిమంది మాత్రమే బడికి వెళ్ళేవారు,” అని ఈ యువ ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇతను కూడా చిన్నతనంలో తన గుజ్జర్ తల్లిదండ్రులతో కలిసి ఒకసారి ఇలా ప్రయాణించినవాడే.
“కానీ ఇప్పుడు ఈ పథకంతో ఈ పిల్లలకు ఒక ఉపాధ్యాయుదు ఉంటున్నారు. వాళ్ళు తమ బడి పనుల్లో నిమగ్నమై ఉంటారు, ఆ విధంగా మా సుముదాయం అభివృద్ధి చెందుతుంది,” అని ఆయన చెప్పాడు. "ఇలా కాకపోతే, నాలుగు నెలల పాటు ఇక్కడే ఉండే ఈ పిల్లలు తమ గ్రామంలోని (అనంతనాగ్ జిల్లాలోని) బడిలో చదివే పిల్లలకంటే వెనుకబడిపోతారు."
2018-19లో ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షను గురించి అలీ ప్రస్తావిస్తూ, "సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ), దేశీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎమ్ఎస్ఎ), ఉపాధ్యాయ విద్య (టిఇ) అనే మూడు పథకాలను ఇది తనలో ఇముడ్చుకుంది," అని చెప్పాడు. ఇది "బడి చదువులలో సమాన అవకాశాల, సమానమైన అభ్యాస ఫలితాల రూపంలో పాఠశాల సమర్థతను కొలిచేందుకు" ఉద్దేశించినది.
ఆ విధంగా ఈ బడి అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గాఁవ్ తహసీల్ లో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే లిద్దర్ నది ఒడ్డున ఉన్న ఒక పచ్చని డేరాలో ఏర్పాటయింది. ఎండ కాస్తున్నపుడు, విశాలమైన పచ్చికభూములే ఈ పాఠశాల ఉపాధ్యాయునికి తరగతి గదిగా పనిచేస్తాయి. అలీకి జీవశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉంది, ఈ ఉద్యోగం కోసం అతనికి మూడు నెలల శిక్షణ కూడా ఇచ్చారు. "మేం ఏ అభ్యాస ఫలితాలను లక్ష్యంగా పెట్టుకోవాలి, ఎలా బోధించాలి, విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు అనేవాటి నిజజీవిత అన్వయాలను మాకు చూపించారు."
![Ali Mohammed (left) is a travelling teacher who will stay for four months up in the mountains, making sure his students are up to date with academic requirements. The wide open meadows of Lidder valley are much sought after by pastoralists in their annual migration](/media/images/04a-IMG_4967-Crop-PD-The_travelling_teache.max-1400x1120.jpg)
![Ali Mohammed (left) is a travelling teacher who will stay for four months up in the mountains, making sure his students are up to date with academic requirements. The wide open meadows of Lidder valley are much sought after by pastoralists in their annual migration](/media/images/04b-IMG_4994-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
సంచార ఉపాధ్యాయుడైన అలీ మొహమ్మద్ (ఎడమ) పర్వతాలపై నాలుగు నెలల పాటు ఉండి, తన విద్యార్థులు విద్యాపరంగా అవసరమైన విషయాలలో ఎప్పటికప్పుడు వెనకబడకుండా ఉండేలా చూసుకుంటాడు. పశుపోషకులు తమ వార్షిక వలసల కోసం లిద్దర్ లోయలోని విశాలమైన పచ్చికభూములకు వెళ్ళాలని కోరుకుంటారు
ఈ వెచ్చని జూన్ ఉదయాన తరగతి జరుగుతూ ఉంది - అలీ గడ్డి మీద కూర్చునివున్నాడు, అతని చుట్టూ 5-10 సంవత్సరాల వయస్సులోని పిల్లలు కూర్చొనివున్నారు. ఇంకో గంటలో, మధ్యాహ్నం 12 గంటలు అవుతుండగానే అతను ఇక్కడి మూడు గుజ్జర్ కుటుంబాల చిన్న పల్లె ఖలాన్‌లో జరుగుతోన్న తరగతిని ముగిస్తాడు. నదికి కొద్ది దూరంలో, కొంచెం ఎత్తు ప్రదేశంలో మట్టి పూసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడ నివాసముండే కొద్దిమందిలో దాదాపు అందరూ ఆరుబయటే ఉండి, వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బాటసారులను పలకరిస్తున్నారు. ఇక్కడున్న కుటుంబాలకు మొత్తం 20 ఆవులూ గేదెలూ, 50 మేకలూ గొర్రెలూ ఉన్నాయని పిల్లలు PARIతో చెప్పారు.
"ఈ ప్రదేశమంతా మంచు కప్పివుండటంతో బడి ఒక పది రోజులు ఆలస్యంగా మొదలయింది. నేను పది రోజుల క్రితం (జూన్ 12, 2023) ఇక్కడకు వచ్చాను," చెప్పాడతను.
ఖలాన్, లిద్దర్ హిమానీనదానికి వెళ్లే మార్గంలో, భూమికి దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఖలాన్కు మరో 15 కిలోమీటర్ల ఎత్తులో లిద్దర్ హిమానీనదం ఉంది. కొందరు స్థానిక యువకులతో కలిసి అలీ ఈ ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆకుపచ్చగా జీవం తొణికిసలాడుతూ ఉన్నాయి. జంతువులకు మేత పుష్కలంగా దొరుకుతుంది. గుజ్జర్, బకర్వాల్ కుటుంబాలు ఇప్పటికే నదీ తీరం వెంబడి ఉన్న ప్రదేశాలలో స్థిరపడ్డాయి.
"నేను మధ్యాహ్నం వేళల్లో అక్కడి పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తాను," నదికి అవతలి వైపున నాలుగు గుజ్జర్ కుటుంబాలు నివాసముండే సలార్ అనే చిన్న పల్లె వైపు చూపిస్తూ చెప్పాడతను. అవతలివైపుకు వెళ్ళడానికి అలీ, ఉరవడిగా ప్రవహిస్తోన్న ఆ నీటిపై ఉన్న ఒక చెక్క వంతెన మీదుగా వెళ్ళాలి.
![Left: Ali with the mud homes of the Gujjars in Khalan settlement behind him.](/media/images/05a-IMG_4948-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
![Right: Ajeeba Aman, the 50-year-old father of student Ejaz is happy his sons and other children are not missing school](/media/images/05b-IMG_4982-PD-The_travelling_teacher_of_.max-1400x1120.jpg)
ఎడమ: ఖలాన్లోని గుజ్జర్ల నివాసాలైన మట్టి ఇళ్ళ ముందు అలీ. కుడి: తన కొడుకులతో పాటు ఇతర పిల్లలకు కూడా బడి చదువులు తప్పిపోనందుకు సంతోషంగా ఉన్న ఇజాజ్ తండ్రి అజీబా అమన్ (50)
![Left: The Lidder river with the Salar settlement on the other side.](/media/images/6a-IMG_5006-PD-The_travelling_teacher_of_L.max-1400x1120.jpg)
![The green tent is the school tent. Right: Ali and two students crossing the Lidder river on the wooden bridge. He will teach here in the afternoon](/media/images/6b-IMG_5026-PD-The_travelling_teacher_of_L.max-1400x1120.jpg)
ఎడమ: నది ఒడ్డున నిల్చొని ఉన్న అలీ. అతని వెనుక సలార్ సెటిల్మెంట్ ఉంది. పచ్చగా ఉన్న ఆ డేరాలో బడి నడుస్తుంది. కుడి: చెక్క వంతెనపై లిద్దర్ నదిని దాటుతోన్న అలీ, మరో ఇద్దరు విద్యార్థులు. అతనిక్కడ మధ్యాహ్నం వేళల్లో పిల్లలకు పాఠాలు చెప్తాడు
ఇంతకుముందు ఈ రెండు చిన్న పల్లెలకూ కలిపి ఒకే బడి ఉండేదని స్థానికులు చెప్పారు. కానీ రెండేళ్ళ క్రితం ఒక మహిళ వంతెనపై జారిపోయి నీళ్ళల్లో పడి మరణించింది. ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రాథమిక తరగతులు చదివే పిల్లలను ఆ వంతెనను దాటనివ్వటంలేదు. అందుకు బదులుగా ఉపాధ్యాయుడే వంతెనను దాటి వెళ్ళాల్సివస్తోంది. "అందువలన గత రెండు వేసవికాలాల నుంచి నేను రెండు విడతలుగా పిల్లలకు పాఠాలు చెప్తున్నాను," అని అలీ వివరించాడు.
ఇంతకుముందున్న వంతెన నీటిలో కొట్టుకుపోవడంతో, అలీ సుమారు ఒక కిలోమీటరు దూరంలోని దిగువ ప్రవాహంపై ఉన్న మరో వంతెనను దాటవలసివస్తోంది. ఈరోజు అతన్ని తీసుకువెళ్ళడానికి అతని విద్యార్థులు అప్పటికే వచ్చి ఎదురుచూస్తున్నారు!
అలీ వంటి ప్రతి సంచార ఉపాధ్యాయులు నాలుగు నెలల కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారు. ఆ మొత్తం సమయానికి సుమారు రూ. 50,000 వరకూ సంపాదిస్తారు. వారమంతా అలీ సలార్‌లోనే ఉంటాడు. "నా తిండినీ, బసనూ నేనే చూసుకోవాలి. అందుకని ఇక్కడున్న మా బంధువులింట్లో ఉంటాను," అలీ వివరించాడు. "నేనొక గుజ్జర్‌ని, వీళ్ళు నా బంధువులు. నా సోదరుడు ఇక్కడే నివసిస్తుంటాడు, నేనతని కుటుంబంతో కలిసివుంటాను."
అలీ ఇల్లు అక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని అనంత్‌నాగ్ జిల్లా, హిలాన్ గ్రామంలో ఉంటుంది. వారాంతాలలో పట్టణానికి వెళ్ళినపుడు అతను తన భార్యనూ, బిడ్డనూ చూసివస్తాడు. అతని భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఆమె తన ఇంట్లోనూ చుట్టుపక్కలా ఉన్న పిల్లలకు చదువు (ట్యూషన్) చెప్తుంది. "నేను చిన్నబిడ్డగా ఉన్నప్పటినుంచే నాకు విద్యాబోధనలో ఆసక్తి ఉంది."
"ప్రభుత్వం చాలా మంచిపని చేసింది. అందులో భాగంగా ఉన్నందుకు, నా సముదాయానికి చెందిన పిల్లలకు చదువు నేర్పుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది," అన్నాడతను నదిని దాటడానికి చెక్క వంతెన వైపుకు ముందుకు అడుగులేస్తూ.
చిన్నారి విద్యార్థి ఇజాజ్ తండ్రి అజీబా అమన్(50) కూడా ఆనందంగా ఉన్నారు. "నా కొడుకు, నా సోదరుని కొడుకులు అందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. మా పిల్లలకు ఒక అవకాశం రావటం చాలా బాగుంది."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి