సుకుమార్ బిశ్వాస్ కొబ్బరికాయలమ్మే ఒక మామూలు వ్యాపారి కాదు. దాహంతో ఉన్న కొనుగోలుదారుల కోసం కొబ్బరికాయలను కొట్టేటపుడు కూడా పాటపై ఆయన ప్రేమ ఆగదు, "నేను ఆహారం లేకుండానైనా ఉండగలను గానీ పాడకుండా ఉండలేను." శాంతిపూర్‌లోని లొంకాపారా చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన డాబ్‌దాదూ (కొబ్బరికాయల తాతయ్య)గా సుపరిచితుడు.
ఈ 70 ఏళ్ళ వృద్ధుడు, పచ్చటి కొబ్బరికాయను కొట్టి అందులో స్ట్రా వేసి మీకు ఇస్తారు. మీరు నీరు తాగిన తర్వాత ఆ కాయను పగులగొట్టి అందులో ఉండే లేత కొబ్బరిని తోడి మీకు అందిస్తారు. ఈ పనులు చేస్తున్నంతసేపూ ఆయన జానపద గీతాలను పాడుతూనే ఉంటారు. లాలన్ ఫకీర్, సంగీతకారుడైన షా అబ్దుల్ కరీమ్, భబా ఖేపా వంటి ఆధ్యాత్మికవాదులు స్వరపరచిన గీతాలను ఆయన పాడుతుంటారు. తన జీవితానికి అర్థాన్ని ఆ పాటలలో కనుగొన్నానని చెప్పే ఆయన PARI కోసం ఒక గీతాన్ని ఉటంకిస్తూ, భావానువాదం చేశారు: సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం సత్యాన్ని చేరుకోగలం. ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం మనలో మనం నిజాయితీని పెంపొందించుకోవాలి. మనం కపటానికి దూరంగా ఉన్నపుడే ఇతరులను ప్రేమించగలుగుతాం."
ఆయన తన టోలీ (ఒక మూడు చక్రాల సైకిల్‌కు జోడించిన వ్యాన్) పై ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కూడా పాడుతూనే ఉంటారు. ఆయన పాట వినే, ఆయన వచ్చినట్టుగా ఆ ప్రాంతంలోనివారు తెలుసుకుంటారు.
"కొబ్బరికాయలను కొనకపోయినా కాసేపు నిలబడి నా పాటను వినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొనాల్సిన పనిలేదు. అమ్మకాలు జరగాలని నేనూ పెద్దగా ఆశించను. జరిగినంతవరకూ నాకు సంతోషమే," కొనేవాళ్ళకు కొబ్బరికాయలు అందిస్తూనే ఆయన ఈ మాటలన్నారు.




