రజిత, తన చిన్నతనంలో తన తండ్రి, తాతయ్యలు చిన్నపిల్లలకు శిక్షణనివ్వడాన్ని కిటికీలోంచి తొంగి చూసేది. వాళ్ళతో పాటు తనెందుకు లేదని ఆశ్చర్యపోయేది కూడా. ఆ చిన్నారి కళ్ళను మరీ ముఖ్యంగా తోలుబొమ్మలు ఆకర్షించాయి. ఆ పద్యాల ప్రత్యేకమైన లయను ఆమె చెవులు ఇష్టపడ్డాయి.

“తోలుబొమ్మలాటపై నాకున్న మక్కువను గమనించి, మా తాత నాకు పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు,” ముప్పై మూడేళ్ళ రజిత అన్నారు.

రజితా పులవర్, షర్నూర్‌లోని తన కుటుంబానికి చెందిన స్టూడియోలో, ఒక చెక్క బల్లపై కూర్చొని, తోల్‌పావకూత్తు తోలుబొమ్మపై ముఖ కవళికలను చెక్కుతున్నారు. ఆమె ముందున్న మేజాబల్లపై అరె, ఉలి, సుత్తి లాంటి రకరకాల ఇనుప పనిముట్లు ఉన్నాయి.

మధ్యాహ్న సమయం, స్టూడియోలో ప్రశాంతత నెలకొంది. బొమ్మలు తయారుచేసే సాలలో రజిత పక్కన గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ చప్పుడు మాత్రమే వినబడుతోంది. బయట, తోలుబొమ్మలు చెక్కడానికి ముందు తోలు పట్టాలు బాగా ఎండేందుకు విశాలమైన మిద్దె మీద ఆరబెట్టారు.

“ఆధునిక ఇతివృత్తాలపై మేమిచ్చే ప్రదర్శనల కోసం ఈ తోలుబొమ్మలు చేసున్నాను,” రజిత తను చేస్తున్న తోలుబొమ్మ గురించి చెప్పారు. తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట, భారతదేశంలోని మలబార్ తీరానికి చెందిన ఒక సంప్రదాయ కళారూపం. దీనిని భద్రకాళి దేవత వార్షిక ఉత్సవంలో, ఆలయ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు.

PHOTO • Megha Radhakrishnan
PHOTO • Megha Radhakrishnan

ఎడమ: సమకాలీన కాలానికి చెందిన తోలుబొమ్మ పాత్రతో రజిత. కుడి: తండ్రి రామచంద్రతో కలిసి తోలుబొమ్మను కదిలించటాన్ని చూపిస్తోన్న రజిత

రజిత తాతగారైన కృష్ణన్‌కుట్టి పులవర్, ఈ కళను ఆధునికీకరించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. దేవాలయాల ప్రాంగణాలు దాటి, దానికి మూలమైన రామాయణం మాత్రమే కాకుండా, మరిన్ని కథలకు వస్తువును సమకూర్చారాయన. (చదవండి: తమ కళను విస్తరించిన కేరళ తోలుబొమ్మలాట కళాకారులు ).

ఆయన మనవరాలు ఆయన అడుగుజాడలలో నడిచింది; తోలుబొమ్మలాట బృందంలో చేరిన మొదటి కళాకారిణి ఆమె. 2021లో సొంతంగా, మొట్టమొదటి తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట మహిళా బృందాన్ని కూడా ఆమె ఏర్పాటు చేశారు.

అంతవరకు చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది.

మలయాళం మాట్లాడే రజితకు, తనకు తెలియని తమిళ భాషలో ఉన్న లయబద్ధమైన పద్యాలపై పట్టు సాధించడం సవాలుగా మారింది. కానీ, వాటి అర్థం, ఉచ్చారణ మొదలైన వివరాలను ఆమె గ్రహించేంతవరకూ ఆమె తండ్రి, తాతయ్యలు ఆమెతో ఓపికగా వ్యవహరించారు. “మా తాతయ్య నాకు తమిళ వర్ణమాలను నేర్పటంతో మొదలుపెట్టి, నెమ్మదిగా పద్యాలను పరిచయం చేశారు.”

“పిల్లలమైన మా కోసం చాలా ఆసక్తికరమైన పద్యాలను అతను ఎంచుకునేవారు” రజిత గుర్తుచేసుకున్నారు. రామాయణంలో హనుమంతుడు రావణుడిని సవాలు చేసే సన్నివేశం, ఆమె తన తాతయ్య నుండి నేర్చుకున్న మొదటి శ్లోకం:

“అడా తడాత్తు చెయ్తా నీ
అంత నాధన్ దేవియే
విడ తాడాత్ పోమెడా
జలతి చూళి లాంగయే
వీనడాత్తు పోకుమో
ఎడా పోడా ఏ రావణా”

ఓ రావణా,
దుష్కార్యాలు చేసే నువ్వు
భూమిపుత్రికను చెరసాలలో నిర్బంధించావు
నా తోకతో ఈ లంకనంతా నాశనం చేస్తాను.
పోరా... రావణా… పో!

PHOTO • Megha Radhakrishnan

తన బృందంతో కలిసి ప్రదర్శననిస్తున్న రజిత

ఆమె కుటుంబంలోని అబ్బాయిలు ఆమెను ఉత్సాహంగా స్వాగతించారు; ముఖ్యంగా ఆమె సోదరుడు రాజీవ్ తనను చాలా ప్రోత్సహించారని రజిత తెలిపారు. “అందరూ మహిళలతో ఒక బృందాన్ని ప్రారంభించమని అతను నన్ను ప్రేరేపించాడు.”

దేవాలయాలలో ప్రదర్శన ఇవ్వడమనేది మహిళలకు అనేక పరిమితులున్న అంశం (ఇది ఇప్పటికీ కొనసాగుతోంది). కనుక, ప్రదర్శన ఇవ్వడానికి ఆమె సిద్ధమైనప్పుడు, తన కుటుంబంలోని కళాకార బృందంతో కలిసి, సమకాలీన వేదిక కోసం పనిచేయడం ప్రారంభించారు రజిత. అయితే మొదట్లో, ఆమె తెరవెనుక ఉండటానికే ఇష్టపడ్డారు.

“నేను సీత లాంటి స్త్రీ పాత్రలకు సంభాషణలు అందించాను ( రామాయణం ఆధునిక అనుసరణలలో). కానీ, తోలుబొమ్మలను ఆడించడం, లేదా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడే విశ్వాసం అప్పటికి నాకు రాలేదు,” ఆమె తెలిపారు. కానీ, పిల్లల కోసం తన తండ్రి నిర్వహించే కార్యశాలలలో పాల్గొనడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. “కార్యశాల జరుగుతున్న సమయంలో, నేను చాలామందితో కలిసిమెలసి మెలగాల్సి వచ్చింది. దాంతో, ప్రేక్షకుల ముందుకు రాగలనన్న గట్టి నమ్మకం నాకు కలిగింది.”

తోలుబొమ్మల తయారీలో కూడా రజిత ప్రావీణ్యం సంపాదించారు. “నేను కాగితంపై తోలుబొమ్మలను గీయడంతో ఆ పని ప్రారంభించాను. నా తల్లిదండ్రులు, సోదరుడే నాకు ఉపాధ్యాయులు,” అన్నారామె. “అలా నెమ్మదిగా తోలుపై నమూనాలను ఎలా గీయాలో, వాటికి ప్రాణం పోసే రంగులను ఎలా జోడించాలో కూడా నేర్చుకున్నాను.” రామాయణానికి చెందిన తోలుబొమ్మలు కొంత అతిశయించిన ముఖ కవళికలతో ఉంటాయి; సమకాలీన ప్రదర్శనల కోసం తయారుచేసే తోలుబొమ్మలు మాత్రం మరింత వాస్తవికంగా ఉంటాయి. “స్త్రీ వయసు ఆధారంగా దుస్తులు కూడా మారుతాయి – ఆమె వృద్ధురాలు అయితే, తోలుబొమ్మ చీరలో ఉంటుంది; ఆమె యువతి అయితే గనుక, టాప్-జీన్స్ ధరించవచ్చు,” రజిత వివరించారు.

రజితను ఆదరించి ప్రోత్సహించినవారిలో ఆమె కుటుంబానికి చెందిన మగవారు మాత్రమే లేరు. తోల్‌పావకూత్తు కళలో లింగ బేధాన్ని తొలగించడంలో మొదటి మెట్టుని, రజిత తన తాతయ్య నిర్వహించే శిక్షణా తరగతిలో చేరడానికి కొన్నేళ్ళ ముందే, ఆమె తల్లి రాజలక్ష్మి ఏర్పాటు చేశారు.

రజిత తండ్రి రామచంద్రను 1986లో వివాహమాడిన తరువాత, తోలుబొమ్మలను తయారుచేయడంలో ఆ కుటుంబంలోని కళాకారులకు రాజలక్ష్మి సహాయం చేయడం ప్రారంభించారు. అయితే, పద్య పఠనంలో గానీ, ప్రదర్శనలో పాల్గొనే అవకాశం గానీ ఆమెకు ఎప్పుడూ లభించలేదు. “రజిత ప్రయాణాన్ని చూసినప్పుడు, నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. నేను చిన్నతనంలో చేయలేనిది తను సాధించింది,” రాజలక్ష్మి గర్వంగా అన్నారు.

PHOTO • Courtesy: Krishnankutty Pulvar Memorial Tholpavakoothu Kalakendram, Shoranur
PHOTO • Courtesy: Krishnankutty Pulvar Memorial Tholpavakoothu Kalakendram, Shoranur

ఎడమ: చేతికి తొడిగే తోలుబొమ్మను చూపెడుతున్న రజిత, ఆమె సోదరుడు రాజీవ్. కుడివైపు: అభ్యాసంలో నిమగ్నమైన కళాకారిణులు

PHOTO • Megha Radhakrishnan
PHOTO • Megha Radhakrishnan

ఎడమ: తోలుబొమ్మలు తయారుచేస్తోన్న రాజలక్ష్మి (ఎడమ), అశ్వతి (మధ్య), రజిత. కుడి: సుత్తిని, ఉలిని ఉపయోగించి తోలు నుంచి బొమ్మను తయారుచేస్తోన్న రజిత

*****

తన సొంత బృందాన్ని – పెణ్ పావకూత్తు – ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, రజిత చేసిన మొదటి పని తన తల్లికి, వదిన అశ్వతికి ఆహ్వానం అందించడం.

అశ్వతికి మొదట్లో ఈ కళపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తానొక తోలుబొమ్మ కళాకారిణిగా మారుతుందని ఊహించలేదు కూడా. వివాహం చేసుకొని తోలుబొమ్మ కళాకారుల కుటుంబంలోకి వచ్చిన తరువాత, “నేను ఈ కళారూపాన్ని ఆనందించసాగాను,” అన్నారామె. కానీ, ఆచారవిధి ప్రకారం నడిచే తోలుబొమ్మలాట నెమ్మదిగా సాగుతుంది, కథను వివరించడంలో తోలుబొమ్మలను పెద్దగా ఆడించాల్సిన అవసరం ఉండదు. దాంతో, ఆమెకు ఈ కళను నేర్చుకోవడానికి ఆసక్తి కలగలేదుఅయితే, ఆమె భర్త రాజీవ్, అతని బృందం ఇచ్చే సమకాలీన తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఆమెలో ఆసక్తిని రేకెత్తించాయి; కళను నేర్చుకోవడానికి రజిత బృందంలో తాను కూడా చేరింది.

ఆ తరువాతి కాలంలో రామచంద్ర తన బృందంలో ఎక్కువమంది మహిళలను చేర్చుకోసాగారు. ఇది, ఇరుగు పొరుగిళ్ళలోని అమ్మాయిలను ఆహ్వానించి, ఒక సంపూర్ణ మహిళా తోలుబొమ్మలాట బృందాన్ని ఏర్పాటు చేయడానికి రజితను ప్రేరేపించింది. మొదటి బృందంలో ఎనిమిది మంది సభ్యులు – నివేదిత, నిత్య, సంధ్య, శ్రీనంద, దీప, రాజలక్ష్మి, అశ్వతి – ఉన్నారు.

“మా నాన్నగారి మార్గదర్శకత్వంలో, మేం వీరికి శిక్షణా తరగతులను ఏర్పాటు చేశాం. ఈ అమ్మాయిలలో చాలామంది బడులకు వెళ్ళాల్సిరావడంతో, వారి సెలవులప్పుడు, లేదా ఖాళీ సమయంలో శిక్షణా తరగతులను నిర్వహించేవాళ్ళం. మహిళలు తోలుబొమ్మలాట ప్రదర్శించకూడదని సంప్రదాయాలు చెబుతున్నప్పటికీ, సదరు కుటుంబాలు మాకు ఎంతో సహకరించాయి,” రజిత వివరించారు.

ఇలా కలిసి ప్రదర్శనలిచ్చే క్రమంలో, ఈ మహిళలూ  బాలికలూ ఒక సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్నారు. “మేం ఒక కుటుంబంలా ఉంటాం. పుట్టినరోజులు, ఇతర కుటుంబ కార్యక్రమాలను కలిసి జరుపుకుంటాం,” అన్నారు రజిత.

వారి మొదటి ప్రదర్శన డిసెంబర్ 25, 2021న జరిగింది. “మేం ఎంతో కష్టపడ్డాం, సిద్ధపడేందుకు చాలా సమయాన్ని వెచ్చించాం,” అన్నారు రజిత. తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాటను ఒక సంపూర్ణ మహిళా బృందం ప్రదర్శించడం అదే మొదటిసారి. కేరళ ప్రభుత్వ 'సమమ్' కార్యక్రమం కింద నిర్వహించే ఈ ప్రదర్శనకు పాలక్కాడ్‌లోని ఆడిటోరియం వేదికగా నిలిచింది.

PHOTO • Courtesy: Krishnankutty Pulvar Memorial Tholpavakoothu Kalakendram, Shoranur
PHOTO • Megha Radhakrishnan

ఎడమ: ఒక ప్రదర్శనలో భాగంగా, ఫోటో తీసుకుంటోన్న పెణ్ పావకూత్తు తోలుబొమ్మలాట బృందం. అందరూ మహిళలతో కూడుకొన్న మొట్టమొదటి తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట బృందం వారిదే. కుడి: తోలుబొమ్మలను పట్టుకొనివున్న బృందం సభ్యులు

చలికాలమైనప్పటికీ, నూనె దీపాల వేడిలో ప్రదర్శననివ్వడం వారికి కష్టంగా ఉంటుంది. “మాలో కొందరికి బొబ్బలు వచ్చాయి," అన్నారు రజిత. "తెర వెనుక చాలా వేడిగా ఉంటుంది మరి." అయితే, వారంతా ఒక విధమైన సంకల్ప భావనతో ఉన్నారని ఆమె అన్నారు, "ప్రదర్శన విజయవంతమైంది."

సమమ్ (మలయాళంలో 'సమానం' అని అర్థం) కార్యక్రమం, ఔత్సాహిక మహిళా కళాకారులకు ఒక వేదికను అందిస్తుంది. దీనిని పాలక్కాడ్‌లోని మహిళా-శిశు సంరక్షణ విభాగం నిర్వహిస్తుంది. రజిత బృందం ఇచ్చిన ప్రదర్శన విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితంలో మహిళల పోరాటాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. అలాగే, వారి హక్కులను బలోపేతం చేసే మార్గాలను కూడా సూచించింది.

“ఈ అసమానతలతో పోరాడడానికి మేం మా కళను ఉపయోగిస్తున్నాం. ఈ తోలుబొమ్మల నీడలు మా పోరాటాలకు ప్రతిబింబాలు," అన్నారు రజిత. "మేం కొత్త ఆలోచనలను, నేపథ్యాలను అన్వేషించాలనుకుంటున్నాం, ముఖ్యంగా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి. అలాగే, స్త్రీల దృక్కోణం నుండి రామాయణ కథనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాం.”.

తన సొంత బృందాన్ని స్థాపించిన తరువాత, తోలుబొమ్మలను ఆడించడమే కాకుండా మరిన్ని నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలుపెట్టారు రజిత. స్క్రిప్టులపై పని చేయడం, గొంతులను, సంగీతాన్ని రికార్డ్ చేయడం, తోలుబొమ్మల తయారీ, వాటిని ఆడించడం, బృంద సభ్యులకు శిక్షణనివ్వడం - ప్రదర్శనలలోని ఈ పనులన్నీ ఆవిడే నిర్వహిస్తున్నారు. “ప్రతి ప్రదర్శన కోసం మేం చాలా సిద్ధపడాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మహిళా సాధికారతపై ఇచ్చిన ప్రదర్శన కోసం, మహిళలకు అందుబాటులో ఉన్న పథకాలు, అవకాశాలకు సంబంధించిన డేటాను సేకరించడానికి మహిళా-శిశు సంక్షేమ శాఖకు వెళ్ళాను. తరువాత, స్క్రిప్ట్, సంగీతం కోసం బయటి నుంచి సహాయాన్ని తీసుకున్నాను. రికార్డింగ్ పూర్తయ్యాక, తోలుబొమ్మలను తయారుచేయడం, వాటిని ఆడించడాన్ని సాధన చేయడం మొదలుపెట్టాం. ఎవరైనా తనకు వీలైనంత దోహదం చేయడానికి, తోలుబొమ్మలకు ఆకృతినివ్వడానికి, వేదికపై వాటిని ఆడించడంపై పని చేయడానికి ఇక్కడ ప్రతి సభ్యురాలికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

PHOTO • Megha Radhakrishnan
PHOTO • Megha Radhakrishnan

ఎడమ: ప్రదర్శననిస్తోన్న అశ్వతి (కుడి), రజిత. కుడి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోలుబొమ్మ

PHOTO • Megha Radhakrishnan
PHOTO • Megha Radhakrishnan

ఎడమ: పెణ్ పావకూత్తు ప్రదర్శన తెరవెనుక దృశ్యం. కుడి: తెర వెనుకనున్న ప్రదర్శనకారులు, ఆడిటోరియంలోని ప్రేక్షకులు

వారి ప్రదర్శనలు నెమ్మదిగా ఒకటి నుండి 40కి పైగా పెరిగాయి. ఇప్పుడు వారిది 15 మంది సభ్యుల బృందం. వారు తమ మాతృ సంస్థ, కృష్ణన్‌కుట్టి మెమోరియల్ తోల్‌పావకూత్తు కళాకేంద్రం సహకారంతో ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. కేరళ ఫోక్‌లోర్ అకాడమీ నుంచి రజిత 2020లో యువ ప్రతిభా అవార్డును అందుకున్నారు.

మొదట్లో, తన మహిళా బృందానికి పురుషులకు చెల్లించినంత మొత్తాన్ని ఇవ్వలేదని రజిత తెలిపారు. కానీ, మెల్లమెల్లగా పరిస్థితులు మారాయి. “చాలా సంస్థలు, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు, మమ్మల్ని సమానంగా చూస్తున్నాయి. పురుష కళాకారులకు ఇచ్చే వేతనాలను చెల్లిస్తున్నాయి,” అన్నారామె.

మరో గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, ఒక ఆలయంలో ప్రదర్శనకు ఆహ్వానం అందుకోవడం. “ఇది సంప్రదాయ ప్రదర్శన కానప్పటికీ, ఒక ఆలయం మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు సంతోషంగా ఉంది,” అన్నారు రజిత. ఆమె ఇప్పుడు కంబ రామాయణం శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఇవి సంప్రదాయ తోల్‌పావకూత్తు లో పఠించే ఇతిహాసపు తమిళ పాఠాంతరం. తాను నేర్చుకున్నాక, వాటిని ఆమె తన బృంద సభ్యులకు కూడా నేర్పుతారు. అంతేకాకుండా, భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నారామె. “పవిత్ర ఆలయ ప్రాంగణాల్లో మహిళా తోలుబొమ్మలాట కళాకారులు కంబ రామాయణం లోని శ్లోకాలను పఠించే రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. మా అమ్మాయిలను అందుకు సన్నద్ధం చేస్తున్నాను.”

కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ ( MMF ) ఫెలోషిప్ మద్దతు ఉంది .

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Sangeeth Sankar

Sangeeth Sankar is a research scholar at IDC School of Design. His ethnographic research investigates the transition in Kerala’s shadow puppetry. Sangeeth received the MMF-PARI fellowship in 2022.

Other stories by Sangeeth Sankar
Photographs : Megha Radhakrishnan

Megha Radhakrishnan is a travel photographer from Palakkad, Kerala. She is currently a Guest Lecturer at Govt Arts and Science College, Pathirippala, Kerala.

Other stories by Megha Radhakrishnan
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi