తూర్పు భారతదేశంలో ఉన్న ఒక బీచ్‌లో అప్పుడు సమయం ఉదయం 3 గంటలు. ఒక ఫ్లాష్‌లైట్ సాయంతో రామోలు లక్ష్మయ్య ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్ల కోసం వెతుకుతున్నారు. ఒక పొడవాటి కర్రనూ, ఒక బాల్చీనీ పట్టుకొనివున్న ఆయన జాలారిపేటలో ఉన్న తన ఇంటి నుంచి ఆర్కె బీచ్ వరకూ ఉన్న ఇసుక దారిలో నెమ్మదిగా నడుస్తున్నారు.
ఆడ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి సముద్రపు ఒడ్డుకు వస్తాయి. వాలుగా ఉన్న తీరప్రాంతంతో ఉండే విశాఖపట్నం ఇసుక బీచ్‌లు ఈ తాబేళ్ళు గూడు కట్టుకోవటానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. 1980ల ప్రారంభం నుండి ఈ తాబేళ్ళు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అయితే, ఉత్తరాన మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా తీరంలో ఈ తాబేళ్ళకు దేశంలోనే అతిపెద్ద సామూహిక స్థావరాలు ఉన్నాయి. ఆడ తాబేళ్ళు ఒకేసారి 100-150 గుడ్లను పెడతాయి, వాటిని ఇసుక గుంటలలో లోతుగా పాతిపెడతాయి.
“ఎక్కడైనా ఇసుక వదులుగా ఉందంటే, అక్కడ తల్లి తాబేలు గుడ్లను పెట్టిందనటానికి అది సూచన," తేమగా ఉన్న ఇసుకలో కర్రతో జాగ్రత్తగా వెతుకుతూ వివరించారు లక్ష్మయ్య. లక్ష్మయ్యతో పాటు జాలరి సముదాయానికి (ఆంధ్రప్రదేశ్‌లో ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు) చెందిన కర్రి జల్లిబాబు, పుట్టియపాన యెర్రన్న, పుల్లా పోలారావు కూడా ఉన్నారు. సముద్ర తాబేళ్ళ పరిరక్షణ ప్రాజెక్టు కింద ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ గుడ్లను సంరక్షించటంలో భాగంగా 2023లో వీరంతా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ (ఎపిఎఫ్‌డి)తో కలిసి గార్డులుగా పార్ట్-టైమ్ పని చేస్తున్నారు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్ళను (లెపిడోకెలిస్ ఆలివేసియా), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్‌లో 'హానికి లోనయ్యే జాతులు'గా వర్గీకరించారు. భారతదేశ వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 (1991లో సవరించబడినది) షెడ్యూల్-I క్రింద రక్షణనిచ్చారు.
తీరప్రాంత విధ్వంసం వంటి అనేక అంశాల వల్ల తాబేళ్ళు ప్రమాదంలో ఉన్నాయి. “ప్రత్యేకించి గూళ్ళు కట్టుకునే ఆవాసాల వద్ద అభివృద్ధి పేరుతోనూ, అలాగే వాతావరణ మార్పుల వలన సముద్ర ఆవాసాలను కోల్పోవడం వల్ల కూడా,” అని విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రాజెక్ట్ శాస్త్రవేత్తగా పనిచేస్తోన్న యజ్ఞపతి అడారి చెప్పారు. సముద్రపు తాబేళ్ళను వాటి మాంసం కోసం, గుడ్ల కోసం కూడా వేటాడతారు.















