ముప్పై ఏళ్ళు దాటిన గణేశ్ పండిత్ కొత్త దిల్లీలోని పాత యమునా వంతెన, లోహా పుల్‌లో నివసించే అతి పిన్న వయస్కుడు. 'ప్రధాన స్రవంతి ' ఉద్యోగాలకు వెళ్ళేదుకు ఇష్టపడే తన సముదాయానికి చెందిన యువకులు స్విమ్మింగ్ కోచ్‌లుగానూ, పొరుగున ఉన్న చాందినీ చౌక్‌లోని రిటైల్ షాపుల్లోనూ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
దిల్లీ గుండా ప్రవహిస్తోన్న యమునా నది, గంగా నదికి ఉన్న ఉపనదులలో అతి పొడవైనది, నీటి పరిమాణంపరంగా రెండవ అతిపెద్దది (ఘాఘరా తర్వాత).
పండిత్ యమునా నదిపై ఫోటో షూట్‌లను నిర్వహిస్తారు, కర్మకాండలు నిర్వహించాలని కోరుకునే వ్యక్తులను నది మధ్య వరకు పడవలో చేరవేస్తారు. "విజ్ఞానం విఫలమైన చోట, విశ్వాసం పని చేస్తుంది," అని అతను వివరించాడు. అతని తండ్రి ఇక్కడ పూజారిగా ఉన్నారు. అతను, అతని ఇద్దరు సోదరులు "చిన్నవాళ్ళుగా ఉండగా జమున [యమున]లో ఈత నేర్చుకున్నారు." పండిత్ సోదరులు ఫైవ్ స్టార్ హోటళ్ళలో లైఫ్‌గార్డులుగా పనిచేస్తున్నారు.
![](/media/images/02a-IMG_20190505_162903697-SS-Row_row_row_.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG_20190505_161403444-SS-Row_row_row_.max-1400x1120.jpg)
ఎడమ: దిల్లీలోని లోహా పుల్ బ్రిడ్జ్ నివాసి, యమునా నదిలో పడవ నడిపే గణేశ్ పండిత్. కుడి: వంతెనపై ఉన్న చరిత్రను గుర్తుకుతెస్తోన్న సైన్‌బోర్డ్
![](/media/images/03a-IMG_20190505_162932025-SS-Row_row_row_.max-1400x1120.jpg)
![](/media/images/03b-IMG_20190505_164834849-SS-Row_row_row_.max-1400x1120.jpg)
ఎడమ: గణేశ్ పండిత్ పడవ ఆగివున్న యమునా నది రేవులోని వృక్షజాలం, జంతుజాలం, మురికి. కుడి: నదికి దగ్గరగా ఉన్న కొండపై తంత్ర మంత్ర కార్యక్రమాల్ నిర్వహించడానికి ప్రజలు తీసుకువచ్చే సీసాల ఖాళీ రేపర్లు. గణేశ్ పండిత్ వంటి పడవ నడిపేవారు కొంత రుసుము తీసుకొని ఈ వ్యక్తులను రవాణా చేస్తారు
ఇదేమీ లాభదాయకమైన, గౌరవప్రదమైన వృత్తి కాదు కాబట్టి ఈ రోజుల్లో జనం తమ కుమార్తెను ఒక పడవ నడిపే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడంలేదని ఆ యువకుడు చెప్పారు. అలా ఎందుకో అతను అర్థం చేసుకోలేరు, ఒప్పుకోరు కూడా "నేను ప్రజలను పడవలో అటూ ఇటూ తిప్పి రోజుకు 300-500 రూపాయలు సంపాదిస్తాను." నది మీద ఫోటో, వీడియో షూట్‌లను ఏర్పాటు చేయడంలో సహాయపడటం ద్వారా తాను మంచి మొత్తాన్నే సంపాదిస్తున్నట్లు పండిత్ జోడించారు.
దశాబ్దకాలానికి పైగా ప్రయాణీకులను రవాణా చేస్తున్న గణేశ్, నదీ జలాల కాలుష్యం గురించి విచారపడుతున్నారు. వర్షాకాల జలాలు నదిలోని మురికిని బయటకు పంపిన తర్వాత మాత్రమే, సెప్టెంబర్‌లో, నది శుభ్రపడుతుందని ఆయన చెప్పారు.
దేశ రాజధాని ప్రాంతం గుండా యమున కేవలం 22 కిలోమీటర్లు (లేదా కేవలం 1.6 శాతం) ప్రవహిస్తుంది. కానీ 1,376 కిలోమీటర్ల నదిలోని మొత్తం కాలుష్యంలో దాదాపు 80 శాతం వరకు వ్యర్థాలను ఆ చిన్న విస్తీర్ణంలోనే వదులుతున్నారు. చదవండి: యమునలో 'చనిపోయిన చేపలు తాజాగా ఉన్నప్పుడు'
అనువాదం: సుధామయి సత్తెనపల్లి