తమిళనాడులోని వడనమ్మేలి గ్రామంలో అప్పుడే చీకటిపడుతోంది. కారియక్కూత్తు ప్రదర్శన కోసం శ్రీ పొన్నియమ్మన్ తెరుక్కూత్తు మండ్రమ్ సభ్యులు సిద్ధపడుతున్నారు. ఎప్పటిలాగే, ఇది అనేక పాత్రలు, అనేక దుస్తుల మార్పిడులతో సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకూ సాగే ప్రదర్శన.

తెరవెనుక, 33 ఏళ్ళ శర్మి మేకప్ వేసుకోవడం ప్రారంభించారు. ఆమె తన స్వంత లిప్‌స్టిక్‌ను తయారుచేసుకోవడానికి నూనెలో ఎర్రటి పొడిని కలుపుతూ, అరిదారమ్ (మేకప్) గురించి కొన్ని ప్రాథమిక నియమాలను వివరిస్తున్నారు: “ అరిదారమ్ పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. ఇది పాత్రను బట్టి, పాత్ర నిడివిని బట్టి కూడా భిన్నంగా ఉంటుంది.

తమిళనాడులోని పురాతన కళారూపాలను ప్రదర్శించే నాటక సంస్థలలో ఒకటిగా భావించే శ్రీ పొన్నియమ్మన్ తెరుక్కూత్తు మండ్రమ్‌లోని 17 మంది సభ్యుల బృందంలో ఉన్న నలుగురు ట్రాన్స్‌జెండర్ కళాకారులలో శర్మి ఒకరు. "నా తరానికి ముందు కూడా తెరుక్కూత్తును ప్రదర్శించేవారు," అన్నారు శర్మి. “ఇది ఎంత పాతదో నేను ఖచ్చితంగా చెప్పలేను."

తెరుక్కూత్తు, లేదా వీధి నాటకం సాధారణంగా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల కథల ఆధారంగా రాత్రిపూట ప్రదర్శనలనిస్తుంది. తెరుక్కూత్తు సీజన్ సాధారణంగా పంగుణి (ఏప్రిల్), పురట్టాసి (సెప్టెంబర్) నెలల మధ్యకాలంలో వస్తుంది. ఈ కాలంలో శర్మి, ఆమె బృందం ఆదివారం తప్ప దాదాపు ప్రతి రోజూ ప్రదర్శనలు ఇస్తారు. ఆ విధంగా ఒక నెలలో దాదాపు 15-20 ప్రదర్శనల వరకూ ఉంటాయి. ప్రతి ప్రదర్శనకు రూ. 700-800 చొప్పున, అంటే నెలకు ఒక్కో ఆర్టిస్టుకు దాదాపు రూ. 10,000-15,000 వరకూ ఆదాయం వస్తుంది.

అయితే, సీజన్ ముగిసిన తర్వాత కళాకారులు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం వెతకవలసి వస్తుంది. ఆచార ఆధారిత తెరుక్కూత్తుకు మరో రూపమైన కారియక్కూత్తును అంత్యక్రియల సమయంలో మాత్రమే ప్రదర్శిస్తారు. తిరువళ్ళూరు జిల్లాలోని పట్టరైపెరుంబుదూర్‌లోని తన డ్రామా కంపెనీ ఇంటికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడనమ్మేలిలో కారియక్కూత్తు ప్రదర్శనకు సిద్ధపడుతూ, “ఒకరి మరణం మాకు వారానికి ఒకటి లేదా రెండు ప్రదర్శనలను ఇస్తుంది,” అన్నారు శర్మి.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

వడనమ్మేలి గ్రామంలో తెరుకూత్తు ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధపడుతోన్న శర్మి. సాధారణంగా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలలోని కథల ఆధారంగా తెరుక్కూత్తు అనే వీధి నాటకాల ప్రదర్శనలివ్వడాన్ని ఆమె ప్రారంభించి ఇప్పటికి నాలుగేళ్ళు అవుతోంది

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

తన స్వంత లిప్స్‌స్టిక్‌ను తయారుచేసుకోవడానికి నూనెలో ఎర్రటి పొడిని కలుపుతూ ఆమె, అరిదారమ్ (మేకప్) గురించి కొన్ని ప్రాథమిక నియమాలను వివరిస్తున్నారు: 'అరిదారమ్ పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. ఇది పాత్రను బట్టి, పాత్ర నిడివిని బట్టి కూడా భిన్నంగా ఉంటుంది'

కూత్తు కోసం ‘వేదిక’ సిద్ధమయింది. చనిపోయినవారి ఇంటి బయట గుడ్డతో ఒక గుడారాన్ని వేశారు, వీధిలో ఒక నల్లని పట్టాను పరిచారు. ఇంటి ముందు ఉంచిన చనిపోయినవారి ఫోటో, చుట్టూ అమర్చిన దీపాల మినుకు మినుకుమనే కాంతిని ప్రతిఫలిస్తోంది. వీధిలో అమర్చిన బెంచీలు, పాత్రలు, బల్లలు అక్కడి భోజన ఏర్పాట్లను సూచిస్తున్నాయి.

“గ్రామమంతా నిశ్శబ్దంలో మునిగిపోయినప్పుడు, మేం వాయిద్యాలను సరిగ్గా శ్రుతి చేసి, శ్రవణీయంగా ఉండేలా సిద్ధం చేయడం మొదలుపెడతాం. మేకప్ వేసుకోవడం కూడా ప్రారంభిస్తాం," అని చెప్పారు శర్మి. రాత్రి 10 గంటలకు ముడి (కిరీటం. ప్రదర్శన కోసం ధరించే ఆభరణాలలో ఒకటి)కి పూసై (నైవేద్యం) సమర్పించడంతో కూత్తు మొదలవుతుంది. “ పూసై ని అర్పించటం నాటకానికి గౌరవం ఇవ్వటం. ఈ నాటకం విజయవంతం కావాలని, కళాకారులు క్షేమంగా తమ ఇళ్ళకు చేరుకోవాలని మేం ప్రార్థిస్తాం,” అని ఆమె వివరించారు.

ఆ సాయంత్రపు నాటకమైన మిన్నలొలి శివ పూజ మహాభారతంలోని పాండవ రాకుమారుడైన అర్జునన్, అతని ఎనిమిది మంది భార్యల గురించిన కథ ఆధారంగా చేస్తున్నది. "నేను మొత్తం ఎనిమిది పాత్రలనూ చేయగలను [కానీ] నేనీ రోజు బోగవతి పాత్రను వేస్తున్నాను," అంటూ ఇతిహాసం లోని పాత్రల పేర్లనూ, వాటి లక్షణాలలోని మెలికలనూ చెప్పారు శర్మి.

మిన్నలొలి (మెరుపు) అర్జునన్ (అర్జునుడు) అష్ట భార్యలలో ఒకరని ఆమె వివరించారు. రాజు మేగరాసన్ (మేఘాలకు రాజు), రాణి కొడిక్కళాదేవి కుమార్తె అయిన ఈమెను ఐదేళ్ళ వయసులో అర్జునన్‌కు ఇచ్చి పెళ్ళిచేస్తారు. యుక్తవయసుకు వచ్చిన తర్వాత ఆమె తన భర్త గురించి తల్లిదండ్రులను అడుగుతుంది. తన భర్తను కలుసుకోవటానికి ముందు 48 రోజుల పాటు శివపూసై (శివ పూజ) చేయమని వాళ్ళు ఆమెకు చెప్తారు. మిన్నలొలి ఆ ఆచారాన్ని 47 రోజులపాటు భక్తిగా పాటిస్తుంది. 48వ రోజున ఆమె ఇంకా పూసై (పూజ) చేయకముందే అర్జునన్ ఆమెను కలవడానికి వస్తాడు. ఆమె అతన్ని కలుసుకోకుండా, పూసై అయ్యేవరకూ వేచి ఉండమని అర్థిస్తుంది; కానీ అర్జునన్ వినిపించుకోడు. ఈ నాటకం ఈ సంఘటన చుట్టూ ఎన్నో మలుపులు మెలికలు తిరిగి, శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేసి మిన్నలొలి, అర్జునన్‌లు తిరిగి కలిసే సంతోషకరమైన ముగింపుని ఇవ్వడంతో ముగుస్తుంది.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: ప్రదర్శన కోసం ధరించే ఆభరణాలలో ఒకటైన ముడి(కిరీటం)కి నైవేద్యం సమర్పించడంతో రాత్రి 10 గంటలకు ప్రదర్శన మొదలవుతుంది. కుడి: తెరుక్కూత్తుకు సిద్ధమైన వేదిక

శర్మి తన పెదవులపై మయి (నల్ల సిరా)ని పూయడం ప్రారంభించారు. "నేను పెదవులపై మయి ని పూయడం చూసి, చాలామంది అదే చేయడం మొదలెట్టారు," అని ఆమె చెప్పారు. “ఇప్పుడు నేనిలా తయారవడం (మేకోవర్) వలన నువ్వు అమ్మాయివి కదా అని జనం నన్ను అడుగుతుంటారు. [నాకు అదే కావాలి] నేను తయారై బయటకు వెళ్ళినప్పుడు, మగవాళ్ళు నా పైనుంచి చూపు తిప్పుకోకూడదు.”

శర్మికి "మేకప్ అంటే అంత మక్కువ". ఆమె కొన్ని సంవత్సరాల క్రితం ఆరు నెలల బ్యూటీషియన్ కోర్సును కూడా పూర్తి చేశారు. “కానీ ఇంతకుముందు [లింగ పరివర్తన] మహిళలకు మేకప్ చేయడానికి నన్ను అనుమతించేవారుకాదు."

శర్మి తన అరిదారమ్‌ ను పూర్తిచేయడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. చీర కట్టుకోవటంతో బోగవతిగా ఆమె 'రూపు' పూర్తయింది. "చీర కట్టుకోవడాన్ని నాకెవరూ నేర్పలేదు. నేనే నేర్చుకున్నాను. నా ముక్కూ చెవులూ కూడా నేనే కుట్టుకున్నాను. ఇవన్నీ నా అంతట నేనే నేర్చుకున్నాను," అన్నారామె.

"కేవలం శస్త్రచికిత్స మాత్రమే డాక్టర్ చేసింది. శస్త్రచికిత్స చేయటమెలాగో తెలిసుంటే, అది కూడా నేనే చేసుకునేదాన్ని. కానీ అందుకోసం నేను 50,000 రూపాయలు ఆసుపత్రిలో ఖర్చుపెట్టాల్సివచ్చింది," అంటూ తనకు 23 ఏళ్ళ వయసులో చేయించుకున్న జెండర్ స్థిరీకరణ చికిత్స గురించి ఆమె చెప్పారు.

"ఒక ట్రాన్స్ మహిళ చీర కట్టుకోవటం ఇంకా మామూలు విషయం కాలేదు. ఇతర మహిళలు చేసినట్టుగా మేం చీర కట్టుకొని వీధుల వెంట నడవటం అంత సులభం కాదు," అని ఆమె పేర్కొన్నారు. అయితే, చాలా తరచుగా ట్రాన్స్ మహిళలు ఎదుర్కొనే బెదిరింపులు, వేధింపుల వంటివాటి నుంచి ఆమె వృత్తి ఆమెకు కొంత రక్షణను ఇస్తోంది. "నేనొక రంగస్థల కళాకారిణిని కావటం వలన ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు."

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

స్వంతంగా మేకప్ చేసుకోవడానికి శర్మికి సుమారు గంటన్నర సమయం పట్టింది (ఎడమ). 'నేను పెదవులపై మయి [నల్ల సిరా]ని పూయడం చూసి, చాలామంది అదే చేయడం మొదలెట్టారు,' అన్నారామె. ఇతర పాత్రధారులు మేకప్ చేసుకోవటంలో ఆమె సహాయం చేస్తారు

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ప్రదర్శన కోసం సిద్ధపడుతూ మేకప్ చేసుకుంటోన్న కళాకారులు

*****

"నేను తిరువళ్ళూర్ జిల్లా [తమిళనాడు], ఈక్కాడు గ్రామం నుంచి వచ్చాను," తన టొప్పా (విగ్)లోంచి దువ్వెనను పోనిచ్చి దువ్వుతూ అన్నారు శర్మి. చిన్నతనంలోనే తనకు పాడటంలోనూ, డైలాగులు చెప్పటంలోనూ సహజమైన అభిరుచి ఉండేదనే విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. "చిన్నతనంలోనే నేను రంగస్థలంతో ప్రేమలో పడ్డాను. నేను [దానికి సంబంధించిన] అన్నిటినీ- మేకప్, దుస్తులు - ప్రేమించాను. కానీ ఒకరోజున నేను కూడా ఇలా రంగస్థల కళాకారిణిని అవుతానని మాత్రం ఎన్నడూ ఊహించలేదు."

ఆమె తన రంగస్థల ప్రయాణం 'రాజా రాణి నృత్యం'తో ఎలా ప్రారంభమైందో వివరించారు. ఇది నృత్యం, తాళవాయిద్యాల కలయికతో కూడిన ఒక వీధి ప్రదర్శన. “ఆ తర్వాత, దాదాపు పదేళ్ళపాటు నేను సమకాలీన కథలతో తెరుక్కూత్తు రంగస్థల అనుకరణలలో నటించాను. నేను తెరుక్కూత్తును ప్రదర్శించడం ప్రారంభించి దాదాపు నాలుగేళ్ళు అవుతోంది.”

తెరవెనుక, పాత్రధారులు అరిదారమ్ చేసుకోవటం మొదలుపెట్టారు; శర్మి తన జ్ఞాపకాలను పంచుకోవటం కొనసాగించారు. "నన్ను నా కుటుంబం అమ్మాయిగా పెంచింది. అది చాలా సహజంగా ఉండేది," ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె ఫొర్త్ స్టాండర్డ్‌లో ఉండగా తాను ట్రాన్స్‌జెండర్‌ననే గుర్తింపు ఆమెకు తెలిసింది. "కానీ దీన్ని ఇతరులు తెలుసుకునేట్టు చేయటమెలాగో నాకు సరిగ్గా తెలిసేదికాదు."

ఇది సులభమైన ప్రయాణం కాదని ఆమె గుర్తించింది. బడిలో వేధింపులు భరించలేక పదో తరగతి తర్వాత చదువుకు స్వస్తి చెప్పింది. “ఆ సమయంలో తిరుడా తిరుడి అనే సినిమా విడుదలైంది. తరగతిలోని అబ్బాయిలు నా చుట్టూ చేరి, వండార్‌కుళలీ పాట [ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురించి అసభ్యకరమైన ప్రస్తావనలు చేసే ప్రసిద్ధిచెందిన పాట] పాడుతూ నన్ను ఆటపట్టించేవారు. ఆ తర్వాత ఇక నేను బడికి వెళ్ళలేదు.”

“నేను నా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను [నేను బడికి వెళ్ళడం ఎందుకు మానేశాననే సంగతి]. అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. కాబట్టి నేనేమీ మాట్లాడలేదు,” అని ఆమె చెప్పారు. "నేను నా కౌమారప్రాయంలో ఇంటి నుండి పారిపోయాను, 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను."

ఇంటికి తిరిగి రావడమనేది అంత సులభమేమీ కాదు. ఇంటికి దూరంగా ఉన్న సమయంలో, ఆమె చిన్ననాటి ఇల్లు తీవ్రంగా దెబ్బతిని నివాసయోగ్యంగా లేదు. దాంతో ఆమె ఉండటానికి ఒక అద్దె ఇల్లు వెతుక్కోవలసివచ్చింది. "నేను ఈ ఊర్లోనే పెరిగాను, కానీ నేనొక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని కావటం వలన నాకు ఇల్లు అద్దెకు దొరకలేదు," చెప్పారు శర్మి. "మేం ఇంట్లో సెక్స్ వర్క్‌లో మునిగిపోతామని వాళ్ళు [ఇళ్ళ యజమానులు] అనుకుంటారు." చివరకు ఆమె గ్రామ కేంద్రానికి దూరంగా ఉండే ఒక అద్దె ఇంట్లో చేరవలసివచ్చింది.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

'చిన్నతనంలోనే నేను రంగస్థలంతో ప్రేమలో పడ్డాను. నేను ప్రతిదాన్నీ - మేకప్, దుస్తులు - ప్రేమించాను. కానీ ఒకరోజున నేను కూడా ఇలా రంగస్థల కళాకారిణిని అవుతానని మాత్రం ఎన్నడూ ఊహించలేదు,' అంటారు శర్మి

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

'నన్ను నా కుటుంబం అమ్మాయిగా పెంచింది. అది చాలా సహజంగా ఉండేది,' అని ఆమె గుర్తుచేసుకున్నారు. బడిలో వేధింపులను భరించలేక ఆమె 10వ తరగతి తర్వాత చదువును కొనసాగించలేదు. శర్మి ప్రస్తుతం 57 ఏళ్ళ తన తల్లి (కుడి)తోనూ, 10 మేకలతోనూ కలిసివుంటున్నారు. తెరుక్కూత్తు లేని నెలల్లో ఆ మేకలే ఆమె ఆదాయ వనరు

ఆది ద్రావిడర్ [షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసి ఉంది] సముదాయానికి చెందిన శర్మి, ప్రస్తుతం 57 ఏళ్ళ తన తల్లితోనూ, 10 మేకలతోనూ కలిసివుంటున్నారు. తెరుక్కూత్తు లేని నెలల్లో ఆ మేకలే ఆమె ఆదాయ వనరు.

"తెరుక్కూత్తు ఒక్కటే నాకున్న వృత్తి. అది గౌరవప్రదమైన వృత్తి కూడా. ప్రజల మధ్య హుందాతనంతో ఉండటం నాకు సంతోషంగా ఉంటుంది," అన్నారామె. తెరుక్కూత్తు లేని సమయాల్లో [అక్టోబర్ నుంచి మార్చి మధ్య వరకు], బతకటానికి మేం మేకలను అమ్ముకుంటాం. నాకు పిచ్చయ్ (అడుక్కోవటం)కు వెళ్ళటం గానీ సెక్స్ వర్క్ చేయటం కానీ ఇష్టంలేదు."

నర్సింగ్‌లో కూడా శర్మికి చాలా ఆసక్తి ఉంది. "నా మేకలు జబ్బుపడినప్పుడు వాటికి నేనే చికిత్స చేస్తాను. అవి ప్రసవించేటపుడు నేనే వాటి మంత్రసానిని అవుతాను," అన్నారామె. "కానీ నేను వృత్తినైపుణ్యం ఉన్న నర్సును కాలేను."

*****

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి విదూషకుడు పాడటం, పరిహాసాలాడటంతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. అప్పుడు, ముఖ్య భూమికను పోషించే కళాకారుడు వేదికపైకి వస్తాడు. మేగరాసన్, కొడిక్కళాదేవిలు తమ పరిచయ గీతాలను ప్రదర్శించి, నాటకం ప్రారంభాన్ని ప్రకటిస్తారు

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఇక్కడ ప్రదర్శిస్తోన్న మిన్నలొలి శివ పూజ నాటకం మహాభారతంలోని పాండవ రాకుమారుడు అర్జునన్, అతని అష్టభార్యల కథను అధారంగా చేసుకున్నది. శర్మి బోగవతి పాత్రను పోషిస్తున్నారు

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

శర్మి, ఇతర కళాకారులు నాటక ప్రదర్శన సమయంలో సుమారు 10 సార్లు దుస్తులు మార్చి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు

పరిహాసాలు, పాటలు, విలాప గీతాలతో కథ చురుగ్గా సాగుతుంది. విదూషకుడైన మునుసామి, తన మాటలతోనూ చేతలతోనూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటారు, ప్రజలను కన్నీళ్ళు వచ్చేంతగా నవ్విస్తారు. శర్మి, ఇతర కళాకారులు నాటకం జరుగుతున్న సమయంలో సుమారు 10 సార్లు దుస్తులు మార్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నాటకం జరుగుతున్నంతసేపూ, అప్పుడప్పుడూ జరిపే కొరడా ఝుళిపింపులు వేదికపై జరిగే కార్యక్రమాలకు కొంత నాటకీయతను జోడించడంతోపాటు ప్రేక్షకుల నిద్రను దూరంచేసే పని చేస్తాయి.

తెల్లవారుజామున 3:30 గంటలకు, కోపంతో ఉన్న అర్జునన్‌ ద్వారా వితంతువులా జీవించమని శపించబడిన మిన్నలోలి వేదికపై కనిపిస్తుంది. నాటక రచయిత రూబన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. అతని ఒప్పారి (విలాప గీతం) ప్రదర్శన చాలామంది ప్రేక్షకులను ఏడ్పిస్తుంది. రూబన్ పాడుతున్నప్పుడు కొంతమంది అతని చేతుల్లోకి డబ్బులు విసిరారు. ఆ సన్నివేశం ముగిసిన తర్వాత, విదూషకుడు కొంత హాస్య ఉపశమనాన్ని అందించడానికి తిరిగి వేదికపైకి వస్తాడు.

సూర్యుడు ఉదయించబోతున్నాడు. అప్పుడే మిన్నలొలి అర్జునన్‌తో తిరిగి ఒకటయింది. రూబన్ మరణించిన వ్యక్తిని పేరుతో పిలిచి, వారి ఆశీర్వాదాలను కోరతారు. ఆ తర్వాత అతను ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రదర్శన ముగిసినట్టుగా ప్రకటిస్తారు. అప్పటికి సమయం ఉదయం 6 గంటలు, అంతా సర్దుకోవాల్సిన సమయం.

కళాకారులంతా ఇళ్ళకు వెళ్ళటానికి తయారవుతున్నారు. వారు అలసిపోయినప్పటికీ, ఎటువంటి సంఘటనలూ లేకుండా విజయవంతంగా ప్రదర్శన ముగిసినందుకు సంతోషంగా ఉన్నారు. "కొన్నిసార్లు జనం మమ్మల్ని అల్లరి పెడతారు [ప్రదర్శన జరుగుతున్న సమయంలో]. ఒకసారి ఒకతను నా ఫోన్ నంబర్ ఇవ్వలేదని నన్ను వెనక నుంచి కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు," శర్మి చెప్పారు. "మేం ట్రాన్స్ మహిళలమని తెలిసినప్పుడు, మగవాళ్ళు కొన్నిసార్లు మాతో చాలా మొరటుగా ప్రవర్తిస్తారు, సెక్స్ కోసం కూడా డిమాండ్ చేస్తారు. కానీ మేం కూడా మనుషులమేనని వాళ్ళు తెలుసుకోరు. కేవలం ఒక్క క్షణం పాటైనా మేం ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళు ఆగి అలోచిస్తే, వాళ్ళు ఇదంతా చేయనే చేయరు."

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

నాటకంలో జోకులు, విలాప గీతాలు కూడా ఉంటాయి. కృష్ణుడి పాత్రలో నటించిన గోబి (కుడి)తో కలిసి నటిస్తోన్న శర్మి

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ప్రదర్శన అంతిమ ఘట్టంలో మిన్నలొలి పాత్రను పోషించిన రూబన్ (ఎడమ), అర్జునన్ పాత్రను పోషించిన అప్పన్. నాటకం ముగిశాక నూనె ఉపయోగించి తన మేకప్‌ను తొలగిస్తోన్న శర్మి

అరిదారమ్ అంత తొందరగా వదిలేది కాదు, అందుకని కళాకారులు దానిపై నూనె రాసి, ఒక తువ్వాలుతో తుడుస్తున్నారు. "మేం ప్రయాణం చేయాల్సిన దూరాన్ని బట్టి, మా ఇళ్ళకు చేరేసరికి ఉదయం 9 లేదా 10 గంటలవుతుంది. నేను ఇంటికి వెళ్ళగానే వంటచేసి, తినేసి, నిద్రపోతాను. మధ్యాహ్నం లేస్తే తింటాను. లేదంటే సాయంత్రం వరకూ నిద్రపోతాను," చెప్పారు శర్మి. “[కూత్తు సీజన్‌లో] మీరు నిరంతరాయంగా ప్రదర్శన ఇచ్చినప్పటికీ మీరు ఎప్పటికీ అలసిపోరు. ప్రదర్శనల మధ్య సుదీర్ఘ విరామాలు ఉండటం వలన ఉత్సవం లేని సమయాల్లో ప్రదర్శన చేయడం మరింత అలసిపోయేలాచేస్తుంది.”

విశ్రాంతి తీసుకోవడం గానీ, తక్కువ ప్రదర్శనలు చేయడం గానీ తనకు సాధ్యం కాదని శర్మి పేర్కొన్నారు. తెరుక్కూత్తు కళాకారుల ప్రయాణంలో వయస్సు కీలక అంశం: చిన్న వయస్సు, ఆరోగ్యం ఉన్న కళాకారులకు పని దొరికే అవకాశాలు మెరుగవుతాయి, ప్రతి ప్రదర్శనకు ప్రామాణికంగా రూ.700-800 లభిస్తాయి. వయసు మళ్ళటం మొదలయినప్పుడు, వారికి చాలా తక్కువ ధరకు - ప్రదర్శనకు దాదాపు రూ. 400-500 - తక్కువ ప్రదర్శనలు వస్తాయి.

"రంగస్థల కళాకారులుగా మా మొహాలు అందంగా, మా శరీరాల్లో పటుత్వం ఉన్నంత వరకే మాకు ఉపాధి లభిస్తుంది. నేను వాటిని [రూపం, గౌరవం, ఉపాధి] పోగొట్టుకోక ముందే, నివసించడానికి ఒక ఇంటిని [కట్టుకోవడానికి సరిపడా] సంపాదించాలి. మమ్మల్ని మేం పోషించుకోవడానికి ఒక చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే వయసుమళ్ళిన తర్వాత కూడా బ్రతకగలం!"

ఈ కథనానిని మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Poongodi Mathiarasu

Poongodi Mathiarasu is an independent folk artist from Tamil Nadu and works closely with rural folk artists and the LGBTQIA+ community.

Other stories by Poongodi Mathiarasu
Photographs : Akshara Sanal

Akshara Sanal is an independent photojournalist based in Chennai, and interested in documenting stories around people.

Other stories by Akshara Sanal
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

Other stories by Sangeeta Menon
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli