మా పళ్‌సుండే గ్రామంలో ఏడు రకాల తెగలకు చెందిన ప్రజలున్నారు, వారిలో ఎక్కువమంది వర్లీ తెగకు చెందినవారు. నేను ఈ ఏడు తెగల సముదాయాలకు చెందిన భాషలను నేర్చుకున్నాను: వర్లీ, కోయి మహదేవ్, కాత్కరీ, మా ఠాకూర్, క ఠాకూర్, ధోర్ కోయి, మల్హర్ కోయి. ఇది నేను పుట్టిన ప్రదేశం, నా కర్మభూమి కావటంతో వాటిని నేర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాలేదు; నా చదువు కూడా ఇక్కడే సాగింది.

నేను భాలచంద్ర రామ్‌జీ ధన్‌గరే, మొఖాడాలోని జిల్లా పరిషద్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.

"నువ్వు ఏ భాషనైనా వినగానే త్వరగా పట్టేసుకుని దాన్లో మాట్లాడటం మొదలుపెట్టేస్తావు," అని నా స్నేహితులు నాతో తరచుగా అంటుంటారు. నేను ఏ సముదాయంవారి దగ్గరకు వెళ్ళినా, అక్కడి ప్రజలు నన్ను వారి సొంత నేలకు చెందినవాడిగా చూస్తూ, తమ సొంత భాషలో మాట్లాడుతుంటారు.

వీడియో చూడండి: వర్లీ విద్యకు ఒక గొప్ప దోహదం

మా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న పిల్లలతో కలసిమెలసి మెలగేటప్పుడు, వాళ్ళు తమ పాఠశాల విద్య నేర్చుకునే సమయంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారని నేను తెలుసుకున్నాను. ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఒక స్పెషల్ గ్రేడ్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక నిబంధన ఉంది. ఈ గ్రేడ్ ఎందుకిస్తారంటే, అనుదిన జీవితంలో ఆదివాసులు ఉపయోగించే స్థానిక భాషను ఈ ఉపాధ్యాయులు నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ మొఖాడాలో వర్లీని ఎక్కువగా మాట్లాడతారు. అనేకమంది పిల్లలు బడిలో ఈ భాషనే మాట్లాడతారు. వాళ్ళకు మనం ఆంగ్లాన్ని బోధించాలంటే, ఆ మాటకు మరాఠీ పదాన్ని ముందు పరిచయం చేసి, ఆ తర్వాత వర్లీలో ఆ పదం గురించి వివరించాలి. అ తర్వాతనే ఆ పదాన్ని ఆంగ్లంలో బోధిస్తాం.

పరిస్థితి ఏమంత సుళువుగా ఉండదు కానీ ఇక్కడి పిల్లలు చాలా తెలివైనవారు, కష్టపడే స్వభావం ఉన్నవారు. ప్రమాణ భాష అయిన మరాఠీని వాళ్ళు త్వరగా అలవరచుకుంటే, వారితో కలిసి సంభాషించటం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, మొత్తం మీద ఇక్కడి విద్యా స్థాయి అది సాగాల్సినంత వేగంగా సాగటంలేదు. అదే ఇప్పటి అవసరం. ఇక్కడి జనాభాలో దాదాపు 50 శాతం మంది ఇంకా చదువురానివారిగానే ఉన్నారు, ఇక్కడి అభివృద్ధి కూడా సాపేక్షికంగా వెనకబడే ఉంది.

తరగతి గదిలోకి 1 నుండి 5 తరగతుల విద్యార్థుల కోసం సంప్రదాయక కాత్కరీ పాటను తీసుకువచ్చిన ఉపాధ్యాయులు భాలచంద్ర ధన్‌గరే, ప్రకాశ్ పాటిల్

ఈ ప్రాంతంలో 1990ల వరకూ 10వ తరగతికి మించి చదివినవారు దాదాపు ఎవరూ ఉండేవారు కాదు. కొత్త తరం నెమ్మదిగా ఒక వ్యవస్థీకృత విద్యను అభ్యసించడం ప్రారంభించింది. 1వ తరగతిలో 25 మంది వర్లీ విద్యార్థులు చేరితే, వారిలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే 10వ తరగతికి చేరుకున్నారు. బడి మానేసినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎనిమిది మందిలో కూడా 5-6 మంది మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతికి చేరుకునే సరికి ఇంకా ఎక్కువమంది విద్యార్థులు చదువు మానేయటంతో చివరకు 3-4 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాల చదువును ముగించగలిగారు.

కళాశాల చదువు ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో, తాలూకా స్థాయిలో సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రాంతంలో అంతకుమించిన చదువు ఏమీ లేకపోవటంతో విద్యార్థులు తదుపరి విద్య కోసం ఠానే, నాసిక్ లేదా పాల్‌ఘర్ వంటి నగర ప్రాంతాలకు వెళతారు. ఫలితంగా, ఈ తాలూకాలో కేవలం మూడు శాతం మంది మాత్రమే కళాశాల చదువును కలిగి ఉన్నారు.

వర్లీ సముదాయంలో విద్యా రేటు ప్రత్యేకించి తక్కువగా ఉంది, దానిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేం గ్రామాలకు వెళ్ళి, ప్రజలతో వారి స్వంత భాషలోనే సంభాషించడం ద్వారా కూడా వారితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక నమ్మకాన్ని పెంపొందించేందుకు మరింత కృషి చేస్తున్నాం.

ఈ డాక్యుమెంటేషన్ రూపకల్పనలో సహాయం చేసినందుకు AROEHAN కు చెందిన హేమంత్ శింగడేకు PARI ధన్యవాదాలు తెలియజేస్తోంది.

ఇంటర్వ్యూ: మేధా కాళే

భారతదేశంలో హానికి లోనవుతోన్న, అంతరించిపోతోన్న భాషలను డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న PARI అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్‌లో ఈ కథనం ఒక భాగం.

వర్లీ భారతదేశంలోని గుజరాత్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగర్ హవేలీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలలో నివసిస్తున్న వార్లీ లేదా వర్లీ ఆదివాసీలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. యునెస్కో వారి అట్లాస్ ఆఫ్ లాంగ్వేజెస్, వర్లీని భారతదేశంలో హానికి లోనవుతోన్న భాషలలో ఒకటిగా జాబితా చేసింది.

మహారాష్ట్రలో మాట్లాడే వర్లీ భాషను డాక్యుమెంట్ చేయటం మా లక్ష్యం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Bhalchandra Dhanagare

Bhalchandra Dhangare is a school teacher at the Zilla Parishad Primary School in Mokhada of Palghar district.

Other stories by Bhalchandra Dhanagare
Editor : Siddhita Sonavane

Siddhita Sonavane is Content Editor at the People's Archive of Rural India. She completed her master's degree from SNDT Women's University, Mumbai, in 2022 and is a visiting faculty at their Department of English.

Other stories by Siddhita Sonavane
Video : Siddhita Sonavane

Siddhita Sonavane is Content Editor at the People's Archive of Rural India. She completed her master's degree from SNDT Women's University, Mumbai, in 2022 and is a visiting faculty at their Department of English.

Other stories by Siddhita Sonavane
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli