ఏప్రిల్ 30, 2023న, హిమాలయలలోని ధౌలాధార్ శ్రేణిలోని ధర్మశాల పట్టణం తన మొదటి స్వాభిమాన యాత్రను నిర్వహించుకుంది.
‘ఈ ఇల్లు నీకు, నాకు, అతనికి, ఆమెకి, వారికి, వారి కోసం’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకుని, ప్రజలు (క్వీర్ కమ్యూనిటీ వ్యక్తులు, మద్దతుదారులు) ప్రధాన మార్కెట్ నుంచి ధర్మశాలలోని టిబెట్ ప్రజల స్థిరనివాసమైన మెక్‌లోడ్‌గంజ్‌లో ఉన్న దలైలామా ఆలయం వైపుకు నడిచారు. తర్వాత ఈ యాత్ర ధర్మశాల పట్టణంలో రద్దీగా ఉండే కొత్వాలీ బజార్లో కొనసాగింది. ఇది LGBTQIA+ (ఎల్జిబిటిక్యుఐఎ+) సముదాయానికి మద్దతు తెలుపుతూ ధర్మశాలలో ఏర్పాటైన తొలి బహిరంగ సభ. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచీ, చిన్న పట్టణాలనుంచీ వచ్చిన అనేకమంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు
"మేం అజీబ్ (విలక్షణ) అనే పదాన్ని సగర్వంగా ఉపయోగిస్తున్నాం" అని హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, స్వాభిమాన యాత్ర నిర్వాహకుడు డాన్ హసర్ చెప్పారు. “Queernessని (విలక్షణతను) వివరించడానికి మేం ఆంగ్ల పదాలను వాడతాం. కానీ హిందీ, ప్రాంతీయ భాషల మాండలికాల సంగతేంటి? విలక్షణతను(Queerness), స్వేచ్ఛగా చరించడాన్ని (Fluidity) గురించి మాట్లాడటానికి మేం ప్రాంతీయ మాండలికాలలో పాటలనూ కథలనూ ఉపయోగిస్తాం," అని 30 ఏళ్ళ డాన్ వివరించారు.
"అతి తక్కువ సమయంలోనే దేశం నలుమూలల నుండి - దిల్లీ, చండీగఢ్, కొల్కతా, ముంబైలతో పాటు రాష్ట్రంలోని చిన్న పట్టణాల నుండి కూడా - దాదాపు 300 మంది జనం ఈ యాత్రలో పాల్గొనటానికి వచ్చారు. స్వాభిమాన యాత్రలో పాల్గొనటానికి సిమ్లా నుంచి వచ్చిన 20 ఏళ్ళ విశ్వవిద్యాలయ విద్యార్థి ఆయుష్, “ఇక్కడ (హిమాచల్ ప్రదేశ్‌లో) దీని (విలక్షణంగా ఉండటం) గురించి ఎవరూ మాట్లాడరు,” అన్నాడు. బడిలో ఉన్న సమయంలో ఆయుష్ బాత్రూమ్కి వెళ్లేందుకు ఇబ్బందిపడేవారు. “నా తరగతిలోని అబ్బాయిలు నన్ను ఆటపట్టించేవారు, వేధించేవారు. నేను ఆన్లైన్లో ఈ సముదాయాన్ని కనుక్కున్న తర్వాత ఎప్పటికంటే కూడా సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తులతో కలిసి ఉండే అవకాశం నాకు లభించింది." అంటూ ఆయుష్ వివరించారు..
ఒక ప్రొఫెసర్‌ను సలహాదారుగా తీసుకుని, కళాశాలలో బహిరంగ చర్చా కూటములను నిర్వహించి, ఈ విషయాలను చర్చలోకి తీసుకురావడానికి ఆయుష్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు జెండర్, లైంగికత (sexuality)ల గురించి తెలుసుకోవడానికి వచ్చి, తమ సందేహాలను తీర్చుకోవడానికో, లేదా పంచుకోవడానికో ఉండిపోతారు.
























