2009-10 నుంచి, మినాఖాఁ-సందేశ్‌ఖాలీ బ్లాక్‌లోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది కార్మికులు, ర్యామింగ్ మాస్ పరిశ్రమలో తొమ్మిది నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పనిచేసిన తరువాత సిలికోసిస్‌తో అకాల మరణం చెందారు.
కార్మికులు ఊపిరి పీల్చుకున్నప్పుడు సిలికా ధూళి, ఊపిరితిత్తుల అల్వియోలార్ సంచులలోకి వెళ్ళి, క్రమంగా అవి బిరుసుగా అయ్యేలా చేస్తుంది. సిలికోసిస్ మొదటి లక్షణాలు - దగ్గు, ఊపిరి అందకపోవడం, ఆ తర్వాత బరువు తగ్గడం, చర్మం నల్లబడటం. క్రమంగా ఛాతీ నొప్పి, శారీరక బలహీనత ఏర్పడతాయి. తరువాతి దశలలో, రోగులకు నిరంతరం ఆక్సిజన్ సహాయం అవసరం అవుతుంది. సిలికోసిస్ రోగులలో సాధారణంగా మరణానికి కారణం- ఆక్సిజన్ అందక గుండె ఆగిపోవడం.
సిలికోసిస్ అనేది కోలుకోలేని, నయం చేయలేని, మెల్లమెల్లగా వృద్ధి చెందే వృత్తి సంబంధంగా వచ్చే వ్యాధి, ఇది న్యుమోకోనియోసిస్ నిర్దిష్ట రూపాన్ని సూచిస్తుంది. వృత్తిసంబంధిత వ్యాధి నిపుణుడు డాక్టర్ కునాల్ కుమార్ దత్తా మాట్లాడుతూ, "సిలికోసిస్ ఉన్న రోగులు క్షయవ్యాధి బారిన పడే అవకాశం 15 రెట్లు ఎక్కువగా ఉంది," అన్నారు. దీనిని సిలికో-క్షయ లేదా సిలికోటిక్ టిబి అంటారు.
అయితే గత రెండు దశాబ్దాలుగా పనుల అవసరం ఎంతగా ఉందంటే, పని వెతుక్కుంటూ అక్కడికి వలస వెళ్ళే పురుషుల సంఖ్య పెరుగుతూ ఉంది. 2000లో, గోవాల్‌దహ్ గ్రామానికి చెందిన 30-35 మంది కూలీలు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్టీ లోని ర్యామింగ్ మాస్ ప్రొడక్షన్ యూనిట్‌లో పని చేసేందుకు వెళ్లారు. కొన్ని సంవత్సరాల తరువాత, మినాఖాఁ బ్లాక్‌కు చెందిన గోవాల్‌దహ్, దేవీతల, ఖరీబారియా, జయగ్రామ్ వంటి గ్రామాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రైతులు బారాసాత్‌లోని దత్తపుకుర్‌లోని ఒక యూనిట్‌లో పనికి వెళ్ళారు. అలాగే 2005-2006లో సుందరీఖాలీ, సర్‌బేరియా, బాటిదహ, ఆగర్‌హాటి, జెలియాఖాలీ, రాజ్‌బారీ, ఝూప్‌ఖాలీ గ్రామాల రైతులు సందేశ్‌ఖాలీ బ్లాక్ 1, 2లలో పనికి వెళ్ళారు. అదే కాలంలో, ఈ బ్లాకులలో పని చేసే కార్మికులు జామూరియాలోని ర్యామింగ్ మాస్ యూనిట్‌కు వెళ్ళారు.
"మేం బాల్ మిల్లు [ఒక రకమైన గ్రైండర్] ఉపయోగించి స్ఫటిక రాయినుంచి సన్నని పొడిని, అలాగే క్రషర్ యంత్రాన్ని ఉపయోగించి గోధుమ గింజల నుంచి సెమోలినా (బొంబాయి రవ్వ)ను, చక్కెర పొడిని తయారు చేస్తాం," అని ఝూప్‌ఖలీకి చెందిన అమయ్ సర్దార్ చెప్పారు. “పనిచేసే చోట మీ ముందు చేయి దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేనంత ధూళి ఉంటుంది. ఆ దుమ్మంతా మా మీద పడుతుంది,” చెప్పారతను. దాదాపు రెండేళ్ళపాటు పనిచేసిన తర్వాత 2022 నవంబర్‌లో అమయ్‌కు సిలికోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఇకపై బరువులను ఎత్తలేడు. “నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధిని వెతుక్కుంటే, ఈ వ్యాధి నన్ను పట్టుకుంది,” అని అతను చెప్పారు.
2009లో వచ్చిన తీవ్రమైన ఐలా తుఫాను సుందరవనాలలోని వ్యవసాయ భూమిని నాశనం చేయడం వల్ల వలసలు మరింత పెరిగాయి. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.