అది వేడిగా, ఎండగా ఉన్న మార్చి నెల మధ్యాహ్న సమయం. ఔరాపానీ గ్రామానికి చెందిన వయోజనులు చిన్నగా, తెల్లగా కనిపిస్తోన్న చర్చి లోపల గుమిగూడారు. అయితే వారిని అక్కడికి తీసుకొచ్చింది నైతిక ఒత్తిడి కాదు.
నేల మీద గండ్రంగా కూర్చొనివున్న ఆ బృందానికి ఉమ్మడిగా ఒక ముఖ్యమైన సమస్య ఉంది - వారు దీర్ఘకాలిక రక్తపోటు సమస్యలతో - అది ఎక్కువగా కావచ్చు, తక్కువగా కూడా కావచ్చు - బాధపడుతున్నారు. దాంతో వారు తమ రక్తపోటును పరీక్ష చేయించుకోవడానికి నెలకు ఒకసారి అక్కడ కలుస్తారు. తమ మందుల కోసం ఎదురుచూస్తూ, వివిధ విషయాలపై ముచ్చటించుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు.
"నాకు ఇలా అందర్నీ కలవడానికి రావడమంటే ఇష్టం, ఎందుకంటే నేనిక్కడ నా బాధలను పంచుకోవచ్చు," అందరూ ప్రేమగా రూపీ బాయి అని పిలుచుకునే రూపీ బఘేల్ చెప్పారు. 53 ఏళ్ళ రూపీ గత ఐదేళ్ళుగా ఇక్కడికి వస్తున్నారు. తన జీవనం కోసం రైతు పనిపై ఆధారపడే ఈ బైగా ఆదివాసీ, ఆ ఆదాయానికి తోడుగా అడవి నుండి సేకరించిన వంటచెరకు, మహువా వంటి కలపేతర అటవీ ఉత్పత్తులపై (NTFP) ఆధారపడతారు. బైగాలు ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహాలు (PVTG)గా జాబితా చేయబడ్డారు. అవురాపానీ అని కూడా పిలిచే ఔరాపానీ గ్రామంలో బైగా సముదాయానికి చెందిన జనాభా ఎక్కువగా ఉంది.
బిలాస్‌పూర్ జిల్లాలోని కోట బ్లాక్‌లో ఉన్న ఈ గ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని అచానక్‌మార్-అమర్‌కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్ (AABR)కు దగ్గరలో ఉంది. “నేను అమ్మడానికి తయారుచేసే ఝాడూల[చీపుర్లు] కోసం వెదురును సేకరించేందుకు అడవికి వెళ్ళేదాన్ని. కానీ నేనిపుడు ఎక్కువ దూరాలు నడవలేకపోతున్నా కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను,” అధిక రక్తపోటు వలన వచ్చే అలసట తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఫూల్సోరి లక్డా వివరించారు. అరవైల వయసులో ఉన్న ఆమె ఇప్పుడు మేకలను చూసుకుంటూ, పగటిపూట ఆవు పేడను సేకరిస్తూ ఇంటిపట్టున ఉంటున్నారు. చాలామంది బైగాలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు.








