నాగరాజ్ బండన్ తన ఇంట్లో వండే రాగి కలి వాసనను గుర్తుతెచ్చుకున్నారు. చిన్నపిల్లాడిగా ఉండగా ఆయన దాని కోసం ప్రతి రోజూ ఎదురుచూసేవాడు.
ఐదు దశాబ్దాల తర్వాత, రాగి కలి (రాగి పిండితో చేసే వంటకం) అంతకు ముందులా అసలు లేదు. "ఇప్పుడు మనకు లభిస్తోన్న రాగి ఇంతకుముందు ఉన్నంత సువాసనగా గానీ రుచిగా గానీ ఉండటంలేదు," అంటూ, ఇప్పుడు రాగి కలిని కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇరుల (తమిళనాడులో షెడ్యూల్డ్ తెగల కింద జాబితా అయివుంది) సముదాయానికి చెందిన నాగరాజ్ నీలగిరులలోని బొక్కాపురమ్ గూడేనికి చెందినవారు. ఆయన రాగుల వంటి చిరుధాన్యాల మధ్య పెరిగినవారు. ఆయన తల్లిదండ్రులు రాగులు, చోళమ్ (జొన్నలు), కంబూ (సజ్జలు) సామై (సామలు) వంటివాటిని సాగుచేశారు. కొన్ని కిలోల చిరుధాన్యాలను కుటుంబం తినటం కోసం పక్కన పెట్టి, మిగిలినవాటిని అమ్మకం కోసం ఉంచేవారు.
పెడ్డవాడై, వ్యవసాయం చేపట్టిన నాగరాజ్, తన తండ్రికి వచ్చిన దిగుబడి కంటే తన కాలానికి వస్తోన్న దిగుబడి చాలా తక్కువగా ఉండటాన్ని గమనించారు. "మాకు కేవలం తినటానికి మాత్రమే సరిపోయేంత [రాగులు] వస్తాయి, కొన్నిసార్లు అన్నికూడా రావు," అని ఆయన PARIతో చెప్పారు. తనకున్న రెండెకరాల పొలంలో రాగులను పండించడాన్ని కొనసాగించిన ఆయన, అందులో చిక్కుళ్ళు, వంకాయల వంటి కూరగాయలను అంతరపంటలుగా వేశారు.
ఇతర రైతులు కూడా ఈ మార్పును గమనించారు. తన తండ్రికి 10-20 బస్తాల రాగుల దిగుబడి వచ్చేదని మారి చెప్పారు. అయితే, తన రెండెకరాల పొలం నుంచి ఇప్పుడు కేవలం 2-3 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోందని ఈ 45 ఏళ్ళ రైతు చెప్పారు.
నీలగిరులలో 1948-49లో ఉన్న 1,369 హెక్టార్ల రాగుల సాగు 1998-99 నాటికి 86 హెక్టార్లకు తగ్గిపోయినట్లు చూపిస్తోన్న అధికారిక సంఖ్యలు నాగరాజ్, మారిల అనుభవాలలో ప్రతిబింబిస్తున్నాయి.
చివరగా తీసిన పంటల గణన (2011) ప్రకారం, జిల్లాలో చిరుధాన్యాల సాగు కేవలం ఒక హెక్టారు భూమిలోనే సాగుతోంది.











