ఐదుగురు సభ్యులున్న సుశీల కుటుంబం తమ చిన్న ఇంటి వరండాలో కూర్చుని, ఆమె తీసుకువచ్చే ‘జీతం’ కోసం ఎదురుచూస్తూ ఉంది. అది సుశీల రెండు ఇళ్ళలో ఇంటి సహాయకురాలుగా పనిచేసి తెచ్చే 5,000 రూపాయలు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విద్యాపీఠ్ బ్లాక్‌లో ఉండే అమరా బస్తీలో ఉన్న తన ఇంట్లోకి 45 ఏళ్ళ సుశీల అడుగు పెట్టేటప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలయింది.
"మా అమ్మ రెండు ఇళ్ళల్లో గిన్నెలు తోమి, ఇల్లు తుడిచి నెలకు 5,000 రూపాయలు సంపాదిస్తోంది," సుశీల కొడుకు 24 ఏళ్ళ వినోద్ కుమార్ భారతి అన్నారు. "ప్రతి నెలా ఒకటో తేదీన, అంటే ఈ రోజున, ఆమెకు ఆ డబ్బులు చేతికి వస్తాయి. అదృష్టం బాగుండి పని దొరికిన రోజుల్లో మా నాన్న ఒక ఎలక్ట్రీషియన్‌కు వైరింగ్ పనిలో సహాయకుడిగా పనిచేస్తాడు. ఇవి తప్ప మాకు ఒక నిలకడకలిగిన ఆదాయ వనరు ఇంకేమీ లేదు. నేను కూలి పనులు చేస్తాను. మేమందరం కలిసి నెలకు సుమారు 10-12,000 రూపాయలు సంపాదిస్తాం. అంచేత, బడ్జెట్‌లోని 12 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పరిమితితో మాకేమిటి సంబంధం?"
“కొన్నేళ్ళ క్రితం వరకు మేం MNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005) కింద పని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పని లేదని అంటున్నారు," డిజిటల్‌కి మారకముందు 2021 వరకు ఎంట్రీలు ఉన్న తన కార్డ్‌ని మాకు చూపిస్తూ అన్నారు సుశీల. వారణాసి, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం.
గత రెండేళ్ళలో తమకు MGNREGA పథకం కింద కనాకష్టంగా ఒక 30 రోజులు పని దొరికిందని సుశీల భర్త 50 ఏళ్ళ సత్రూ చెప్పారు. "మేం మరింత పని కోసం ప్రధాన్‌ను అడిగినప్పుడు, బ్లాక్ ఆఫీసుకు వెళ్ళి పని కోసం అడగమని మాకు చెప్పారు," అన్నారాయన.
సుశీల అమరచక్ గ్రామంలోని ఇంటిలో సత్రు ఇద్దరు సోదరుల కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. మొత్తం మీద 12 మందితో కూడిన ఈ ఉమ్మడి కుటుంబం ఒకే చూరు కింద నివసిస్తోంది.
"నేను 2023 నుండి NREGA కింద పనిచేసిన 35 రోజుల చెల్లింపుల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను," అని ఆ సోదరులలో ఒకరి భార్య పూజ (42) చెప్పారు. "నా భర్త గత నెలలో చనిపోయాడు, ఎటునుంచీ ఆర్థిక సహాయం లేని నాకు ముగ్గురు చిన్న కొడుకులు ఉన్నారు," అని ఆమె అన్నారు. " శుకర్ హై ఆస్‌పాస్ కాలనీ మే ఘర్ కా కామ్ మిల్ జాతా హై [అదృష్టం ఏంటంటే, ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలనీలో నాకు ఇంటి పనులు దొరుకుతాయి]," అన్నారామె. " వర్నా సర్కార్ కే భరోసే తో హమ్ దో వక్త్ కా ఖానా భీ నహీ ఖా పాతే [అదే నేను ప్రభుత్వంపై ఆధారపడవలసి వస్తే మాకు రోజుకు రెండు పూటలా తిండి కూడా దొరికేది కాదు]."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి