ఫాగుణ్ (ఫాల్గుణ) మాసం దగ్గర పడుతోంది. ఆదివారం ఉదయం, సురేంద్రనగర్ జిల్లాలోని ఖారాఘోడా స్టేషన్ సమీపాన ఉన్న ఒక చిన్న కాలువలోని నీటి మీదుగా సూర్యుడు బద్ధకంగా ఉదయిస్తున్నాడు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ఒక చిన్న అడ్డంకి, కాలువలోని నీటిని పారకుండా ఆపుతూ, అక్కడొక చిన్న చెరువును సృష్టించింది. ఆ అడ్డంకిపై నుండి పారుతున్న నీరు, ఒడ్డున నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నట్టు కూర్చొని ఉన్న పిల్లలందరి కంటే కూడా బిగ్గరగా శబ్దం చేస్తోంది. గాలి నిలిచిపోయాక పొలంలోని చిన్న చిన్న మొక్కలు కదలకుండా నిలిచిపోయినట్టు, ఆ ఏడుగురు అబ్బాయిలు నిశ్శబ్దంగా వేచివున్నారు – తాము వేసిన గాలానికి పడే ఒకటో రెండో చేపలను పట్టుకోవడానికి. గాలాన్ని కొంచెం లాగి, వెంటనే వెనక్కి గుంజి, తమ చేతులతో దాన్ని మళ్ళీ పట్టుకుంటున్నారు. ఒక చేప నీటిలో నుండి బయటికి వచ్చింది. తపతపమని రెక్కలు కొట్టుకుంది. కొన్ని నిమిషాలకి ఆ అల్లల్లాడటం ఆగిపోయింది.
ఒడ్డుకి కొంచెం దూరంలో, అక్షయ్ దరోదరా, మహేశ్ సిపారాలు మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ రంపపు బ్లేడుతో చేపల పొలుసులు తీసి శుభ్రం చేసి, వాటిని ముక్కలుగా కోస్తున్నారు. మహేశ్‌కు త్వరలోనే పదిహేనేళ్ళు నిండుతాయి. మిగిలిన ఆరుగురు అబ్బాయిలూ చాలా చిన్నవాళ్ళు. చేపలు పట్టే ఆట ముగిసింది. ఇక ఇప్పుడు ఒకరినొకరు పట్టుకునే ఆట ఆడుతూ, కబుర్లు చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా నవ్వుకునే సమయం. ఇప్పుడు చేపలు శుభ్రపడ్డాయి. ఆ వెంటనే సామూహిక వంట మొదలవుతుంది. ఆ సరదా ఇక్కడ కూడా కొనసాగుతుంది. వంట పూర్తయింది. వండినది పంచుకోవడం మొదలైంది. బోలెడన్ని నవ్వులను ఉదారంగా చల్లి మరీ వండిన భోజనం అది.
కొంతసేపయ్యాక, ఆ అబ్బాయిలంతా ఆ చిన్న కాలువలోకి దిగి, ఈత కొట్టి, ఆ తరువాత ఒడ్డున అక్కడక్కడా మొలిచివున్న గడ్డి మీద కూర్చుని వారి ఒంటిని ఆరబెట్టుకుంటున్నారు. చుంవాలియా కోలీ అనే విముక్త తెగ (denotified tribe)కి చెందిన ముగ్గురబ్బాయిలు, ముస్లిమ్ సమాజానికి చెందిన ఇద్దరబ్బాయిలు, అలాగే మరో ఇద్దరు అబ్బాయిలు ఈ మధ్యాహ్నమంతా కలిసి తిరుగుతూ, నవ్వుతూ, మాట్లాడుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ గడుపుతున్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళి, నవ్వుతూ ఒక ప్రశ్నతో మా సంభాషణ మొదలుపెట్టాను: “ఓయ్, మీరంతా ఏం చదువుతున్నారు?”
అప్పటికింకా బట్టలు వేసుకొని పవన్ ముసిముసినవ్వులు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు: “ ఆ మైసియో నవ్మా భాణా, అన్ ఆ విలాసియో ఛట్టూ భాణా. బిజూ కోయ్ నాథ్ భణ్తు. ముయ్ నాథ్ భణ్తు (ఈ మహేశియో [మహేశ్] తొమ్మిదవ తరగతి, విలాసియో [విలాస్] ఆరవ తరగతిలో ఉన్నాడు. ఇంకెవరూ చదువుకోవటం లేదు. నేను కూడా).” నాతో మాట్లాడుతూనే అతను ఒక సంచిని చింపి అందులోంచి సుపారీ(వక్క పలుకులు)ని, మరొక సంచిలో నుండి పొగాకును తీసి కలిపాడు. రెండిటినీ నలిపి, చిటికెడు తీసుకొని తన చిగుళ్ళ దగ్గర పెట్టుకొని, మిగిలినదాన్ని తన స్నేహితులకి పంచాడు. దాన్ని నమలగా వచ్చిన ఎర్రని రసాలను కాలువ నీటిలో ఉమ్మివేస్తూ, నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు: “ నో మజా ఆవే. బేన్ మార్తా’తా (చదవడంలో సరదాయేం ఉండదు. టీచర్ మమ్మల్ని కొట్టేది.]” అది విన్న నాలోలోపల ఒక నిశ్శబ్దం చల్లగా వ్యాపించింది.

చేపలు పట్టడంపై దృష్టి పెట్టిన షారుఖ్ (ఎడమ), సోహిల్

చేపలను శుభ్రం చేస్తున్న మహేశ్, అక్షయ్

మూడు రాళ్ళు పెట్టి అప్పటి అవసరానికి ఏర్పాటుచేసిన పొయ్యి. పొయ్యి వెలిగించడానికి ముందు కొన్ని తుమ్మ కర్రలను, ఒక చిన్న ప్లాస్టిక్ సంచిని పొయ్యిలో పెట్టిన కృష్ణ

అక్షయ్, విశాల్, పవన్‌లు ఆసక్తిగా చూస్తుండగా మూకుడులో నూనె పోస్తోన్న కృష్ణ

అబ్బాయిలలో ఒకరు తెచ్చిన మూకుడులో ఇప్పుడు చేపలు వేస్తున్నారు. సోహిల్ నూనె తీసుకురాగా, విశాల్ కారం పొడి, పసుపు, ఉప్పు తీసుకొచ్చాడు

తన మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూస్తున్న కృష్ణ

పిల్లలంతా ఉద్వేగంగా పాల్గొంటున్న వంట చేసే ఆట నడుస్తోంది

తాము ఏర్పాటు చేసుకున్న చిన్న టార్పాలిన్ షెడ్ నీడలో, ఇంటి నుండి తెచ్చుకున్న కొన్ని రోటీలతో తాము స్వయంగా వండుకున్న భోజనాన్ని ఆస్వాదిస్తున్న అబ్బాయిలు

కారంగా ఉన్న చేపల కూర ఒకవైపు, మండే మధ్యాహ్నపు ఎండ మరోవైపు

వేడి, చెమట ఈతకు రమ్మని పిలుస్తున్నాయి

‘రండి, ఈత కొడదాం’, అంటూ కాలువలోకి దూకిన మహేశ్

బడిలో టీచర్లు కొడుతున్నారని ఆ ఏడుగురు అబ్బాయిలలో ఐదుగురు బడికి వెళ్లడం లేదు

వాళ్ళు
ఈతకోసమని వెళ్ళినప్పుడు ఈదుతారు. అయితే, ఎప్పుడూ ఆడుకుంటూ తమ జీవితం నేర్పే పాఠాలను
నేర్చుకుంటుంటారు
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి