నేను అలసిపోయాను. నా శరీరం, మనసూ భారంగా ఉన్నాయి. నా కళ్ళు మరణాల బాధతో - నా చుట్టూ ఉన్న పీడితుల మరణాలు - నిండిపోయాయి. నేను పని చేసిన చాలా కథనాలను రాయలేకపోతున్నాను. నాకు మొద్దుబారిపోయినట్టు అనిపిస్తోంది. నేను ఈ కథనాన్ని రాయడం మొదలుపెడుతుండగానే చెన్నైలోని అణగాపుత్తూరులో దళితుల ఇళ్ళను ప్రభుత్వం కూల్చివేస్తోంది. నేను మరింతగా కొయ్యబారిపోయాను.
తమిళనాడులోని హోసూర్‌లో అక్టోబరు 7, 2023న బాణాసంచా గిడ్డంగులలో జరిగిన కార్మికుల మరణాల నుండి నేను ఇప్పటికీ దూరం జరగలేకపోతున్నాను. నేను ఇప్పటి వరకు 22 మరణాలను నమోదు చేసాను. వీరిలో ఎనిమిది మంది 17 నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్సు గల విద్యార్థులు ఉన్నారు. వీరంతా బాణాసంచాను నిలవచేసే గిడ్డంగులలో పనిచేశారు. ఈ ఎనిమిది మంది విద్యార్థులు ఒకే పట్టణానికి చెందినవారు, సన్నిహిత స్నేహితులు కూడా.
నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి, బాణసంచా కర్మాగారాలలో, గిడ్డంగులలో, దుకాణాల్లో పనిచేసే వ్యక్తుల గురించి నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నేను ఎంతగా ప్రయత్నించినా ఆ గిడ్డంగులను చూడటానికి అవసరమైన అనుమతులను పొందలేకపోయాను. నేను చేసిన వాకబులన్నిటిలో, వాటిని చూసేందుకు ఎప్పటికీ అనుమతి ఇవ్వరనేదే నాకు తెలిసింది. ఫోటోలు తీయడం అటుంచి, లోపలికి వెళ్లడమే సాధ్యం కాదు.
మా అమ్మానాన్న దీపావళి పండుగ కోసమని మాకు ఎన్నడూ కొత్త బట్టలు కానీ టపాకాయలు కానీ కొనలేదు. వారికి ఆ స్తోమత లేదు. మా పెదనాన్న మాకు కొత్త బట్టలు కొనేవారు. మేమెప్పుడూ దీపావళి పండుగను జరుపుకోవటానికి ఆయన ఇంటికే వెళ్ళేవాళ్ళం. ఆయన మాకే కాక మిగిలిన చిన్నాన్నల పిల్లలందరికీ టపాకాయలు కొనేవారు, మేమందరం కలిసి వాటిని కాల్చేవాళ్ళం.
అయితే నాకు టపాసులు కాల్చటంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నేను పెరిగి పెద్దవుతున్న క్రమంలో వాటిని కాల్చడాన్ని పూర్తిగా మానేశాను. దీపావళితో సహా పండుగలను జరుపుకోవడం కూడా మానేశాను. నేను ఫొటోగ్రఫీలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే శ్రామికవర్గ జీవితాల గురించి అర్థంచేసుకోవటం మొదలుపెట్టాను.
ఫొటోగ్రఫీ ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఏటా దీపావళి సమయంలో బాణాసంచా గిడ్డంగులలో మంటలు చెలరేగటం, ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాలను అంతగా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో నేనుండేవాడ్ని.





















