మిర్చి , లసూన్ (వెల్లుల్లి), అద్రక్ (అల్లం)... సొర, కరేలా (కాకర) ఆకులు,... బెల్లం.”

ఈ మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, కాకరకాయలు ఏదో వంటకం తయారీ కోసమైతే కాదు… పన్నా టైగర్ రిజర్వ్‌ను ఆనుకొని ఉన్న చున్గునా గ్రామంలో, శక్తివంతమైన ఎరువుల, క్రిమిసంహారక మందుల తయారీ కోసం సేంద్రియ రైతయిన గులాబ్‌రాణి ఉపయోగించే పదార్థాలు ఇవి.

సదరు జాబితా విన్న మొదట్లో తను బిగ్గరగా నవ్వానని ఈ 53 ఏళ్ళ మహిళ గుర్తు చేసుకున్నారు. “ఇవన్నీ నేను ఎక్కడ సంపాదించాలి అనుకున్నాను. కానీ, అడవిలో పెంచుతోన్న తీగజాతి మొక్కల సంగతి గుర్తొచ్చింది.” బెల్లం లాంటి పదార్థాలను ఆమె మార్కెట్‌లో కొనుగోలు చేయవలసి వచ్చింది.

ఆవిడ ఏం తయారు చేస్తుందోనన్న అనుమానంతో పొరుగింటివారు ఆమెకి ఎలాంటి సహాయం అందించలేదు. అయితే, జనాలు ఏమనుకుంటున్నారో అని గులాబ్‌రాణి ఎప్పుడూ ఆలోచించలేదు. దాదాపు 500 మంది జనాభా ఉన్న తన గ్రామంలో, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసిన మొదటి వ్యక్తి ఆవిడే అవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

“మనం మార్కెట్‌లో కొనే ఆహారంలో ఏవేవో మందులుంటాయి. పైగా, ఎన్నో రకాల రసాయనాలను కూడా వాటి లోపలికి ఎక్కిస్తారు. అలాంటప్పుడు వాటిని మనం ఎందుకు తినాలి?” నాలుగేళ్ళ క్రితం తన ఇంట్లో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్నారామె.

“అందుకే, సేంద్రియ పద్ధతిని అవలంబించడం ఒక మంచి ఆలోచన అని నా కుటుంబం భావించింది. జైవిక్ (సేంద్రీయ పద్ధతిలో పండించిన) ఆహారాన్ని తింటే, మా ఆరోగ్యాలకి మేలు జరుగుతుందని మేమంతా భావించాం. జైవిక్ ఎరువులను వాడితే, తెగుళ్ళ స్వాస్థ్ (ఆరోగ్యం) దెబ్బతింటుంది; మన ఆరోగ్యం బాగుపడుతుంది,” తన హాస్యాన్ని తానే ఆస్వాదిస్తూ అన్నారామె.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: పన్నా జిల్లా, చున్గునా గ్రామంలోని తన ఇంట్లోని స్టోర్ రూమ్ బయట ఉన్న గులాబ్‌రాణి. కుడి: తన భర్త ఉజియన్ సింగ్ తో కలిసి, కాకర ఆకులు, ఆవు మూత్రం లాంటి పదార్థాలను ఉపయోగించి ఒక కుండలో సహజ ఎరువులను తయారుచేస్తున్నారు

PHOTO • Priti David
PHOTO • Priti David

‘సేంద్రియ పద్ధతిని అవలంబించడం ఒక మంచి ఆలోచన అని నా కుటుంబం భావించింది. జైవిక్ (సేంద్రీయ పద్ధతిలో పండించిన) ఆహారాన్ని తింటే, మా ఆరోగ్యాలకి మేలు జరుగుతుందని మేమంతా భావించాం,’ అంటారు గులాబ్‌రాణి

సేంద్రియ వ్యవసాయం చేపట్టి ఇప్పటికి మూడేళ్ళు గడుస్తుండగా, వారి 2.5 ఎకరాల భూమిలో, తన భర్త ఉజియన్ సింగ్‌తో కలిసి ఆమె ఖరీఫ్‌ లొ వరి, మొక్కజొన్న, కంది, నువ్వుల పంటలను, అలాగే రబీ లో గోధుమలు, శనగలు, ఆవాలను పండిస్తున్నారు; ఇవి కాకుండా, ఏడాది పొడవునా రకరకాల కూరగాయలను – టమాటా, వంకాయ, మిరపకాయ, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, బెండకాయ, ఆకు కూరలు, తీగజాతి కాయలు, కరోండా (వాక్కాయలు), బీన్స్ లాంటివి మరెన్నో – కూడా పండిస్తున్నారు. “మేం మార్కెట్లో పెద్దగా ఏవీ కొనవలసిన అవసరం లేదు,” ఆమె సంతోషంగా అన్నారు.

చున్గునా గ్రామం, తూర్పు మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌ను ఆనుకొని ఉంది. ఇక్కడ ఎక్కువగా రాజ్‌గోండ్ ఆదివాసీ సముదాయానికి చెందిన కుటుంబాలు నివసిస్తాయి. వీరందరూ వార్షిక వర్షపాతం పైనా, సమీపంలో ప్రవహించే ఒక కాలువ నీటి పైనా ఆధారపడి, తమ చిన్న చిన్న భూభాగాలలో వ్యవసాయం చేస్తుంటారు. అయితే, సీజనల్ పని కోసం కట్నీకి, ఉత్తరాన ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని సమీప నగరాలకు కూడా చాలామంది వలస వెళ్తుంటారు.

“మొదట్లో, ఒకరిద్దరం మాత్రమే దీన్ని (సేంద్రియ సాగు) చేపట్టాం. ఆ తరువాత, మరో 8-9 మంది రైతులు మాతో కలిశారు,” గులాబ్‌రాణి తెలిపారు. ఇప్పుడు తన సముదాయంవారు దాదాపు 200 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని ఆవిడ అంచనా వేశారు.

సామాజిక కార్యకర్త శరద్ యాదవ్ మాట్లాడుతూ, “(చున్గునాలో) వలసలు తగ్గాయి; కేవలం ఇంధనం, కట్టెల కోసం మాత్రమే అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు,” అన్నారు. పీపుల్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (PSI)లో క్లస్టర్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తోన్న శరద్, స్వయంగా ఒక రైతు కూడా.

గులాబ్‌రాణి ముక్కుసూటి వ్యవహారం, ప్రశ్నించే వైఖరి ఆమెను ఒక ప్రభావశీలిగా నిలబెట్టాయని పిఎస్ఐ సిబ్బంది తెలిపారు. వారు సూచించిన పద్ధతులలో మొక్కజొన్న పంటను పండించిన మొదటి వ్యక్తి ఆవిడే. ఎంతో దక్షతతో సాగు చేశారామె. అలా ఆమె విజయం ఇతరులను కూడా ప్రోత్సహించింది.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: తన 2.5 ఎకరాల పొలంలో, సేంద్రియ ఎరువులు-పురుగుమందులను ఉపయోగించి వ్యవసాయం చేస్తోన్న గులాబ్‌రాణి. కుడి: ఆమె కుటుంబం, వారికవసరమైన ఆహార పదార్థాలన్నింటినీ తమ భూమిలోనే పండించుకుంటుంది

*****

“మేం ఎరువులు, పురుగుమందుల – యూరియా, డిఎపి – కోసం నెలకు రూ. 5,000 వరకు ఖర్చు చేసేవాళ్ళం,” ఉజియన్ సింగ్ చెప్పారు. అప్పుడు వారి సాగు భూమి పూర్తిగా రసాయనాలపై ఆధారపడి ఉండేది. ఈ పరిస్థితినే స్థానికంగా ‘ చిడ్కా ఖేతీ ’ (రసాయనాలు చల్లి సాగు చేయడం) అంటారని శరద్ తెలిపారు.

“ఇప్పుడు మేం మా సొంత మట్కా ఖాద్ (మట్టి కుండ ఎరువు)ను తయారుచేసుకుంటున్నాం,” పెరట్లో ఉన్న ఒక పెద్ద మట్టి కుండను చూపిస్తూ గులాబ్‌రాణి అన్నారు. “దీని కోసం ఇంటి పనుల మధ్య కొంత సమయాన్ని చిక్కించుకోవాలి.” సాగుభూమితో పాటు ఈ కుటుంబానికి 10 పశువులు కూడా ఉన్నాయి; వాటి నుండి వచ్చే పాలను వీరు అమ్మరు. తమ చిన్న కుటుంబం – ఇద్దరు కూతుళ్ళు, ఒక పెళ్ళైన కొడుకు – కోసమే వినియోగించుకుంటారు.

ద్రావణం తయారీకి మిరపకాయలు, అల్లం, ఆవు మూత్రంతో పాటు కాకర, సొర, వేప ఆకులు కూడా అవసరమవుతాయి. “వీటన్నిటిని ఒక గంటసేపు ఉడకబెడతాం. దానిని ఉపయోగించే ముందు, రెండున్నర నుండి మూడు రోజుల వరకు పక్కన పెడతాం. అయితే, మనకు అవసరమైనంత వరకు కూడా దానిని కుండలోనే ఉంచవచ్చు. “కొందరు దీనిని 15 రోజుల వరకు ఉంచుతారు. తద్వారా, ఇది అచ్చే సే గల్ జాతా హై (బాగా పులుస్తుంది),” ఈ సేంద్రియ రైతు వివరించారు.

ఇలా, ఆమె ఒకేసారి ఐదు నుండి 10 లీటర్ల వరకు తయారుచేస్తారు. “ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీనిని తప్పనిసరిగా 10 లీటర్ల నీటిలో కలపాలి. మీరు ఈ ద్రావణాన్ని ఎక్కువగా వాడినట్టయితే, అది పువ్వులను చంపి పంటను నాశనం చేస్తుంది,” తెలిపారామె. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన మొదట్లో, ప్రయోగించి చూడటం కోసం ఒక సీసా ద్రావణాన్ని ఇవ్వమని ఆమె పొరుగువారు అడిగేవారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: తన మనవరాలు అనామికతో వంటగదిలో గులాబ్ రాణి. కుడి: ఉజియన్ సింగ్; దూరంగా కనిపిస్తున్నవి పంపును నడిపించడానికి ఏర్పాటుచేసిన సౌర ఫలకాలు

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే సాంకేతిక వనరుల కేంద్రాన్ని (TRC) నిర్వహిస్తున్న రాజేందర్ సింగ్. కుడి: సిహవన్ గ్రామంలోని ఒక వ్యవసాయ భూమిలో, నాలుగు రకాల సంప్రదాయ వరి రకాలను పక్కపక్కనే ఇలా సాగు చేస్తున్నారు

“మాకు ఏడాదికి సరిపడా ఆహారాన్ని మేమే సాగు చేసుకుంటున్నాం. ఇది కాక, సంవత్సరానికి సుమారు రూ.15,000 విలువ చేసే ఆహార ఉత్పత్తులను కూడా అమ్ముతున్నాం,” ఉజియన్ సింగ్ తెలియజేశారు. అయితే, మధ్య భారతదేశంలో ఉండే ఇతర రైతుల మాదిరిగానే, ఆహార పంటలను నాశనం చేసే అడవి జంతువుల బెడదను వీరు కూడా నిరంతరం ఎదుర్కొంటున్నారు. “ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంతో మేం వాటిని పట్టుకోలేం, చంపలేం. నీల్‌గాయ్ (మనుబోతు - జింక వంటి జంతువు) గోధుమలను, మొక్కజొన్నలను తింటుంది; పంటను పూర్తిగా నాశనం చేస్తుంది,” గులాబ్‌రాణి PARIతో అన్నారు. ఇదిలా ఉంటే, అడవి పందులను చంపడాన్ని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 నిషేధించింది.

ఒక సోలార్ పంపు సహాయంతో సమీపంలోని ప్రవాహం నుండి సాగు కోసం నీటిని తోడుకుంటున్నారు. “చాలా మంది రైతులు ఒక ఏడాదిలో మూడు పంటల వరకు సాగు చేయగలుగుతున్నారు,” తన పొలం సరిహద్దులలో స్థాపించిన సౌర ఫలకాల వైపు చూపిస్తూ ఉజియన్ సింగ్ అన్నారు.

బిల్‌పురా పంచాయతీ పరిధిలో ఉన్న 40 గ్రామాలకు సేవలందించ డం కోసం పీపుల్స్ సైన్స్ ఇన్స్‌స్టిట్యూట్ (PSI) ఒక సాంకేతిక సేవా కేంద్రాన్ని (TRC) కూడా ఏర్పాటు చేసింది. “టిఆర్‌సిలో 15 రకాల ధాన్యాన్ని, 11 రకాల గోధుమలను నిల్వ చేస్తారు. ఇవన్నీ ఎక్కువగా సంప్రదాయ విత్తనాలు. ఇవి తక్కువ వర్షపాతాన్ని, తీవ్రమైన చలిని తట్టుకుంటాయి, వీటిలో తెగుళ్ళు, కలుపులు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి,” టిఆర్‌సిని నిర్వహించే రాజేందర్ సింగ్ వివరించారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

బిల్‌పురా పంచాయతీలోని చున్గునాతో సహా 40 గ్రామాలకు సేవలందించే సాంకేతిక సేవా కేంద్రంలో నిల్వ చేసివున్న సంప్రదాయ రకాలైన ధాన్యం (ఎడమ), దాల్ (కుడి)

PHOTO • Priti David
PHOTO • Priti David

రోజువారీ పనులన్నీ ముగించుకొని, ఈ రోజున జరిగే హల్‌ఛట్ పూజకు సిద్ధమయ్యేందుకు నదిలో స్నానానికి బయలుదేరుతున్న చున్గునాకు చెందిన మహిళలు

“మా రైతు సభ్యులకు మేం రెండు కిలోల వరకు విత్తనాలను ఇస్తాం. వారు పంట పండించాక, దానికి రెండింతలు మాకు తిరిగివ్వాలి,” ఆయన తెలిపారు. కొంచెం దూరంలో, ఒక ఎకరం భూమిలో పెరుగుతున్న వరి పంటను మాకు చూపించారాయన – అక్కడ, నాలుగు వేర్వేరు వరి వంగడాలను పక్కపక్కనే సాగుచేస్తున్నారు; ఆ పంటలు కోతకొచ్చే తేదీలను గబగబా వల్లించారతను.

కూరగాయల బేరసారాల కోసం ఒక సమష్టి కేంద్రాన్ని ప్రారంభించాలని ఈ ప్రాంతంలోని రైతులు యోచిస్తున్నారు. సేంద్రియ సాగుకు మద్దతు పెరగడంతో, తమకి మెరుగైన ధరలు లభిస్తాయని కూడా వీళ్ళు ఆశిస్తున్నారు.

మేం తిరుగుముఖం పడుతుండగా, హల్‌ఛట్ పూజ చేయడం కోసం తమ ఉపవాస దీక్షను విరమించే ముందు, కాలువలో స్నానం చేసేందుకు గ్రామంలోని ఇతర మహిళలతో పాటు గులాబ్‌రాణి కూడా బయలుదేరారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఐదవ నెలలో – భాదోఁ (భాద్రపదం) – తమ పిల్లల కోసం ఈ పూజను చేస్తారు. “ మహువా ను మజ్జిగతో కలిపి ఉడకబెట్టిన వంటకాన్ని తిని, మా ఉపవాస దీక్షను విరమిస్తాం,” గులాబ్‌రాణి తెలిపారు. అలాగే, తమ భూమిలో సేంద్రియ పద్ధతిలో పండించిన చనా (శనగల)ను కూడా వేయించి తింటారు వీరు.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi