ప్రియమైన PARI పాఠకులకు,

ఇది www. ruralindiaonline.org లో పనిలో తీరికలేకుండా ఉన్న సంవత్సరం.

2023 ముగియబోతోన్న సందర్భంగా PARI బృందం ఒక అద్భుత దృశ్యమానమైన సంవత్సరాంతపు సమీక్షల వరుసను రూపొందించింది: రాబోయే తొమ్మిది రోజులలో ప్రతి రోజూ మేం మా సంపాదకులు ఎంపికచేసిన ఉత్తమమైన PARI – కథనాలు, కవితలు, సంగీతం, వ్యాఖ్యాచిత్రాలు, చలనచిత్రాలు, ఛాయాచిత్రాలు, అనువాదాలు, గ్రంథాలయం, ముఖాలు, సోషల్ మీడియా, విద్యార్థులతో కలిసి పనిచేయటం - ప్రచురణలను అందించబోతున్నాం.

మేం దేశవ్యాప్త కథనాలను ప్రచురించడాన్ని కొనసాగించాం. ఈ సంవత్సరం ఈశాన్య ప్రాంతాలతో సహా అనేక కొత్త ప్రదేశాల కథనాలను కూడా జోడించాం. వ్యవసాయానికి సంబంధించి మేం ప్రచురించిన వార్తాకథనాలలో ఇప్పుడు మల్లెలు, నువ్వులు, ఎండు చేపలు, ఇంకా మరి కొన్నింటిపై అపర్ణ కార్తికేయన్‌ నిశితంగా పరిశోధించి నివేదించిన ధారావాహిక ఉంది. మానవ-జంతు సంఘర్షణల పతనం, అభయారణ్యాల సమీపంలో నివసించే ప్రజలపై దాని అణిచివేత ప్రభావం గురించి జైదీప్ హర్దీకర్ అవిరామంగా జరిపిన అన్వేషణ ఫలితమైన, వ్యవసాయంపై ఒక గట్టి అవగాహన ఉన్న ధారావాహిక - 'ఒక కొత్త రకమైన కరువు'ను చదవవచ్చు.

తమిళనాడులోని విగ్రహాల తయారీదారులు, ట్రాన్స్ నటులు, మత్స్యకారుల వంటి సమాజానికి ఒక వారన జీవించే వ్యక్తుల మరపురాని ఛాయాచిత్రాలను పళని కుమార్ చిత్రీకరించారు. ఋతాయన్ ముఖర్జీ, ముజామిల్ భట్‌లు కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలలో పశుపోషకులతో కలిసి ప్రయాణించి, ఎత్తైన పర్వత ప్రాంతాలలో మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకోడానికి వారు చేసే ప్రయత్నాలను, వారి పనినీ ఛాయాచిత్ర సహితంగా నివేదించారు. యువ క్రీడాకారులు, వలసవచ్చిన వారి పిల్లలకు విద్య, రుతుక్రమం సమయంలో ఉండే ఆంక్షలు వంటి మరెన్నో, గ్రామీణ మహారాష్ట్రలో జరుగుతోన్న అనేక అన్యాయాలను గురించి జ్యోతి శినోలి నివేదించారు. బిహార్‌కు చెందిన ముసహర్ సముదాయం గురించి, మద్యపాన సంబంధిత మరణాలపై PARI ఫెలో ఉమేశ్ కె. రే అందించిన కఠిన సత్యాలతో కూడిన నిజాయితీ గల ధారావాహిక ఉంది.

సముదాయాలకు, పరిరక్షణకు సంబంధించిన కథనాలతో మేం కొత్త పుంతలు తొక్కగలిగాం: తూర్పు హిమాలయాల్లో అంతరించిపోతున్న పక్షి బుగున్ లియోచిక్లాకు ముంచుకొస్తున్న ప్రమాదాలను, స్థానికులు ఆ సంక్షోభాన్ని తగ్గించడంలో ఎలా సహాయం చేస్తున్నారో విశాఖ జార్జ్ నివేదించారు; రాజస్థాన్‌లో అంతరించిపోతున్న బట్టమేక పక్షి గురించీ, పునరుత్పాదక ఇంధన కర్మాగారాలు స్వాధీనం చేసుకున్న పవిత్రమైన తోటలు ఇంకెంతమాత్రమూ పవిత్రమైనవి కావంటూ ప్రీతి డేవిడ్ నివేదించారు.

వార్తా కథనాల తీవ్రతను బట్టి మేం వాటికి ప్రాధాన్యం ఇచ్చాం - మహారాష్ట్రలో నిరసన తెలుపుతున్న రైతులతో కలిసి నడిచాం, ఆదివాసీలు తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు వారితో మాట్లాడాం, అలాగే సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను కూడా కలిశాం. డిసెంబర్ 2023లో ఎన్నికలు జరుగుతోన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో పర్యటించిన పార్థ్ ఎమ్.ఎన్., ఈ రాష్ట్రాల్లో అమలవుతోన్న బుల్డోజర్ అన్యాయం గురించి, ఆదివాసులపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి, కస్టడీ మరణాల బారిన పడినవారి జీవిత వాస్తవాల గురించి రాశారు.

స్మితా ఖటోర్ ముర్షిదాబాద్‌లోని బీడీ కార్మికులపై కథనాన్ని చేస్తున్నప్పుడు ఆమెకు స్త్రీల పాటలు, పిల్లల ఆటలు వంటి చిన్నపాటి ముసాఫిర్ కథనాలు పరిచయమయ్యాయి. వ్యక్తిగత అనుభవాల ఆధారంగా కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. ఉదాహరణకు, స్వయంగా ఉపాధ్యాయురాలైన మేధా కాళే వికలాంగులకు అవగాహన కల్పించే ప్రత్యేక ఉపాధ్యాయులపై దృష్టి సారించి అద్భుతమైన కథనాన్ని చేశారు. మా రిపోర్టర్లు నిశితంగా పరిశీలించడమే కాకుండా గ్రామీణ భారతదేశంలో జరుపుకునే మా బన్‌బీబీ, సైలా నృత్య, చాదర్ బాఁదినీ, పిలి వేష మొదలైన పండుగలను చూసి, ఆ వేడుకల గురించి నివేదించారు. 'ఇంతకూ ఎవరి ప్రార్థనాస్థలమిది?' వంటి కథనాలను కూడా మేం ప్రచురించాం.

PARI బృందం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నందున మేం అనేక అఖిలభారత స్థాయి నివేదికలను - దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న 'గిగ్ శ్రామికులు’, అనువాదంలోని బాధలూ ఆనందాలు, వలస కార్మికులు, వారితోపాటే వలస వచ్చిన పదాలు, గ్రామీణ మహిళలు తమ 'ఖాళీ' సమయాన్ని ఎలా గడుపుతున్నారు - ప్రచురించాం.  వచ్చే ఏడాది ఈ దిశగా మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.

PHOTO • Nithesh Mattu
PHOTO • Ritayan Mukherjee

కోస్తా కర్ణాటకలోని జానపద కళల ఉత్సవమైన పిలి వేష (ఎడమ) వంటి పండుగలను గురించి నివేదించాం, అదేవిధంగా లదాఖ్‌లోని జాంస్కర్ ప్రాంతంలో జడలబర్రెల కాపరులతో (కుడి) కలిసి ప్రయాణించాం

PARI ఎంతగానో గర్వించే నమితా వైకర్ సారథ్యంలోని విసుర్రాయి పాటల ప్రాజెక్ట్ (Grindmill Songs Project - GSP), ఈ సంవత్సరం తన చరిత్ర గురించిన అద్భుతమైన వీడియోను బహుమతిగా అందించిన విధంగానే ఇకముందు కూడా అందించడాన్ని కొనసాగిస్తుంది. 2023లో మేం కచ్ఛ్ పాటల ఆర్కైవ్‌ను జోడించాం. మా PARIకే చెందిన కవి ప్రతిష్ఠా పాండ్య నిర్వహణలో రణ్ ఆఫ్ కచ్ నుండి పాటలను రికార్డ్ చేశాం.

PARI మొదటిసారిగా అందించిన మరో అంశం, ఆదివాసీ పిల్లలు గీసిన వర్ణచిత్రాలు - గ్రామీణ ఒడిశాలోని పాఠశాల పిల్లలు గీసిన చిత్రాలను కనికా గుప్తా క్షుణ్ణంగా పరిశీలించి, శ్రమకోర్చి వీటిని కూర్చారు. చిత్రకారిణి లావణి జంగి పశ్చిమ బెంగాల్‌లోని దేవ్‌చా పచామి బొగ్గు గనుల వద్ద నిరసనలకు నాయకత్వం వహిస్తున్న మహిళల గురించి తన వ్యాఖ్యాచిత్రాల ద్వారా మొదటి కథనాన్ని రూపొందించారు.

PARI MMF సభ్యులు సంకటంలో ఉన్న నైపుణ్యకళాకారులను గురించి నమోదు చేశారు: మహారాష్ట్రలో సంకేత్ జైన్ చిన్న చిన్న గ్రామాలలో ఝోప్డీలు, జాలీల వంటి మరెన్నిటినో తయారుచేసే అంతగా ప్రజలకు తెలియని కళాకారులను గురించి నివేదించారు; భారతదేశపు క్రీడా మైదానాల నుండి శ్రుతి శర్మ, కేవలం క్రీడా నైపుణ్యాల గురించి మాత్రమే కాకుండా, క్రీడా పరికరాల చుట్టూ ఉన్న సంక్లిష్టమైన చారిత్రక, సామాజిక-సాంస్కృతిక నేపథ్యం గురించిన దగ్గరి చూపును మాకు అందించారు; అస్సామ్‌లోని మాజులీ నుండి ప్రకాశ్ భుయాఁ అక్కడి రాస్ సంప్రదాయం గురించి రాశారు; ఉత్తర కేరళలోని తోల్‌పావకూత్తు సంప్రదాయాలపై సంగీత్ శంకర్, కర్ణాటకలోని తుళునాడు భూతాల పై ఫైసల్ అహ్మద్ నివేదించారు.

అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలపై PARI ఫెలో అమృత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి అందించిన కథనాలు జెండర్‌పై దృష్టి సారించి విరివిగా నివేదిస్తోన్న మా కథనాలకు మంచి జోడింపు అయ్యాయి.

పైన పేర్కొన్న వాటితో పాటు, PARIకి క్రమం తప్పకుండా పనిచేసేవారు, పాతకాపులు మా కథనాల భాండాగారానికి సహకరిస్తూనే ఉన్నారు: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల నుండి రాసే పురుషోత్తం ఠాకూర్, ఆదివాసీ సముదాయాల జీవితాలు, జీవనోపాధి, పండుగల గురించిన ఫోటోలను, వీడియోలను పంపారు; శాలినీ సింగ్ యమునా నది నుంచి స్థానభ్రంశం చెందిన రైతుల కథనాలను అందించడాన్ని కొనసాగిస్తున్నారు. ఊర్వశి సర్కార్ పీతల వేట గురించి, సుందరవనాలలో నడుస్తోన్న త్రైమాసిక పత్రిక గురించీ రాశారు. ఒడిశాలోని గ్రామీణ పాఠశాలలను మూసివేయడంపై కవిత అయ్యర్, బళ్ళారిలో గనులలో పనిచేసే మహిళలపై ఎస్. సెందళిర్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రైడ్ మార్చ్‌పై శ్వేత డాగా, వధువుల అమ్మకాల గురించి జిజ్ఞాస మిశ్రా, సంచి కవర్లు (Envelops), జల్లెడల వంటి నిత్యావసర వస్తువులను తయారుచేసే వ్యక్తుల గురించి ఉమేశ్ సోలంకి రాశారు. ఇంకా ముంబై లోకల్ రైళ్ళలో పాడే సంగీతకారులపై ఆకాంక్ష, తమిళనాడులోని ఇరులర్లపై స్మిత తూములూరు రాశారు.

కడలూర్‌లో చేపలు పట్టడం గురించి, హిమాలయాలలో పశుపోషణ గురించి డాక్టర్ నిత్యారావు, డాక్టర్ ఓవీ థోరట్ వంటి పండితులు, విద్యావేత్తల నుండి కూడా మాకు చాలా కథనాలు వచ్చాయి. వారి రచనలతో పాటు అండర్ గ్రాడ్యుయేట్,  గ్రాడ్యుయేట్ విద్యార్థులు తాము అధ్యయనం చేస్తోన్న ప్రజలను, సమాజాలను - డినోటిఫైడ్ (నేరస్థ జాతిగా పడిన ముద్ర నుంచి విముక్తి పొందినవారు) తెగలు, గ్రామీణ బీహార్‌లో పొట్టకూటి కోసం నాట్యం చేసే మహిళలు, కొచ్చిలోని బట్టలుతికే స్త్రీ పురుషులు, గ్రామీణ భారతదేశపు తపాలా ఉద్యోగి (పోస్ట్‌మ్యాన్) గురించి రాసిన ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి - మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా PARI కోసం రాశారు

PHOTO • PARI Team
PHOTO • Ishita Pradeep

ఆదివాసీ పిల్లలు గీసిన చిత్రాలతో (ఎడమ) మేం ప్రారంభించిన ఒక కొత్త సేకరణ. ముంబైలోని ఆరేకు చెందిన ఆదివాసీలు చేస్తున్న నిరసన (కుడి)

ఇప్పుడు 2023 PARI  ప్రయాణంలోని ఉత్తమ ప్రచురణలపై ఒక సంగ్రహావలోకనం. రాబోయే వారం రోజుల్లో ఇవి మీకు కనువిందు చేయబోతున్నాయి.

బెస్ట్ ఆఫ్ మొజాయిక్‌ తో ప్రారంభిద్దాం. ఈ సంవత్సరంలో మా కవితలు, సంగీతం, పాటల ఎంపిక మా భాండాగారాన్ని విస్తరించింది, మరింత గాఢతను సమకూర్చింది. PARI గ్రంథాలయం కోసం సమీక్షించేందుకు తాము పరిశీలించిన వందల నివేదికల నుండి వేటిని ప్రముఖంగా ప్రకటించాలనుకుంటున్నారో గ్రంథాలయ బృందం మాకు తెలియజేస్తుంది. PARI ఫిల్మ్ బృందం బాక్సాఫీస్ విజయాలను అందించింది, మా Youtube ప్లే లిస్ట్‌లో చాలామంది చిత్ర నిర్మాతలను, వీడియోగ్రాఫర్‌లను కూడా ప్రవేశపెట్టింది. PARI నుండి వచ్చిన అత్యంత అద్భుతమైన చిత్రాలలో - మదరసా అజీజియా దహనంపై శ్రేయా కాత్యాయిని, జైసల్మేర్ ఒరాఁన్‌లను రక్షించడం గురించి ఉర్జా తీసినవి ఉన్నాయి. అనధికారికంగా వ్యర్థాలను సేకరించేవారిపై కవితా కార్నీరో నిర్మించిన చిత్రం PARI కిరీటంలోని మేలిమి ముత్యం. వీటి గురించి, ఇతర సంచలనాత్మక చిత్రాల గురించి వారి సంవత్సరాంతపు కథనంలో మీరు మరింతగా వింటారు, చూస్తారు.

'PARIలో ప్రచురించబడిన ప్రతి కథనం 14 భారతీయ భాషలలో తిరిగి జన్మనెత్తుతుంది.' అనువాద కథనాలను మేం ప్రదేశాలను ప్రజాస్వామ్యీకరించడంలో సహాయపడే శుద్ధమైన అనుసృజనలుగా చూస్తాం. భారతీయ భాషల అనువాదకులు, భాషా సంపాదకుల బృందం – PARIbhasha కృషి వల్ల ఇది సాధ్యమైంది. పని గురించిన వారి సంవత్సరాంతపు సమీక్ష వారు సృష్టించిన అద్భుతమైన పని విస్తృతిని మీతో పంచుకుంటుంది.

ఛాయాచిత్రాలు PARI పనిలో ప్రధానమైనవి. 2023 ఛాయాచిత్రాల ఎంపికను, విద్యార్థులకు PARI ఇంటర్న్‌షిప్‌లు అంటే ఏమిటో చూడండి. సంవత్సరం పొడవునా మా సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రదర్శించే మా ఎస్ఎమ్ హైలైట్ రీల్‌ ను తప్పకుండా చూడండి. చివరగా ఈ సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరం ప్రారంభం సంపాదకులకు ప్రియమైన ఫేసెస్ ఆన్ PARI – భారతదేశ ముఖ వైవిధ్యాన్ని మీకు చూపించే మా ప్రధాన పతాక - ప్రాజెక్ట్‌తో ముగిస్తాం.

2023 చివరి నాటికి, PARI తన తొమ్మిదేళ్ళ ప్రయాణంలో సాధించిన దేశీయ, అంతర్దేశీయ పురస్కారాల సంఖ్య 67. అత్యంత ఇటీవలి విజయం, డిసెంబర్‌లో యుఎన్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ నుండి PARI సహ-వ్యవస్థాపకురాలు శాలినీ సింగ్ పొందిన పురస్కారం. ఈ పురస్కారాలు మొదటగా మాతో ఉదారంగా తమ కథనాలను పంచుకునే సామాన్య జనానికి, అలాగే వారితో కలిసి నడిచిన రిపోర్టర్‌లకు, ఆ కథనాలపై పనిచేసిన పాఠ్య, వీడియో, ఛాయాచిత్ర సంపాదకులకు, అనువాదకులకు చెందుతాయని మేం నమ్ముతున్నాం.

PARI సంపాదకులు రిపోర్టర్‌లతో కలిసిమెలసి పనిచేస్తారు, అవసరమైన చోట మార్గనిర్దేశం చేయడం ద్వారా వారి రచనలు మరింత ప్రభావవంతంగా, మరింత ఖచ్చితతత్వంతో ఉండేలా చేయడానికి వారికి సహాయం చేస్తారు. PARIతో పనిచేసే ఆంగ్ల, ఇతర భాషా సంపాదకులు, ఛాయాచిత్ర సంపాదకులు, ఎంచుకున్న కథనాలపై పనిచేసే ఫ్రీలాన్స్ సంపాదకులు మా పనిలో కీలకమైన పాత్రను పోషిస్తారు.

ఆన్‌లైన్ జర్నల్‌ను ప్రచురించడంతో పాటు ఏకకాలంలో ఒక ఆర్కైవ్‌ను నిర్మించడం అనేవి సవరణలు చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, లేఅవుట్‌లను చేసే PARI డెస్క్ ద్వారానే సాధ్యమవుతుంది. వారు మొదటి నుంచి రిపోర్టర్లతో సన్నిహితంగా పనిచేయడం ప్రారంభించి, చివరి వరకు వారితో ఉంటారు - సంపాదకత్వపు సూక్ష్మ వివరాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ ప్రచురణా లక్ష్యం కూడా వారి పరిధికి మించినది కాదు. వారు ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొంటారు.

మేం మా సాధారణ ప్రచురణతో జనవరి 2, 2024న తిరిగి వస్తాం. అగర్తల జాతరలలో ‘మృత్యుబావి', బిహార్‌లోని ఛాపా కళాకారులు, మహారాష్ట్రలో మతపరమైన పోలీసింగ్, మీరట్‌లోని ఇనుము కార్మికులు, ఇంకా మరెన్నో వరుసలో ఉన్నాయి.

వచ్చే సంవత్సరంలో మేం రోజువారీ వ్యక్తుల దైనందిన జీవితాల గురించి - మెరుగైన రిపోర్టింగ్, చక్కని ఛాయాచిత్రాలు, చిత్రీకరణలు, ఇంకా మెరుగ్గా రూపొందించినవి - మరిన్ని కథలను చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ధన్యవాదాలు!

PARI బృందం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli