వత్సల మణిరామ్ ప్రాణాలను కాపాడింది.

"మేం పాండవ జలపాతాల దగ్గరకు వెళ్ళాం," మణిరామ్ చెప్పటం మొదలుపెట్టారు. "వత్సల మేత కోసం వెళ్ళింది. నేను ఆమెను తీసుకురావటానికి వెళ్తుండగా ఒక పులి ప్రత్యక్షమయింది."

సహాయం కోసం మణిరామ్ కేకలు పెట్టారు. "ఆమె పరుగెట్టుకుంటూ వచ్చి, నేను ఆమె వీపు మీదకు ఎక్కటానికి వీలుగా తన ముందు కాలిని పైకెత్తింది. నేను ఎక్కి కూర్చోగానే, ఆమె కోపంగా తన కాళ్ళను నేలకు గట్టిగా తాటించి, చెట్లను పడగొట్టింది. పులి భాగ్ గయా [పులి పారిపోయింది]," అన్నారు ఉపశమించిన మహావత్ (మావటి)

పన్నా టైగర్ రిజర్వ్‌కు ఘనమైన మాత్రధికారిణి అయిన వత్సలకు వందేళ్ళ కంటే ఎక్కువ వయసుంటుందని చెప్తారు. తద్వారా ఆమె ప్రపంచంలోనే జీవించివున్న అత్యంత పెద్దవయసు ఏనుగుగా మారింది. "కొందరు ఆమెకు 110 ఏళ్ళనీ, మరికొందరు 115 ఏళ్ళనీ అంటున్నారు. అది నిజమే అయుంటుందనుకుంటున్నాను," 1996 నుండి వత్సల సంరక్షణను చేపట్టిన గోండు ఆదివాసి మణిరామ్ చెప్పారు.

వత్సల ఆసియా ఖండపు ఏనుగు ( Elephas maximus ). ఈమె కేరళలోనూ, మధ్యప్రదేశ్‌లోనూ నివాసముంటోంది. ఆమె చాలా సౌమ్యురాలని, చిన్న వయసులో ఉండగా చాలా ఉల్లాసంగా, సాహసంగా ఉండి ఉంటుందనీ మణిరామ్ అంటారు. ఇప్పటికి కూడా, తన కంటి చూపు, వినికిడి శక్తీ సన్నగిల్లిపోతున్నప్పటికీ, ఆమె ఎదురవ్వబోయే ప్రమాదాన్ని గురించి తన మందకు మొదటి సంకేతాన్ని అందిస్తుంది.

ఆమె ఘ్రాణ శక్తి ఇంకా చాలా బలంగా ఉందనీ, మరో జంతువు నుంచి వచ్చే అపాయాన్ని వాసన ద్వారా పసిగట్టగలదనీ మణిరామ్ అంటారు. అలా జరిగినప్పుడు, ఆమె మిగిలిన మందను హెచ్చరిస్తుంది. వెంటనే అవన్నీ ఏనుగు గున్నలను మధ్య ఉంచుకొని, వాటి చుట్టూ గుంపుకడతాయి. "ఆ జంతువు దాడిచేయటానికి ప్రయత్నించినపుడు అవి తమ తొండాలతో అందుబాటులో ఉన్న రాళ్ళనూ కర్రలనూ చెట్లకొమ్మలనూ పట్టుకొని విసురుతూ ఆ జంతువును తరిమేస్తాయి," అన్నారు మణిరామ్. " పెహలే బహుత్ తేజ్ థీ [మొదట్లో చాలా చురుగ్గా ఉండేది]."

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో వత్సల, ఆమె మావటి మణిరామ్. కుడి: ప్రపంచంలో అతి పెద్ద వయసు ఏనుగుగా వత్సలకు గుర్తింపు ఉంది, ఆమెకు నూరేళ్ళు దాటాయి

PHOTO • Sarbajaya Bhattacharya
PHOTO • Sarbajaya Bhattacharya

వత్సల ఆసియాకు చెందిన ఏనుగు (ఎలిఫస్ మాగ్జిమస్). కేరళలో పుట్టిన ఆమెను 1993లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ (నర్మదాపురంగా పేరు మార్చారు)కు తీసుకువచ్చారు

ఆయన అధీనంలో ఉన్న ఏనుగులాగే మణిరామ్ కూడా పులితో సహా ఇతర అడవి జంతువులకు భయపడరు. 2022లోని ఈ నివేదిక ప్రకారం పన్నా టైగర్ రిజర్వ్‌లో 57 నుంచి 60 వరకూ పులులు ఉన్నాయి. " హాథీ కే సాథ్ రెహతే థే, తో టైగర్ కా డర్ నహీ రెహతా థా [నేను ఏనుగుతో కలిసి ఉంటాను కాబట్టి పులులంటే భయపడను]," అంటారతను.

పన్నా టైగర్ రిజర్వ్‌, హినౌతా గేట్ వద్ద ఉన్న ఏనుగుల ఆవరణం దగ్గర PARI ఆయనతో మాట్లాడుతోంది. ఆ రోజుటికి తమ మొదటి ఆహారం కోసం ఒక గున్నతో సహా దాదాపు 10 ఏనుగులు అక్కడ వేచివున్నాయి. ఒక చెట్టు కింద నిల్చొని ఉన్న వత్సల వద్దకు మణిరామ్ మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఆ ఏనుగు పాదాలను అక్కడ భూమిలోకి పాతి ఉన్న దుంగలకు తాత్కాలికంగా గొలుసులతో కట్టేశారు. ఆమెకు దగ్గరలోనే తన రెండు నెలల వయసున్న గున్నతో కృష్ణకలి నిల్చొనివుంది.

వత్సలకు సొంత బిడ్డలు లేరు. "అయితే ఆమె ఎల్లప్పుడూ ఇతర ఏనుగుల పిల్లల సంరక్షణను చూసుకుంటూనేవుంటుంది. దూస్రీ కీ బచ్చియాఁ బహుత్ చాహతీ హై [ఆమె ఇతర ఏనుగుల పిల్లలను చాలా ప్రేమిస్తుంది]," విచారంగా నవ్వుతూ చెప్పారు మణిరామ్. "ఆమె గున్నలతో ఆడుకుంటుంది."

*****

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంత జిల్లా అయిన పన్నాకు వత్సల, మణిరామ్‌లిద్దరూ వలసవచ్చారు. ఈ ప్రాంతం 50 శాతం అడవులతో నిండివుంటుంది. కేరళలో పుట్టిన వత్సలను 1993లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ (నర్మదాపురంగా పేరు మార్చారు)కు తీసుకువచ్చారు. మణిరామ్ అక్కడే పుట్టారు. వారిద్దరూ మొదటిసారి అక్కడే కలిశారు.

"నేనెప్పుడూ ఏనుగులను ప్రేమించేవాణ్ణే," ఏబై ఏళ్ళ వయసు దాటిన మణిరామ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ ఇంతకుముందు జంతువులను చూసుకున్నవారు కాదు. ఆయన తండ్రి వారికున్న ఐదెకరాల భూమిని సాగుచేసేవారు, ఇప్పుడు మణిరామ్ కొడుకు అదే పని చేస్తున్నారు. "మేం గెహూఁ [గోధుమ], చనా [శనగలు], తిలి [నువ్వులు] పండిస్తాం," అని ఆయన చెప్పారు.

వత్సల జీవితంలో ఒక రోజును చూడండి

వత్సల వయస్సు వందేళ్ళు దాటిందని చెబుతారు- ఆ విధంగా ఆమె ప్రపంచంలోనే జీవించి ఉన్న ఏనుగులలో అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచిందని గోండు ఆదివాసీ అయిన ఆమె మావటి మణిరామ్ అంటారు

వత్సల హోషంగాబాద్‌కు వచ్చిన సమయంలో మణిరామ్ ఒక మహావత్ (మావటి)కు సహాయకుడిగా ఉన్నారు. "ఆమెను ట్రక్కులలో కొయ్య దుంగలు నింపే పనిలో పెట్టారు," అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక రెండేళ్ళ తర్వాత వత్సల పన్నాకు వెళ్ళింది. "ఆ తర్వాత కొన్నేళ్ళకు పన్నాలోని మహావత్ బదిలీ మీద వెళ్ళిపోవటంతో వాళ్ళు నన్ను పిలిచారు," అన్నారు మణిరామ్. అప్పటి నుంచి ఆయన పన్నా టైగర్ రిజర్వ్‌లోని తన రెండు గదుల వసతిలో నివాసముంటూ, ప్రస్తుతం వయసు మీదపడుతోన్న ఆ ఏనుగును చూసుకుంటున్నారు.

అయితే తన నేస్తంలాగా మణిరామ్ అటవీ విభాగంలో శాశ్వత ఉద్యోగి కాదు. " జబ్ శాసన్ రిటైర్ కరా దేగా, తబ్ చలే జాయేంగే [ప్రభుత్వం నన్నెప్పుడు రిటైర్ చేస్తే అప్పుడు వెళ్ళిపోవాలి]," అన్నారతను. నెలకు రూ. 20,000 వేతనంతో ఉన్న అతని కాంట్రాక్టును ప్రతి ఏటా పునరుద్ధరిస్తారు. తానెంత కాలం పనిచేయగలడనే దాని గురించి అతనికి కచ్చితంగా తెలియదు.

"ఉదయం 5 గంటలకు నా రోజు మొదలవుతుంది," అన్నారు మణిరామ్. "నేను దలియా [గోధుమ నూక] వండి, వత్సలకు పెట్టి, ఆమెను అడవికి పంపిస్తాను." మణిరామ్ చెప్పినట్టుగా ఒక 20 ఏనుగులతో కలిసి వత్సల మేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమె నివాసాన్ని శుభ్రం చేసి, ఆమె రాత్రి భోజనమైన 10 కిలోల దలియా ను తయారుచేస్తారు. ఆ తర్వాత తన కోసం రోటీ , లేదా చావల్ (అన్నం)ను మధ్యాహ్న భోజనంగా తయారుచేసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఏనుగులన్నీ తిరిగి రాగానే, వత్సలకు స్నానం చేయించి, రాత్రి భోజనం తినిపించి ఆ నాటికి తన పనిని ముగిస్తారు.

"ఆమెకు అన్నం తినటమంటే చాలా ఇష్టంగా ఉండేది. కేరళలో ఉండగా ఆమె అన్నమే తినేది," అన్నారు మణిరామ్. కానీ 15 ఏళ్ళ క్రితం అప్పటికే 90 నుంచి వందేళ్ళ వయసున్న వత్సలపై రామ్ బహదూర్ అనే మగ ఏనుగు దాడి చేయటంతో అదంతా మారిపోయింది. ఆమెకు వీపు మీద, పొట్ట మీద గాయాలయ్యాయి. ఒక డాక్టర్‌ను పిలిపించారు. "నేనూ, డాక్టర్ సాబ్ కలిసి ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాం," మణిరామ్ చెప్పారు. కానీ ఆ దాడి వలన ఆమె చాలా బలహీనపడిపోవటంతో, ఆమె పోగొట్టుకున్న బలాన్ని కొంతైనా తిరిగి పొందటానికి ఆమె ఆహారంలో మార్పు చేయాల్సివచ్చింది.

PHOTO • Priti David
PHOTO • Sarbajaya Bhattacharya

ఎడమ: ఏనుగుల కోసం దలియా తయారుచేస్తోన్న అటవీ సంరక్షకుడు ఆశిష్. కుడి: పొద్దుటిపూట ఆహారాన్ని తినటం కోసం వత్సలను తీసుకువెళ్తున్న మణిరామ్

PHOTO • Priti David
PHOTO • Sarbajaya Bhattacharya

పదిహేనేళ్ళ క్రితం అప్పటికే 90 నుంచి వందేళ్ళ మధ్య వయసున్న వత్సలపై ఒక మగ ఏనుగు దాడిచేసింది. ఆమె వీపు పైనా, పొట్ట మీదా గాయాలయ్యాయి. 'ఆ దాడి వలన ఆమె చాలా బలహీనపడిపోవటంతో, ఆమె పోగొట్టుకున్న బలాన్ని కొంతైనా తిరిగి పొందటానికి ఆమె ఆహారంలో మార్పు చేయాల్సివచ్చింద’ని ఆమె మావటి చెప్పారు

ఆ తర్వాత ఆమె తాను చేసే పని నుండి విరమించుకుంది - ట్రక్కులలోకి కొయ్య మొద్దులను నింపడం నుంచి ఆమె పని పులులను కనిపెట్టటం, వాటిని అనుసరించటం, అడవికి కాపలాగా తిరగటం వరకు మారింది.

ఈ స్నేహితులిద్దరూ ఎడంగా ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరు బెంగపెట్టుకుంటారు. "నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమె గురించి బెంగగా అనిపిస్తుంటుంది. ఆమె ఏం చేస్తూ ఉంటుందో, సరిగ్గా తిండి తిన్నదో లేదోనని నేను ఆలోచిస్తుంటాను..." ఆ ఏనుగుకు కూడా అవే రకమైన భావనలు కలుగుతాయి - తన మావటి ఒక వారం కంటే ఎక్కువ రోజులు సెలవు మీద ఉంటే, ఆమె కడుపునిండా తినటం మానేస్తుంది.

" ఉస్‌కో పతా చల్తీ హై కి అబ్ మహావత్ సాబ్ ఆ గయే [మావటి వచ్చేశాడని ఆమె అర్థంచేసుకుంటుంది]." అన్నారు మణిరామ్. ఆయన గేటు దగ్గర, ఒక నాలుగైదు వందల మీటర్ల దూరంగా నిల్చొని ఉంటే కూడా, అతని రాకను గుర్తించినట్టుగా తొండంతో బిగ్గరగా ఘీంకరిస్తుంది.

ఏళ్ళు గడిచే కొద్దీ వారి బంధం మరింత దృఢంగా ఎదిగింది. " మేరీ దాదీ జైసీ లగ్తీ హై [ఆమె మా అమ్మమ్మ లాంటిది]," పళ్ళన్నీ కనిపించేలా విశాలంగా నవ్వుతూ అన్నారు మణిరామ్.

ఈ కథనానికి సహకరించిన దేవశ్రీ సోమానీకి రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Photographs : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Photographs : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli