ఫాతిమా బానో ఒక పద్యం చదువుతోంది: "ఫ్యాన్ పైన తిరుగుతుంది, పాప కింద పడుకుంటుంది," అని హిందీలో చెప్పింది. “నిద్రపో పాప నిద్రపో, పెద్ద ఎర్రని మంచం మీద పడుకో... ” రాజాజీ టైగర్ రిజర్వ్ లోపల ఉన్న గుజ్జర్ బస్తీలో మధ్యాహ్నం తరగతికి హాజరవుతున్న పిల్లలు అందరూ తనపైనే చూస్తోంటే, ఆ తొమ్మిదేళ్ల చిన్నారి వాన్ గుజ్జర్, ఏదో ఒకవిధంగా గుర్తించబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తోంది..
ఆ రోజు తబస్సుమ్ బీవీ ఇంటి ముందు వారి ‘పాఠశాల’ జరుగుతోంది. 5 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల సమూహం, ఒక పెద్ద దరి మీద, కొన్ని నోట్బుక్లు చేత పట్టుకుని కూర్చున్నారు. వారిలో తబస్సుమ్ బీవీ ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా ఉన్నారు; ఈ బస్తీలో దాదాపు అందరిలాగే ఆమె కుటుంబంలో వారు కూడా గేదెల పెంచుతూ, పాలు అమ్ముతూ జీవిస్తున్నారు.
2015 నుండి, పాఠశాల కునౌ చౌడ్ సెటిల్మెంట్లో యార్డ్‌లో లేదా ఇంట్లో పెద్ద గదిలో, అడపాదడపా సమావేశమవుతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. డిసెంబర్ 2020లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఫాతిమా బానో పద్యం చదువుతోంది. తరగతిలో 11 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు ఉన్నారు.
వాన్ గుజ్జర్ లో ఉన్న యువకుల బృందం ఆ బడి ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ బ్లాక్‌లోని దాదాపు 200 కుటుంబాల బస్తీ అయిన కునౌ చౌద్లో వారు నిరంతర విద్య అవసరాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. (రాష్ట్రంలోని కుమావోన్, గర్వాల్ ప్రాంతాలలో 70,000 -100,000 మధ్య వాన్ గుజ్జర్లు నివసిస్తున్నారని కమ్యూనిటీ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు; వీరిని ఉత్తరాఖండ్‌లో OBC జాబితాలో చేర్చారు. ప్రస్తుతం వీరు షెడ్యూల్డ్ తెగ గుర్తింపు కోసం డిమాండ్ చేస్తున్నారు.) టైగర్ రిజర్వ్‌లో ఉండే వీరి గుడిసెలు సాధారణంగా మట్టితో, తాటి మట్టలతో కట్టి ఉంటాయి. అటవీ శాఖ ఇక్కడ శాశ్వత నిర్మాణాలను నిషేధించింది, పైగా టాయిలెట్ సౌకర్యం లేదు. అడవిలో ప్రవహిస్తున్న సెలయేళ్ళు, వాగుల నీటినే వినియోగిస్తారు.














