“మేం హైదరాబాద్‌కు వలస వచ్చిన కొత్తలో, ఏ పని దొరికితే అది చేసేవాళ్ళం. మా కూతుర్ని బాగా చదివించడానికి కావలసినంత డబ్బు సంపాదించాలనుకున్నాం,” అన్నారు గుడ్ల మంగమ్మ. తమ మొదటి బిడ్డ కల్పన జన్మించిన వెంటనే, 2000లో మహబూబ్‌నగర్ జిల్లాలోని తమ గ్రామాన్ని విడిచి హైదరాబాద్‌కు వలస వచ్చారు గుడ్ల మంగమ్మ, ఆమె భర్త కోటయ్య.

కానీ నగరం వారిపట్ల దయగా ఏమీ లేదు. వేరే ఉద్యోగమేదీ దొరకకపోయేసరికి, తప్పనిసరియై హైదరాబాద్ నగరపు పాత బస్తీల్లోని మురుగుకాల్వలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుడుగా మారారు కోటయ్య.

అయితే, హైదరాబాద్‌లో కోటయ్య సంప్రదాయక వృత్తి అయిన బట్టలు ఉతికే వృత్తికి ఏమీ గిరాకీ ఉండేది కాదు. కోటయ్య ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి) జాబితా కిందకు వచ్చే చాకలి సముదాయానికి చెందినవారు. “మా పూర్వీకులు బట్టలుతికి, ఇస్త్రీ చేసేవారు. కానీ మాకిప్పుడు పెద్దగా పనేమీ ఉండటంలేదు; ప్రతి ఒక్కరింట్లో సొంత వాషింగ్ మెషీన్లు, ఇస్త్రీ పెట్టెలు ఉన్నాయి కదా,” వారిద్దరూ పని వెతుక్కోవడానికి ఎంత కష్టపడ్డారో వివరించారు మంగమ్మ.

నిర్మాణ స్థలాల్లో రోజువారీ కూలీ పని కోసం కూడా ప్రయత్నించారు కోటయ్య. “నిర్మాణ స్థలాలు మా ఇంటికి చాలా దూరంగా ఉండేవి. దాంతో తన ప్రయాణానికే ఎక్కువ డబ్బు ఖర్చయేది. అందుకే, ఇంటి దగ్గరలోనే దొరుకుతుంది కాబట్టి, పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేయడం మంచిదని అతననుకున్నాడు,” అన్నారు మంగమ్మ. కోటయ్య ఈ పనిని వారానికి మూడు రోజులు చేసేవారని మంగమ్మ అంచనా వేశారు. పని చేసిన రోజున కోటయ్యకు రూ. 250 వచ్చేవి.

మే నెల 2016న, ఉదయం 11 గంటలకు కోటయ్య ఇంటి నుండి బయలుదేరారని మంగమ్మ గుర్తుచేసుకున్నారు. తాను మురుగు కాలువ శుభ్రం చేయడానికి వెళ్తున్నాననీ, తిరిగి రాగానే ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఇంటి బయట ఒక బకెట్ నీళ్ళు ఉంచమనీ అతను భార్యను కోరారు. “నా భర్త సఫాయి కార్మికుడు (మునిసిపాలిటీకి చెందిన పారిశుద్ద్య కార్మికుడు) కాదు. కానీ మాకు డబ్బు అవసరం కాబట్టి ఆ పని చేసేవాడు,” అని మంగమ్మ తెలిపారు.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: హైదరాబాద్‌లోని కోఠీలో తాను నివాసముంటున్న వీధిలో గుడ్ల మంగమ్మ. కుడి: ఆమె ఇంటి గోడపై ఆమె భర్త గుడ్ల కోటయ్య ఫోటో. కోటయ్య మే 1, 2016న తన తోటి పనివాడిని కాపాడేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి మరణించారు

ఆ రోజు పాత బస్తీలో రద్దీగా ఉండే సుల్తాన్ బజార్‌లో పనిచేయడానికి కోటయ్యను పిలిపించారు. అక్కడి మురుగు కాలువలు తరచూ మూసుకుపోయి, పొంగిపొర్లుతుంటాయి. ఇలా జరిగినప్పుడు, వాటిని శుభ్రం చేసి, అడ్డుపడిన చెత్తను తొలగించడానికి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ తరఫున పనిచేసే మూడవ అంచె (థర్డ్ పార్టీ) కాంట్రాక్టర్లు మనుషులను నియమిస్తారు.

అలా నియమించినవారిలో కోటయ్య స్నేహితుడు, ఆయనతో పాటే పనిచేసే బొంగు వీరాస్వామి ఒకరు. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా మ్యాన్‌హోల్‌లోకి దిగిన వీరాస్వామి, కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయారు. తెలివితప్పి పడిపోయిన తన స్నేహితుణ్ణి రక్షించేందుకు అక్కడే పనిచేస్తున్న కోటయ్య వెంటనే మ్యాన్‌హోల్‌లోకి దూకారు. కానీ కొద్ది నిమిషాలలోనే కోటయ్య కూడా కుప్పకూలిపోయారు

ఆ ఇద్దరిలో ఎవ్వరికీ మాస్క్, చేతి తొడుగుల లాంటి రక్షణ పరికరాలేమీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు స్నేహితుల మరణాలు కూడా ఇంతకుముందు మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ చనిపోయినవారి సంఖ్యకు చేరాయి. సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం, "అపాయకరమైన మురుగు కాలువలను, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రంచేసే పని చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాల కారణంగా," దేశంలో 1993 నుండి ఏప్రిల్ 2022 మధ్య కాలంలో 971 మంది మరణించారు .

కోటయ్య, వీరాస్వామి చనిపోయిన కొన్ని గంటల తర్వాత వారిని చూసిన మంగమ్మ, “ఆ మ్యాన్‌హోల్ దుర్వాసన ఇంకా అలాగే ఉంది,” అని గుర్తుచేసుకున్నారు

గుడ్ల కోటయ్య మే 1, 2016న మరణించారు. ఆ రోజు మే డే- ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను ఎత్తిపట్టే రోజు. ఈ పారిశుద్ధ్య పనిని చేయడానికి ఒక మనిషిని నియమించడం చట్టవిరుద్ధమని కోటయ్యకు కానీ అతని భార్యకు కానీ తెలియదు; ఇది 1993 నుండి చట్టానికి విరుద్ధం. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం, 2013 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. దీనిని అతిక్రమిస్తే, రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

“ఇది (మనుషులు చేసే పారిశుద్ధ్య పని) చట్టవిరుద్ధమని నాకు తెలియదు. నా కుటుంబానికి పరిహారం ఇవ్వాలనే చట్టాలు ఉన్నాయనే విషయం, అతను చనిపోయిన తర్వాత కూడా, నాకు తెలియదు” అని మంగమ్మ అన్నారు.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: హైదరాబాద్‌లోని కోఠీ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్ భవనం బేస్‌మెంట్‌లో, ప్రస్తుతం మంగమ్మ నివాసముంటున్న ఇంటి ప్రవేశ ద్వారం. కుడి: మరణించిన కోటయ్య కుటుంబం (ఎడమ నుండి): వంశీ, మంగమ్మ, అఖిల

కోటయ్య ఎలా మరణించాడన్న విషయం తెలిసిన తర్వాత బంధువులు తమను దూరం పెడతారని కూడా మంగమ్మకు తెలియదు. “నన్ను ఓదార్చడానికి కూడా నా బంధువులు రాకపోవడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. మురుగుకాలువను శుభ్రం చేస్తూ నా భర్త చనిపోయాడని తెలుసుకున్న వారంతా నాతోనూ, నా పిల్లలతోనూ మాట్లాడడం మానేశారు” అని ఆమె తెలిపారు.

మాన్యువల్ స్కావెంజర్లను తెలుగులో ‘పాకీవాళ్ళు’ అని పిలుస్తారు. సాధారణంగా ఎవరినైనా తిట్టేటపుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. బహుశా ఇలాంటి సాంఘిక బహిష్కరణకు భయపడే, జీవనోపాధి కోసం తాను చేస్తున్న పని గురించి వీరాస్వామి తన భార్యకు చెప్పలేదు. “అతను మానవ పారిశుద్ధ్య కార్మికునిగా పని చేస్తున్నాడని నాకు తెలియదు. దానిగురించి నాతో ఎప్పుడూ చర్చించలేదు,” అని వీరాస్వామి భార్య బొంగు భాగ్యలక్ష్మి అన్నారు. ఆమెకు వీరాస్వామితో వివాహమై అప్పటికి ఏడేళ్ళయింది. “నేనెప్పుడూ అతనిపై ఆధారపడేదాన్ని,” అంటూ భాగ్యలక్ష్మి భర్తను ప్రేమగా గుర్తుచేసుకున్నారు.

కోటయ్యలాగే వీరాస్వామి కూడా వలస వచ్చినవారే. భార్య, ఇద్దరు కుమారులు – 15 ఏళ్ళ మాధవ్, 11 ఏళ్ళ జగదీశ్ – ఇంకా తల్లి రాజేశ్వరితో పాటు తెలంగాణాలోని నాగర్‌కర్నూల్ నుండి వలస వచ్చారతను. ఆ కుటుంబం రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న మాదిగ వర్గానికి చెందినది. “మా జనం చేసే ఈ పని నాకు నచ్చదు. మేం పెళ్ళి చేసుకున్నాక అతనీ పని మానేశాడనుకున్నాను,” అన్నారు భాగ్యలక్ష్మి.

మ్యాన్‌హోల్‌లో విషవాయువులు పీల్చి కోటయ్య, వీరాస్వామిలు మృతి చెందిన కొన్ని వారాల తర్వాత, వారిని ఆ పనికి నియమించిన కాంట్రాక్టర్‌, మంగమ్మ, భాగ్యలక్ష్మిలకు చెరొక రెండు లక్షల రూపాయలు అందించారు.

కొన్ని నెలల తర్వాత, మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిర్మూలించేందుకు పనిచేస్తున్న సఫాయి కర్మచారి ఆందోళన్ (SKA) అనే సంస్థ సభ్యులు మంగమ్మను సంప్రదించారు. భర్త మృతి చెందడం వలన, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల వరకూ పరిహారం లభించే అర్హత ఉందని వారు ఆమెతో చెప్పారు. 1993 నుండి మురుగు కాలువలను లేదా సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రంచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ, 2014లో ఒక సుప్రీంకోర్టు తీర్పు ఈ పరిహారాన్ని నిర్ణయించింది. ఇంకా, మానవ పారిశుద్ధ్య శ్రామికుల పునరావాసం కోసం, వారిపై ఆధారపడిన వారికోసం ప్రభుత్వం నగదు సహాయాన్నీ, మూలధన రాయితీనీ (రూ. 15 లక్షల వరకు), నైపుణ్యాభివృద్ధి శిక్షణనూ అందిస్తుంది..

ఎస్‌కెఎ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేసిన తర్వాత, 2020లో తొమ్మిదిమంది మానవ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు పూర్తి పరిహారం లభించింది. అయితే కోటయ్య, వీరాస్వామి కుటుంబాలకు మాత్రం పరిహారం అందలేదు. ఈ విషయంపై స్పందించిన సఫాయి కర్మచారి ఆందోళన్ తెలంగాణ విభాగం అధినేత్రి కె. సరస్వతి, ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ఒక న్యాయవాదితో కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: తన అత్త రాజేశ్వరితో భాగ్యలక్ష్మి. కుడి: కోటయ్య రక్షించడానికి ప్రయత్నించిన భాగ్యలక్ష్మి దివంగత భర్త , బొంగు వీరాస్వామి ఫోటో

కానీ మంగమ్మకు సంతోషంగా లేదు. "నాకు మోసపోయినట్లుగా అనిపిస్తోంది," అని ఆమె అన్నారు. "నాకు డబ్బు అందుతుందనే ఆశ కల్పించారు కానీ ఇప్పుడా ఆశ కనిపించడం లేదు."

భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, “చాలామంది కార్యకర్తలు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. అప్పుడేదో అలా ఆశ కలిగింది. కానీ ఇప్పుడు, ఆ డబ్బు వస్తుందని నాకేమీ అనిపించడం లేదు.” అన్నారు.

*****

ఈ సంవత్సరం అక్టోబరు చివరలో, హైదరాబాద్‌లోని కోఠీ ప్రాంతంలో ఉన్న ఒక పాత అపార్ట్‌మెంట్ భవనం పార్కింగ్ స్థలం వద్ద వాలుగా ఉన్న ప్రవేశద్వారం దగ్గర, మంగమ్మ ఒక కట్టెల పొయ్యి ని కడుతున్నారు. అరడజను ఇటుకలను మూడు జతలుగా ఒకదానిపై ఒకటి పేర్చితే ఒక త్రిభుజాకారపు పొయ్యి ఏర్పడింది. “నిన్న మాకు గ్యాస్ (ఎల్‌పిజి) అయిపోయింది. నవంబర్ మొదటి వారంలో కొత్త సిలిండర్ వస్తుంది. అప్పటిదాకా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తాం," అని ఆమె అన్నారు. "నా భర్త చనిపోయినప్పటి నుండి మా పరిస్థితి ఇలాగే ఉంది."

కోటయ్య చనిపోయి ఆరేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 40 ఏళ్లకు దగ్గరవుతున్న మంగమ్మ, “నా భర్త చనిపోయినప్పుడు, చాలాకాలం పాటు నేను కోలుకోలేకపోయాను. నా గుండె పగిలిపోయింది," అన్నారు.

ఆమెతో పాటు ఆమె ఇద్దరు చిన్న పిల్లలు- వంశీ, అఖిల- ఒక బహుళ అంతస్తుల భవనంలోని మసకబారిన నేలమాళిగలో - మెట్ల ప్రక్కన ఉన్న ఒక చిన్న గదిలో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో, అంతకు ముందున్న ఇంటికి రూ.5,000-7,000 అద్దె చెల్లించే పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో, 2020 చివరిలో వారు ఇక్కడికి వచ్చారు. మంగమ్మ ఆ ఐదంతస్తుల భవనానికి కాపలాగా ఉండటంతోపాటు ఆవరణను కూడా శుభ్రం చేస్తారు. అందుకామెకు నెలకు ఐదువేల రూపాయల జీతం, కుటుంబంతో కలిసి నివసించడానికి ఈ గదినీ ఇచ్చారు.

"మా ముగ్గురికి ఈ స్థలం సరిపోదు," అని ఆమె అన్నారు. ప్రకాశవంతమైన ఉదయం వేళల్లో కూడా వారి గది చీకటిగానే ఉంటుంది. అరిగిపోయిన గోడలపై కోటయ్య ఫోటోలు ఉన్నాయి; ఎత్తు తక్కువగా ఉన్న పైకప్పు నుండి ఒక ఫ్యాన్ వేలాడుతోంది. “నేను ఇకపై కల్పనను (పెద్ద కూతురు) ఇక్కడికి పిలవను. తను ఇక్కడ ఎక్కడుంటుంది? ఎక్కడ కూర్చుంటుంది?”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: నేలమాళిగలో ఉన్న మంగమ్మ ఇంటి లోపల. కుడి: ఎల్‌పిజి సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడంతో , భవనం పార్కింగ్ ప్రాంతంలో ఇటుకలతో పొయ్యి కట్టారు

2020లో, కల్పనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు, మంగమ్మ ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి వచ్చిన 2 లక్షల రూపాయలను ఆమె ఆ పెళ్లికి ఖర్చు పెట్టారు. గోషామహల్‌లోని ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు కూడా చేశారు. అతను ఆమె వద్దనుండి నెలకు 3 శాతం వడ్డీ వసూలు చేస్తాడు. నియోజకవర్గ కార్యాలయాన్ని శుభ్రం చేయడం ద్వారా ఆమె సంపాదించే దానిలో సగం ఈ అప్పు చెల్లించడానికే ఖర్చవుతుంది.

ఈ పెళ్లి ఆ కుటుంబాన్ని దివాళా తీసింది. “మాకు ఇప్పుడు 6 లక్షల రూపాయల అప్పు ఉంది. (నా సంపాదన) మా రోజువారీ ఖర్చులకే సరిపోదు" అని ఆమె చెప్పారు. అపార్ట్‌మెంట్ ఆవరణను శుభ్రం చేయడంతో పాటు ఆమెకు హైదరాబాద్ పాతబస్తీలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాన్ని శుభ్రం చేసినందుకు నెలకు రూ.13,000 వస్తాయి.

వంశీ (17) అఖిల (16) అక్కడికి సమీపంలోనే ఉన్న కళాశాలల్లో చదువుతున్నారు. వాళ్ళ చదువు కోసం, సంవత్సరానికి రూ.60,000 ఫీజు కట్టాలి. వంశీ అకౌంటెంట్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. అతను వారానికి ఆరు రోజులు, రోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాడు. రోజుకు రూ.150 సంపాదించే వంశీ, ఆ డబ్బుతో కాలేజీ ఫీజు కడుతున్నాడు.

అఖిల వైద్యవిద్య చదవాలని కలలు కంటోంది, కానీ ఆ కలను నెరవేర్చే పరిస్థితిలో తల్లి లేదు. “తన చదువు కొనసాగించడానికి కావలసిన వనరులు నా దగ్గర లేవు. తనకి కొత్త బట్టలు కూడా కొనలేని పరిస్థితి నాది,” అని మంగమ్మ నిరుత్సాహంగా చెప్పారు.

భాగ్యలక్ష్మి పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళు చదివే ప్రైవేట్ పాఠశాలకు సంవత్సరానికి రూ.25,000 ఫీజు కట్టాలి. “ఇద్దరూ బాగా చదువుతారు. వాళ్ళని చూసి నేను చాలా గర్వపడుతున్నాను,” అంటారు వెలిగిపోతోన్న మొహంతో భాగ్యలక్ష్మి.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: వీరాస్వామి కుటుంబం (ఎడమ నుండి): భాగ్యలక్ష్మి , జగదీశ్ , మాధవ్ , రాజేశ్వరి. కుడి: హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ బేస్‌మెంట్‌లోని వారి ఇల్లు

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: పార్కింగ్ ప్రాంతం వెలుపల వుంచిన భాగ్యలక్ష్మి కుటుంబానికి చెందిన కొన్ని వస్తువులు. కుడి: ప్లాస్టిక్ తెరతో విభజించివున్న వంటగది

భాగ్యలక్ష్మి కూడా శుభ్రం చేసే పనులే చేస్తున్నారు. వీరాస్వామి మరణం తర్వాత ఆమె ఈ పనిలో చేరారు. కోఠీలోని మరో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ బేస్‌మెంట్‌లోని ఒక గదిలో ఆమె తన కొడుకులతోనూ అత్తగారితోనూ కలిసి నివసిస్తున్నారు. సామానులతో నిండిపోయి ఉన్న ఆ గదిలోని చిన్న బల్లపై వీరాస్వామి ఫోటో ఉంది. ఆ సామాన్లలో చాలా వరకు ఇతరులు ఇచ్చినవో లేదా, వాడకుండా వదిలేసినవో.

లోపల కాస్తంత ఖాళీ ఉండటం కోసం, కుటుంబానికి చెందిన కొన్ని వస్తువులను వారి గది బయట ఉన్న పార్కింగ్ స్థలంలో ఒక మూలన ఉంచారు. బయట ఉంచిన కుట్టు మిషన్ మీద దుప్పట్లు, బట్టలు పోగుపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆ కుట్టుమిషన్ గురించి వివరిస్తూ,  "నేను 2014లో ఒక టైలరింగ్ కోర్సులో చేరాను. కొంతకాలం పాటు కొన్ని జాకెట్లు, ఇతర బట్టలను కుట్టాను," అన్నారు. లోపల అందరూ పడుకోవడానికి స్థలం సరిపోదు. దాంతో మాధవ్, జగదీశ్‌లు గదిని ఆక్రమించారు. భాగ్యలక్ష్మి, రాజేశ్వరి ఆరుబయట ప్లాస్టిక్ షీట్లు, చాపలపై పడుకుంటారు. వంటగది అదే భవనంలో మరో చోట ఉంది.  ప్లాస్టిక్ షీట్లతో వేరుచేసి, మసక వెలుతురున్న చిన్న స్థలం అది.

అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను శుభ్రం చేసి, నెలకి రూ.5,000 సంపాదించుకుంటున్నారు భాగ్యలక్ష్మి. “నేను అపార్ట్‌మెంట్‌లలో పనికూడా చేస్తాను. అలా నా కొడుకుల పైచదువులకు సహాయం చేస్తున్నాను.” ఇన్నేళ్ళలో వడ్డీ వ్యాపారుల దగ్గర ఆమె తీసుకున్న అప్పు దాదాపు రూ.4 లక్షలకు చేరింది. “అప్పు తీర్చడానికి ప్రతి నెలా రూ.8,000 కడుతున్నాను.” అన్నారు భాగ్యలక్ష్మి.

భవనం కింది అంతస్తులో ఉన్న వాణిజ్య విభాగానికి చెందిన కార్మికులతో ఈ కుటుంబం మరుగుదొడ్డిని పంచుకుంటుంది. "మేం దానిని పగటిపూట చాలా అరుదుగా ఉపయోగిస్తాం. ఎందుకంటే మగవాళ్ళు నిరంతరం వస్తూ పోతూ ఉంటారు,” అని ఆమె చెప్పారు. ఆమె ఆ మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి వెళ్ళే రోజుల్లో, "నా భర్తను చంపిన మ్యాన్‌హోల్‌లోని దుర్వాసన గురించే నేను ఆలోచిస్తాను. అతను నాతో చెప్పి ఉంటే బాగుండేది – నేనతన్ని ఆ పని చేయనివ్వకపోయేదాన్ని. అతనిప్పుడు జీవించి ఉండేవాడు, నేను ఈ నేలమాళిగలో చిక్కుకోకపోదును" అన్నారామె.

కథనానికి రంగ్ దే నుండి గ్రాంట్ మంజూరయింది .

అనువాదం: వై. కృష్ణ జ్యోతి

Amrutha Kosuru

Amrutha Kosuru is a 2022 PARI Fellow. She is a graduate of the Asian College of Journalism and lives in Visakhapatnam.

Other stories by Amrutha Kosuru
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi