అదొక వీరుని ప్రవేశం లాంటి శ్రేష్టమైన దృశ్యం. రవాణా, భారీ బరువులెత్తడం, ఇంకా అందులో ఇమిడివుండే ప్రమాదాలన్నిటి దృష్ట్యా పనసపండ్ల వ్యాపారం మహిళలకు తగినది కాదని ఆరుగురు పురుషులు నొక్కివక్కాణించిన ఐదు నిముషాలకు లక్ధ్మి ఆ దుకాణంలోకి ప్రవేశించారు. పసుపుపచ్చని చీర ధరించిన ఆమె నెరసిన జుట్టుని ముడి చుట్టుకున్నారు. ఆమె ముక్కుకీ చెవులకూ బంగారు నగలున్నాయి. "వ్యాపారంలో ఈమె చాలా పేరెన్నికగన్న మనిషి," అంటూ ఒక రైతు ప్రకటించారు
"మా పంటకు ధర నిర్ణయించేది ఆమే."
పణ్రుటిలో 65 ఏళ్ళ లక్ష్మి ఒక్కరే పనసపండ్ల వ్యాపారంలో ఉన్న ఏకైక మహిళ. అదేవిధంగా వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న అతి కొద్దిమంది సీనియర్ మహిళలలో ఆమె కూడా ఒకరు
తమిళనాడులోని కడలూరు జిల్లా, పణ్రుటి పట్టణం పనసపండ్లకు ప్రసిద్దిచెందినది. సీజన్‌లో వందలాది టన్నుల పనసపండ్ల కొనుగోళ్ళూ అమ్మకాలూ జరుగుతాయిక్కడ. ప్రతి సంవత్సరం పట్టణంలోని పనసపండ్ల మండీలలో ఉన్న 22 దుకాణాల్లో అమ్మకాలు జరిగే వేలాది కిలోల పనసపండ్లకు లక్ష్మి ధర నిర్ణయిస్తారు. అందుకు ఆమెకు అమ్మేవారి దగ్గర నుంచి వెయ్యి పండ్లకు రూ. 50 చొప్పున కొద్దిపాటి కమీషన్ లభిస్తుంది. రైతులు ఇష్టమైతే, అమెకు మరికొంత ఎక్కువ కమిషన్ కూడా ఇస్తుంటారు. పంటకాలంలో ఆమె సంపాదన రోజుకు రూ. 1000 నుండి రూ. 2000 వరకూ ఉంటుంది
దీన్ని సంపాదించడం కోసం ఆమె 12 గంటలపాటు పనిచేస్తారు. ఉదయం ఒంటిగంటకే ఆమె పని మొదలవుతుంది. "చాలా ఎక్కువ సరక్కు(సరుకు) ఉన్నప్పుడు నన్ను తీసుకువెళ్ళేందుకు వ్యాపారులు చాలా పెందలకడనే మా ఇంటికి వస్తారు," అని లక్ష్మి వివరించారు. తెల్లవారుఝాము 3 గంటలకే ఆమె ఆటో రిక్షాలో మండీకి చేరుకుంటారు. ఆప్పటి నుంచి ఆమె పని 'దినం' రాత్రి 11 గంటలవరకూ సాగుతుంది. ఆ తర్వాతనే ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు- తిరిగి మార్కెట్‌కు వెళ్ళేంతవరకూ...
"పనస పంటను పండించడం గురించి నాకు పెద్దగా తెలియదు," రోజంతా గంటలకు గంటలు మాట్లాడుతూ, పెద్ద గొంతుకతో అరుస్తూ ఉండటం వల్ల బొంగురుపోయిన గొంతుకతో ఆమె నాకు చెప్పారు. "అయితే వాటిని అమ్మడం గురించి నాకు కొంత తెలుసు." అంటారు లక్ష్మి వినయంగా. గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఆమె అంతకు ముందు 20 ఏళ్ళపాటు రైళ్ళలో పనసపండును అమ్మేవారు.















