జమ్మూ కశ్మీర్‌లలోని ఎత్తైన పర్వతాలపై ఒంటరి బకర్వాల్(గొర్రెల కాపరి)లు చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తారు.
ఈ పశుపోషకుల సముదాయం హిమాలయాలంతటా పెద్ద పెద్ద సమూహాలుగా తమ పశువుల మేత కోసం వెతుకుతూ తిరుగుతుంది. "ముగ్గురు నుండి నలుగురు సోదరులు వారి వారి కుటుంబాలతో కలిసి ప్రయాణిస్తారు," అని ప్రతి సంవత్సరం ఒక ఎత్తైన పచ్చికభూమి లేదా బహక్కు వెళ్ళే మొహమ్మద్ లతీఫ్ అన్నారు. "మేకలనూ, గొర్రెలనూ కలిపేయడం వలన మందను నిర్వహించడం చాలా సులువవుతుంది," ప్రతి సంవత్సరం తమతోపాటు ప్రయాణించే దాదాపు 5,000 గొర్రెలు, మేకలు, గుర్రాలు, వాటితో పాటు రెండు సాహసులైన బకర్వాల్ కుక్కల గురించి ప్రస్తావిస్తూ చెప్పారాయన.
జమ్మూ మైదానాల నుండి పీర్ పంజాల్, ఇంకా ఇతర హిమాలయ శ్రేణులలోని ఎత్తైన పచ్చికబయళ్ళ వరకు సాగే బకర్వాల్ల ప్రయాణాలు క్రమంగా దాదాపు 3,000 మీటర్ల ఎత్తు వరకూ చేరుకుంటాయి. వారు వేసవి ప్రారంభానికి ముందు మార్చి నెల చివరిలో పైకి వెళతారు; శీతాకాలం ప్రారంభమయ్యే ముందు సెప్టెంబర్ నెల వచ్చేవరకు కిందికి దిగేందుకు తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
ప్రతి యాత్రకు దాదాపు 6-8 వారాలు పడుతుంది; మహిళలు, పిల్లలు, కొంతమంది పురుషులు ముందుగా వెళ్ళే బృందం. "వాళ్ళు మాకంటే ముందే ముఖ్యమైన పచ్చికబయళ్ళ వద్దకు చేరుకుని, జీవాల మంద రాక కోసం డేరా (శిబిరం) వేసి సిద్ధంగా ఉంచుతారు," అని మొహమ్మద్ లతీఫ్ చెప్పారు. అతని బృందం రాజౌరి సమీపంలోని మైదానాల నుండి బయలుదేరి లడఖ్‌లోని జోజి లా పాస్ సమీపంలో ఉన్న మీనామర్గ్ వరకు ప్రయాణిస్తుంది.


























