"అమ్మాయి పుట్టింది" డాక్టర్ చెప్పారు.
ఇది ఆశాకి నాలుగో సంతానం- కానీ ఖచ్చితంగా ఆమెకి చివరిది కాదు. గైనకాలజిస్ట్ తన తల్లి కాంతబెన్‌ని ఓదార్చడం ఆమె విన్నది: "అమ్మా, నువ్వు ఏడవద్దు. అవసరమైతే మరో ఎనిమిది సిజేరియన్లు చేస్తాను. కానీ ఆమె అబ్బాయిని ప్రసవించే వరకు నేను ఇక్కడే ఉంటాను. అది నా బాధ్యత. "
దీనికి ముందు, ఆశ కి ముగ్గురు ఆడపిల్లలు, వారందరూ సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా పుట్టారు. ఇప్పుడు ఆమె అహ్మదాబాద్ నగరంలోని మణినగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో పిండం సెక్స్ డిటెక్షన్ పరీక్ష ఫలితం డాక్టర్ గారు చెప్తుంటే వింటున్నది. (ఇటువంటి పరీక్షలు చట్టవిరుద్ధం, కానీ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.) ఈ నాలుగు సంవత్సరాలలో ఇది ఆమె నాల్గవ గర్భం. ఆమె కాంతాబెన్ తో 40 కిలోమీటర్ల దూరంలోని ఖన్‌పర్ గ్రామం నుండి ఇక్కడకు వచ్చింది. అక్కడున్నవారు ఈ తల్లి కూతుళ్ళిద్దరినీ ఓదార్చలేకుండా ఉన్నారు. ఆశా మామగారు ఆమెను అబార్షన్ చేయించుకోడానికి అనుమతించరని వారికి తెలుసు. "ఇది మా విశ్వాసానికి విరుద్ధం" అని కాంతబెన్ అన్నారు.
మరో మాటలో చెప్పాలంటే: ఇది ఆశ కి చివరి గర్భం కాదు.
ఆశా, కాంతాబెన్ లు సాధారణంగా గొర్రెలు, మేకలను మేపుకునే భార్వాడ సంఘానికి చెందినవారు. అయితే, వీరిలో చాలా మంది అహ్మదాబాద్ జిల్లాలోని డోల్కా తాలూకాలో - ఖాన్‌పర్ గ్రామంలో ఉంటారు. కేవలం 271 గృహాలు, 1,500 మంది కంటే తక్కువ మంది జనాభా (సెన్సస్ 2011) ఉన్న ఈ గ్రామం లో - అందరు కొన్ని ఆవులను గేదెలను పెంచుతారు. సాంప్రదాయ సామాజిక సోపానక్రమంలో, కులంపరంగా వారిని తక్కువ స్థాయిలో చూస్తారు. వీరు గుజరాత్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితాలో చేర్చబడ్డారు.







