బమ్దాభైసా మొహల్లా మొత్తం నహకుల్ పాండో కోసం పెంకులను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది సంఘీభావ ప్రదర్శన, వ్యక్తులు అందరూ ఈ పెంకుల తయారీలో ఒకరి తరవాత ఒకరు వంతులు వేసుకుని చేసే ఈ సమాజ ప్రయత్నానికి ఖరీదు ఉచితమనే అనుకోవాలి - నహాకుల్ అందరి మధ్య తిరుగుతూ ఇంటిలో చేసిన ద్రాక్ష సారాయిని, ఒక్కొక్కరికి అందించడాన్ని పట్టించుకోకపోతే.

కానీ వారందరు అతని పైకప్పుకు పెంకులను ఎందుకు తయారు చేస్తున్నారు? ముందే ఉన్న పైకప్పుల పెంకులను ఉన్నట్టుడి నహకుల్ ఎలా పోగొట్టుకున్నాడు? పెంకులు లేని ఆ ఇల్లు, బట్టతల ఉన్న మనిషిలా అలా బోడిగా నిలబడి ఉంది.

“అది ఒక ప్రభుత్వ ఋణం,” అన్నాడతను. “నేను 4800 రూపాయిలు ఋణం తీసుకుని రెండు ఆవులను కొనుక్కున్నాను.” వీటిని సాఫ్ట్ లోన్ లని పిలుస్తారు. ఇది ఒక అధికారిక స్కీమ్- ఆవు కొనుక్కుంటే, దీనికి సబ్సిడీ వస్తుంది, తక్కువ వడ్డీ ఉంటుంది. 1994లో, సుర్గుజాలో ఈ డబ్బుకు రెండు ఆవులను కొనుక్కోవచ్చు(ఈ జిల్లా అప్పట్లో మధ్యప్రదేశ్ లో ఉండేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోకి మారిపోయింది)

నహకుల్ కు అసలు ఋణం తీసుకునే ఉద్దేశం లేదు. చాలామంది అతని పాండో ఆదివాసీ బంధువులు ఇలానే అప్పులు తీసుకుని అనేకసార్లు వారిని భూమిని కూడా పోగొట్టుకున్నారు. కాని ఇది  ప్రభుత్వ ఋణం, పైగా స్థానిక బ్యాంకు నుండి ఆదివాసీల  అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇస్తున్నారు. ఇది తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఏదో పాత ఉవాచ చెప్పినట్లు - ఆ సమయానికది మంచి పనిగానే తోచింది.

“కాని నేను ఆ ఋణాన్ని తీర్చలేకపోయాను,” అన్నాడు నహకుల్. పాండోలు కడు పేదవారు, వీరిని ‘ప్రత్యేక బలహీనపు గిరిజన సమూహం' గా  వర్గీకరించారు. వీరి సాధారణ స్థితికి నహకుల్ మినహాయింపు కాదు.

PHOTO • P. Sainath

నహకుల్ కూడా ఈ కార్యక్రమాన్ని శిక్షగానే అనుభవించాడు

"ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించాలని ఒత్తిడి ఉంది," అని అతను మాకు చెప్పాడు. బ్యాంకు అధికారుల నుండి చాలా తిట్లుపడ్డాడు. “నేను వేర్వేరు వస్తువులను అమ్మడం ద్వారా కొంత చెల్లించాను. చివరగా, నేను నా పైకప్పు పై ఉన్న పెంకులను అమ్మేశాను.“

అతని పేదరికాన్ని నిర్మూలించడానికి ఇచ్చిన ఋణం అతని తల పైన పైకప్పుని ఎత్తుకెళ్లిపోయింది. అతని వద్ద ఆవులు కూడా లేవు. లేదంటే వాటిని కూడా అమ్మేసేవాడే. ఆ స్కీం తన మంచి కోసమే వచ్చిందని నహకుల్ నమ్మాడు కానీ నిజానికి అతను, ఆ బాంక్ వాళ్ళు సాధించవలసిన ‘టార్గెట్’ తో సమానం. తరవాత ఇక్కడ ఉండే ఆదివాసిలలో కొందరు ఇలానే ఋణం తీసుకుని, ఈ విధంగానే శిక్షింపబడ్డారు.

"నహకుల్, ఇంకా ఈ పథకం కింద ఋణం తీసుకున్న ఇతరులకు, వారు తీసుకున్న డబ్బు అవసరం - కానీ వారికి కావలసిన వాటికి రుణాలను ఇవ్వలేదు," అని నాతో పాటు కొన్ని గ్రామాలకు వచ్చిన న్యాయవాది మోహన్ కుమార్ గిరి అన్నారు. సుర్గుజా అతని స్వస్థలం.  “వారి అవసరాలకు సంబంధం లేని పథకాల కోసం వారు దానిని తీసుకోవలసి వచ్చింది. సాధారణంగా, మీరు మీ తలపై పైకప్పును కాపాడుకోవడానికి రుణం తీసుకుంటారు. నహకుల్ తీసుకున్న అప్పు, అది కోల్పోయేలా చేసింది. ఇంతమంది ఇప్పటికీ వడ్డీ వ్యాపారి వద్దకు ఎందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమైందా?”

మేమిద్దరం, మట్టి నుండి అద్భుతమైన చక్కటి పెంకులను తయారుచేసే  నైపుణ్యం కలిగిన వారి చేతులని మెచ్చుకుంటూ అలా  చూస్తుండిపోయాము.  మా గుంపులోని మరో ఇద్దరు, ద్రాక్ష సారాయి ఆస్వాదిస్తున్న ఆ ఆదివాసీలపై అసూయపడుతూ ఉండిపోయారు.

ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్‌ లో మొదట ప్రచురించబడిన కథ 'టేక్ ఎ లోన్, లాస్ యువర్ రూఫ్' నుండి - అందులో పై ఫోటోలు వాడలేదు.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota