జూన్ 16, 2022 నాటి రాత్రి, అస్సాంలోని నొగాఁవ్ గ్రామంలో, ఇతరులందరి మాదిరిగానే లబా దాస్ కూడా ననోయ్ నది ఒడ్డున నిర్విరామంగా ఇసుక బస్తాలను ఒకదానిపై మరొకటి పేరుస్తున్నారు. బ్రహ్మపుత్రా నదికి ఉపనది అయిన ఈ నది కట్టలు తెంచుకొని పొంగిప్రవహించబోతోందని అంతకు 48 గంటల ముందే వారిని హెచ్చరించారు. ఆ నది ఒడ్డునే ఉన్న దరంగ్ జిల్లాలోని ఈ గ్రామాలకు జిల్లా యంత్రాంగం ఇసుక బస్తాలను అందించింది.

"తెల్లవారుజామున (జూన్ 17) ఒంటిగంటకు కరకట్ట విరిగిపోయింది" అని శిపాఝార్ బ్లాక్‌కు చెందిన నొగాఁవ్‌లోని హీరా సూబూరి కుగ్రామంలో నివసిస్తున్న లాబా వరదను గురించి మాట్లాడుతూ చెప్పారు. "ఇది వేర్వేరు పాయింట్ల వద్ద విరిగిపోతుండటంతో మేం ఏం చేయలేకపోయాం." అప్పటికి ఐదు రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ, నెల ప్రారంభంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. జూన్ 16-18 తేదీల మధ్య అస్సాం, మేఘాలయలలో 'అత్యంత భారీ వర్షపాతం' (రోజులో 244.5 మి.మీ, లేదా అంతకంటే ఎక్కువ) పడవచ్చునని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది..

జూన్ 16వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో, నొగాఁవ్‌కు దక్షిణంగా ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఖాశ్దిపిలా గ్రామంలోని కాలితపరా కుగ్రామంలోకి కూడా ననోయ్ ప్రవాహం విపరీతమైన శక్తితో దూసుకెళ్లింది. జయమతి కలిత కుటుంబం ఈ వరదల్లో తమ సర్వస్వాన్నీ కోల్పోయింది. "ఒక్క చెంచా కూడా మిగల్లేదు," అని తగరపు పైకప్పు ఉన్న ఒక తాత్కాలిక టార్పాలిన్ ఆశ్రయం బయట కూర్చుని ఉన్న జయమతి చెప్పారు. "మా ఇల్లు, వడ్ల కొట్టు, గోశాల బలమైన నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాయి," అన్నారామె.

అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణా యంత్రాంగం ఇచ్చిన వరద నివేదిక ప్రకారం, జూన్ 16 నాటి వర్షం కారణంగా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సుమారు 19 లక్షల మంది (1.9 మిలియన్లు) ప్రజలు ప్రభావితమయ్యారు. ఆ రాత్రి వర్షానికి రాష్ట్రంలో ఎక్కువగా దెబ్బతిన్న మూడు జిల్లాలలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు ప్రభావితమైన దరంగ్ జిల్లా కూడా ఒకటి. ననోయ్ నదీ జలాలు తన ఒడ్డును దాటి పొంగి ప్రవహిస్తున్నప్పుడు, రాష్ట్రంలోని మరో ఆరు నదులు - బెకీ, మానస్, పగ్లాదియా, పుఠిమరి, జియా-భరొలీ, బ్రహ్మపుత్ర - కూడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత వారం రోజుల పాటు వర్షాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూనే ఉన్నాయి..

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: జూన్ 16 రాత్రి ననోయ్ నదికి వరద వచ్చినపుడు దరంగ్ జిల్లాలోని ఖాశ్దిపిలా గ్రామంలో మునిగిపోయిన ప్రాంతం. కుడి: నొగాఁవ్ గ్రామంలో తంకేశ్వర్ డేకా, లబా దాస్, లలిత్ చంద్ర దాస్ (ఎడమ నుండి కుడికి). అమితంగా పెరిగిపోయిన చెట్ల వేర్లు, తెల్ల చీమలు, ఎలుకల వలన కట్ట దెబ్బతిందని తంకేశ్వర్ చెప్పారు

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: ఖాశ్దిపిలా గ్రామంలో, బలమైన ప్రవాహానికి జయమతి కలిత కుటుంబానికి చెందిన ఇల్లు, వడ్ల కొట్టు, గోశాల కొట్టుకుపోయాయి. కుడి: సమీపంలోని తాత్కాలిక ఆశ్రయం వద్ద కూర్చునివున్న జయమతి (కుడివైపు) 'ఒక్క చెంచా కూడా మిగల్లేదు' అని చెప్పారు

"మేం 2002, 2004, 2014 సంవత్సరాలలో వచ్చిన వరదలను చూశాం కానీ ఈసారి వచ్చినవి మరీ భయంకరంగా ఉన్నాయి" అని నొగాఁవ్ నుండి మోకాళ్ల లోతు నీటిలో రెండు కిలోమీటర్లు నడిచి భేరువాడోల్‌గాఁవ్ సమీపంలోని హాతిమారా వద్ద ఉన్న సమీప ప్రజారోగ్య కేంద్రానికి చేరుకున్న తంకేశ్వర్ డేకా చెప్పారు. పెంపుడు పిల్లి కరవడంతో రేబిస్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆయన జూన్ 18న అక్కడికి వెళ్లారు.

"పిల్లికి తిండి లేదు. అది ఆకలి కావచ్చు, లేదా వర్షపు నీటికి భయపడి ఉండవచ్చు. దాని యజమాని తనకు భోజనం పెట్టి రెండు రోజులైంది. మొత్తం అంతటా నీరు ఉండటంతో, దానికి తిండిపెట్టడం యజమానికి సాధ్యం కాలేదు. వంటగది, ఇల్లు, మొత్తం గ్రామమే నీట మునిగి ఉంది” అని తంకేశ్వర్ చెప్పారు. జూన్ 23న మేం తంకేశ్వర్‌ను కలిశాం. అప్పటికే అతను తాను  వేసుకోవాల్సిన ఐదు వ్యాక్సిన్ డోసులలో రెండు డోసులను వేసుకునివున్నారు. వరద నీరు దిగువన ఉన్న మంగళ్‌దోయ్ ప్రాంతం వైపుకు మళ్ళింది.

అమితంగా పెరిగిపోయిన చెట్ల వేర్లు, తెల్ల చీమలు, ఎలుకలు కరకట్టను దెబ్బతీశాయని తంకేశ్వర్ చెప్పారు. "పది సంవత్సరాల నుండీ దీనికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు," అని అతను అన్నారు. “వరి పొలాలు 2-3 అడుగుల లోతు బురదలో మునిగిపోయాయి. ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం పైనా, రోజువారీ కూలీ పైనా ఆధారపడి జీవించేవారు. వారి కుటుంబాలకు ఇప్పుడు ఎలా గడుస్తుంది?" అని తంకేశ్వర్ ప్రశ్నించారు.

ఇది లక్ష్యపతి దాస్‌ను కూడా ఇబ్బంది పెడుతున్న ప్రశ్న. అతని మూడు బిఘాల (సుమారు ఒక ఎకరం) భూమి నీట మునిగింది. "రెండు కఠాల (ఐదు కఠాలు ఒక బిఘా కు సమానం) భూమి లోని వరి మొలకలు ఇప్పుడు మొత్తం బురదమయమైపోయాయి," అని అతను ఆందోళనగా చెప్పారు. "నేను మళ్ళీ వరి నాట్లు వేయలేను."

నొగాఁవ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిపాఝార్ కళాశాలలో లక్ష్యపతి కూతురు, కొడుకు చదువుతున్నారు. “కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళకి రోజుకు 200 రూపాయలు కావాలి. ఆ డబ్బును ఎలా ఏర్పాటు చేయాలో నాకు తెలియటంలేదు. వరద నీరు తీసింది, కానీ మళ్లీ వస్తే ఏంచేయాలి? మాకు భయంగానూ, ఆందోళనగానూ ఉంది,” అని ఆయన చెప్పారు. నది గట్టును త్వరలోనే మరమ్మత్తు చేస్తారని కూడా ఆయన ఆశిస్తున్నారు.

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: మునిగిపోయిన తన భూమిని చూస్తున్న లక్ష్యపతి దాస్; కుడి: నొగాఁవ్‌లో అనేకమంది రైతుల పొలాలు చిత్తడిగా మారిపోయాయి

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: వరద నీటికి దెబ్బతిని కుళ్ళిపోతున్న బంగాళదుంపలను, ఉల్లిపాయలను వేరుచేస్తున్న లలిత్ చంద్ర దాస్. ఉల్లిపాయలు అతనికి కళ్ళనీళ్ళు తెప్పిస్తున్నాయి; కుడి: పొంగిపొర్లుతున్న చేపల చెరువు ముందు నిల్చొన్న కుటుంబానికి చెందిన ఎనిమిది మేకలలోని ఒక మేక. ‘పెద్ద చేపలన్నీ పోయాయి’

“తెల్ల గుమ్మడి తీగ చనిపోయింది, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. గుమ్మడికాయలనూ, బొప్పాయిలనూ ఊళ్ళోవాళ్ళకు పంచేశాం”, అని హీరా సూబూరి నివాసి సుమిత్రా దాస్ చెప్పారు. ఈ కుటుంబానికి చెందిన చేపల చెరువు కూడా నీటిలో కొట్టుకుపోయింది. “చెరువులో పెంచేందుకు చేప విత్తనాల కోసం రూ. 2,500 ఖర్చు చేశాను. చెరువు ప్రస్తుతం నేలకి సమతలంగా మారిపోయింది. పెద్ద చేపలన్నీ పోయాయి”, అని సుమిత్ర భర్త లలిత్ చంద్ర, వరద నీటి వలన కుళ్ళిపోయిన ఉల్లిపాయలనూ బంగాళాదుంపలనూ వేరు చేస్తూ, చెప్పారు.

సుమిత్ర, లలిత్ చంద్రలు ' బంధక్ ' విధానంలో భూమిని సాగుచేస్తారు. అంటే పంటలో నాలుగో వంతును భూయజమానికి కౌలు రూపంలో ఇవ్వాలి. వాళ్ళు తమ స్వంత వాడకం కోసం పంటను పండిస్తారు. లలిత్ కొన్నిసార్లు సమీపంలోని పొలాల్లో రోజువారీ కూలీ పని కూడా చేస్తారు. "ఈ పొలాలు మళ్లీ సాగుకు సిద్ధం కావడానికి పదేళ్ళు పడుతుంది," అన్నారు సుమిత్ర. వరదల తర్వాత కుటుంబానికి చెందిన ఎనిమిది మేకలకు, 26 బాతులకు మేత దొరకడం కూడా ఒక సమస్యగా మారిందని ఆమె చెప్పారు.

నొగాఁవ్ నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంఖలా, లొఠాపరాలలోని మార్కెట్‌లలో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి కూరగాయలనూ, నిత్యావసర వస్తువులనూ అమ్మడం ద్వారా వారి కుమారుడు లవకుశ్ దాస్‌కు వచ్చే ఆదాయంపై ఆధారపడటం ఇప్పుడా కుటుంబానికి తప్పనిసరి.

ఈ నష్టాలూ బాధల మధ్య సుమిత్ర, లలిత్‌ల కుమార్తె అంకిత హయ్యర్ సెకండరీ (12వ తరగతి) పరీక్షలో మొదటి తరగతి సాధించిందనే సంతోషకరమైన వార్త జూన్ 27న వారికి తెలిసింది. అంకితకు మరింత చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రస్తుతం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఆమె తల్లి ఏమీ తేల్చలేకపోతున్నారు.

అంకిత లాగే, 18 ఏళ్ల జుబ్లీ డేకా కూడా పైచదువులు చదవాలనుకుంటోంది. నొగాఁవ్‌లోని తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దిపిలా చౌక్‌లోని ఎన్‌ఆర్‌డిఎస్ జూనియర్ కళాశాల విద్యార్థిని అయిన జుబ్లీ అదే పరీక్షల్లో 75 శాతం మార్కులను సాధించింది. అయితే, చుట్టూ జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తున్న ఆమెకు తన భవిష్యత్తు అస్థిరంగా కనిపిస్తోంది.

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: తన ఇంటి తలుపు వద్ద నిలబడి ఉన్న జుబ్లీ డేకా. వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన మట్టితో నిండిపోయిన ఇంటి ప్రాంగణం; మధ్య: పది రోజులపాటు నీటిలో మునిగిపోయి ఉన్న తన దుకాణంలో దీపాంకర్ దాస్; కుడి: వర్షం వల్ల దెబ్బతిన్న వరి పైరును చూపిస్తున్న సుమిత్రా దాస్

"నాకు క్యాంప్‌లో ఉండడం ఇష్టం లేదు, అందుకే ఈరోజు ఇక్కడకు తిరిగి వచ్చేశాను", అని వరదలో నాశనమైన నొగాఁవ్‌లోని తన ఇంటి కిటికీలోంచి మాతో మాట్లాడుతూ చెప్పింది. నలుగురు సభ్యులున్న ఆమె కుటుంబంలోని మిగతావారు జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న సహాయక శిబిరంలో ఉన్నారు. "ఆ రాత్రి, మేం ఎక్కడికి వెళ్లాలో, ఏం తీసుకెళ్లాలో కూడా నిర్ణయించుకోలేకపోయాం," అని జుబ్లీ చెప్పింది. వారి ఇల్లు మునిగిపోతున్నప్పుడు తన కాలేజీ పుస్తకాల సంచిని మాత్రమే ఆమె సర్దుకోగలిగింది.

వానలు కురుస్తున్నప్పుడు, 23 ఏళ్ల దీపాంకర్ దాస్, సుమారు 10 రోజుల పాటు నొగాఁవ్‌లోని తన టీ కొట్టును తెరవలేకపోయాడు. అతను సాధారణంగా రోజుకు రూ. 300 సంపాదిస్తాడు, కానీ వరద తీసిన తర్వాత వ్యాపారం ఇంకా పుంజుకోలేదు. జూన్ 23న మేం అతన్ని కలిసినప్పుడు, ఒక కప్పు నానబెట్టిన మూంగ్ (పెసలు), సిగరెట్ కొనడం కోసం ఒకే ఒక వ్యక్తి అతని దుకాణానికి వచ్చారు.

దీపాంకర్ కుటుంబానికి సొంతంగా భూమి లేదు. అతని టీ కొట్టు నుండి వచ్చే ఆదాయంతోపాటు, అతని తండ్రి 49 ఏళ్ల సత్‌రామ్ దాస్ అప్పుడప్పుడూ చేసే కూలీ పనిపై వారి కుటుంబం ఆధారపడి ఉంది. "మా ఇల్లు ఇప్పటికీ ఉండడానికి వీలుగా లేదు, మోకాలి లోతు బురదలో మునిగి ఉంది," అని దీపాంకర్ చెప్పాడు. అరకొర వసతులతో కట్టిన వారి ఇంటికి చాలా మరమ్మతుల అవసరం ఉంది. అందుకు వారి కుటుంబానికి లక్ష రూపాయలకు పైనే ఖర్చవుతుందని దీపాంకర్ అన్నాడు.

"వరదలకు ముందే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ విపత్తును నివారించడం సాధ్యమయ్యేది" అన్నాడు దీపాంకర్. అతను కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో గువాహటీ(Guwahati) నుండి నొగాఁవ్‌కు తిరిగివచ్చాడు. గువాహటీలో అతను ఒక ప్రముఖ బేకరీ సంస్థకు చెందిన గొలుసు దుకాణంలో పనిచేశాడు. “గట్టు విరిగిపోబోతున్నప్పుడే వారు (జిల్లా పరిపాలనా యంత్రాంగం) ఎందుకు రావడం? ఎండల కాలంలోనే వచ్చి వుండాలి కదా!”

అసోం రాష్ట విపత్తు నిర్వహణా యంత్రాంగం చెప్పిన ప్రకారం, జూన్ 16 నాటి వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో దాదాపు 19 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు

వీడియో చూడండి: అసోంలోని దరంగ్ జిల్లా: వర్షాలూ, వరదలూ ముంచెత్తిన తర్వాత

ఇంతలో, ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగంలో ఖలాసీ గా పనిచేసే దిలీప్ కుమార్ డేకా, ఇప్పుడు తమ డిపార్ట్‌మెంట్, గ్రామంలో ఎక్కడెక్కడ గొట్టపు బావులను ఏర్పాటు చేయబోతోందో, ఆ జాబితాను మాకు చూపించారు. ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో నిర్మించిన గొట్టపు బావులు వరదల సమయంలో ప్రజలకు తాగునీటిని అందుబాటులోకి తెస్తాయి.

డిపార్ట్‌మెంట్ ఈ పనులు చేయడానికి వరదలు వచ్చి పోయేంత వరకూ ఎందుకు ఆలస్యం చేసిందని అడిగినప్పుడు, "మేం పై నుండి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తామంతే," అని ఆయన చెప్పారు. దరంగ్ జిల్లా, బ్యాస్‌పరా గ్రామంలోని దిలీప్ ఇల్లు కూడా నీట మునిగిపోయింది. జూన్ నెల ప్రారంభం నుండి, 22వ తేదీ నాటికి జిల్లాలో సాధారణం కంటే 79 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.

నిన్న (జూన్ 22) పాలనా యంత్రంగం నీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేసింది, కానీ ఈ రోజు మాకు (తాగడానికి) చుక్క నీరు లేదు,” అని జయమతి చెప్పారు. ఆమె భర్తనీ, పెద్ద కొడుకునీ కుక్క కరిచినందున వాళ్ళు రేబిస్ టీకా తీసుకునేందుకు వెళ్లారు.

మేం నొగాఁవ్ నుండి బయలుదేరుతున్నప్పుడు లలిత్ చంద్ర, సుమిత్రలు మాకు వీడ్కోలు చెప్పేందుకు వరదలో ధ్వంసమైన తమ ఇంటి నుండి బయటకు వచ్చారు. లలిత్ చంద్ర ఇలా అన్నారు, “ఎవరో ఒకరు వస్తారు, మాకు సహాయం అందించి వెళ్ళిపోతారు. కానీ మాతో ఎవరూ కూర్చుని మాట్లాడరు.".

PHOTO • Pankaj Das
PHOTO • Pankaj Das

ఎడమ: కూలిపోతున్న కరకట్టకు సంబంధించి అధికారులెవరూ స్పందించకపోవడంతో, తంకేశ్వర్ డేకా,'ఇది ఏనుగులు మరణించిన ప్రదేశం కావడంతో, ఈ ప్రాంతాన్ని హాతిమారా అని పిలుస్తారు. కట్ట మరమ్మత్తు చేయకపోతే, ఇది బానేమారా - వరదల వల్ల నాశనమైనది - అవుతుంది’ అన్నారు; కుడి: తన మేకల ఆహారం కోసం, చెట్టు చిటారు కొమ్మలకు చేరుకోవడం


PHOTO • Pankaj Das

వర్షాలూ, వరదలలో పంటలు నాశనమైపోవడం వలన నొగాఁవ్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయని దండధర్ దాస్ చెప్పారు


PHOTO • Pankaj Das

ననోయ్ నది గట్లను విరగదొక్కుకుంటూ నొగాఁవ్ గ్రామంలోకి ప్రవహించడంతో కూకటివేళ్ళతో సహా నేలకూలిన చెట్లు


PHOTO • Pankaj Das

వరి పొలం వరదలకు ముందు నారుమళ్లకు సిద్ధంగా ఉంది , కానీ ఇప్పుడు రెండు అడుగుల లోతున బురదతో నిండిపోయింది


PHOTO • Pankaj Mehta

నొగాఁవ్ గ్రామంలో నీట మునిగిన పొలాలు


PHOTO • Pankaj Das

నొగాఁవ్ సమీపంలోని దిపిలా మౌజాలోని శిబిరంలో వరద సహాయాన్ని పంపిణీ చేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ


PHOTO • Pankaj Das

ఖాశ్దిపిలా గ్రామం వద్ద శిథిలమైన నది కరకట్ట


PHOTO • Pankaj Das

నది నీరు ఎంత ఎత్తుకు చేరిందో చూపిస్తున్న ఖాశ్దిపిలా గ్రామ నివాసి


PHOTO • Pankaj Das

శిథిలమైన తమ ఇంటి పక్కన జయమతి (మధ్యలో), ఆమె కొడుకు, కోడలు


PHOTO • Pankaj Das

జూన్ 2022 లో అసోంలో సాధారణం కంటే 62 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది


PHOTO • Pankaj Das

దరంగ్ జిల్లాలోని పలు గ్రామాలను కలిపే దిపిలా-బొర్బారీ రహదారి ఇప్పుడు చాలా చోట్ల తెగిపోయింది


అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Wahidur Rahman

Wahidur Rahman is an independent reporter based in Guwahati, Assam.

Other stories by Wahidur Rahman
Pankaj Das

Pankaj Das is Translations Editor, Assamese, at People's Archive of Rural India. Based in Guwahati, he is also a localisation expert, working with UNICEF. He loves to play with words at idiomabridge.blogspot.com.

Other stories by Pankaj Das
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli