రమకు ఏప్రిల్ 1, 2022 శుక్రవారం నాటి ఉదయం అన్ని రోజులలాగే మొదలయింది. పొద్దుపొద్దున్నే 4.30కల్లా లేచి, ఇంటికి దగ్గరలోనే ఉన్న ఊరి బావి దగ్గర నుండి నీళ్ళు మోసుకొచ్చి, బట్టలుతికి, ఇల్లు శుభ్రం చేసింది. ఆ తర్వాత తన తల్లితో కలిసి కంజి(గంజి) తాగిన తర్వాత తన ఉద్యోగానికి బయల్దేరింది. తన గ్రామానికి 25 కి.మీ. దూరంలో, దిండుక్కల్ జిల్లా, వేడసందూర్ తాలూకాలో ఉండే నాచ్చి అప్పేరెల్లో ఆమె ఉద్యోగం చేస్తోంది. కానీ ఆరోజు మధ్యాహ్నం వేళకల్లా 27 ఏళ్ళ రమ, ఆమె తోటి మహిళా కార్మికులు చరిత్రను సృష్టించారు- తమ దుస్తుల తయారీ కర్మాగారంలో జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడి!
నిజాయితీగా చెప్పాలంటే, మేం అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశామనిపిస్తోంది నాకు," దిండుక్కల్ ఒప్పందం గురించి మాట్లాడుతూ అంది రమ. ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లోతింగ్ (నాచ్చి అప్పేరెల్కు మాతృసంస్థ, తిరుప్పూర్ కేంద్రగా పనిచేస్తుంది), తమిళనాడు టెక్స్టైల్ అండ్ కామన్ లేబర్ యూనియన్ (TTCU)లు ఈ ఒప్పందంపై ఆ రోజు సంతకాలు చేశాయి. తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న కర్మాగారాలలో అమలవుతున్న లింగ-ఆధారిత హింస, వేధింపులను అరికట్టడానికి ఈ ఒప్పందం జరిగింది.
ఈ మైలురాయి ఒప్పందంలో భాగంగా, టిటిసియు-ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ల మధ్య జరిగిన ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికీ, అమలు చేయడానికీ బహుళజాతి ఫ్యాషన్ బ్రాండ్ అయిన ఎచ్&ఎమ్ (H&M) 'అమలుచేయదగిన బ్రాండ్ ఒప్పందం', లేదా ఇబిఎ(EBA) పై సంతకం చేసింది. ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్వారి నాచ్చి అప్పేరెల్, స్వీడన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ దుస్తుల కంపెనీకోసం దుస్తులను ఉత్పత్తిచేస్తుంది. ఎచ్&ఎమ్ సంతకం చేసిన ఈ ఒప్పందం, ఫ్యాషన్ పరిశ్రమలో లింగ-ఆధారిత హింసను పరిష్కరించే దిశలో జరిగిన రెండవ పారిశ్రామిక ఒప్పందం.
దళిత మహిళల నాయకత్వంలో నడుస్తోన్న టెక్స్టైల్ కార్మికుల కార్మిక సంఘమైన టిటిసియులో సభ్యురాలైన రమ, గత నాలుగేళ్ళుగా నాచ్చి అప్పేరెల్లో పనిచేస్తోంది. "ఒక యాజమాన్యం, ఒక బ్రాండ్ [H&M]లు ఒక దళిత మహిళల కార్మిక సంఘంతో ఒప్పందంపై సంతకం చేస్తాయని నేనెన్నడూ అనుకోలేదు. కొన్ని నిజంగా తప్పుడు పనులకు పాల్పడిన తర్వాత, వారిప్పుడు సరైన అడుగు వేశారు," అని రమ చెప్పింది. కార్మిక సంఘంతో ఎచ్&ఎమ్ సంతకం చేసిన ఒప్పందం, భారతదేశంలో సంతకం చేయబడిన మొట్టమొదటి ఇబిఎ. ఇది చట్టానికి కట్టుబడి ఉన్న ఒప్పందం. దీని ప్రకారం సరఫరాదారైన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ టిటిసియుతో తాను చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తే, ఎచ్&మ్ దానిపై జరిమానాలు విధిస్తుంది.
కానీ, నాచ్చి అప్పేరల్లో పనిచేసే 20 ఏళ్ళ దళిత యువతి, జయశ్రీ కదిర్వేల్పై అత్యాచారం జరిపి, ఆపైన ఆమెను హత్యచేసిన ఒక ఏడాది దాటిన తర్వాత మాత్రమే, ఈస్ట్మన్ చర్చలకు రావడానికి సిద్ధపడింది. జనవరి 2021లో హత్యగావించబడటానికి ఆరు నెలల ముందునించీ కర్మాగారంలో పనిచేసే సూపర్వైజర్ జయశ్రీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆధిపత్య కులానికి చెందిన ఈ సూపెర్వైజర్పై హత్యానేరం నమోదయింది.
జయశ్రీ హత్య, ఆమె పనిచేసే దుస్తుల తయారీ కర్మాగారంపైనా, దాని మాతృసంస్థ అయిన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ పైనా ఆగ్రహజ్వాలలు రేకెత్తేలా చేసింది. ఎచ్&ఎమ్, గ్యాప్, పివిఎచ్ వంటి బహుళజాతి దుస్తుల కంపెనీలకు దుస్తుల సరఫరాదారైన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్, భారతదేశంలోని అతి పెద్ద దుస్తుల తయారీదారులలో ఒకటి. జయశ్రీకి న్యాయంచేయాలి అనే ప్రచారంలో భాగంగా యూనియన్లు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాల ప్రపంచ కూటమి, "జయశ్రీ కదిర్వేల్ కుటుంబంపై ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న బెదిరింపు చర్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని" డిమాండ్ చేసింది.







