“ఇన్నేళ్ళబట్టీ నా ఫోటోలు తీస్తున్నావు కదా, వాటిని ఏం చేస్తారు?” విషాదంలో ఉన్న గోవిందమ్మ వేలు నన్ను ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో కొడుకు సెల్లయ్య మరణించడం ఆమెను ఎంతగానో కలచివేసింది. “నాకు పూర్తిగా చూపు పోయింది. మిమ్మల్ని కూడా చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నన్నూ, ముసిలిదైపోయిన నా తల్లినీ ఎవరు చూసుకుంటారు?”
తన చేతులపై ఉన్న కోతలనూ, గాయాలనూ నాకు చూపిస్తూ, ఆవిడ ఇలా అన్నారు: “ఇంటికి రూ.200 సంపాదించి తేవడానికి నేను చాలా కష్టపడతాను. వల విసిరి రొయ్యలు పట్టే వయసులో ఉన్నానా నేను? లేదు కదా; నేనాపని చేయలేను. నా చేతుల్తో మాత్రమే వాటిని పట్టుకోగలను.” చిన్నగా, బలహీనంగా, 70 ఏళ్ళ వయసుండే ఈ రొయ్యలు పట్టే ఆవిడ, తన వయసు 77 ఏళ్ళని నమ్ముతున్నారు. “అందరూ నాతో అలాగే చెప్తారు మరి." అన్నారావిడ. “ఇసుకను తవ్వి, రొయ్యలు పట్టేటప్పుడు చేతుల మీద లోతుగా కోతలుపడతాయి. చేతులు నీటి లోపల ఉంటాయికదా, రక్తం కారుతున్నా కూడా నాకు తెలియదు!”
2019లో బకింగ్‌హామ్ కాలువ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేనామెను మొదటిసారి గమనించాను. ఉత్తర చెన్నై ప్రాంతమైన ఎన్నూర్ నుంచి పొరుగున ఉన్న తిరువళ్ళూర్ జిల్లా వరకు ప్రవహించే కొసస్థలైయారు నదికి సమాంతరంగా, ఈ కాలువ ప్రవహిస్తుంది. గ్రీబ్ పక్షిలా ఎంతో నేర్పుగా ఆమె తలవంచి కాలువలోకి దూకడం, నీటి అడుగున ఈత కొట్టడం నా దృష్టిని ఆకర్షించింది. నదీగర్భంలోని బరకగా ఉండే ఇసుక కణికెలలోకి వేగంగా తన చేతులను పోనిచ్చి, అక్కడున్న వారందరికంటే ముందుగా ఆవిడ రొయ్యలను పట్టుకున్నారు. తుంటి వరకూ ఉన్న నీటిలో నిలబడి, నడుముకు కట్టుకున్న తాటాకు బుట్టలోకి తాను పట్టుకున్న రొయ్యలను వేస్తున్నప్పుడు, ఆమె చర్మపు రంగు కాలువ నీళ్ళ రంగులో కలిసిపోయి, రెండింటికీ తేడా లేనట్లు కనిపించింది.
19వ శతాబ్దంలో నీటి రవాణా మార్గంగా నిర్మించబడిన బకింగ్‌హామ్ కాలువ, అలాగే ఎన్నూర్ గుండా ప్రవహించే కొసస్థలైయార్, అరణియార్ నదులు చెన్నై నగరవాసులకు జీవనాధారామైన నీటిని అందించే ముఖ్యమైన నీటి వనరులు.

















