ఆ ప్రకంపనలు రాచరికపు  పడక గదులను  చేరుకునే సమయానికే చాలా ఆలస్యం జరిగింది. ధ్వంసమైన బురుజులను మరమ్మత్తు చేయడానికీ ఆలస్యమైంది,  శక్తివంతమైన స్థానిక నాయకులను (సత్రాప్) , భట్రాజులను ఇక్కడికి తీసుకురావడం మరీ ఆలస్యమైంది.

లోతైన అగాధాలు సామ్రాజ్యం అంతటా సగర్వంగా పరచి ఉన్నాయి. పచ్చి గోధుమకాండాల వాసన వేస్తూ ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలపై  ఆయనకున్న ద్వేషం  కన్నా లోతుగా, ఆయన విశాల ఛాతి కన్నా వెడల్పుగా ఉన్న ఈ అగాధాలు - వీధులంతా  వ్యాపించాయి. ఆ ఆగాధాల వీధులు - సాగి సాగి రాజభవనానికి, బజారులకు, ఆయన గోశాలల గోడలకు చేరుకున్నాయి. కాని అప్పటికే చాలా  ఆలస్యమైంది.

తన అనుంగు కాకులను ఎగురవేయడం ఆలస్యమైంది.  ఇది కాసేపట్లో తొలిగిపోయే దారిలోని చిన్న అడ్డంకి మాత్రమే - అంటూ  ప్రజల మధ్య కంగారుగా పరిగెత్తుతూ,  గోలగోలగా గొడవ చేసి, ప్రకంపనల పై  విసుగును ప్రకటించడం కూడా ఆలస్యమైంది. కవాతు చేస్తున్న పాదాలను తెగనాడడమూ ఆలస్యమైంది. అబ్బా, ఆ పగిలిన, ఎండలో కమిలిన పాదాలు, అవి అతని మస్నాడ్‌(పీఠాన్ని) ని ఎలా కదిలించాయి! ఈ పవిత్ర సామ్రాజ్యం వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగుతుందని బోధించడానికి కూడా చాలా ఆలస్యమైంది. మట్టిని మొక్కజొన్న కంకులుగా మార్చిన ఆ పచ్చని చేతులు, ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అయితే ఆ బలమైన పిడికిళ్లు ఎవరెవరివి? సగం స్త్రీలవి, మూడింట ఒక వంతు బానిసత్వ భారాన్ని ఇంకా భరిస్తున్నవారివి, ఇక నాలుగోవంతు పైచిలుకు మిగిలిన వాటికన్నా పురాతన మైనవి.  వారు అద్భుతమైన హరివింటి రంగులలో  అలంకరించబడి ఉన్నారు. కొందరు  కెంపు, పసుపు రంగులలో ఉన్నారు. మరి కొందరు చినిగిన దుస్తుల్లో ఉన్నారు. అధినేత వేసుకునే పదిలక్షల డాలర్ల దుస్తుల కంటే ఈ చినిగిన బట్టలు ఇంకా ఘనంగా ఉన్నాయి. వీరు కవాతు చేస్తూ, పాడుతూ, నవ్వుతూ, ఆనందిస్తూనే మృత్యువు ఎదుర్కొని ధిక్కరించే వీరులు. వీరు నాగలి పట్టే అలసట ఎరుగని యోధులు. విరోధి  ప్రయోగించిన పవిత్రమైన రాళ్లు,  షాట్‌గన్‌లు కూడా వీరి ముందు విఫలమయ్యాయి.

ఈ ప్రకంపనలు గుండెకు బదులుగా రాచరిక సూన్యం నిండి ఉన్న చోటుకు చేరేసరికి, చాలా ఆలస్యం అయింది.

ప్రతిష్ఠా పాండ్య పద్య పఠనాన్ని వినండి

రైతులకు

1)

పేదలైన రైతులారా,
ఎందుకు నవ్వుతున్నారు?
బక్‌షాట్ వంటి
నా కనులే జవాబు”

బహుజనులైన రైతులారా,
నెత్తురోడుతున్నారెందుకు?
“నా చర్మమే ఒక పాపం,
నా ఆకలి రషీద్”

2)

కవచధార మహిళలారా,
కవాతు ఎలా చేయగలరు?
“లక్షలమంది  సాక్షిగా
సూర్యుడిని, కొడవలినీ  చేపట్టి”

పైసా లేని రైతుల్లారా,
మీరు ఎలా నిట్టూరుస్తారు?
“పట్టెడు గోధుమల్లాగా
వైశాఖ మాసంలోని వరి మొక్కల్లాగా”

3)

ఎర్రెర్రని రైతుల్లారా,
మీరు  ఊపిరెక్కడ తీసుకుంటారు?
“తుఫాను గుండెల్లోని
పంటల పండగ (లోహ్రి) కు ముందు”

ఎర్రమట్టి రైతుల్లారా,
ఎక్కడికా పరుగు?
“కొట్టుకొచ్చిన ఎండలో దొరికే
ఒక శ్లోకం కోసం, ఐక్యతా బలం కోసం."

4)

భూమిలేని రైతుల్లారా?
మీరు కలలు కనేదెప్పుడు?
“మీ భయపెట్టే అణిచివేతను
చినుకులు పెనుమంటై దహించినపుడు.”

ఇంటిమీద బెంగపడే సైనికుల్లారా?
మీరు నాట్లు వేసేదెప్పుడు?
“యుద్ధం సమసి
కాకులకు శాంతి సందేశం అందినప్పుడు.”

5)

ఆదివాసీ రైతుల్లారా,
మీరు పాడుతున్నవేమిటి ?
“కన్నుకు కన్ను,
రాజుకు పోయిన దన్ను”

రైతుల్లారా, ఈ అర్ధరాత్రి
ఏమని గావురుమన్నారు?
“రాజ్యాలు కూలబడినప్పుడు
మా భూములు అనాధలవుతాయి”


సూచీ

బక్‌షాట్: ఒక రకం షాట్ గన్ షెల్

బహుజన్: దళితులు, సూద్రులు, ఆదివాసీలు

గోశాల: ఆవుల కోసం తయారు చేయబడిన గొడ్లపాక

లోహ్రి: చలికాలం అయిపోయే ముందు పంజాబ్లో జరిగే పండగ

మస్నాద్: సింహాసనం

రషీద్: వినయం, పధ్ధతి

సత్రాప్: చక్రవర్తికి ఊడిగం చేసే సామంత రాజు

ట్రెబుచేట్ : ఒక పెద్ద ఆయుధం(ఉండేలు వంటిది)

వైశాఖి (బైసాఖ అని కూడా అంటారు): పంట అందివచ్చిన వసంతంలో - ఈ  పండుగను  ప్రధానంగా పంజాబ్‌లో జరుపుకుంటారు, కానీ ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా జరుపుకుంటారు

ఈ బృంద ప్రయత్నానికి గణనీయమైన సహకారం అందించినందుకు స్మితా ఖటోర్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అనువాదం: అపర్ణ తోట

Poems and Text : Joshua Bodhinetra

Joshua Bodhinetra is the Content Manager of PARIBhasha, the Indian languages programme at People's Archive of Rural India (PARI). He has an MPhil in Comparative Literature from Jadavpur University, Kolkata and is a multilingual poet, translator, art critic and social activist.

Other stories by Joshua Bodhinetra
Paintings : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota