ఇది గ్రామీణ ప్రాంతాలలో సాధారణ రవాణా, లారీ లేదా ట్రక్ డ్రైవర్లకు వారి సామాను డెలివరీ అయిపోయిన తరవాత ఖాళీగా వెనక్కి వస్తూ డబ్బులు సంపాదించుకునే సాధనం కూడా. ఎవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చు - మీరు కూడా, కానీ కొన్నిసార్లు ఈ బండిలో వారపు సంత తరవాత తిరిగి ఇంటికి చేరే  కిక్కిరిసిన జనాల మధ్య సందు దొరకడం కష్టం . మారుమూలనున్న గ్రామీణ ప్రాంతాలలో, ప్రతి ట్రక్కు, లారీ డ్రైవర్; వారి యజమాని చూడనప్పుడు, ఒక ఫ్రీలాన్స్  క్యాబ్ డ్రైవర్ లాగా వ్యవహరిస్తాడు. అసలు రవాణా సౌకర్యం లేని ప్రాంతాలలో అతను ఒక గొప్ప  సౌకర్యాన్ని అందిస్తాడు- కానీ అందుకు డబ్బులు తీసుకుంటాడు.

ఒడిశాలోని కోరాపుట్ హైవే దగ్గరగా ఉన్నఈ గ్రామంలో చీకటి పడుతుండగా ప్రజలు ఇంటికి వెళ్లడానికి కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో బోర్డు పై ఎంత మంది ఎక్కారో ఎవరికీ లెక్కలేదు. డ్రైవర్ కి లెక్క ఉండొచ్చు, ఎందుకంటే అతనే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నది. కానీ అతని లెక్క కూడా సరిగ్గా ఉండకపోవచ్చు- ఒక్కక్కరి నుంచి ఒక్కో ధర తీసుకుంటాడు. కొందరు కోళ్లు తీసుకురావచ్చు, కొందరు మేకలు పట్టుకురావచ్చు, కొందరి వద్ద పెద్ద పెద్ద మూటలు ఉండొచ్చు. అతను ముసలివాళ్లు వద్ద, లేక తెలిసినవారు వద్ద  తక్కువ డబ్బులు తీసుకోవచ్చు. అలా ప్రధాన రహదారి వద్ద కొన్ని తెలిసిన చోట్ల వారిని దింపుతూ సాగుతాడు. అక్కడి నుంచి వారు గబగబా కొండనెక్కి చీకట్లు ముసురుడుతుండగా ఇళ్లకు చేరతారు.

చాలామంది వారి ఇళ్ళనుండి సంతకు చేరుకోవడానికి 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. పైగా వారి ఇళ్లు ప్రధాన రహదారికి చాలా దూరంలో ఉంటాయి. రెండు నుంచి ఐదు రూపాయిల మధ్య, వారు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు, ఇది 1994లో కోరాపుట్ రహదారి వద్ద ధర. కానీ  ఆ దారి సౌకర్యం మేరకు ఈ ధర మారుతుంది. రేట్లు కూడా డ్రైవర్ కు డ్రైవర్ కు మధ్య; ప్రయాణీకుడు-డ్రైవర్, ఇద్దరిలో ఎవరు ఎంత ఎక్కువ ఎంత అవసరంగా వెళ్లాలన్న విషయం మీద; లేక ఇద్దరిలో ఎవరు బాగా బేరమాడగలరో దానిని బట్టి మారుతుంటాయి. ఇటువంటి రవాణాలో, వేల కిలోమీటర్లు ప్రయాణించిన నాకు, ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఆ డ్రైవర్ ని నేను వెనుక నుంచుని ప్రయాణించవలసిన ఆవశ్యకత గురించి ఒప్పించాలి- కుదిరితే అతని కేబిన్ పైన కూర్చుని కూడా ప్రయాణించగలను కానీ, అతనితో పాటు కేబిన్ లో కూర్చుని కాదు.

PHOTO • P. Sainath

ఈ వాహనాన్నినడిపే స్నేహశీలుడైన డ్రైవర్ కి నా ప్రతిపాదన అర్థం లేనిదిగా కనిపిస్తుంది. “కానీ నా దగ్గర ఒక ఇస్టీరియో, ఒక క్యాసెట్ ప్లేయర్ ఉంది సార్, మీరు అది వింటూ నాతొ ప్రయాణించ వచ్చు.” అన్నారాయన. అంతేగాక ఆయన దగ్గర పైరేటెడ్ సంగీతం చాలా ఉంది. ఇంతకు ముందు నేను ఆ రకంగా కూడా ప్రయాణించి సంతోషపడ్డాను. కానీ ఈసారి, ఆ రోజు తన ట్రక్ లో రవాణా చేస్తున్న మనుషులు సంతలో అనుభవాలని చెబితే విని అర్థం చేసుకోవాలనుకున్నాను. చీకటి పడుతుంది ఫోటోలు త్వరగా తీసుకోవాలని, నేను అతన్ని బ్రతిమాలాను. నేను ఇళ్లకు వెళ్తున్న అతని ప్రయాణికులతో మాట్లాడాలి . చివరికి అతను ఒప్పుకున్నాడు- కాస్త ఆశ్చర్యపోయాడనుకుంటాను - ఈ జెంటీల్ మనిషి,  మహానగరాల్లో నివసించేవాడికి కాస్త పిచ్చి ఉందేమోనని.

ఐతే ట్రక్ వెనుక ఎక్కడానికి అతను నాకు సాయం చేశాడు, అక్కడున్నవారు కూడా నా చేయనందుకుని నన్ను పైకి లాగి స్వాగతం పలికారు. అక్కడ కోళ్లు, మేకలతో పాటు, సంత నుంచి అలిసిన మొహాలతో ఉన్న మనుషులు కూడా స్నేహంగా ఆదరంగా  ఉన్నారు. నాకు వారితో మంచి సంభాషణ జరిగింది కాని, చీకటి పడేలోపు వారితో ఒకటో రెండో మంచి ఫోటోలు మాత్రమే తీసుకోగలిగాను.

ఈ వ్యాసపు చిన్న సారాంశం సెప్టెంబర్ 22, 1995 హిందూ బిజినెస్ లైన్‌లో ప్రచురితమైంది.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota