“స్టెరిలైజేషన్ చేసే మూడు స్టేజీలలో, కోయడం, మూయడం, లాప్రోస్కోపిక్ పరికరంతో ఫెలోపియన్ ట్యూబులను కట్టివేయడం, వీటన్నిటికీ సరైన వెలుతురు అవసరం.” గోస్వామి అన్నారు. ఆ మధ్యహ్నపు కాంతివంతమైన ఎండ నెమ్మదిగా బలహీనపడి సంధ్యలోకి జారుకుంటూ ఉంది. ఆ గదిలో వెలుతురు సరిపడా లేదనిపిస్తిన్నది. కానీ ఎవరూ అక్కడ ఉన్న స్టాండింగ్ ఎమర్జెన్సీ లైట్లను వేయలేదు.
ఇంకో ఐదు నిముషాలలో ఒక ఆపరేషన్ అయిపొయింది. డాక్టర్ తరవాత టేబుల్ వద్దకు వెళ్లారు. అటెండెంట్ కి చెప్పినట్లుగా, “హోగయా, డన్” అన్నారు. ఆశ వర్కర్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను టేబుల్ మీద నుండి దించి, తరవాత బృందాన్ని సిద్ధం చేసేందుకు వెళ్లింది.
ఆ పక్కనే ఉన్నగదిలో పరుపులని పరిచారు. ఆ గదిలోని పసుపు గోడలకి చెమ్మ, నాచు పట్టి ఉన్నాయి. పక్కనున్న మూత్రశాల నుంచి వాసన వస్తోంది . ఒకసారి ఆపరేషన్ అయిపోయాక, నేహాను ఈ గదిలోకి తెచ్చి ఒక మూల పడుకోబెట్టారు. ఆమె కాస్త తేరుకున్నాక ఆంబులెన్సులో తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెడతారు. అరగంట తరవాత ఆమె ఆంబులెన్స్ ఎక్కే సమయానికి నేహా ఇంకా మత్తులోనే ఉంది. ఆమె ఆపరేషన్ త్వరగా చేసేయడం ఒక కారణమైతే, మరొక కారణం ఆమెకు పూర్తిగా అనెస్తీషియా ఇవ్వక పోవడం.
తన అత్తగారితో కలిసి నేహా ఇంటికి చేరాక, ఆకాష్ వారి కోసం ఎదురు చూస్తున్నాడు. “మగవారు, వారింటికి రాగానే, వారి అమ్మా, భార్య, పిల్లలు, కుక్క వారి కోసం ఇంటి దగ్గర ఎదురు చూడాలని అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో అది తిరగబడింది.” అని ఆమె అత్తగారు అన్నది. ఆ తర్వాత నేహాకి టీ పెట్టడానికి, వారింట్లో మూల ఉన్న చిన్న వంట గదిలోకి వెళ్ళింది.
“ఇంజక్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ నొప్పి వస్తోంది”, అని కడుపు పట్టుకుని అన్నది నేహా. అక్కడ కడుపు కోసిన చోట చతురస్రాకారపు బ్యాండేజ్ వేశారు.
రెండు రోజుల తరవాత నేహా మళ్లీ వంటగదిలో చేరి, గొంతుక్కూర్చుని వంట చేస్తోంది. ఆ బ్యాండేజ్ ఇంకా ఆమె వంటి మీదే ఉంది, ఆమె మొహం మీద అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తోంది, ఆమె కుట్లు ఇంకా మానలేదు. “పర్ ఝన్ ఝట్ ఖతమ్(సమస్య తీరిపోయింది)”, అన్నది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజంలో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి మెయిల్ చేసి [email protected]కి కాపీ పెట్టండి.
అనువాదం: అపర్ణ తోట