ఈ దీపావళి కోసం తాను 10,000-12,000 వరకూ దియాల(ప్రమిదలు)ను తయారుచేశానని శ్రీకాకుళం పరదేశం చెప్పారు. ఈ వారంలో జరుపుకోబోతున్న పండుగ కోసం తొంభైరెండేళ్ళ ఈ కుమ్మరి, ఒక నెల ముందునుంచే ప్రమిదలను తయారుచేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు ఒక కప్పు టీ తాగిన తర్వాత పని ప్రారంభించే ఆయన, సాయంత్రం చీకటిపడేవరకూ - మధ్యలో కేవలం రెండుసార్లు మాత్రమే విరామం తీసుకుంటూ - పనిచేస్తారు.
కొన్ని వారాల క్రితం, అక్టోబర్ నెల ప్రారంభంలో, ఒక చిన్న దీపస్థంభంతో కలిపి దియాలను తయారుచేయటం మొదలుపెట్టారు పరదేశం. "వీటిని తయారు చేయటం కొద్దిగా కష్టం. దీపస్థంభం సరైన మందంతో ఉండేలా చూసుకోవాలి," అంటారాయన. చిన్న గిన్నె ఆకారంలో ఉండే ప్రమిదలో నింపిన నూనె ఒలికిపోకుండా, అందులో వెలిగే వత్తి మలిగిపోకుండా ఈ దీపస్థంభం (స్టాండ్) కాపాడుతుంది. మామూలు ప్రమిదను చేసేందుకు రెండు నిమిషాలు పడితే, ఈ ప్రమిదను చేయడానికి ఆయనకు ఐదు నిముషాలు పడుతుంది. అయితే తన దగ్గర ప్రమిదలు కొనేవారిని పోగొట్టుకోవడం ఇష్టంలేని ఆయన, మమూలు ప్రమిదకు తీసుకునే మూడు రూపాయలకంటే ఈ దియాకు ఒక్క రూపాయి మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నారు.
తన వృత్తిపై పరదేశంకు ఉన్న ఉత్సాహం, మమకారాల వల్ల విశాఖపట్నం, కుమ్మరివీధిలో ఉన్న ఆయన ఇంటిలో గత 8 దశాబ్దాలకు పైగా కుమ్మరి సారె నిర్విరామంగా తిరుగుతూ ఉంది. ఈ మొత్తం కాలంలో ఆయన లక్షలాది దియాలు లేదా దీపాలను తయారుచేసి దీపావళి పండుగ సమయంలో ఇళ్ళను దీపకాంతులతో వెలిగించారు. "కేవలం మా చేతులనూ, శక్తినీ, సారెనూ ఉపయోగించి ఏ ఆకారమూ లేని ఒక మట్టిముద్దను ఒక వస్తువుగా మలుస్తాం. అది ఒక కళ!" అంటారు తొంభైల వయసులో ఉన్న పరదేశం. వినికిడి శక్తి కొద్దిగా తగ్గినందువల్ల అంతగా బయటకు తిరగటం మానేసిన పరదేశం తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.
కుమ్మరి వీధి విశాఖపట్నం నగరంలో అత్యంత రద్దీగా ఉండే అక్కయ్యపాలెం మార్కెట్ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఒక ఇరుకైన వీధి. ఈ వీధిలో నివాసముండేవాళ్ళలో ఎక్కువమంది కుమ్మర సామాజికవర్గానికి చెందినవారు. సంప్రదాయకంగా ఈ కుమ్మరులు మట్టిని ఉపయోగించి దేవతా విగ్రహాలతో సహా అనేక వస్తువులను తయారుచేస్తుంటారు. పరదేశం తాతగారు విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలం పొట్నూరు నుంచి జీవనోపాధిని వెతుక్కుంటూ నగరానికి వలసవచ్చారు. తన చిన్నతనంలో ఈ వీధిలో ఉండే 30 కుమ్మరి కుటుంబాలు దేవతా విగ్రహాలతో పాటు దియాలు, మొక్కలు పెంచే కుండీలు, 'పిగ్గీ బ్యాంకులు’ (పిల్లలు డబ్బులు దాచుకునే ముంతలు), మట్టి జాడీలు, కుండలు, గిన్నెలువంటి వాటిని తయారుచేసేవారని ఆయన గుర్తుచేసుకుంటారు.
ఈనాడు, విశాఖపట్నంలో దియాలు తయారుచేసే చివరి హస్తకళాకారుడుగా పరదేశం నిలిచివున్నారు. ఇక్కడ ఉండే ఇతర కుమ్మరి కుటుంబాలు కేవలం విగ్రహాలు, ఇతర మట్టి వస్తువులను తయారుచేయడానికి మారిపోవటమో, లేదా పూర్తిగా ఈ వృత్తిని విడిచిపెట్టడమో చేశాయి. ఒక దశాబ్దం క్రితం వరకు, ఆయన కూడా పండుగల సమయాలలో విగ్రహాలను తయారు చేశారు కానీ నెమ్మదిగా ఆ పనిని ఆపేశారు. విగ్రహాల తయారీ శారీరకంగా చాలా కష్టమైన పని. గంటల తరబడి నేలపై కూర్చొని పనిచేయడం చాలా కష్టమని ఆయన చెప్పారు.













