ఆమె మాట్లాడటం మొదలుపెడుతుంది, కానీ మధ్యలోనే ఆగిపోతుంది. గాఢంగా ఊపిరి తీసుకుని, మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ ఆమె గొంతు కంపిస్తుంది. క్రిందికి చూస్తుంది, ఆమె చుబుకం వణుకుతుంది. అనితా సింగ్ దాదాపు ఏడాది కాలంగా ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నట్టే కనిపిస్తుంటారు. కానీ భర్త జ్ఞాపకాలు ఆమెని ముంచెత్తుతుంటాయి. "మాది సంతోషకరమైన చిన్న కుటుంబం," అంటారు 33 ఏళ్ళ అనిత. "నా భర్తే మాకు దిక్సూచి."

అనిత భర్త, 42 ఏళ్ల జైకర్ణ్ సింగ్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని లఖావటీ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. 2021 ఏప్రిల్ మొదటి వారంలో ఆయనకు కోవిడ్-19 లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. మేము నగరంలోని తన ఇంటిలో కలిసినప్పుడు అనిత ఇలా చెప్పారు: "ఆయనకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చాయి. కోవిడ్ రెండవ దశ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయులను పాఠశాలకు వెళ్ళమని ప్రభుత్వం చెప్పింది. అలా వెళ్ళిన ఏదో ఒకరోజున ఆయనకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి."

ఏప్రిల్ 20, 2021న జైకర్ణ్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. అతను ఊపిరి అందక సతమతమవుతున్నప్పుడు, నగరంలో ఉన్న ఏ హాస్పిటల్‌లోనూ ఆక్సిజన్ బెడ్ అందుబాటులో లేదు. "నేను ఎన్నో ఆసుపత్రులను బతిమాలాను, కానీ వారు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నందున మేము చాలా ఫోన్ కాల్స్ చేసాము. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఆయనకు ఇంట్లోనే చికిత్స చేయవలసి వచ్చింది." అని అనిత గుర్తుచేసుకున్నారు.

జ్వరం, దగ్గుతో బాధపడుతున్న జైకర్ణ్‌కు స్థానిక వైద్యుడు ఒకరు చికిత్స అందించారు. అనిత బంధువులు ఎలాగోలా ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయగలిగారు. "దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా మాకు తెలియదు. మాకు మేమే ఎలాగో నేర్చుకోవాల్సివచ్చింది. కానీ మేము హాస్పిటల్ బెడ్ కోసం వెతుకుతూనే ఉన్నాము.” అని ఆమె చెప్పారు.

ఈ మహమ్మారి భారతదేశపు నాసిరకం ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను - ముఖ్యంగా గ్రామాలలో, చిన్న పట్టణాలలో - ఎంతగానో బహిర్గతం చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం జిడిపి (2015-16లో)లో 1.02 శాతం మాత్రమే ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆధారపడేందుకు ప్రజలకు అక్కడ ఎక్కువేమీ లేదు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2017 ప్రకారం, దేశంలో 10,189 మంది ప్రజలకు ఒక్క ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ ఉన్నారు; ప్రతి 90,343 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉంది.

PHOTO • Parth M.N.

బులంద్‌షహర్‌లోని తన ఇంట్లో అనితా సింగ్. 2021లో తన భర్త మరణించినప్పటి నుండి ఆమె ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నారు

గత ఏడాది జూలైలో ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రచురించిన ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2021: ఇండియాస్ అన్ ఈక్వల్ హెల్త్‌కేర్ స్టోరీ , 2020లో దేశంలోని ప్రతి 10,000 మంది జనాభాకు 5 హాస్పిటల్ బెడ్లు, 8.6 మంది వైద్యులు ఉన్నారని పేర్కొంది. దేశం మొత్తం జనాభాలో 70 శాతం మంది ఉన్న గ్రామీణ భారతదేశంలో, మొత్తం ఆసుపత్రి పడకల సంఖ్య 40 శాతం మాత్రమే.

జైకర్ణ్ మరణంతో హాస్పిటల్ బెడ్ కోసం అనిత చేస్తున్న అన్వేషణ ముగిసింది. ఆయన ఏప్రిల్ 26, 2021న ఊపిరి తీసుకునేందుకు కష్టపడుతూ మరణించారు. అప్పటికి రెండు రోజుల తర్వాత ఆయన ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. మహమ్మారి తారాస్థాయికి చేరుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు తెగబడింది.

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలలో (ఏప్రిల్ 15-29, 2021) నిర్బంధ విధులకు వెళ్లిన ఇతరులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. మే నెల మధ్య నాటికి, కనీసం 1621 మంది పాఠశాల ఉపాధ్యాయులు కోవిడ్-19తో, లేదా 'కోవిడ్-వంటి’ లక్షణాలతో మరణించారు.

మరణించిన వారి కుటుంబాలకు, ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు చొప్పున ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే ఎన్నికల విధులకు వెళ్ళడానికి రెండు రోజుల ముందే జైకర్ణ్ మృతి చెందడంతో, అనితకు ఎలాంటి పరిహారం అందలేదు. "ఇది అన్యాయం," ఆమె దుఃఖపడుతూ చెప్పారు. “ఆయన నిజాయితీగల ప్రభుత్వోద్యోగి. అందుకు ప్రతిఫలంగా మాకు దక్కింది ఇది. నేను నా పిల్లలను ఎలా పెంచాలి? నేను వారిని సరిగ్గా పెంచాలనుకుంటున్నాను. కానీ డబ్బు లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు."

జైకర్ణ్ నెల జీతం రూ. 70,000. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి ఆయనే. జైకర్ణ్ చనిపోయినప్పటి నుంచి ఆమె కుమార్తె అంజలి(7 ఏళ్ళు), కుమారుడు భాస్కర్ (10 ఏళ్ళు) బడికి వెళ్లడం లేదు. ఆయన మరణం తర్వాత, అనితకు బులంద్షహర్ నగరంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో కారుణ్య ప్రాతిపదికపై ఉద్యోగం వచ్చింది. “నా జీతం రూ. 20,000. ఇంటిని నడపడానికి నేను చాలా కష్టపడుతున్నాను" అని అనిత చెప్పారు.

PHOTO • Parth M.N.

అనితకు ఉద్యోగం ఉంది కానీ, మరణించిన తన భర్త సంపాదన కంటే ఆమెకు వచ్చేది చాలా తక్కువ. 'నేను ఇంటిని నడపడానికి చాలా కష్టపడుతున్నాను,' అని ఆమె చెప్పారు

ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్, 2022 జనవరిలో విడుదల చేసిన ఇనిక్వాలిటీ కిల్స్ నివేదిక  ప్రకారం, భారతదేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం, మహమ్మారి ప్రారంభం కావడానికి ముందున్న వారి ఆదాయం కంటే బాగా తగ్గిపోయింది. మార్చి 2021లో, అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2020లో భారతదేశంలో మధ్యతరగతి దాదాపు 32 మిలియన్ల వరకూ తగ్గిపోయింది. అయితే పేదల సంఖ్య (రోజుకు 2 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు) 75 మిలియన్లు పెరిగినట్లు అంచనా.

2020 మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఆకస్మికంగా విధించిన కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు పోవడం, బలహీనమైన ఆరోగ్య మౌలిక సదుపాయాల వ్యవస్థ వలన దేశవ్యాప్తంగా కుటుంబాల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. కోవిడ్-19 కేసులతో ప్రజారోగ్య సౌకర్యాలపై పడిన అత్యధిక భారం వలన అనేక కుటుంబాలు వైద్యం కోసం, భరించగలిగే శక్తి లేనప్పటికీ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ వైపు మొగ్గు చూపవలసి వచ్చింది.

అటువంటివారిలో రేఖాదేవి కుటుంబం కూడా ఒకటి. ఏప్రిల్ 2021లో, ఆమె మరదలు 24 ఏళ్ళ సరిత, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడ ఆమెకు సరైన వైద్యం అందకపోవడంతో రేఖ ఆమెను అక్కడి నుంచి డిశ్చార్జి చేయించారు. చందౌలీ జిల్లాలోని తెందువా గ్రామంలోని తన గుడిసె బయట కూర్చొని ఉన్న 36 ఏళ్ల రేఖ, “మన చుట్టూ చాలామంది ప్రజలు చనిపోతున్నారు. సరితకు కోవిడ్ లేదు. కానీ ఆమె కడుపు నొప్పి మాత్రం తగ్గడం లేదు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏ వైద్యుడూ ఆమెను పట్టించుకోలేదు. అక్కడంతా ఏం జరుగుతోందో కూడా తెలియకుండా ఆమె అలా మంచం మీదనే పడుకునివుంది.” అన్నారు.

బనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రికి(బిఎచ్‌యు) తీసుకువెళ్లడానికి ఒక వారం రోజుల ముందునుండి సరిత అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త గౌతమ్ (26) ఆమెను, మొదట వారు నివసించే సోన్‌భద్ర పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇది చందౌలీ, నౌగఢ్ బ్లాక్‌లోని తెందువా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. “ఆ హాస్పిటల్‌వాళ్ళు ఆమెను ఒక రోజుపాటు అడ్మిట్ చేసుకుని, రూ. 12,000 బిల్లు చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను వేరే చోటికి తరలించాలని చెప్పారు," అని రేఖ చెప్పారు. “గౌతమ్ అందుకు నిరాకరించాడు. ఆమె ఎప్పుడైనా చనిపోవచ్చునని ఆసుపత్రివాళ్ళు చెప్పడంతో గౌతమ్ భయపడి ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చాడు. మేము వెంటనే బిఎచ్‌యుకి వెళ్ళాము."

PHOTO • Parth M.N.

తన మరదలి జబ్బుకు ఇంత ఖర్చు అవుతుందని రేఖాదేవి ఊహించలేదు. 'ఆమె వైద్య ఖర్చులు రూ. లక్ష వరకూ అయ్యాయి'

వారణాసి ఆసుపత్రి తెందువా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళేందుకు గౌతమ్, రేఖలు రూ.6,500కు ఒక వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. బిఎచ్‌యు ఆసుపత్రి నుండి సరితను డిశ్చార్జ్ చేసిన తర్వాత, వారు ఆమెను వారణాసికీ, నౌగఢ్ బ్లాక్‌కూ మధ్య ఉన్న చకియా పట్టణానికి తీసుకెళ్లారు. ఆ ప్రయాణానికి వారికి రూ. 3,500 ఖర్చయింది. "చకియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆమెను అడ్మిట్ చేసుకుని ఒక వారం పాటు చికిత్స అందచేసింది. దాంతో ఆమె అనారోగ్యం నుండి కోలుకుంది." అని రేఖ చెప్పారు. తన మరదలికి 'కడుపు నొప్పి' వస్తోందని తప్ప, ఆమెకు ఏ ఇబ్బంది ఉందో వారికి తెలియదు. "కానీ ఆమె వైద్య ఖర్చులు మాత్రం లక్ష రూపాయల వరకూ అయ్యాయి."

రేఖ, ఆమె బంధువులు ఉత్తరప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన జాతవ్ కమ్యూనిటీకి చెందినవారు. ఆమె వ్యవసాయ కూలీగా పనిచేస్తూ రోజుకు రూ.200 సంపాదిస్తారు. గౌతమ్ సోన్‌భద్రలోని రాతి గనుల్లో పని చేస్తూ రోజుకు రూ. 250 సంపాదిస్తారు. "లాక్‌డౌన్ [మార్చి 2020] అప్పటినుండి అతనికి చాలా అరుదుగా మాత్రమే పని దొరుకుతోంది. మాకు నెలల తరబడి ఆదాయం లేదు." అని రేఖ చెప్పారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతను లాక్‌డౌన్‌ల సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ గనులలో రహస్యంగా పనిచేశాడని ఆమె చెప్పారు. “మేము ప్రధానంగా ప్రభుత్వం, స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఉచిత రేషన్‌తోనే జీవించాం. సరిత అనారోగ్యానికి ఇంత ఖర్చు అవుతుందని మేము ఊహించలేదు."

ఆక్స్‌ఫామ్ ఇండియా నవంబర్ 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక, సెక్యూరింగ్ రైట్స్ ఆఫ్ పేషంట్స్ ఇన్ ఇండియా లో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 472 మంది ప్రతివాదులలో 61.47 శాతం మందికి చికిత్స అంచనా వ్యయం అందించబడలేదని కనుగొన్నారు. దేశవ్యాప్తంగా, 3,890 మంది ప్రతివాదులలో 58 శాతం మందికి ఇదే అనుభవం ఉంది. ఇది రోగుల హక్కుల ఉల్లంఘనే. జాతీయ మానవ హక్కుల కమిషన్ రూపొందించిన 17-పాయింట్ల చార్టర్ ఆఫ్ పేషెంట్స్ రైట్స్ ప్రకారం, ఒక రోగి, వారి సంరక్షకులు "పొందిన ప్రతి సేవకు ఆసుపత్రి వసూలు చేసే రేట్లపై సమాచారం పొందే హక్కును కలిగి ఉంటారు."

సరిత వైద్య ఖర్చుల కోసం రేఖ తనకున్న రెండెకరాల పొలంలో మూడో వంతు పొలం, కొన్ని నగలు తాకట్టుపెట్టాల్సి వచ్చింది. "వడ్డీలవాడు మా నుంచి నెలకు 10 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాడు. కాబట్టి మేము వడ్డీని మాత్రమే తిరిగి చెల్లిస్తున్నాము, అయితే అసలు మొత్తం [రూ. 50,000] అలా మిగిలే ఉంది. ఈ అప్పును మేం ఎప్పటికి వదుల్చుకోగలమో అనేది నాకూ తెలియదు."అన్నారు రేఖ.

PHOTO • Parth M.N.

చందౌలీ జిల్లా తెందువా గ్రామంలోని తన పొలంలో రేఖ. ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు చెల్లించడానికి ఆమె భూమిలో కొంత భాగాన్ని తాకట్టు పెట్టారు

మహమ్మారి ప్రారంభమైన మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుండి జూన్ 2020 వరకు) ఉత్తరప్రదేశ్‌లోని అనేక గ్రామాలలో ప్రజల అప్పు 83 శాతం పెరిగింది. పునాదివర్గాల సంస్థల సముదాయమైన కలెక్ట్ (COLLECT) సర్వే చేసి, తొమ్మిది జిల్లాల నుండి డేటాను సేకరించింది. 2020, జూలై-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్ నెలల్లో రుణభారం వరుసగా 87,, ఇంకా 80 శాతంగా ఉన్నట్లు ఈ సర్వే గుర్తించింది.

65 సంవత్సరాల ముస్తకీమ్ షేక్, మరింత దురదృష్టవంతుడు.

ఘాజీపూర్ జిల్లా జలాలాబాద్ గ్రామంలో కేవలం ఒక ఎకరం లోపు భూమి ఉన్న ఒక చిన్న రైతు, ముస్తకీమ్. మార్చి 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందడానికి కొన్ని రోజుల ముందు పక్షవాతం బారినపడ్డారు. అది ఆయన ఎడమ వైపు శరీరభాగాన్ని బలహీనపరచింది, ఆయన కుంటుతూ నడవవలసి వచ్చింది. “నడవడానికి నాకు కర్ర కావాలి. కానీ నేను దానిని నా ఎడమ చేతితో సరిగ్గా పట్టుకోలేను, ” అని ఆయన అన్నారు.

ఇంకెంతమాత్రం తన వ్యవసాయ భూమిలో పనిచేయలేని, కనీసం కూలీ పనులు చేయగలననే ఆశ కూడా లేదని చెప్పారు. "ఇది నేను రాష్ట్రం నుండి పొందే వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛనుపై పూర్తిగా ఆధారపడేలా చేసింది" అని ముస్తకీమ్ చెప్పారు. "నా ఈ పరిస్థితిలో, ఎవరూ నాకు డబ్బు అప్పుగా ఇవ్వరు. ఎందుకంటే వాటిని తిరిగి చెల్లించడానికి నేను అస్సలు సంపాదించలేనని వారికి తెలుసు." ఆధారపడేందుకు దాచిపెట్టిన నిధులేమీ లేవు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ ప్రకారం, గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లోని 99.5 శాతం మంది ప్రజలకు ఏ విధమైన ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య వ్యయ మద్దతు లేవు.

55 ఏళ్ల వయసున్న ముస్తకీమ్ భార్య సైరున్‌కు కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు - అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఆయన అనుమానం - ఆమెకు చికిత్స చేయించడానికి ఆయన పెద్దగా ఏం చేయలేకపోయారు. “ఆమెకు స్ట్రోక్ వచ్చి కింద పడింది. ఇది ఆమె వెన్నెముకను దెబ్బతీసింది, ”అని ఆయన చెప్పారు. ఇది ఏప్రిల్ 2020లో జరిగింది. దేశంలో మహమ్మారి అప్పుడప్పుడే వ్యాప్తి చెందడం ప్రారంభించింది. "నేను ఆమెను ఆజంగఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను, కానీ అది కోవిడ్ కేంద్రంగా మార్చబడివుంది."

PHOTO • Parth M.N.

ఘాజీపూర్ జిల్లాలోని తన గ్రామంలో ముస్తకీమ్ షేక్. ఆయనకు పక్షవాతం వచ్చినప్పటి నుండి, ఈ రైతు పూర్తిగా రాష్ట్ర పింఛనుపైనే ఆధారపడి ఉన్నారు

ఆజంగఢ్ ఆసుపత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏదైనా ప్రైవేట్ వాహనంలో అక్కడికి చేరుకోవాలంటే ఆయనకు రూ. 3,000 ఖర్చవుతుంది. "ఘాజీపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు లేనందున మేము వారణాసికి వెళ్ళవలసి వచ్చేది. [వారణాసి] ప్రయాణానికి నాకు మరింత డబ్బు ఖర్చు అవుతుంది. నా దగ్గర డబ్బు లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల గురించి నా స్నేహితులను అడిగాను. కానీ నేను వైద్య ఖర్చులు భరించలేనని గ్రహించాను." అని ఆయన చెప్పారు.

ముస్తకీమ్ సైరున్‌ను జఖానియా బ్లాక్‌లోని వారి గ్రామానికి తిరిగి తీసుకువచ్చారు. ఆమెకు స్థానికంగా చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. "ఇదే తెలివైన పని అని కూడా ఆమె చెప్పింది," అని ఆయన అన్నారు. "గ్రామంలో ఉన్న ఝోలా చాప్ (గుడ్డ సంచీ తగిలించుకునే) వైద్యుడు ఆమెకు మందులు ఇచ్చాడు."

ప్రజలు ప్రభుత్వ వైద్యులపై కంటే కూడా ఝోలా చాప్ 'వైద్యుల'పై ఎక్కువగా ఆధారపడతారు. " ఝోలా చాప్ మమ్మల్ని గౌరవంగా చూస్తారు, మా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఇతర వైద్యులు మా దగ్గరికి రావడానికి భయపడినప్పుడు వీరు మా కోసం ఉంటారు." అని ముస్తకీమ్ చెప్పారు." కానీ ఝోలా చాప్‌ లు శిక్షణ లేని వైద్యులు.

అక్టోబర్ 2020లో, ఆమెకు స్ట్రోక్ వచ్చిన ఆరు నెలల తర్వాత, సరైన చికిత్స లేకపోవడంతో సైరున్ వారి ఒంటిగది గుడిసెలో మరణించింది. "ఆసుపత్రులలో మరణించినవారు అనేక గందరగోళాల మధ్య మరణించారు, నా భార్య మరణం వాటి కంటే చాలా ప్రశాంతమైనది." అని ముస్తకీమ్ సరిపెట్టుకున్నారు.

పార్థ్ ఎం.ఎన్. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదికలు అందిస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ నియంత్రణనూ పాటించలేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli