శీతాకాలపు మధ్యాహ్నాల్లో, పొలాల్లో పని ముగించుకుని, ఇంటిలోని చిన్నోలు తమ ఉద్యోగాల కొరకు దూరంగా ఉన్నప్పుడు, హర్యాణాలోని సోనిపట్ జిల్లాలో హర్సానా కలాన్ గ్రామంలోని పురుషులు, చౌపాల్ (గ్రామ కూడలి) వద్ద తరచుగా పేకాడుతుంటారు లేదా నీడలో విశ్రాంతి తీసుకుంటారు.
అక్కడ స్త్రీలు ఎప్పుడూ కనిపియ్యరు.
"మహిళలు ఇక్కడికి ఎందుకు రావాలి?" అని స్థానిక నివాసి విజయ్ మండల్ అడిగాడు. "వారికి పని చేయడానికే సమయం లేదు. వో క్యా కరేంగే ఇన్ బడే అద్మియోన్ కే సాథ్ బైట్ కర్ ? [ఈ పెద్దమనుషుల మధ్య కూర్చుని వారు ఏమి చేస్తారు]?"
కొన్ని సంవత్సరాల క్రితం వరకు దాదాపు 5,000 మంది జనాభా మాత్రమే ఈ గ్రామంలో ఉండేవారు. ఢిల్లీ నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరు జాతీయ రాజధాని ప్రాంతంలో భాగంగా ఉండేది. స్త్రీలు ముసుగులు లేదా పర్దా ధరించే అభ్యాసాన్ని ఖచ్చితంగా పాటించేవారు.
"మహిళలు చౌపాల్ వైపు చూసేవారు కూడా కాదు," అని మండల్ చెప్పారు. దాదాపుగా గ్రామం మధ్యలో ఉన్న ఇది సమావేశాలు జరిగే ప్రదేశం. ఇక్కడ వివాదాలను పరిష్కరించడానికి పంచాయతీ సమావేశమవుతుంది. "పెహ్లే కి ఔరత్ సంస్కారీ థీ [గతంలో మహిళలు సంప్రదాయాలను గౌరవించేవారు]," అని హర్సానా కలాన్ మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ చెప్పారు.
"వారికి పరువు, గౌరవం గురించి మతింపు ఉండేది," అని మండల్ చెప్పారు, "వారు చౌపాల్ వైపు నడిచినట్లయితే వారు ముసుగు ధరించేవారు," అని అతను జోడించాడు, అతని ముఖంలో చిరునవ్వుతో ముడుతలు పడింది.
36 ఏళ్ల సైరాకు ఇవేమీ కొత్త కావు. ఆమె ఢిల్లీకి సమీపంలోని తన గ్రామమైన మజ్రా దాబాస్ నుండి 20 ఏళ్ల వధువుగా ఇక్కడికి వచ్చినప్పటి నుండి, గత 16 సంవత్సరాలుగా ఈ ఆదేశాలను చాలా వరకు అనుసరించింది. పురుషుల మాదిరిగా కాకుండా, ఆమె తన మొదటి పేరునే వాడుతుంది.
“పెళ్లికి ముందే నేను నా భర్తను కలిసి ఉంటే, ఈ వివాహానికి నేను ఎప్పుడూ అంగీకరించేదానిని కాదు. ఈజ్ గావ్ మేన్ తో కాటే నా ఆతి [ఈ గ్రామానికి రావడానికి నేను ఎప్పటికీ అంగీకరించను],” అని సైరా చెప్పింది, కుట్టు మిషన్ సూది మరియు పర్పుల్ ఫ్యాబ్రిక్ మధ్య ఆమె వేళ్లు నేర్పుగా నడుస్తున్నాయి. (ఈ కథలో ఆమె పేరు మరియు ఆమె కుటుంబ సభ్యులందరి పేర్లు మార్చబడ్డాయి.)











