ఉత్తరప్రదేశ్, లక్నోలోని తమ అద్దె ఇంటి పెరట్లో తన మూడేళ్ళ బంధువుతో కలిసి ఆడుకుంటోన్న ఏడేళ్ళ కజ్రీని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

పదేళ్ళ తర్వాత, డిసెంబర్ 2020లో, మరొక బంధువు - బ్యాంక్ ఏజెంట్ - పని కోసం పట్టణంలోని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, కజ్రీలా కనిపిస్తోన్న ఒక అమ్మాయి ఇల్లు తుడుస్తూ కనిపించింది. అతను, ఆమె తండ్రి పేరు కనుక్కుంటుండగా ఒక మహిళ వాళ్ళ సంభాషణకు అడ్డుతగిలి, వాళ్ళని మాట్లాడుకోనివ్వలేదు. అక్కడి నుండి బయటికి వచ్చిన అతను వెంటనే లక్నో వన్-స్టాప్ కేంద్రానికి కాల్ చేశారు. హింసకు గురైన మహిళలను, బాలికలను రక్షించి, వారికి అండగా నిలిచే ఉదేశ్యంతో ఆ కాల్ సెంటర్‌ను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. కొన్ని గంటల్లోనే, మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్, వన్-స్టాప్ కేంద్రం నుండి వచ్చిన ఒక పోలీసు బృందం ఆ ఇంటిపై దాడి చేసి, కజ్రీని రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించింది.

ఇప్పుడు, 21 ఏళ్ళ కజ్రీ మానసిక వైకల్యంతో జీవిస్తోంది. ఆమె తన నోట్లో, దిగువ వరుసలోని ముందు పళ్ళను కోల్పోయింది. మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురై, బాల కార్మికురాలిగా గత పదేళ్ళుగా తాను అనుభవించిన కష్టాల మసకబారిన జ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలి ఉన్నాయి.

PHOTO • Jigyasa Mishra

కేవలం ఏడేళ్ళ వయస్సులో ఇంటి నుండి అపహరణకు గురైన కజ్రీ, ఆ తర్వాత పదేళ్ళ పాటు మానవ అక్రమ రవాణాకు, లైంగిక వేధింపులకు గురై, ఇంటి పనిమనిషిగా పనిచేసింది

*****

"ఇంతకుముందు కేవలం విచారంగా ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా నిరాశా నిస్పృహలకు లోనయ్యాను," కజ్రీ తండ్రి, 56 ఏళ్ళ ధీరేంద్ర సింగ్ చెప్పారు. లక్నోలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, అద్దె ఇంట్లో ఉంటున్నారాయన. అతని భార్య, కజ్రీతో సహా ఇద్దరు కుమార్తెలు ఉత్తరప్రదేశ్, హర్దోయి జిల్లాలోని వారి సొంత ఇంటిలో నివసిస్తున్నారు.

“నేను లక్నోలోని వివిధ కంపెనీలు, కళాశాలల్లో సుమారు 15 సంవత్సరాల పాటు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను. కానీ, 2021 నుండి ఒకే చోట నా ఉద్యోగాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది. ఎందుకంటే, పోలీసు స్టేట్‌మెంట్ల కోసం, పరీక్షలు చేయించటం వంటివాటి కోసం కజ్రీని తీసుకెళ్ళడానికి చాలా రోజులు సెలవు పెట్టాల్సిన పరిస్థితి. నేను తరచుగా సెలవు అడుగుతుండడంతో, నన్ను ఉద్యోగం నుండి తొలగించేవాళ్ళు. దాంతో, నేను మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవల్సివస్తోంది,” ధీరేంద్ర వాపోయారు.

ధీరేంద్ర నెలకు సంపాదించే రూ. 9,000, అతని కుటుంబ ఖర్చులకు సరిపోదు. “నేను కజ్రీని పదే పదే లక్నోకి తీసుకురాలేను. ఆమె భద్రత ఒక ఎత్తైతే, నేను సంపాదించే కొద్దిపాటి మొత్తాన్ని ప్రయాణానికి ఖర్చు చేయడం తప్ప మరింకేమీ చేయలేకపోతున్నాను.”

కజ్రీ దొరికినప్పటి నుండి, ఈ మూడున్నరేళ్ళలో న్యాయం కోసం అతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అనేకసార్లు న్యాయ సహాయ కార్యాలయానికి, మోహన్‌లాల్‌గంజ్‌లోని పోలీస్ స్టేషన్‌కు, లక్నో కైసర్‌బాగ్‌లో ఉన్న జిల్లా కోర్టుకు తిరిగినప్పటికీ, శిక్షాస్మృతి (CrPC) సెక్షన్ 164 ప్రకారం, కజ్రీ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయలేదు. ఎందుకంటే, "కోర్టు 2020 నుంచి, అంటే కజ్రీని రక్షించినప్పటి నుంచి, పోలీసు ఎఫ్ఐఆర్ కోసం అడుగుతోంది,” అని ధీరేంద్ర వివరించారు.

డిసెంబర్ 2010లో, కజ్రీ కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత, ధీరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 363 , 364 ల కింద (కిడ్నాప్ ఆరోపణలు) పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ పత్రం చిరిగిపోయింది; అందులోని చేతిరాత వెలిసిపోయింది. పద్నాలుగేళ్ళ తర్వాత దాన్ని ఇప్పుడు చదవడం అసాధ్యం. 2020లో, కజ్రీని రక్షించిన తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో ఫాలో-అప్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, పోలీసుల దగ్గర కూడా ఈ 2010 నాటి ఎఫ్ఐఆర్ కాపీ — డిజిటల్ రూపంలో గానీ, ఫిజికల్‌గా గానీ - లేదు..

మరో మాటలో చెప్పాలంటే, కోర్టుకు అవసరమైన ‘2020 ఎఫ్ఐఆర్’ ఉనికిలోనే లేదు కాబట్టి కజ్రీ కేసు కూడా న్యాయవ్యవస్థలో లేదు.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

కజ్రీ దొరికిన మూడున్నరేళ్ళలో, ఆమె తండ్రి ధీరేంద్ర న్యాయం కోసం అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ ఫలితాన్నివ్వలేదు. న్యాయ సహాయ కార్యాలయానికి, మోహన్‌లాల్‌గంజ్‌లోని పోలీస్ స్టేషన్‌కు, లక్నో కైసర్‌బాగ్‌లో ఉన్న జిల్లా కోర్టుకు అనేకసార్లు వెళ్ళినా ఫలితం లేకపోయింది

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ: తన తల్లిదండ్రులతో కజ్రీ. కుడి: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఉన్న వారి ఇల్లు

“కజ్రీని రక్షించిన వెంటనే, ఆమెతో పని చేయించుకుంటోన్న ఆ ఇంటి మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 2010లో ఆమె అదృశ్యమైనప్పుడు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కిడ్నాప్ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆమెను రక్షించిన తర్వాత అక్రమ రవాణా కు, లైంగిక వేధింపు లకు గురి చేసినందుకుగాను సదరు ఐపిసి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చాలా ముఖ్యం,” కేసు గురించి అవగాహన ఉన్న లక్నోకు చెందిన న్యాయవాది అపూర్వ శ్రీవాస్తవ్ అన్నారు. “కజ్రీ వాంగ్మూలాన్ని పోలీసుల వద్ద, మేజిస్ట్రేట్ వద్ద వీలైనంత త్వరగా నమోదుచేసి ఉండాల్సింది, కానీ మేజిస్ట్రేట్ వద్ద నమోదు చేయటం ఇప్పటికీ జరగనేలేదు.”

కజ్రీని రక్షించిన 48 గంటల్లో, శిక్షాస్మృతి  సెక్షన్ 161 ప్రకారం, మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. లక్నోలోని రెండు ఆసుపత్రుల్లో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేశారు. మొదటి ఆసుపత్రిలో కజ్రీ పొత్తికడుపుపైన ఒక గాయపు మచ్చను, కింది దవడలో కొన్ని పళ్ళు లేకపోవటాన్ని, ఆమె కుడి రొమ్ముపై నల్లగా కమిలిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇక రెండవ ఆసుపత్రిలో ఆమెను మనోరోగచికిత్సా విభాగానికి సూచించారు.

2021లో ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కజ్రీకి 50-55 ఐక్యూతో “తేలికపాటి మానసిక మాంద్యం” ఉందని తెలిసింది. ఇది “50 శాతం వైకల్యాన్ని” సూచిస్తుంది. ఇలా గుర్తించిన తరువాత కజ్రీని ఏడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి, ఆమె మానసిక వ్యాధికి అవసరమైన చికిత్సను, కౌన్సెలింగ్‌ను అందించారు. “సుదీర్ఘమైన లైంగిక దాడులకు, మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులకు ఈ పునరావాసం సరిపోదు. మానసిక గాయం నుంచి, అపరాధ భావన నుంచి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లక్షణాల నుండి బయటపడేందుకు వీరికి సుదీర్ఘ చికిత్స, కౌన్సెలింగ్ అవసరం. వెలివేతను, నిందలు మోపడాన్ని ఎదుర్కోవడానికి సామాజిక సమైక్యత ఉండేలా చూడటం కూడా చాలా ముఖ్యం,” అని శ్రీవాస్తవ్ తెలిపారు.

తగినంత మానసిక-సామాజిక మద్దతు లేకపోవడం, సరైన సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో 2010 నుండి 2020 మధ్యకాలం నాటి కజ్రీ జీవిత వివరాలు అస్పష్టంగా ఉన్నాయి, సమయం గడిచేకొద్దీ అవి మరింత చివికిపోతాయి.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

కజ్రీపై జరిగిన శారీరక దాడుల గుర్తులు

“ఇద్దరు వ్యక్తులు నా నోటిని కట్టేసి నన్ను ఎత్తుకెళ్ళారు. వాళ్ళు నన్ను బస్సులో చిన్‌హట్‌కి తీసుకెళ్ళారు,” డిసెంబర్ 2010 ఉదయాన, తాను కిడ్నాప్ అయిన సంఘటనను గుర్తుచేసుకుంటూ భోజ్‌పురి-హిందీ కలగలిసిన భాషలో చెప్పింది కజ్రీ. చిన్‌హట్ కజ్రీని రక్షించిన లక్నోలోని ఒక బ్లాక్; ఆమెను నిర్బంధించిన ఇంట్లోవాళ్ళు మాట్లాడుకునే భాష భోజ్‌పురి. ఆమె తరచుగా ' నంగే గోడ్ రఖ్తే థే' అని పదే పదే చెబుతుంది. దీని అర్థం 'వాళ్ళెప్పుడూ నన్ను దిసపాదాలతో ఉంచేవారు’ అని.

ఇంటి మొదటి అంతస్తులో, రేఖ అనే మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉండేవారని కజ్రీకి జ్ఞాపకముంది. కింది గదుల్లో చాలామంది అద్దెకి ఉండేవాళ్ళని కూడా ఆమె గుర్తుచేసుకుంది.

“నాకు రోజుకు రెండుసార్లు రెండు రోటీలు ఇచ్చేవాళ్ళు. అంతకు మించి దేనికీ అనుమతి లేదు. నన్ను ఎప్పుడూ దిసపాదాలతో ఉంచేవాళ్ళు. చలికాలంలో కూడా వాళ్ళు నాకు దుప్పటి గానీ, పట్టా గానీ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు ఇచ్చేవల్లా చిరిగిపోయిన పాత బట్టలు... మహీనా (రుతుక్రమం) వచ్చినప్పుడు, రేఖ నాకు మురికి బట్టలను ఇచ్చేది. కొన్నిసార్లు ఆమె నన్ను పోఛా (ఇల్లు తుడిచే గుడ్డ) వాడమని చెప్పేది.” కజ్రీ చెప్పింది.

ఇల్లు ఊడ్చడం, తుడవడం, వంట చేయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులన్నిటినీ తాను ఎప్పుడూ ఒక నీడలా పరచుకొన్న హింసాత్మక వాతావరణంలో చేసేదని కజ్రీ గుర్తుచేసుకుంది. ఒకసారి, రుచిలేని భోజనం వండిందని కజ్రీ ముఖంపై కొట్టింది రేఖ. దాంతో, ఆమె కింది వరసలోని ముందువైపు దంతాలు విరిగిపోయాయి.

“నాకు రుతుక్రమం లేనప్పుడు, ఆమె నన్నొక గదికి తీసుకువెళ్ళేది,” కజ్రీ నేలవైపు చూస్తూ చెప్పింది. ఆ ఇంట్లో నివసించే వ్యక్తి “లోపల నుండి గదిని మూసి, నా బట్టలు విప్పి, నాపై పడుకుని, తనకు నచ్చింది చేసేవాడు. నేను అతనిని ఆపడానికి ప్రయత్నిస్తే, బలవంతం చేసేవాడు. అలాగే, తన ఇంట్లో అద్దెకు ఉంటున్నవారిని కూడా ఆ పని చేయడానికి పిలిచేవాడు. నన్ను వాళ్ళ మధ్య పడుకోబెట్టుకునేవాళ్ళు.”

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ: కజ్రీ పాదాల మీద, పొట్ట మీద ఉన్న గాయాల ఫోటోలు. కుడి: ఈ కేసుకు సంబంధించి కజ్రీ తండ్రి సేకరించిన పత్రాలు, సమాచారమంతా ఒక ఇనుప అలమారాలో భద్రంగా ఉంది

ఆమెను మొదటిసారి రక్షించినప్పుడు, “తనతో ఇంటి పనులు చేయించుకున్నందుకు, పదేపదే తనపై అత్యాచారం చేసే అవకాశం ఇచ్చినందుకు, ఇంట్లో అద్దెకు ఉంటున్నవారి నుండి రేఖ డబ్బు తీసుకునేదని కజ్రీ ఆరోపించింది,” అని ధీరేంద్ర తెలిపారు.

ఇక ఆ తండ్రి అలసిపోయారు. “మేం జనవరి 2021 నుండి న్యాయం కోసం పరుగులు పెడుతూనేవున్నాం,” అన్నారాయన. ఇక్కడ ఆయన ప్రస్తావించిన ‘మేము’లో స్థిరమైన, చట్టపరమైన సహాయం లేదు. లక్నోకు చెందిన అసోసియేషన్ ఫర్ అడ్వకసీ అండ్ లీగల్ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ (AALI) అనేది మహిళలపై జరిగే హింసకు సంబంధించిన ప్రజాహితమైన (pro-bono) కేసులను చేపట్టే లాభాపేక్షలేని ఒక న్యాయ సహాయ సంస్థ. 2020లో, వన్-స్టాప్ సెంటర్ ద్వారా ధీరేంద్ర దానిని సంప్రదించారు. అప్పటి నుండి, కజ్రీ కేసులో కనీసం నలుగురు లాయర్లు మారారు.

AALI నుండి వచ్చిన ప్రస్తుత న్యాయవాది ధీరేంద్రకు కొత్త ఫిర్యాదుకు సంబంధించిన ముసాయిదాను పంపారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. కానీ, ఆ తండ్రి అందులోని కొన్ని వాస్తవ తప్పిదాలను ఎత్తిచూపినప్పుడు, సదరు న్యాయవాది చీవాట్లు పెట్టడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ ముసాయిదాపై ధీరేంద్ర సంతకం చేయలేదు, ఆ న్యాయవాది సవరించిన ముసాయిదాను పంపలేదు.

“తమ ఫోన్ కనపడకపోతేనే అందరూ ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తారు. అలాంటిది, ఇక్కడ నా కూతురు అక్రమ రవాణాకు గురై, పదేళ్ళు బానిసగా బతికింది. అయినా ఎవరూ ఏమీ చేయలేదు,” అని ధీరేంద్ర బాధపడ్డారు. అతని పట్టుదలకి, సంకల్పానికి నిదర్శనంగా ఆయన జాగ్రత్తగా భద్రపరిచిన పత్రాలు, ఎన్వలప్‌లు, ఫోటోల రాశి – 2010 నుండి కజ్రీ కేసు కోసం ఆయన సేకరించిన సమాచారమంతా – ఒకటి ఇనుప అల్మారాలోని లాకర్లో భద్రంగా ఉంది.

ఈ కథనం, భారతదేశంలో లైంగిక, జెండర్-ఆధారిత హింస (SGBV) నుండి బయటపడిన వారి సంరక్షణ కోసం సామాజిక, సంస్థాగత, నిర్మాణాత్మక అడ్డంకులపై దృష్టి సారించే దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఇది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండియా అందించిన ప్రేరణలో భాగం.

గుర్తింపును కాపాడటం కోసం హింస నుంచి బయటపడిన వ్యక్తుల, వారి కుటుంబ సభ్యుల పేర్లను మార్చాం.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Reporting and Cover Illustration : Jigyasa Mishra

জিজ্ঞাসা মিশ্র উত্তরপ্রদেশের চিত্রকূট-ভিত্তিক একজন স্বতন্ত্র সাংবাদিক।

Other stories by Jigyasa Mishra
Editor : Pallavi Prasad

পল্লবী প্রসাদ মুম্বই-ভিত্তিক একজন স্বতন্ত্র সাংবাদিক, ইয়ং ইন্ডিয়া ফেলো এবং লেডি শ্রী রাম কলেজ থেকে ইংরেজি সাহিত্যে স্নাতক। তিনি লিঙ্গ, সংস্কৃতি এবং স্বাস্থ্য ইত্যাদি বিষয়ের উপর লেখেন।

Other stories by Pallavi Prasad
Series Editor : Anubha Bhonsle

২০১৫ সালের পারি ফেলো এবং আইসিএফজে নাইট ফেলো অনুভা ভোসলে একজন স্বতন্ত্র সাংবাদিক। তাঁর লেখা “মাদার, হোয়্যারস মাই কান্ট্রি?” বইটি একাধারে মণিপুরের সামাজিক অস্থিরতা তথা আর্মড ফোর্সেস স্পেশাল পাওয়ারস অ্যাক্ট এর প্রভাব বিষয়ক এক গুরুত্বপূর্ণ দলিল।

Other stories by Anubha Bhonsle
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi