మా ఇల్లు ఇందిరా కాలనీ అ నే ఒక ఆదివాసీ గ్రామంలో ఉంది. వివిధ ఆదివాసీ సముదాయాలకు చెందిన 25 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మా గ్రామంలో ఒక నీళ్ళ ట్యాంకు, మరుగుదొడ్డి; తాగు నీటి కోసం ఒక బావి ఉన్నాయి.
గ్రామంలో కొందరికి వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, వంగ, మొక్కజొన్న, ఝులన, బెండ, కాకర, గుమ్మడితో పాటు కొలాతా (ఉలవలు), కందులు, పెసలు వంటి వివిధ రకాల పప్పు దినుసులు కూడా పండిస్తారు. చాలామంది మా తిండి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగు చేస్తుంటారు. వర్షాకాలంలో ఈ వరి సాగు జరుగుతుంది.
వరి పంట కోతలు అయ్యాక మేం తినడం కోసం సరిపోయేంత ధాన్యాన్ని ఉంచుకొని మిగిలిన ధాన్యాన్ని అమ్మేస్తాం. వీటిని అమ్మడంతో వచ్చే డబ్బు ఎరువులు, ఇంకా పంటపై మేం పెట్టిన పెట్టుబడిపై ఆధారపడివుంటుంది.
మా ఊళ్ళో ఉన్న కొన్ని ఇళ్ళు గడ్డితో కప్పినవి. గడ్డి మమ్మల్ని ఎండ వేడిమి నుంచి, వర్షాల నుంచి, చలి నుంచి కాపాడుతుంది. ప్రతి ఏడాదీ లేదా రెండేళ్ళకోసారి ఈ గడ్డిని మార్చాల్సివుంటుంది. మా ఇళ్ళను మరమ్మత్తు చేసుకునేందుకు మేం బగులీ గడ్డి, సాలువా, వెదురు, లాహి, ఇంకా అడవి నుంచి తెచ్చిన కలపను ఉపయోగిస్తాం.








