"మేం చదువుకుందామని కూర్చున్నప్పుడు ఇంటి పైకప్పు నుంచి మా పుస్తకాల మీదకు వాన నీరు బొట్లుబొట్లుగా కారుతుంటుంది. కిందటి సంవత్సరం (2022) జులైలో మా ఇల్లు కూలిపోయింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది," అంటాడు ఎనిమిదేళ్ళ విశాల్ చవాన్ బరువైన రాళ్ళు, వెదురు బొంగులతో కట్టిన తన ఇంటి గురించి మాట్లాడుతూ.

ఆళేగావ్ జిల్లా పరిషత్తు బడిలో మూడవ తరగతి చదువుతున్న విశాల్ కుటుంబం, మహారాష్ట్రలో సంచార తెగగా నమోదయిన బేల్దార్ సముదాయానికి చెందినది.

"వర్షం పడినప్పుడు పాక లోపల ఉండడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది... నీరు చాలా చోట్ల నుంచి కారుతుంటుంది," అంటాడు విశాల్. అందుకని, శిరూర్ తాలూకా ఆళేగావ్ పాగా అనే ఊరిలో ఉన్న తమ ఇంటిలో చదువుకోడానికి విశాల్, అతని తొమ్మిదేళ్ళ వయసున్న అక్క వైశాలి, పైకప్పు నుంచి నీరు కారని చోటు కోసం వెతుకుతూ ఉంటారు

చదువు మీద ఈ అక్కాతమ్ముళ్ళకున్న మక్కువే 80 ఏళ్ళ వయసున్న వాళ్ళ నాయనమ్మ శాంతాబాయి చవాన్‌ను చాలా గర్వపడేలా చేస్తుంది. "మా మొత్తం ఖాన్‌దాన్ (కుటుంబం)లో ఎవ్వరూ బడికి పోలేదు," అంటారావిడ, "నా మనవడు, మనవరాలే చదవడం రాయడం నేర్చుకున్న మొదటివారు."

తన మనవడు, మనవరాలి గురించి మాట్లాడేటప్పుడు ముడతలు పడిన ఆమె ముఖంలో గర్వంతో కూడిన బాధల నీడలు కనపడతాయి. "వాళ్ళు సౌకర్యంగా చదువుకోవడానికి మాకు పక్కా ఇల్లు లేదు. సరైన వెలుతురు కూడా లేదు," అంటారు, ఆళేగావ్ పాగా వస్తీ లోని తమ టార్పాలిన్ పాకలో ఉన్న శాంతాబాయి.

Left: Nomadic families live in make-shift tarpaulin tents supported by bamboo poles.
PHOTO • Jyoti
Right: Siblings Vishal and Vaishali Chavan getting ready to go to school in Alegaon Paga village of Shirur taluka.
PHOTO • Jyoti

ఎడమ: సంచార తెగలకు చెందినవారు వెదురు బొంగుల సాయంతో తాత్కాలికంగా కట్టిన టార్పాలిన్ గుడారాలలో నివసిస్తారు. కుడి: శిరూర్ తాలూకా, ఆళేగావ్ పాగా గ్రామంలో ఉండే బడికి బయలుదేరుతున్న అక్కాతమ్ముళ్ళు విశాల్, వైశాలి

Vishal studying in his home (left) and outside the Alegaon Zilla Parishad school (right)
PHOTO • Jyoti
Vishal studying in his home (left) and outside the Alegaon Zilla Parishad school (right)
PHOTO • Jyoti

తన ఇంటిలో చదువుకుంటోన్న విశాల్ (ఎడమ), ఆళేగావ్ జిల్లా పరిషద్ పాఠశాల (కుడి) బయట

వెదురు బొంగుల ఊతంతో కట్టిన ఈ త్రిభుజాకారపు నిర్మాణం లోనికి వెళ్ళడానికి ఐదు అడుగుల ఎత్తున్న మనిషి కూడా వంగి వెళ్ళాల్సి ఉంటుంది. బేల్దార్, ఫాసే పార్ధీ, భిల్ సముదాయాలవారికి చెందిన 40 గుడిసెల సమూహంలో వీళ్ళది కూడా ఒకటి. ఇది పుణే జిల్లాలోని ఆళేగావ్ ఊరికి బయట 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. "ఇలా పాకల్లో నివసించడం ఇబ్బందిగా ఉంటుంది," అంటారు శాంతాబాయి. "కానీ ఈ పిల్లలు ఏం అనరు, సర్దుకుపోతారు."

పాకపై కప్పిన టార్పాలిన్ పట్టాలు కూడా చినిగిపోయాయి. ఏదైనా మరమ్మత్తులు చేయడం గానీ, ఆ పట్టాలను మార్చడం గానీ చేసి తొమ్మిదేళ్ళకు పైనే అవుతోంది.

"మా అమ్మానాన్నలెప్పుడూ ఇంటికి దూరంగా పనిలోనే ఉంటారు," అంటాడు విశాల్, పుణేలో ఒక రాళ్ళ క్వారీలో పనిచేసే తన తల్లిదండ్రులైన సుభాష్, చందాల గురించి మాట్లాడుతూ. వాళ్ళు రాళ్ళని కొట్టి, వాటిని ట్రక్ లోకి ఎక్కించి రోజుకు చెరొక వంద రూపాయలు సంపాదిస్తారు. అలా పనిచేసి నెలకి సంపాదించిన ఆరు వేల రూపాయలతో వారు అయిదు మంది ఉన్న కుటుంబాన్ని పోషిస్తున్నారు. "నూనె, తిండిగింజలు, అన్నీ చాలా ఖరీదుగా ఉన్నాయి. మేమింక డబ్బులెలా కూడబెడతాం?" అంటారు 42 ఏళ్ళ వయసున్న విశాల్ తల్లి చందా. "ఇంక మేం ఇల్లేం కట్టుకుంటాం?"

*****

మహారాష్ట్రలోని సంచార తెగలవారికి ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ, సొంతానికి ఒక గట్టి ఇల్లు కట్టుకోవడమనేది చవాన్ కుటుంబానికి ఒక కలగానే మిగిలిపోయింది. శబరి ఆదివాసీ ఘర్‌కుల్ పథకం, పార్ధీ ఘర్‌కుల్ పథకం, యశ్వంతరావు చవాన్ ముక్త్ వసాహత్ యోజన వంటి పథకాల కోసం కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. "ఏ ఘర్‌కుల్ యోజనను (గృహ నిర్మాణ పథకం) ఉపయోగించుకోవాలన్నా మేమెవరమో నిరూపించుకోవాలి. మా జాత్ (సముదాయం)ని ఎలా నిరూపించుకోవాలి?" అంటారు చందా.

దేశవ్యాప్తంగా ఉన్న సంచార తెగలలో నాసిరకమైన ఇళ్ళ నిర్మాణ ఏర్పాట్లు సర్వసాధారణమని 2017లో వచ్చిన ఇదాతే కమిషన్ నివేదిక చూపుతోంది. "మీరే చూడండి మేం ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నామో," అంటూ ఈ విషయాన్ని ఎత్తిచూపారు చందా. కమిషన్ సర్వే చేసిన తొమ్మిదివేల ఇళ్ళలో ఏభై శాతం ఇళ్ళు పాక్షిక పక్కా ఇళ్ళు లేదా తాత్కాలిక నిర్మాణాలు కాగా, ఎనిమిది శాతం మంది గుడారాలలో నివసించే కుటుంబాలు.

Left and Right: Most nomadic families in Maharashtra live in thatched homes
PHOTO • Jyoti
Left and Right: Most nomadic families in Maharashtra live in thatched homes.
PHOTO • Jyoti

మహారాష్ట్రలోని సంచార తెగలకు చెందిన చాలా కుటుంబాలు గడ్డితో కట్టిన ఇటువంటి ఇళ్ళలోనే నివసిస్తున్నాయి

ప్రభుత్వ పథకాల కొరకు అవసరమయ్యే కాగితాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఉన్న సమస్యల గురించి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని డీనోటిఫైడ్ (నేరస్థ ముద్ర నుంచి విముక్తిపొందిన తెగలు), సంచార, పాక్షిక సంచార తెగల జాతీయ కమిషన్ అందుకున్నట్లుగా నమోదయింది కూడా. అటువటి 454 పిటిషన్‌లలో 304 పిటిషన్‌లు కేవలం కుల ధృవీకరణ పత్రానికి సంబంధించినవే.

మహారాష్ట్ర షెడ్యూల్డ్ కులాల , షెడ్యూల్డ్ తెగల, డీనోటిఫైడ్ తెగల (విముక్త జాతులు), సంచార తెగల, ఇతర వెనుకబడిన తరగతుల, ప్రత్యేక వెనుకబడిన విభాగం (జారీ మరియు ధృవీకరణ నిబంధనలు) కుల ధృవీకరణ పత్రం చట్టం, 2000 ప్రకారం దరఖాస్తుదారులు ఆ ప్రాంతంలో శాశ్వత నివాసితులనీ, లేదా వారి పూర్వికులు నిర్ధారించిన తేదీలలో (డి-నోటిఫైడ్ తెగల విషయంలో అది 1961) అక్కడ నివసించినట్టుగానూ నిరూపించాల్సి ఉంటుంది. "ఈ నిబంధనతో, కుల ధృవీకరణ పత్రం పొందడం అంత సులభం కాదు," అంటారు శిరూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సునీతా భోసలే.

సునీత ఇంకా మాట్లాడుతూ, "భట్‌క్యా-విముక్త్ జాతి (డి-నోటిఫైడ్ తెగలు)కి చెందిన అనేక తరాల కుటుంబాలవారు ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తిరుగుతూ ఉంటారు," అన్నారు. "అసలు 50 -60 ఏళ్ళ క్రితం నాటి నివాస సంబంధ రుజువులను తీసుకురావడం ఎలా సాధ్యం? ఈ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది."

ఫాసే పార్ధీ తెగకు చెందిన సునీత 2010లో క్రాంతి అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. ఈ సంస్థ డి-నోటిఫైడ్ తెగలకు సంబంధించిన కేసులను చూసుకుంటుంది. అంతేకాక, కుల ధృవీకరణ పత్రాలను, ఆధార్ కార్డులను, రేషన్ కార్డులను, ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగపడే ఇతర అధికారిక పత్రాలను ఈ సంస్థ ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. "గత 13 ఏళ్ళలో మేం 2000 మందికి పైగా ప్రజలకు కుల ధృవీకరణ పత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చాం," అంటారు సునీత.

క్రాంతి వాలంటీర్లు పుణే జిల్లాలోని దౌండ్, శిరూర్ తాలూకాల లోనూ, అహ్మద్‌నగర్ జిల్లాలోని శ్రీగోందా తాలూకా లోనూ మొత్తం 229 గ్రామాలలోని సుమారు 25,000 మంది ఫాసే పార్ధీ, బేల్‌దార్, భిల్ వంటి డి-నోటిఫైడ్ తెగల జనాభాతో కలిసి పనిచేస్తున్నారు.

Left: Poor housing arrangements are common among nomadic tribes who find it difficult to access housing schemes without a caste certificate.
PHOTO • Jyoti
Right: The office of the Social Justice and Special Assistance Department, Pune
PHOTO • Jyoti

ఎడమ: కుల ధృవీకరణ పత్రాలు లేకుండా గృహ నిర్మాణ పథకాలను వినియోగించుకోవడం కష్టంగా ఉన్న సంచార తెగలవారికి నాసిరకమైన నిర్మాణ ఏర్పాట్లున్న నివాసాల్లో ఉండడం మామూలైపోయింది. కుడి: పుణే లోని సామాజిక న్యాయం మరియు ప్రత్యేక సహాయ విభాగంవారి కార్యాలయం

సర్టిఫికెట్లను సమకూర్చే ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నదని, సమయం తీసుకుంటుందని, ఖరీదైనదని కూడా అని ఆమె చెప్పారు. “పదే పదే తాలూకా కార్యాలయానికి వెళ్ళడానికి, జిరాక్స్ [ఫోటోకాపీ] కోసం మీరు మీ స్వంత జేబులో నుండి డబ్బు ఖర్చు చేయాలి. మీరు కాగితాల మీద కాగితాల మీద కాగితాలను రుజువులుగా సమర్పిస్తూనే ఉండాలి. అప్పటికి జనం కుల ధృవీకరణ పత్రాలు పొందుతామనే ఆశను వదులుకుంటారు,” అని సునీత వివరించారు.

*****

"ఇల్లు అని చెప్పుకునే చోటు మాకు ఎన్నడూ లేదు," అంటారు విక్రమ్ బర్డే. "నా చిన్నప్పటినుంచి ఎన్ని చోట్లకు మా నివాసాన్ని మార్చుకున్నామో చెప్పలేను. జనం మమ్మల్ని నమ్మరు. ఇప్పటికి కూడా. అందుకే మేం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారుతూ ఉంటాం. ఊరివారు మేమెవరిమో తెలియగానే మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని ఒత్తిడిపెడతారు" అంటారు ముప్పై ఆరేళ్ళ విక్రమ్.

ఫాన్సే పార్ధీ తెగకు చెందిన విక్రమ్, ఒక రోజు కూలీ. ఆయన తన భార్య రేఖతో కలిసి రేకుల కప్పుతో ఉండే ఒక ఒంటిగది ఇంట్లో నివసిస్తున్నారు. ఆళేగావ్ పాగా వస్తీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కురూళీ గ్రామానికి బయట ఉన్న 50 భిల్లు, పార్ధీ కుటుంబాల సెటిల్‌మెంట్‌లో వీరి ఇల్లు కూడా ఒకటి.

విక్రమ్‌కు పదమూడేళ్ళ వయసున్నప్పుడు 2008లో అతని తల్లితండ్రులు జాల్నా జిల్లా, జాల్నా తాలూకా లోని భిల్‌పురి ఖుర్ద్ అనే అనే ఊరికి వలస వచ్చారు. "మేం భిల్‌పురి ఊరి బయట ఒక కుడాచా ఘర్ (పూరి గుడిసె)లో ఉండేవాళ్ళమని నాకు గుర్తుంది. మా నానమ్మ తాతయ్యలు బీడ్‌లోని ఏదో ఒక ఊరిలో నివసించేవారమని చెప్పేవారు," అన్నారు కొద్దిగా గుర్తుతెచ్చుకుంటూ. (చదవండి: No crime, unending punishment ).

2013లో విక్రమ్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం పుణేలో తాను నివసించే ప్రదేశానికి వలస వచ్చారు. ఆయన, భార్య రేఖ (28)తో కలిసి వ్యవసాయ కూలీగానూ, నిర్మాణ ప్రదేశాలలో పని చేయడానికిగానూ పుణే జిల్లాలోని వేరు వేరు ఊర్లకు తిరుగుతుంటారు. "మేం రోజుకి మొత్తం 350 రూపాయలు సంపాదిస్తాం, ఒకోసారి 400 రూపాయలు. రెండు వారాలకు మించి మాకు పని దొరకదు," అంటారు విక్రమ్.

Vikram Barde, a daily-wage worker, lives with his wife Rekha in a one-room house with a tin roof. ' We never had a place to call home,' the 36-year-old says, “I can’t recall how many times we have changed places since my childhood'
PHOTO • Jyoti
Vikram Barde, a daily-wage worker, lives with his wife Rekha in a one-room house with a tin roof. ' We never had a place to call home,' the 36-year-old says, “I can’t recall how many times we have changed places since my childhood'.
PHOTO • Jyoti

రోజు కూలీ అయిన విక్రమ్ బర్డే తన భార్య రేఖతో కలిసి రేకుల కప్పు ఉన్న ఒక ఒంటిగది ఇంటిలో నివసిస్తున్నారు. 'మాకు ఇల్లు అని చెప్పుకునే చోటు ఎన్నడూ లేదు,' అంటారు ముప్పై ఆరేళ్ళ విక్రమ్. "నా చిన్నతనం నుండి మేం ఎన్ని ప్రదేశాలు మారి ఉంటామో చెప్పలేను’

రెండేళ్ళ క్రితం, కుల ధృవీకరణ పత్రం కోసం విక్రమ్ ప్రతీ నెల 200 రూపాయలు ఖర్చు చేసేవారు. తన దరఖాస్తు ఏమైందో తెలుసుకోవడానికి విక్రమ్ 10 కిలోమీటర్ల దూరంలో శిరూర్‌లో ఉన్న బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయానికి నెలకు నాలుగైదుసార్లు ప్రయాణించేవారు.

"రాను పోను షేర్ ఆటో ఖర్చు అరవై రూపాయలు. ఆ తరువాత జెరాక్స్. ఆ తరువాత కార్యాలయంలో చాలా సమయం ఎదురుచూడాల్సి వచ్చేది. నా రోజువారీ కూలిని వదులుకోవాల్సి వచ్చేది. నా నివాసానికి సంబంధించిన రుజువులు కానీ, కుల ధృవీకరణ పత్రం గానీ నా దగ్గర లేవు. అందుకే వెళ్ళటం ఆపేశాను," అన్నారు విక్రమ్.

వారి పిల్లలు కరణ్ (14), సోహమ్ (11) పుణేలోని ముళాశీ తాలూకా, వడగావ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కరణ్ తొమ్మిదవ తరగతి, సోహమ్ ఆరవ తరగతి  చదువుతున్నారు. "మా పిల్లలే మాకున్న ఏకైక నమ్మకం. వాళ్ళు బాగా చదువుకుంటే, వాళ్ళకు మాలాగా తిరుగుతూ ఉండాల్సిన అవసరం ఉండదు."

సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల కోసం చేపట్టిన వివిధ గృహ పథకాల కింద ఆర్థిక సహాయం పొందిన కుటుంబాల సంఖ్యను తెలుసుకోవడానికి పుణే విభాగానికి చెందిన సామాజిక న్యాయం మరియు ప్రత్యేక సహాయ విభాగం అధికారితో PARI రిపోర్టర్ మాట్లాడారు. ఆ అధికారి మాట్లాడుతూ, “2021–22లో పుణేలోని బారామతి తాలూకా , పందరే గ్రామంలో VJNT [విముక్త్ జాతి నోటిఫైడ్ ట్రైబ్స్] నుండి 10 కుటుంబాలకు రూ. 88.3 లక్షలు కేటాయించబడ్డాయి. అది కాకుండా, ఈ సంవత్సరం [2023] సంచార తెగల కోసం మరే ఇతర ప్రతిపాదన ఆమోదించబడలేదు." అన్నారు.

తిరిగి ఆళెగావ్ పాగా వస్తీ లోకి వస్తే, శాంతాబాయి తన మనవడు మానవరాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందనే కలను కంటూనే ఉన్నారు. "నాకు నమ్మకం ఉంది. మేం కాంక్రీట్ గోడలతో కట్టిన ఇంటిలో నివసించలేదు. కానీ నా మనవ సంతానం ఖచ్చితంగా తమ కోసం ఒక ఇంటిని కట్టుకుంటారు. వారక్కడ భద్రంగా ఉంటారు," అంటారావిడ.

అనువాదం: మైత్రి సుధాకర్

Jyoti

জ্যোতি পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার বরিষ্ঠ প্রতিবেদক। এর আগে তিনি 'মি মারাঠি' মহারাষ্ট্র ১' ইত্যাদি সংবাদ চ্যানেলে কাজ করেছেন।

Other stories by Jyoti
Editor : Sarbajaya Bhattacharya

সর্বজয়া ভট্টাচার্য বরিষ্ঠ সহকারী সম্পাদক হিসেবে পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ায় কর্মরত আছেন। দীর্ঘদিন যাবত বাংলা অনুবাদক হিসেবে কাজের অভিজ্ঞতাও আছে তাঁর। কলকাতা নিবাসী সর্ববজয়া শহরের ইতিহাস এবং ভ্রমণ সাহিত্যে সবিশেষ আগ্রহী।

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Mythri Sudhakar

Mythri Sudhakar is currently pursuing her Masters in Psychology from the University of Delhi. She hails from Andhra Pradesh and is proud of her South Indian Dalit-Feminist Identity. She is an aspiring diplomat.

Other stories by Mythri Sudhakar